దేవుడి వద్దకు వెళ్తున్నానంటూ మిస్సింగ్! చిత్తూరు జిల్లాలోనే మరో కలకలం
posted on Jan 29, 2021 @ 10:48AM
మనదేశంలో మాయ మాటలు చెప్పె బాబాలకు ఉన్న క్రేజీ.. తమ పరిశోధనలతో కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలకు ఉండదు. మ్యాజిక్ ను నమ్మే జనం లాజిక్ ను అస్సలు పట్టించుకోరు. త్రివిక్రమ్ సినిమాల్లోని ఈ డైలాగులను కొందరు నిజం చేస్తున్నారు. ఇటీవలే మూఢనమ్మకాలతో కన్నబిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల ఉదంతం మరవకముందే.. అలాంటిదే మరో ఘటన జరిగింది. మదనపల్లెలో జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అదే చిత్తూరు జిల్లాలో మరో కలకలం రేగింది.
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో దేవుడి వద్దకు వెళ్తున్నానని చెప్పి ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. తాను దేవుడి వద్దకు వెళ్తున్నానని గణేష్ అనే యువకుడు రెండు పేజీల లేఖను రాశాడు. అనంతరం జనవరి 21 నుంచి అతడు ఇంటికి కాలేదు. ఫోన్ స్విచాఫ్ వస్తోంది. అప్పటి నుంచీ తల్లిదండ్రులు గణేష్ కోసం వెతుకుతూనే ఉన్నారు. గణేష్ తన వెంట బైక్, సెల్‌ఫోన్, పుస్తకాల బ్యాగ్‌ను తీసుకెళ్లాడు. వారం రోజులు గడస్తున్నా ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. మదనపల్లె ఘటన నేపథ్యంలో తమ కుమారుడికి ఏమీ కాకూడదని ప్రార్థనలు చేస్తున్నారు.
వారం రోజులుగా కనిపించకుండా పోయిన గణేష్‌కు భక్తి భావం ఎక్కువని తెలుస్తోంది. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. అయితే భక్తి భావం ఉన్నప్పటికీ మూఢత్వం లేదంటున్నారు గణేష్ కుటుంబ సభ్యులు. గణేష్ మిస్సింగ్‌పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గంగవరం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతడి కాల్ డేటా వివరాలను సేకరించి.. పలువురిని విచారిస్తున్నారు.
ఇటీవల చిత్తూరు జిల్లాలో మదనపల్లెలో ఇటీవలే దారుణం జరిగింది. మూఢనమ్మకాలతో కన్నతల్లిదండ్రులే బిడ్డలను చంపుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినా ఇప్పటికీ వాళ్లు అదే పిచ్చిలో ఉన్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు.. తమ కుమార్తెలు అలేఖ్య (27), సాయిదివ్య (22)ను చంపేశారు. పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయిన నిందితులు.. తమ కూతుళ్లు మళ్లీ బతుకుతారనే మూఢ నమ్మకంతో చంపేశారు. సాయి దివ్యను అక్క అలేఖ్య త్రిశూలంతో పొడిచి చంపేసింది. ఆమెను బతికించేందుకు తనను కూడా చంపాలని తల్లిదండ్రులను కోరడంతో..వారు డంబెల్‌తో కొట్టి చంపారు. ఇలా ఇద్దరు యువతులు హత్యకు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.