వైన్ షాపుల్లో దారుణంగా మోసం.. మందుబాబులు బీ అలర్ట్

మందు బాటిల్. దానిపై ఎమ్ఆర్పీ స్టిక్కర్. ఎంత రేటు రాసుంటే అంత. ఒక్క రూపాయి తక్కువైనా తీసుకోరు. కస్టమర్ కూడా బేరమాడడు. అదీ వైన్ షాప్ స్పెషాలిటీ. ఇదే ఇప్పుడు దోపిడీకి రహదారి.  అది.. కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిస గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వైన్ షాప్. అక్కడి నిర్వాహకులు నకిలీ ఎమ్మార్పీ స్టిక్కర్లతో దోపిడీకి పాల్పడ్డారు. 150 రూపాయల బాటిల్‌పై 190 రూపాయల నకిలీ స్టిక్కర్లు అంటించారు. మందుబాబులను దగా చేసి.. ఇష్టారీతిన దోచుకున్నారు. చాలా రోజులుగా ఈ లూటీ కొనసాగుతోంది. అయితే, ఆ గ్రామానికి చెందిన ఓ మందుబాబు ఇటీవల మరో గ్రామంలో మద్యం కొన్నాడు. అక్కడ ధర తక్కువగా ఉండటంతో అతనికి అనుమానం వచ్చి.. సొంతూరుకి వచ్చి.. షాపు అతన్ని నిలదీశాడు. అతను పొంతన లేని సమాధానం చెప్పడంతో విషయం ఎక్సైజ్ పోలీసులకు చెప్పాడు. దీంతో.. ఈ వ్యవహారంపై వైన్ షాప్ సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లను ఎక్సైజ్ సీఐ నాగమణి విచారించారు. భారీ ఎత్తున స్కామ్ జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

పోలీస్ స్టేషన్లో కరోనా కేసులు.. 

బంజారాహిల్స్ పోలీసులను కరోనా వెంటాడుతోంది. సెకెండ్‌ వేవ్‌లో 11 మంది పోలీసులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బంజారాహిల్స్‌ సీఐ కళింగరావు, మరో ఎస్సై కరోనా బారిన పడ్డారు. రోజురోజుకు పోలీస్‌స్టేషన్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో పోలీసు సిబ్బంది భయాందోళనలో ఉన్నారు.  మరోవైపు ఎల్బీనగర్‌లోని చిత్ర లే అవుట్‌లో అనాథ విద్యార్థి గృహంలో 45మంది విద్యార్థులకు కరోనా సోకింది. హాస్టల్‌లో మొత్తం 100 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో మిగిలిన వారికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటీవ్ వచ్చిన వారిని గ్రౌండ్ ప్లోర్‌లో ఉన్న ఐసోలేషన్ రూమ్‌లోఉంచారు. నెగటివ్ వచ్చిన విద్యార్థులను ఫస్ట్ ప్లోర్‌కు తరలించారు 

అర్నాబ్‌కు రాజ్యసభ రక్ష!

అర్నాబ్ గోస్వామి. ఇండియాలో మోస్ట్ పాపులర్ న్యూస్ రీడర్. జాతీయ మీడియా గురించి అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన వ్యక్తి. న్యూస్ డిబేట్స్ స్టైల్‌నే మార్చేసిన పర్సన్. ఆయన చేసే చర్చల్లో చర్చ కంటే రచ్చ ఎక్కువ అనేది కామెంట్. అంతా అరుపులు.. కేకలు. ఎవరు ఎక్కువ గట్టిగా మాట్లాడితే.. ఎవరు ఎక్కువ గట్టిగా అరిస్తే.. వాళ్లు అంత గొప్ప అన్నట్టు ఉంటుంది ఆ చర్చ. గెస్ట్స్ కంటే యాంకర్‌గా అర్నాబ్ చేసే గోలే ఎక్కువ. పాకిస్తాన్ ప్రస్తావన వస్తే తోక తొక్కిన పాములా బుసలు కొడతాడు. 'ఇండియా వాంట్స్ టూ నో'.. అంటూ ఎవరినైనా ఏదైనా అడిగేస్తాడు. కడిగేస్తాడు. కుమ్మేస్తాడు. నానా హంగామా చేస్తాడు. అతని హాట్ హాట్ మసాలా న్యూస్ కోసం ప్రతి రోజు రాత్రి కోట్లాది మంది ప్రేక్షకులు టీవీల ముందు అతుక్కుపోతారు. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే.  మరోవైపు.. అర్నాబ్ గోస్వామి బీజేపీ ప్రతినిధి అంటూ ఆరోపణ. అతను చేసే ప్రతీ చర్చ.. అధికార బీజేపీకి అనుకూలంగా ఉంటుందనే విమర్శ. కమలనాథులకు సపోర్ట్‌గా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశ ప్రజలను రెచ్చగొడతారని అంటారు. ముంబైలో ఓసారి అతనిపై ఇంకుతో దాడి కూడా జరిగింది. అది చేయించింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే అంటూ నానా రచ్చ చేశాడు అర్నాబ్. ఇక, TRP రేటింగ్స్ గోల్‌మాల్‌తో అర్నాబ్ పరువు పాతాళానికి పడిపోయింది. రిపబ్లిక్ టీవీ బార్క్ రేటింగ్స్‌ను ట్యాంపరింగ్ చేశాడంటూ అతనిపై కేసు నమోదైంది. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. అర్నాబ్ చుట్టూ కేసు ఉచ్చు బిగిసింది. జైలుకూ వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం అతన్ని అంతలా టార్గెట్ చేసినా.. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. రిపబ్లిక్ టీవీలో మళ్లీ అదే దూకుడు.  తమకు అంత మంచి చేసిన అర్నాబ్ గోస్వామికి ఇంతటి దారుణమైన దుస్థితి దాపురించడంతో బీజేపీలో కలవరం మొదలైంది. కాస్త ఆలస్యమైనా.. ఖతర్నాక్ ఐడియా వచ్చింది. అర్నాబ్‌కు రాజ్యాంగబద్ద రక్షణ కల్పించేలా.. ఆయన్ను పెద్దల సభకు పంపించే ఆలోచన చేస్తోంది. అనుకోకుండా రాజ్యసభలో ఏర్పడిన ఓ ఖాళీని అర్నాబ్ గోస్వామితో బర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నామినేటెడ్ కోటాలో అర్నాబ్‌ను పార్లమెంట్‌కు పంపిస్తారని అంటున్నారు.  కొన్ని వారాల క్రితమే రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. స్వపన్ దాస్ గుప్తా రాజీనామాతో ఏర్పడిన ఖాళీని అర్నాబ్‌తో భర్తీ చేయాలనేది బీజేపీ ప్రయత్నం. మీడియా ప్రతినిధిగా.. రాష్ట్రపతి కోటాలో.. రాజ్యసభకు పంపించే దిశగా కమలనాథులు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే.. త్వరలోనే ఈ ఫైర్ బ్రాండ్ న్యూస్ రీడర్‌.. రాజ్యసభలో 'అధ్యక్షా' అనడం టీవీలో చూడొచ్చు. మరి, టీవీ ఛానెల్ చర్చ మాదిరే పెద్దల సభలోనూ పెద్ద పెద్ద కేకలు, అరుపులతో నానా రచ్చ చేస్తాడా? లేక, హుందాగా వ్యవహరిస్తాడా? అనేది ఆసక్తికరం.

కరోనాకు టాబ్లెట్.. 

కరోనా వాక్సిన్ అంటే బయపడేవాళ్ళకి గుడ్ న్యూస్. ‌కరోనాకి టాబ్లెట్ వచ్చేస్తోంది. రిడ్జిబ్యాక్‌ బయోథెరప్యూటిక్‌-మెర్స్క్‌‌ అండ్‌కో సంయుక్తంగా డెవలప్  చేసిన మోల్నుపిరావిర్‌ ఔషధంపై  చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతానికి ఈ ప్రయోగాలు మధ్య దశలో ఉన్నాయి. ఐదురోజుల పాటు ఈ ఔషధాలతో చికిత్స చేస్తే వైరస్‌ లోడు భారీగా  తగ్గిపోయిందని ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ సైంటిస్ట్‌ల వర్చువల్‌ సమావేశంలో  రిడ్జిబ్యాక్‌ వెల్లడించింది.  ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు రెమిడెసివిర్‌తో వైద్యం నిర్వహిస్తున్నారు. దీనికి కూడా 100శాతం ఫలితాలు రావడంలేదు. ఫావిపిరవిర్‌ పిల్స్‌ ఇస్తున్నారు. ఇది కొవిడ్‌ కోసం డెవలప్ చేసిన ఔషధం కాదు. దీంతో పూర్తిస్థాయి ఫలితం ఆశించలేని పరిస్థితి నెలకొంది.  ఇలాంటి టైములో  కరోనా టాబ్లెట్లు రావడం భారీ ఉపశమనం అనే చెప్పాలి. గతంలో ఫ్లూపై టామీ ఫ్లూ ఎలా పనిచేసిందో.. ఇప్పుడు మోల్నుపిరావిర్‌ కూడా కరోనాపై అలా వర్క్ అవుట్ చేస్తుందని  ఆశిస్తున్నారు. ‘‘ఇది కరోనాను అంతం చేసే దిశగా ఆశాజనకంగా ఉంది.. కానీ, వంద శాతం వర్క్ చేస్తుందని  చెప్పలేము. దీనికి క్లినికల్‌ ఉపయోగాలు ఉంటాయని ఫ్రూవ్ చేయడమే  మా కర్తవ్యం’’ అని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌లో ఎయిడ్స్‌ విభాగ డైరెక్టర్‌ కార్ల్‌ డైఫెన్‌ బ్యాచ్‌ తెలిపింది.  ఇప్పటికే ఈ ఔషధంపై అమెరికా అధ్యక్షుడి సలహాదారు  ఆంతోనీ ఫౌచీ కూడా సానుకూలంగా ఉన్నారు. సార్స్‌ కోవ్‌-2 వైరస్‌పై డైరెక్ట్ గా వర్క్ చేసే ఔషధాల  అభివృద్ధి ముఖ్యమని  ఇటీవల ఆయన అధ్యక్షుడికి తెలిపారు. సాధారణ ఔషధాల వలే మోల్నుపిరావిర్‌  సార్స్‌కోవ్‌-2 స్పైక్‌ ప్రొటిన్‌పై ఇది పనిచేయదు. ఇది నేరుగా వైరస్‌ ఉత్పత్తిని తగ్గించేసేలా ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌పై ప్రభావం చూపిస్తుంది.  ఫేజ్‌-2 ప్రయోగాల్లో భాగంగా మొత్తం 182 మందిపై ప్రయోగించగా. రెండు పూటలా మోల్నుపిరావిర్‌ తీసుకున్న వారిలో ఐదురోజుల తర్వాత వైరస్‌ కనుమరుగైయిందని. అదే ప్లెసిబో (డమ్మీటాబ్లెట్‌) తీసుకొన్న వారిలో 24శాతం మందిలో మాత్రమే ఇటువంటి రిజల్ట్  వచ్చింది. ఈ విషయాన్ని రిడ్జ్‌బ్యాక్‌ వెల్లడించింది. ఈ ఔషధం కరోనావైరస్‌ శరీరంలో మళ్ళీ రాకుండా  సమర్థంగా అడ్డుకుంటోందని రిడ్జిబ్యాక్‌ సంస్థ ఫౌండర్  వేనే హోల్మన్‌ తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థ ఎబోలాకు చికిత్సను డెవలప్ చేసి .. దానికి అనుమతులు కూడా పొందింది.  ప్రస్తుతానికి ఇది మధ్యంతర ఫలితాలే అని.. దీనిపై త్వరలోనే  మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మెర్స్క్‌ సంస్థ తెలిపింది.   

బందీగా కోబ్రా కమాండర్!

ఛత్తీస్‌గఢ్‌లో అడవి నెత్తురోడింది.  మావోయిస్టులు, ఖాకీల మధ్యన జరిగిన కాల్పుల్లో అడవి గొల్లుమంది.. కాల్పుల్లో మావోల తూటాలకు 22 మంది భద్రత సిబ్బంది నేలకొరిగారు.  అంత మంది మరణం పట్ల డిపార్ట్మెంట్ ఒక్క సారిగా నిర్ఘాంత పోయింది. సైనికుల తల్లి దండ్రులు ఆర్తనాదాలు అడవికి వినిపించేలా... కన్నీళ్లు గుండెను తడిపెల రోదించారు. ఆ తుపాకి చప్పుడు ఆగిన తర్వాత ఒక పోలీసులకు మావోయిస్టుల పేరుతో  ఫోన్ కాల్ వచ్చింది.. ఆ ఫోన్ కాల్ తో పోలీసుల గుండెల్లో పిడుగుపడింది. కోబ్రా యూనిట్‌కు చెందిన ఓ కమాండో కన్పించకుండా పోయారు. అయితే ఆ జవాను ఇప్పుడు మావోయిస్టుల చెరలో ఉన్నట్లు సమాచారం. ఆ కమాండో తమవద్దే ఉన్నాడంటూ నక్సల్స్‌ పేరుతో ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. దీంతో ఆ ఫోన్‌ కాల్స్‌పై భద్రతాసిబ్బంది దర్యాప్తు చేపట్టారు.   బీజాపూర్‌-సుక్‌మా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు - పోలీసు బలగాల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 22 మంది భద్రతాసిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత నుంచి 210వ కోబ్రా బెటాలియన్‌కు చెందిన కమాండో రాకేశ్‌ సింగ్‌ మిన్హా కన్పించకుండా పోయారు. ఆయన కోసం అధికారులు గాలింపు చేపట్టారు.    ఇదిలా ఉండగా.. బీజాపూర్‌లోని ఇద్దరు స్థానిక జర్నలిస్టులకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. తాము మావోయిస్టులమని, కమాండో రాకేశ్‌ సింగ్‌ తమవద్ద బందీగా ఉన్నాడని వారు చెప్పినట్లు విలేకరులు తెలిపారు. ప్రస్తుతం రాకేశ్ సింగ్‌ క్షేమంగా ఉన్నాడని, రెండు మూడు రోజుల్లో అతడిని విడుదల చేస్తామని వారు తెలిపారని విలేకరులు చెప్పారు. దీంతో సదరు ఫోన్‌కాల్స్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ కీలక మావోయిస్టు దళం నుంచి ఆ కాల్‌ వచ్చిందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. అయితే కమాండోను నక్సల్స్‌ తీసుకెళ్లారని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలేమీ లేవని అన్నారు. ఆ జవాను కోసం భద్రతా సిబ్బంది గాలిస్తున్నట్లు వెల్లడించారు.    నా భర్తను క్షేమంగా తీసుకురండి..  కమాండో రాకేశ్ స్వస్థలం జమ్మూ. కిడ్నాప్‌ గురించి తెలియగానే ఆయన భార్య తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తన భర్తను క్షేమంగా తీసుకురావాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె విజ్ఞప్తి చేశారు.     

పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపి.. 

నేటి సమాజంలో ధనార్జన కోసం అన్ని దిక్కు మాలిన పనులు చేస్తున్నారు. అందుకోసం రకరకాల ముసులు వేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా కొంత మంది అయితే కన్నవాళ్ళు అని చూడకుండా వారి ప్రాణాలు తీస్తున్నారు. వృద్దులకు, అర్హులకు నెల గడవడం కోసం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల కోసం దారుణానికి పాల్పడ్డాడు ఓకే నీచుడు.. అందుకోసం సొంత తండ్రినే ఛంపాడు ఓ కసాయి కొడుకు.   అతనిది పెన్షన్ తీసుకునే  వయసు. చెట్టంత కొడుకు వున్నాడు.. కానీ వాడు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగుతూ నిసమీద ఉండేటోడు. ఎప్పుడు తండ్రితో  ఆస్తి కోసం.. అతనికి  వచ్చే పెన్షన్ డబ్బుల గొడవ పడేవాడు. తాజాగా మద్యం మత్తులో ఎప్పుడు ఉండే గొడవ తండ్రిని కొట్టి చంపే వరకు దారితీసింది.  అనంతపురం జిల్లా కూడేరు మండలం కడగళ్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు తండ్రినే కొట్టి చంపాడు. గ్రామానికి చెందిన ఓబన్నను ఆయన కొడుకు జయకృష్ణ మద్యం మత్తులో కొట్టి కిందకు తోయడంతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో పింఛను డబ్బుల విషయంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలో తండ్రిపై జయకృష్ణ దాడి చేశాడని పోలీసులు చెప్పారు. ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు, జయకృష్ణను కరెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తరచూ మద్యం మత్తులో ఆస్తి విషయంతోపాటు పింఛను డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడని గ్రామస్థులు తెలిపారు.    

మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. అనిల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్ హోం మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పంపించారు. హోంమినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్‌సింగ్ అవినీతి ఆరోపణలు చేయగా.. వాటిపై విచారణ జరపాలంటూ జయశ్రీ పాటిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ధర్మాసనం.. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి సూచించింది. విచారణలో అనిల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభిస్తే.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  అంబానీ ఇంటి ముందు బాంబు కేసు అటూ ఇటూ తిరిగి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ వరకూ దారి తీయడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. బార్లు, వైన్స్ నుంచి నెలకు 100 కోట్ల వసూళ్లు టార్గెట్‌గా పెట్టారంటూ హోంమంత్రిపై మాజీ ముంబై పోలీస్ కమిషనర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం.. ఆ వెంటనే అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే అధికార శివసేన, ఎన్సీపీ కూటమిలో లుకలుకలతో మరాఠా రాజకీయం రంజుగా మారింది.

ఇంతింతై.. కృష్ణపట్నం అదానీ పరమై..

అనుకున్న్టట్టే అయింది. కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ పరమైంది. గతేడాది 75శాతం వాటా కొనుగోలు చేసింది. ఈసారి మొత్తానికి మొత్తం 100శాతం వాటాను అదానీ పోర్ట్స్ కైవసం చేసుకుంది. తాజాగా విశ్వసముద్ర హోల్డింగ్స్‌ నుంచి మరో 25 శాతం వాటాను కొనుగోలు చేసి.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పూర్తి యాజమాన్య హక్కులను అదానీ పోర్ట్స్‌ సంస్థ దక్కించుకుంది. 25శాతం వాటా విలువ 2,800 కోట్లుగా తెలిపింది అదానీ సంస్థ. 2020-21లో పోర్టు మొత్తం విలువ రూ.13,675 కోట్లు ఉన్నట్లుగా అదానీ పోర్ట్సు వెల్లడించింది. ప్రస్తుత హ్యాండిలింగ్‌ సామర్థ్యం 64 మిలియన్‌ టన్నులుగా ఉందని.. 2025 నాటికి దీనిని 200 నుంచి 300 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు ప్రయత్నిస్తామని.. కృష్ణపట్నం పోర్టును గేట్‌వే ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తామని ప్రకటించింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ ఇటీవలే గంగవరం పోర్టులో సైతం మెజారిటీ వాటా సొంతం చేసుకుంది.  కృష్ణపట్నం పోర్ట్‌ ఒక డీప్‌ వాటర్‌ నౌకాశ్రయం. పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. గత యేడాది 3.8 కోట్ల టన్నుల సరకు రవాణాతో 1,840 కోట్ల ఆదాయాన్ని  సంపాదించింది. సరకు రవాణా సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలనే లక్ష్యంతో కృష్ణపట్నం పోర్టును పూర్తిగా కొన్నట్లు అదానీ పోర్ట్స్ ప్రకటనలో తెలిపింది. కృష్ణపట్నం పోర్టు సామర్థ్యాన్ని 50 కోట్ల టన్నులకు విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది అదానీ సంస్థ.

తొమ్మిది ఫెయిల్.. 30  ఏళ్లుగా జాబ్.. 

తొమ్మిది ఫెయిల్.. 30  ఏళ్లుగా జాబ్..  అతను తొమ్మిదో తరగతి ఫెయిల్ అయ్యాడు.. ఎలాగైన ఉద్యోగం చేయాలనుకున్నాడు. అలాగని చదువుకొని మాత్రం కాదు.. అందుకోసం  పరివిధాల ఆలోచించాడు. చివరికి తన క్రిమినల్ మైండ్ కి ఒక ఆలోచన తగిలింది. అంతే  ఆ ఆలోచనతో జాబ్ లో చేరాడు. ఒకటి కాదు రెండు కాదు  ఏకంగా  ౩౦ ఏళ్ళు క్రితం ఉద్యోగంలో  చేశాడు. ఇంతకీ ఆ క్రిమినల్ మైండ్ కి తట్టిన ఐడియా ఏంటి..? ఉద్యోగం కోసం అతను ఏం చేశాడు...? అని తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..  ఒక  దేశంలో ప్రభుత్వ అంటే పడిచచ్చే వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. కొంత మంది ఉన్నత విద్య చదివి ప్రభుత్వ ఉద్యోగం చేస్తే . మరి కొంతమంది మాత్రం అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. తను ఉద్యోగం చేయడం కోసం చనిపోయిన వ్యక్తి  సర్టిఫికెట్లను ఉపయోగించి 30 ఏళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు ఒక వ్యక్తి. నిందితుడు శక్తి బంధు తమ్ముడు అశోక్ కుమార్ 1977లో బీఏ చదువుతుండగా చనిపోయాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు శక్తి బందు  అశోక్ పేరుతో IMPAలో ఉద్యోగం పొందాడు. ఇందుకు కొంతమంది అధికారుల సాయం తీసుకున్నాడు. నిందితుడు 30 ఏళ్లుగా అశోక్‌కుమార్ పేరుతో IMPAలో పనిచేస్తున్నాడని, అతడు కనీసం తొమ్మిదో తరగతి కూడా పాస్ కాలేదని ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. శక్తిబంధుపై IPCలోని వివిధ సెక్షన్ల కింద కేసు రాశామని పోలీసులు చెప్పారు. గతేడాది  క్రైం బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేసినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూలోని IMPA, జమ్మూ కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్, అచ్చాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అచ్చాన్ ప్రాథమిక పాఠశాలల నుంచి అశోక్ కుమార్, శక్తి బంధు స్టడీ సర్టిఫికెట్లను పోలీసులు పరిశీలించారు. అన్ని ఆధారాలతో నిందితుడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో న్యాయ విచారణ తర్వాత అతనికి తీవ్రమైన శిక్షపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ విషయం తాజాగా బయట పడింది. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలోని అచ్చాన్ గ్రామానికి చెందిన శక్తి బంధు అలియాస్ "కాకా జీ"పై... జమ్మూకాశ్మీర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. అతను ప్రస్తుతం జమ్మూలోని పానీ చాక్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. నిందితుడు కనీసం తొమ్మిదో తరగతి కూడా పాస్ కాకపోవడం విశేషం. ప్రస్తుతం కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.

విశాఖ ఉక్కు కేసు వకీల్ సాబ్ వాదించాలి..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేసును వకీల్ సాబ్ పవన్ కల్యాణ్ వాదించాలని కోరదామంటూ సెటైర్లు వేశారు రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి. ప్రభుత్వం చేతుల్లో లేని ఉక్కు ఫ్యాక్టరీతో పాలనా రాజధాని వచ్చినా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో రాజధాని గురించి ఎడతెగని, ప్రతిష్టంభన కొనసాగుతుందన్నారు. ముందు కోర్టు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. విశాఖలో ప్రశాంత వాతావరణాన్ని, ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉందన్నారు తెలకపల్లి రవి.  కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇవ్వాల్సిన ప్రతీదీ ఎగనామం పెడుతోందని విమర్శించారు. విడిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం మీద రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు పోరాడటం లేదన్నారు. ఇప్పటికి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్టీల్ ప్లాంట్‌పై ఏం కాలేదంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలకపల్లి రవి.  అటు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. జనసేన అధినేత తిరుపతి కొండపైన పాచిపోయిన లడ్డూలు తింటున్నారని ఎద్దేవా చేశారు. ఏ ముఖం పెట్టుకుని జనసేనాని బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తియ్యగా, కమ్మగా ఉన్నాయా? అంటూ నిలదీశారు నారాయణ.

రోజుకు లక్ష.. కుమ్మేస్తున్న కరోనా

కొవిడ్ సెకెండ్ వేవ్ తారాస్థాయిలో ఉండొచ్చు. కరోనా కట్టడికి మినీ లాక్‌డౌన్‌లు అవసరం. ప్రజలు సాధ్యమైనంత వరకూ ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చేసిన హెచ్చరికలు ఇవి. ఆయన అన్నట్టే జరుగుతోంది. కరోనా తొలి వేవ్‌లో 70,000 కేసులు రావడానికి చాలా నెలల సమయం పడితే.. ప్రస్తుతం ఒక్కరోజే లక్ష కేసులతో ఇండియాలో సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. గత వారం ఏకంగా 5.45లక్షల పాజిటివ్‌ కేసులతో దడ పుట్టిస్తోంది.  కేవలం 24 గంటల వ్యవధిలో దేశంలో 1,03,558 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన దేశంగా అమెరికా తర్వాత రెండో స్థానంలో భారత్‌ నిలవడం మరింత ఆందోళనకరం. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మన దేశంలో 1.03లక్షల మందికి వైరస్‌ సోకింది. ఇందులో అత్యధిక మహారాష్ట్ర నుంచే. నెల రోజుల కిందట రోజువారీ కొత్త కేసులు 15వేల వరకూ ఉండగా.. ఇప్పుడు ఏకంగా ఆరు రెట్లు పెరిగి లక్ష దాటడం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అమెరికా, భారత్‌ మినహా ఏ దేశంలోనూ ఇప్పటివరకు ఒక రోజులో లక్షకు పైగా కేసులు నమోదు కాలేదు.   కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. గత సెప్టెంబరులో రోజువారీ మరణాలు వెయ్యికి పైనే నమోదవగా.. గడిచిన 24 గంటల్లో 478 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.25కోట్లు దాటింది. వీరిలో 1.16కోట్ల మంది వైరస్‌పై విజయం సాధించారు. ప్రస్తుతం 7.41లక్షల యాక్టివ్ కేసులున్నాయి.

హోంమంత్రిపై సీబీఐ ఎంక్వైరీ

ఏకంగా పదవిలో ఉన్న హోంమంత్రిపైనే సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం. మహారాష్ట్ర హోంమినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్‌సింగ్ అవినీతి ఆరోపణలు చేయగా.. వాటిపై విచారణ జరపాలంటూ జయశ్రీ పాటిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ధర్మాసనం.. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి సూచించింది. విచారణలో అనిల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభిస్తే.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  అంబానీ ఇంటి ముందు బాంబు కేసు అటూ ఇటూ తిరిగి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ వరకూ దారి తీయడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. బార్లు, వైన్స్ నుంచి నెలకు 100 కోట్ల వసూళ్లు టార్గెట్‌గా పెట్టారంటూ హోంమంత్రిపై మాజీ ముంబై పోలీస్ కమిషనర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం.. ఇప్పటికే అధికార శివసేన, ఎన్సీపీ కూటమిలో లుకలుకలతో మరాఠా రాజకీయం రంజుగా మారింది.

చికెన్@ 300   

ప్రతి ఏటా ఎండాకాలం రాగానే చికెన్ ధరలు భూమి పైనే ఉండేవి.. కానీ కరోనా కారణంగా  చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతుంన్నాయి.   పండగలు లేవు, పెద్దగా పెళ్లిళ్లు కూడా లేవు ,వేడుకల సమయం కూడా కాదు.. కాని చికెన్‌ ధరలు ఈ పిల్ టవర్ లా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక పై సండే కదా చికెన్ తిందామని వంద రెండు వందలు పట్టుకుని చికెన్ షాప్ కి వెళ్ళారనుకోండి.. పావు కిల్లో చికెన్ కూడా రాదు..  చికెన్ ధరలకు రెక్కలు రెక్కలొచ్చాయి.  అందుకు కారణం రవాణా ఛార్జీలు దాదాపు 30 శాతం పెరగడం, కోళ్ల దాణా ధరలు 30 నుంచి 40 శాతం పెరగడం కూడా కారణమని కోళ్ల పరిశ్రమ నిపుణుడు శ్రీకాంత్‌ చెబుతున్నారు. స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 210 ఉండగా.. ధర రూ. 260కి తక్కువ లేకుండా అమ్ముడైంది. కొన్ని చోట్ల స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 270, రూ. 280 వరకూ అమ్మారు. లైవ్‌ కూడా  రూ. 125 ఉండగా.. రూ. 160కి తగ్గలేదు. త్వరలోనే కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 300 కానుంది.  కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోడి కూర తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉడకబెట్టిన రెండు గుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే గుడ్ల ధరలు పెరగకపోవడం ప్రజలకు ఊరటే. గతవారం డజను గుడ్ల ధర రూ. 60 ఉండగా.. ఈ వారం కూడా అంతే ఉంది. అయితే గుడ్డు ధర పెరిగినా అది పైసల్లోనే ఉంటుందంటున్నారు. ఎటొచ్చీ చికెన్‌ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని.. దీంతో కొనుగోళ్లు తగ్గాయని దుకాణదారులు చెబుతున్నారు.       ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా ఈ కాలంలో కోళ్లు ఎండలకు తట్టుకోలేవని.. వాటి నిర్వహణ భారమని చాలా వరకూ కోళ్ల ఫారాలను ఖాళీ చేస్తారు. చిన్న రైతులు, చిన్నమొత్తంలో పెంపకందారులు ఎండాకాలం నిర్వహణ భారమంటూ కోళ్ల పెంపకాన్ని ఆపేస్తారు. అంతేగాక కోళ్ల దాణాకు అవసరమైన సోయాకేకు ఇతరత్రా ముడిసరకు ధరలు 30-40 శాతం వరకూ పెరిగాయని పెంపకందారులు చెబుతున్నారు. దీనికి తోడు కోళ్లకు తెగుళ్లు కూడా ఎక్కువయ్యాయని.. ఇలా అనేక కారణాలతో కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని పరిశ్రమకు చెందిన వారు పేర్కొంటున్నారు. మే నెలలో శుభకార్యాలు మొదలుకానున్న నేపథ్యంలో కోడి ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.  ఇక కారణం ఏదైనా కరోనా వల్ల కోళ్లు వ్యాపారులు బాగానే వెనకేసుకుంటున్నారని. కరోనా స్టార్టింగ్ లో చికెన్ తింటే కరోనా వస్తుందని భయపడ్డ జనాలకు రాష్ట్ర మంత్రులు సైతం నానా హంగామా చేసి చికెన్ తింటే కరోనా తగ్గుతుందని నమ్మించారు.. మళ్ళీ చికెన్ ధరలు పెంచారు. మంచి లాభాలు గడించారని సామాన్యులు మాట్లాడుకుంటున్నారు.. మళ్ళీ ఇప్పుడు కూడా రవాణా  ఛార్జీలు దాదాపు 30 శాతం పెరగడం, కోళ్ల దాణా ధరలు 30 నుంచి 40 శాతం పెరగడం మాట పక్కన పెడితే.. కరోనా సెకండ్ వేవ్ పెరుగుండం చూసి వ్యాపారాలు లాభాలు గడించడం కోసం వేసిన పధకం అని సామాన్యులు  మాట్లాడుకుంటున్నారు..         

రేషన్ తెచ్చివ్వను.. దిక్కున్నోడికి చెప్పుకో పో..

ఇంటింటికీ రేషన్. లబ్ధిదారుల చెంతకే వాహనాల ద్వారా రేషన్. జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం. ఇంటింటి రేషన్‌ కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసింది. భారీ ప్రచారంతో ఊదరగొట్టింది. అదంతా అనవసర ఖర్చు.. ఉపయోగం తక్కువంటూ ప్రతిపక్షం ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ చెప్పినట్టే జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ రేషన్ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. రేషన్ ఇంటికి తెచ్చి ఇచ్చేది లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఎందుకు తెచ్చివ్వరని లబ్దిదారులు అడిగితే.. అది అంతే. సీఎం నుంచి ఎమ్మార్వో వరకు ఎవరికైనా చెప్పుకో పో అంటూ వాహన నిర్వాహకుడు వార్నింగ్ ఇస్తున్నాడు. జగన్ హయాంలో బరితెగిస్తున్న పాలనకు ఈ ఘటన నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  కృష్ణా జిల్లాలోని నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో జరిగిందా ఘటన. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేషన్ ఇంటికి తెచ్చి ఇస్తా అన్నారు కదా అని అడిగితే... సీఎం నుంచి ఎమ్మార్వో వరకు ఎవరికైనా చెప్పుకో పో అంటూ వాహన నిర్వాహకుడు మండిపడ్డాడు.  ఆ వీడియోను టీడీపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘వందల కోట్ల ప్రజాధనం తగలేసి పాలకులు చేసిన బుర్ర తక్కువ పనులకు ఫలితం చూసారా? తమకేదో ఒరగపెడతారనుకుంటే చివరికి "నీకు దిక్కున్నోడికి చెప్పుకో పో" అన్న మాటలతో ప్రజలు అవమానాలు పడాల్సివస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం, లింగాలపాడు గ్రామంలో ఇంటింటికీ డోర్ డెలివరీ పథకం తీరు ఇది’’ అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది టీడీపీ.

సైకిల్‌ గుర్తుకు ఓటేయమన్న వైసీపీ ఎమ్మెల్యే

సైకిల్ గుర్తుకే మీ ఓటు. మామూలుగానైతే ఇది సాధారణ డైలాగే. కానీ, ఇదే మాట ఓ వైసీపీ ఎమ్మెల్యే నోటి నుంచి వస్తే? అది ఇక ట్రోలింగ్ న్యూసే. అదే జరుగుతోంది ఇప్పుడు.  ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు.. తన ప్రత్యర్థి పార్టీ అయిన సైకిల్ గుర్తుకు ఓటేయమంటూ ప్రజలకు పిలుపిచ్చారు. ఎమ్మెల్యే నినాదం విని అక్కడి వారంతా అవాక్కయ్యారు. ఇదేంటి? వైసీపీ ఎమ్మెల్యే.. సైకిల్ గుర్తుకు ఓటు వేయమంటున్నారేంటి? అని ఆశ్చర్యపోయారు. వారంతా షాక్‌కు గురయ్యారు. ఫక్కున నవ్వారు. మీటింగ్‌కు వచ్చిన వారంతా పగలబడి నవ్వుతుండటంతో.. ఏదో పొరబాటు జరిగుంటుందని సదరు ఎమ్మెల్యేకు అర్థమైంది. వాసుబాబు వెంటనే కవర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. సైకిల్ గుర్తుపై ఓటేయాలంటూ తాను జోక్ చేశానని చెప్పుకొచ్చారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఒక్కసారి నాలుక జారాక.. అది వీడియోలో రికార్డ్ అయ్యాక.. ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా? ట్రోల్స్‌తో చెడుగుడు ఆడుకోదూ? ఇప్పుడు అదే జరుగుతోంది. సైకిల్ గుర్తుకు ఓటేయమన్న వైసీపీ ఎమ్మెల్యే వాసుబాబు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్యాంట్ తడుపుకునే బ్యాచ్ కాదు..

ప్రధాని మోదీని చూసి ప్యాంట్ తడుపుకునే బ్యాచ్ కాదు.. పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతు కావాలి. కేంద్రం ఏమి చెబితే దానికి తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే లాభం ఉంటుందా? వైసీపీ వాళ్లు 21 మంది లోక్‌సభ‌లో, ఆరుగురు రాజ్యసభ‌లో ఎంపీలుగా ఉండి ఏం సాధించారు? టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలే అయినా పార్లమెంట్‌లో సింహాల్లా పోరాడుతున్నారని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా తిరుపతితో ప్రచారం నిర్వహించిన ఆయన.. వైసీపీపై ఘాటైన విమర్శలు చేశారు. ఆయన రెగ్యులర్ స్టైల్‌కి భిన్నంగా పంచ్‌లతో అధికార పార్టీని దుమ్ము దులిపేశారు.  ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం, విశాఖ రైల్వే జోన్.. అన్ని అంశాల్లోనూ కేంద్రాన్ని నిలదీసేది టీడీపీ ఎంపీలు మాత్రమేనన్నారు. కేంద్రమంత్రిగా పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న పనబాక లక్ష్మిని టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టామన్నారు. ‘‘ఒక మహిళగా ఇంట్లో ఆడవాళ్లు పడే కష్టం ఆమెకు తెలుసు. ఒక ఎంపీగా ప్రజల సమస్యలు పరిష్కరించడం కూడా ఆమెకు తెలుసు. పార్లమెంట్‌లో గర్జించి ప్రజలకు సేవ చేసే మీ ఇంటి లక్ష్మి కావాలో.. పార్లమెంట్‌లో పడుకొని జగన్ రెడ్డి పాదసేవ చేసే ఎంపీ కావాలో మీరే తేల్చుకోవాలంటూ ఓటర్లకు పిలుపిచ్చారు నారా లోకేశ్.

నర్సులు కావలెను.. అనుభవం అవసరం లేదు.. వసతి జీతం ఫ్రీ..  

నర్సులు కావలెను. అనుభవం లేకున్నా పరవాలేదు.. అవకాశం ఇస్తాం.. ఏంటి...? అనుభవం లేకున్నా అవకాశం ఏంటని అనుకుంటున్నారా. అవసరం అలాంటిది మరి . ఇది నా మాట కాదు. ప్రయివేట్ ఆసుపత్రుల ప్రకటనలు. కరోనా సెకండ్ వేవ్ పెరగడంతో.. ఆసుపత్రుల్లో కిక్కిరుసుకుపోతున్నారు జనాలు. వారికి సేవలు అందించడానికి. నర్సులకు డిమాండ్‌ పెరుగుతుంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులు వందలోపు, కార్పొరేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలైతే 200 నుంచి 500 మంది దాకా నియమించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటికే 200 మంది నర్సులను రిక్రూట్ చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అనుభవం లేకున్నా పర్వాలేదు జాబ్ లోకి తీసుకుంటాం అంటున్నారు. అనుభవం ఉంటే జీతం మరింత ఎక్కువే ఇస్తాం. వసతి సదుపాయాలూ కల్పిస్తాం. వచ్చి చేరండి’ అని సోషల్‌ మీడియాలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆస్పత్రుల్లోని నోటీసు బోర్డుల్లో పెడుతున్నారు. వృత్తిలో ఏడాది నుంచి ఐదేళ్ల అనుభవమున్నవారు, నర్సింగ్‌ స్కూళ్లలో తాజాగా కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.  గత ఏడాది మార్చి నుంచి కరోనా వ్యాప్తి ఉండటంతో నర్సులో కొంతమంది వృత్తిని మానేసి వెళ్లిపోయారు. ఇంకొందరు కుటుంబసభ్యుల ఒత్తిడితో మానుకున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసినవారూ ఉంటున్నారు. నర్సులకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అరబ్‌ దేశాల్లో నర్సులకు రూ.లక్షకు పైగా జీతాలు ఇస్తున్నారు. ఓటీ చేస్తే జీతం అదనం. మనవద్ద మాత్రం గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే ఇస్తుండటంతో కోర్సు పూర్తి చేసినవారిలో చాలామంది సౌదీ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా సెకండ్ వేవ్ కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్నారు. దీంతో కరోనా వార్డుల్లోని పడకలు ఫుల్‌ అయ్యాయి.  మరింత మంది రోగులకు వైద్యసేవలు అందించేందుకు పడకల సంఖ్యను పెంచుకుంటున్నారు. రోగులకు సేవలు అందించే వాళ్ళు కేకపోవడం తో ఆసుపత్రుల యాజమాన్యం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాత్కాలిక పద్ధతిలో సాధారణ నర్సులకు నెలకు రూ. 14 వేల నుంచి 15 వేలు, ఐసీయూలో అనుభవమున్న వారికి రూ. 16 వేలనుంచి రూ.20 వేల దాకా ఇవ్వనున్నారు. విదేశాల్లో కూడా నర్సులకు డిమాండ్.. విదేశాల్లో నర్సులకు చాలా డిమాండ్ ఉండనే చెప్పాలి. అక్కడ వారికి రూ.లక్ష చొప్పున జీతం ఇస్తారు. రెండేళ్లకు మించి అనుభవం ఉంటే రూ.లక్షకు మించి ఇస్తున్నారు. మన దగ్గర రూ.20వేలు మాత్రమే ఇస్తున్నారు.  దీంతో చాల మంది విదేశాలల పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకోవడం వల్ల కొంత మంది అక్కడ చేరుతున్నారు. ప్రతి ఏటా గ్రేటర్‌ పరిధిలో  ఉన్న 40 ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పరిధిలోని ఒక ప్రభుత్వ కాలేజీ కలుపుకొని ఏటా 1500 మంది నర్సులు శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు. ఇందులో 800 మంది నర్సులే వైద్య సేవలందించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చేరినవారిలో కొందరు జీతాలు సరిపోక ఉద్యోగాల నుంచి తప్పుకొని ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. దీంతో మొత్తంగా ప్రస్తుతం ఇక్కడ నర్సులకు కొరత ఏర్పడింది. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీడీయాట్రిక్స్‌ ప్రకారం ప్రతీ ఐదుగురు రోగులకు ఓ నర్సు ఉండాలి

118 ఏళ్ళ వృద్ధురాలికి టీకా.. 

ఆమె 1903 వ సంవత్సరం లో పుట్టింది. ఇప్పుడు ఆమెకు 118 ఏళ్ళు. ఆదివారం కరోనా టీకా తీసుకుంది. అందరూ కరోనా టీకా వేసుకోవాలని సూచించింది. కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. దేశం లో రోజు రోజు పెరుగుతున్న కేసులతో ఆసుపత్రుల్లో పేషేంట్ల సంఖ్య పెరుగుతుంది.. మళ్ళీ ప్రజల్లో కరోనా భయం మొదలైయింది. అదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం టీకా పంపిణీ వేగవంతం చేసింది. మొదట టీకాను అంతా స్పందన రాలేదు. టీకా తీసుకుంటే ఏమైనా అవుతుందేమో అని ప్రజలు భయపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ మొదలవ్వగానే ప్రజల్లో  క్రమంగా భయం స్టార్ట్ అయింది. కరోనాకు టీకా నే సరైన మందు అనుకుంటున్నారు. అటు దేశంలో లక్షలోనూ ఇటు తెలుగు రాష్ర్ట్రాల్లోనూ వేళ్ళ సంఖ్యల్లో కరోనా కేసులు వస్తున్నాయి. ఈ తరుణంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ టీకా తీసుకుంటున్నారు. తాజాగా, 118 ఏళ్ల బామ్మ ఈ టీకా తీసుకుని ఇతరులకూ పిలుపిచ్చింది. అంతేకాదు, వ్యాక్సిన్ సేఫ్ అని కూడా తెలిపింది. ఆమె వయస్సును నిర్ధారించే దస్త్రాలను పున:పరిశీలించాలని సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ సింగ్ పురమాయించారు. ఆధార్ కార్డు ద్వారా తుల్సాబాయి1903లో జన్మించినట్టు అధికారులు కనుగొన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.