తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ ల మధ్య వార్! ఉత్తరాది, దక్షిణాది వారిగా చీలిక!
తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న సివిల్ సర్వెంట్ల మధ్య కోల్డ్ వార్ సాగుతోందా? ఉత్తరాది, దక్షిణాది వారిగా ఉన్నతాధికారులు విడిపోయారా? తెలుగు ప్రాంత అధికారులు సొంత గడ్డలోనే చీత్కారాలకు గురవుతున్నారా? అంటే సచివాలయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. పాలనకు అత్యంత కీలమైన ఐఏఎస్ లో విభజన వచ్చిందని తెలుస్తోంది. పేరుకేమో తెలుగు రాష్ట్రాలైనా.. ప్రస్తుతం ఇక్కడి ప్రభుత్వాల్లో పెత్తనమంతా బయటివారిదే నడుస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పాలనకు కేంద్రం ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో సీఎస్ గా ఉత్తరాది వ్యక్తులే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆథిత్యదాస్ ఉండగా.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ ఉన్నారు. వీళ్లిద్దరిది బీహార్ రాష్ట్రమే. వీళ్లే కాదు దాస్ కు ముందు ఏపీ సీఎస్ గా ఉన్న నీలం సాహ్నీది ఉత్తరాదే. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమెను ఏరికోరి మరీ తెచ్చుకుని సీఎస్ పోస్టింగ్ కట్టబెట్టారు జగన్ రెడ్డి. ఇక తెలంగాణలో సోమేష్ కుమార్ కంటే ముందు సీఎస్ గా పని చేసిన ఎస్కే జోషి కూడా ఉత్తరాది వ్యక్తే. తెలంగాణ తొలి సీఎస్ రాజీవ్ శర్మ, తొలి డీజీపీ అనురాగ్ శర్మ కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే.
ఏపీ సీఎస్సే కాదు సీఎంవోలోనూ ఉత్తరాది అధికారులదే పెత్తనమని తెలుస్తోంది. ఏపీ సీఎంవోలో ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాషే కీలక పాత్ర పోషిస్తున్నారని,సీఎం జగన్ కూడా ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. ఏపీకి చెందిన అధికారులు సీఎంవోలో ఉన్నా.. వారంతా నామ్ కే వాస్తాగానే మిగిలిపోయారట. అంతేకాదు ఢిల్లీ నుంచి తెచ్చుకుని సీఎస్ గా నియమించుకున్న నీలం సాహ్నీ కూడా ఇప్పుడు సీఎం ముఖ్య సలహదారుగా ఉన్నారు. త్వరలోనే ఆమెను ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎంవోలోనూ ఉత్తరాది అధికారులే హవా సాగిస్తున్నారట. ముఖ్యమంత్రి సలహాదారులుగా ఉన్న రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మలే ప్రభుత్వంలో కీలక పనులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. సీఎంవోలో ఉన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే చర్చ సచివాలయంతో పాటు ప్రగతి భవన్ లో జరుగుతోంది.
ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో ఉత్తరాది అధికారులు ఉండటంతో పాలనంతా వాళ్ల కనుసన్నలోనే జరుగుతోందని తెలుస్తోంది. ఉత్తరాదికి చెందిన ఉన్నతాధికారులు... కింది స్థాయిలోనూ తమవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. కీలక శాఖల్లో పోస్టింగులు వారికే కట్టబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు చెబుతున్నారు. సొంత గడ్డలోనూ బయటి ప్రాంతాల అధికారుల ముందు చిన్నచూపుకు గురవుతున్నారని వాళ్లంతా ఆవేదన చెందుతున్నారని చెబుతున్నారు. ఈ కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్ లో డివిజన్ వచ్చిందంటున్నారు. ఉత్తరాది అధికారులంతా ఒక గ్రూపుగా.. మిగితా ప్రాంతానికి చెందిన ఐఏఎస్ లు మరో గ్రూపుగా చీలిపోయారంటున్నారు.
తెలంగాణ సచివాలయంలో అయితే సీఎస్ సోమేష్ కుమార్ కు.. దక్షిణాదికి చెందిన సీనియర్ ఐఏఎస్ లకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సచివాలయం రాకపోవడంతో .. సీఎం తరహాలోనే సీఎస్ సచివాలయంలో సమాంతర వ్యవస్థను సాగిస్తున్నట్లు చెబుతున్నారు. పాలనకు సంబంధించి కీలక విషయాల్లో ఉత్తరాది అధికారులనే సీఎస్ సంప్రదిస్తున్నారని అంటున్నారు. దక్షిణాది అధికారులు కలవాలని చూసినా.. సీఎస్ గంటలకొద్ది వాళ్లను వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇది నచ్చని కొందరు అధికారులు సోమేష్ కుమార్ ను ప్రశ్నించారని, దీంతో విభేదాలు పెరిగిపోయాయని తెలుస్తోంది. దక్షిణాదికి చెందిన అధికారులు తనకు సహకరించకపోవడంతో వారిపై సీఎస్ సోమేష్ కుమార్ నిఘా పెట్టారని, వారి కదలికలను పసిగట్టే బాధ్యత తనకు అనుకూలంగా ఉండే ఉత్తరాది అధికారులకు అప్పగించారని సమాచారం.
సివిల్ సర్వెంట్ల మధ్య గ్యాప్ ప్రభావం పాలనపైనా పడుతుందనే అభిప్రాయం కొందరు అధికారుల నుంచి వస్తోంది. అందుకే ఇటీవల ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలన్ని వివాదాస్పదమవుతున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ తీసుకున్న చాలా నిర్ణయాలను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో పలు విధానపరమైన నిర్ణయాలను సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకున్నారు. ధరణి పోర్టల్, ఎల్ఆర్ఎస్ విషయాల్లో అదే జరిగింది. మొత్తానికి సొంత గడ్డలో తెలుగు ప్రాంతాలకు చెందిన అధికారులు అవమానాలకు గురి కావడంతో పాటు ఉత్తరాది వారితో పాలన కూడా సరిగా జరగడం లేదన్న అభిప్రాయం ఏపీ, తెలంగాణ నిపుణులు, మేథావులు, జనాల నుంచి వినిపిస్తోంది.