అయోధ్యలో కట్టే మసీదుకు విరాళాలివ్వొద్దు.. ఎంపీ అసదుద్దీన్ సెన్సేషనల్ కామెంట్స్
posted on Jan 28, 2021 @ 4:23PM
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసి తాజాగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన చోట నిర్మిస్తున్న మసీదుకు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని అయన పిలుపునిచ్చారు. ఇపుడు కట్టే మసీదులో నమాజ్ చేయడం పాపమని అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మత పెద్దలతో మాట్లాడిన తర్వాతే.. తాను ఈ విషయం చెబుతున్నట్టు అయన వివరించారు. అయోధ్యలో కడుతున్న ఆ నిర్మాణం మసీదు కాదని, అక్కడ ప్రార్థనలు చేయకూడదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన ఉలేమాలే చెబుతున్నారంటూ ప్రస్తావించారు. అంతేకాకుండా ముస్లింలు ఎవరూ ఎన్నికల్లో దళితులతో పోటీ పడవద్దని అయన సూచించారు. తాను అంబేద్కర్ అభిమానినని.. దళితులకు సహకరిస్తానని అయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో శాంతి కోరుకునే వారిని జైలుకు పంపిస్తున్నారని అయన వ్యాఖ్యానించారు.
మరోపక్క ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలను… అయోధ్య మసీదు ట్రస్ట్ సెక్రటరీ అథర్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. అసద్ వ్యాఖ్యలు అయన రాజకీయ ఎజెండాలో భాగమని విమర్శించారు. ఇస్లాంకు వ్యతిరేకమైన చిన్న ప్రదేశం కూడా ఈ ప్రపంచంలో లేదని హుస్సేన్ అన్నారు. ఎంపీ అసదుద్దీన్‌కు భారతదేశ చరిత్ర తెలియదని.. మొదటి స్వాతంత్ర్య సమర పోరాటంలో ప్రజలు పడిన బాధలను అసద్ కుటుంబం అనుభవించలేదని అథర్ హుస్సేన్ విమర్శించారు. ఇది ఇలా ఉండగా.. అయోధ్యలో మసీదు నిర్మాణానికి రిపబ్లిక్ డే రోజున శ్రీకారం చుట్టారు.