రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితోనే ఎన్నికలు జరుగుతాయి: నిమ్మగడ్డ
posted on Jan 29, 2021 @ 3:49PM
అనంతపురం జిల్లాలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం సంతోషం అని పేర్కొన్న ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలు నమోధైన పరిస్థితుల్లో ఈ రోజు 150, 200 దాటక పోవడం శుభపరిణామం అని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పంచాయతీలకు నిధులు వస్తాయని చెప్పారు. ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితోనే జరుగుతాయన్న ఆయన.. రాష్ట్ర ఉద్యోగులు, సిబ్బందిపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కోవిడ్ పేషేంట్లకు ఓటు వేసేందుకు పీపీఏ కిట్లు అందిస్తామన్న ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఏకగ్రీవాలు దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని, అనేక రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. అలజడి సృష్టిస్తే షాడో టీమ్‌లతో పర్యవేక్షిస్తామని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. మీడియాది ఎన్నికల్లో గొప్ప పాత్ర. నిర్మాణాత్మకంగా వ్యవహరించండి అని నిమ్మగడ్డ కోరారు.