వివేకా హత్య వెనుక బంధువులే..? 

రెండేళ్ల క్రితం తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్. హత్యపై సీబీఐ విచారణ జరుగుతున్నా కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. వివేకా హత్యపై రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి.. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగడం లేదని ఆరోపించడం కలకలం రేపుతోంది.  వైఎస్ వివేకానందారెడ్డిని గొడ్డలి పోటు పొడించింది ఎవరు? అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డిని ప్రశ్నించారు. వివేకానందారెడ్డికి కట్లు కట్టింది ఎవరు.. ఆ వైద్యులు ఎవరో తేలాలని వైసీపీ సర్కారును నిలదీశారు. హత్య సమాచారం రాగానే అక్కడి సీఐతో ఎంపీ ఏం మాట్లాడారు? అని ప్రశ్నించారు. సీబీఐ అధికారులతో ఓ ఎంపీ వీడియో కార్ఫరెన్స్‌లో ఏం మాట్లాడారు? అని నిలదీశారు. వివేకా హత్య వెనుక బంధువులే ఉన్నారని తెలుస్తోందని చెప్పారు. పార్లమెంట్‌లో కూడా వివేకా హత్య విషయం ప్రస్తావిస్తానని రఘురామ స్పష్టం చేశారు. తనపై కేసులు పెట్టాలని సీఎం జగన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ కలిసి.. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌పై ఒత్తిడి తెస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతి కేసులో  కొన్ని రోజులుగా  వస్తున్న కథనాలపై స్పందించారు వైఎస్ విజయమ్మ. ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో సంచలన విషయాలు చెప్పారు విజయమ్మ. వివేకా హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబానికి మరో అభిప్రాయం లేదని పేర్కొన్నారు. జగన్ తన కేసు అయినా, తన బాబాయ్ కేసు అయినా సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏం చేయగలడని విజయమ్మ ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన కుమార్తె సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది.  ఎంపీటీసీ,  జడ్పీటీసీ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ కు పోలింగ్ కు మధ్య నాలుగు వారాల గడువు ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ ఎస్ఈసీ పాటించలేదని హైకోర్టు పేర్కొంది. ఏప్రిల్ 1న ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ లో తదనంతర చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో గురువారం జరగాల్సిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ఆగిపోయింది.  పరిషత్ ఎన్నికల నిర్వహణపై విపక్షాలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ పట్టించుకోలేదని విమర్శించాయి. ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాకా అఖిలపక్ష సమావేశం జరపడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ఎస్ఈసీ సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అంతేకాదు పరిషత్ ఎన్నికలను కూడా తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది.   

తెలంగాణ సీఎస్ కు కరోనా.. ఇటీవల కేసీఆర్ తో వరుస సమీక్షలు 

తెలంగాణలో రోజురోజుకు కరోనా పంజా విసురుతోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా భారీన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇటీవల  ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. సీఎస్ కు కరోనా సోకడంతో తెలంగాణ సచివాలయంలో భయాందోళన నెలకొంది. కొన్నిరోజులగా సీఎస్ చాలా సమీక్షలు నిర్వహించారు. ఆయనతో సమావేశాలకు హాజరైన అధికారులంతా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.  సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ సమావేశమయ్యారు.  ప్రతీ రోజు సీఎంతో సోమేష్‌కుమార్‌ సమీక్షల్లో పాల్గొంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణలు కనిపిస్తే వెంటనే  కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు.ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లోనూ ఆందోళన నెలకొంది.  మరోవైపు ఈ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వ్యాధి నియంత్రణకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణ, కరోనావ్యాప్తి నివారణ చర్యలపై బుధవారం కలెక్టర్లతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కరోనా నియంత్రణ చర్యలను పకడ్భందీగా చేపట్టాలన్నారు.కరోనా పరీక్షలు పెంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం రోజు వంద పరీక్షలను, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 150 పరీక్షలను, సివిల్ ఆస్పత్రిలో 3 వందల టెస్టులను నిర్వహించాలని తెలిపారు. వాటి ఫలితాలను కోవిడ్ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు.  కరోనా పరీక్షల ఫలితాల ఆధారంగా కోవిడ్ వ్యాప్తిస్తున్న వారిని గుర్తించి హోం క్వారంటైన్ చేయాలని, ఇళ్లలో వసతి లేనివారిని ప్రభుత్వ క్వారంటైన్ హోంలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు సీఎస్ సోమేష్ కుమార్. కరోనా అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి సదరు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని, జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సామూహిక కార్యక్రమాలు, సభలకు అనుమతి ఇవ్వరాదన్నారు. ప్రజలు తప్పనిసరిగ్గా మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కరోనా వైద్యానికి చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్ సోమేష్ కుమార్.

వాక్సిన్ వేసుకుంటే బీర్ ఫ్రీ..

వాక్సిన్ వేసుకోండి.. బీర్ ఫ్రీ అంటున్నారు. ఓ రెస్టారెంట్ క్రేజీ ఆఫర్ పెట్టింది. వాక్సిన్  మహమ్మారి కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లను డబ్ల్యూహెచ్ఓ ఆమోదించగా, పలు దేశాలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన విషయం విదితమే. భారత్‌లో ఇప్పటికే 45 ఏళ్లకు పైబడిన వారికి వరస పెట్టి  టీకా వేస్తున్నారు. ఈ నేపథ్యం లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఓ రెస్టారెంట్ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తే ఒక బీర్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. రేపు (ఏప్రిల్ 7) నేషనల్ బీర్ డే సందర్భంగా ‘సెలబ్రేట్ యువర్ వ్యాక్సినేషన్ విత్ ఇండియన్ గ్రిల్ రూమ్’ స్లోగన్‌తో ఈ ఆఫర్ ఇస్తున్నట్లు గురు గ్రామ్‌లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు కొవిడ్ ఫస్ట్ ప్లస్ సెకండ్ డోస్ తీసుకున్న వారు వ్యాక్సినేషన్ కార్డు లేదా ఇంకేదైనా తీసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తే ఈ నెల 5 నుంచి ఒక బీర్‌ను ఇస్తున్నారు. వారం రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని తెలిపారు. అయితే వ్యాక్సిన్ నిబంధనల మేరకు ఆల్కహాల్ తీసుకోవద్దని సూచిస్తుండగా, వ్యాక్సిన్ పేరిట బీర్ల ఆఫర్ ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్కహాల్ లేని నార్మల్ డ్రింక్స్ లేదా పర్సంటేజ్ అతి తక్కువ ఉన్న డ్రింక్స్ మాత్రమే ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.  

24 గంటలు.. 43 లక్షల టీకాలు.. 

దేశంలో కరోనా మహమ్మారి  కోరలు చాస్తోంది. ప్రజలతో పాటు ప్రభుత్వాలను కూడా పెరుగెట్టిస్తోంది. ఈ తరుణంలో వైరస్‌ను చెక్ పెట్టే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను స్పీడ్ పెంచింది కేంద్రం. 24 గంటల వ్యవధిలో 43 లక్షల మందికి పైగా టీకాలు అందించింది. దేశంలో టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం ఇదే తొలిసారి.   ఏప్రిల్‌ 5న మొత్తం 43,00,966 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో తొలి డోసు తీసుకున్నవారు 39 లక్షల మంది కాగా..  రెండో డోసు తీసుకున్నవారు 4 లక్షల మంది ఉన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 8.3 కోట్లు దాటినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఉదయం 7 గంటల సమయానికి దేశంలో మొత్తంగా 8,31,10,926 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మహారాష్ట్రలో 81 లక్షలు, గుజరాత్‌లో 76లక్షలు, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 71 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 65 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు.    8 రాష్ట్రాల్లోనే 80 శాతం కేసులు వస్తుండగా.. మరోవైపు దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 96,982 మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే కొత్త కేసుల్లో 80 శాతం మహారాష్ట్రలో 47,288, ఛత్తీస్‌గఢ్‌లో 7,302, కర్ణాటకలో 5,279 కొత్త కేసులు బయటపడ్డాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడు, దిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లోనూ నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  దేశంలో కొత్త కేసులు పెరుగుతుండటంతో  క్రియాశీల కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,88,223 యాక్టివ్‌ కేసులుండగా, క్రియాశీల రేటు 6.21 శాతంగా ఉంది. అయితే వీటిలో 57.42శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 4.51 లక్షల క్రియాశీల కేసులున్నాయి. 13 రాష్ట్రాల్లో వైరస్‌ అదుపులోనే  ఉండటం ఊరటనిస్తోంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించలేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒడిశా, అస్సాం, పుదుచ్చేరి, మేఘాలయ, మణిపూర్‌, త్రిపుర, లక్షద్వీప్‌, మిజోరం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌, లద్దాఖ్‌, నాగాలాండ్‌, దాద్రానగర్‌ హవేలీ-డయ్యూడామన్‌లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు కరోనా మరణాలు లేవన్న సమాచారం ఊరట కలిగించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

వెంచర్ లో వాటా కోసం మంత్రి వార్నింగ్

అయనో మంత్రి. గౌరవప్రదమైన పదవిలో ఉన్నా  బరి తెగించారు. కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. ఓ వెంచర్ లో విషయంలో వాటా కావాలంటూ స్వయంగా ఆయనే బెదిరింపులకు దిగారు. సర్పంచ్‌లకు వాటాలు ఇస్తే.. ఎమ్మెల్యే, మంత్రులకు ఇవ్వారా అంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు చెప్పి పొట్టు పొట్టు చేయిస్తాం.. ఏమైనా బిచ్చమెత్తుకోవాల్నా.. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపేయండి అంటూ సదరు మంత్రి హుకుం జారీ చేశారు.  ఓ వెంచర్ విషయంలో వాటా కావాలంటూ తెలంగాణ మంత్రి  బెదిరింపులకు సంబంధించిన ఆడియో టేపు సంచలనం రేపుతోంది. హైదరాబాద్ నగర శివారు శామీర్‌పేట మండలం బొమ్మరాజుపేటలో 67 ఎకరాల్లో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ పడింది. దాంట్లో వాటా ఇవ్వాల్సిందే అంటూ మంత్రి మల్లారెడ్డి మాట్లాడినట్టు ఆడియో టేపు మీడియాలో వైరల్‌గా మారింది. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపాల్సిందే అంటూ మంత్రి హుకూం జారీ చేసినట్టు ఆడియోలో వినిపిస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఆడియో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారింది. మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  వెంచర్ విషయంలో వాటా కోసం బెదిరించినట్లుగా వైరల్ గా అవుతున్న ఆడియోపై  మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ ఆడియో టేప్‌లో ఉన్న వాయిస్ తనది కాదన్నారు మంత్రి మల్లారెడ్డి.  ఎవరో మిమిక్రీ చేశారని అన్నారు. ప్రస్తుతం నగరంలో మిమిక్రీ చేసేవాళ్లు ఎక్కువయ్యారని, నాకు ఎవరినీ బెదిరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాయిస్ రికార్డుపై దేనికైనా సిద్ధమన్నారు మల్లారెడ్డి. తనకే వందల ఎకరాలు ఉన్నాయని, వేరేవాళ్ల భూములు నాకు అవసరం లేదని మంత్రి తేల్చిచెప్పారు. 

సీఎం జగన్ బెయిల్ త్వరలో రద్దు? హైకోర్టులో వైసీపీ ఎంపీ పిటిషన్

అవినీతి ఆరోపణ వచ్చిందని మహారాష్ట్ర హోంమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌ని సీఎం జగన్ ఆదర్శంగా తీసుకోవాలి. వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని పిలుపిచ్చారు. సీఎం పదవిని వైఎస్ విజయమ్మ, భారతిలో ఎవరికిచ్చినా ఓకే అన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.  అభివ‌ృద్ధి పనుల్లో బిజీగా ఉన్నానంటూ సీఎం జగన్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడం కరెక్ట్ కాదన్నారు రఘురామ. సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్మోహన్‌రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని పిటిషన్‌లో గుర్తు చేశారు. ఇన్ని ఛార్జిషీట్లు వేసినా... ట్రయల్ ఆలస్యంగా జరుగుతోందన్నారు.  రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు. ప్రత్యర్థులు నానా రకాలుగా మాట్లాడటం బాధాకరమని, వారికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

లోకనాయకుడు 2.0.. నెవ్వర్ బిఫోర్..

నారా లోకేశ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలుగు తమ్ముళ్లకు యువరాజు. ప్రత్యర్థులకు మాత్రం పప్పు. లోకేశ్‌ది మాస్టర్ మైండ్ అంటారు సన్నిహితులు. మాట్లాడటమే రాదు, అమూల్ బాయ్ అంటారు ప్రత్యర్థులు. ఎవరేమన్నా.. లోకేశ్ మాత్రం ఇవేమీ పట్టించుకోరు. తన పని తాను చేసుకుపోతారు. పార్టీ కోసం నిత్యం కష్టపడి పని చేస్తుంటారు. డౌట్ ఉంటే.. ఓసారి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం వైపు ఓ లుక్కేయండి.. లోకేశ్ పని తీరు ఏంటో మీకే అర్థం అవుతుంది... మంచి ఎండలో.. చెమటలు కక్కుతూ.. తెలుగుదేశం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు నారా లోకేశ్. పాదయాత్రతో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కేండిడేట్ పనబాక లక్ష్మి నామినేషన్ వేసినప్పటి నుంచీ ఆమె గెలుపు కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్‌లో స్పూర్తి రగిలిస్తున్నారు. లోకేశ్ ముందు నడుస్తుంటే.. ఆ వెనకాలే తమ్ముళ్లు కదం కలుపుతున్నారు. మండు టెండలో.. పసుపు జెండాల నీడలో.. లోకేశ్ డైనమిక్ రోల్ ప్లే చేస్తున్నారు.  గుళ్లో పూజలు, యువకులతో సెల్ఫీలు, వృద్ధులు, మహిళలతో ముచ్చట్లు, రోడ్డు పక్కనే ఉన్న టీ షాపులో టీ తాగడం, వ్యాపారుల కష్టాలు అడిగి తెలుసుకోవడం.. ఇలా లోకేశ్ లోకనాయకుడిగా మారిపోయారు. అన్ని వర్గాల ప్రజలతో సంభాషిస్తూ.. వారి బాగోగులు తెలుసుకుంటూ స్థానికులతో మమేకమవుతున్నారు. చుట్టూ జనం.. మధ్యలో మనం.. అన్నట్టుగా కొన్ని రోజులుగా నారా లోకేశ్ జననేతగా మారిపోయారు. తిరుపతిలో పసుపు ప్రభంజనం సృష్టిస్తున్నారు. గాంధీ రోడ్డు, గాలి వీధి, తిలక్ రోడ్డు, గోవర్ధనపురం, పద్మావతిపురం, ఇందిరానగర్ సెంటర్.. ఇలా తిరుపతిలో ఎనీ సెంటర్ నారా లోకేశే కనిపిస్తున్నారు. తమ్ముళ్లలో ఉత్సాహం.. ఓటర్లలో ఉత్తేజం నింపుతున్నారు. టీడీపీకే ఓటేయమంటూ పిలుపిస్తున్నారు నారా లోకేశ్. నారా లోకేశ్‌కు మాట్లాడటమే రాదనేది ప్రతిపక్షాల టీజింగ్. అదంతా అసత్య ప్రచారమని తిరుపతి ఎన్నికల ప్రచారంలో నిరూపిస్తున్నారు లోకేశ్. రాత్రి, పగలనే తేడా లేకుండా చేస్తున్న ఎన్నికల క్యాంపెయిన్‌లో అడుగడుగునా.. అధికార వైసీపీ ఆగడాలను, అరాచకాలను చీల్చి చెండాడుతున్నారు నారా లోకేశ్. ఆయన మాటల్లో పదును.. డైలాగుల్లో పంచ్‌లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఓటర్లను ఆలోచింప చేస్తున్నాయి.  జే ట్యాక్స్, కరెప్షన్, బాదుడు పార్టీ అంటూ వైసీపీ పేరును జేసీబీగా మార్చేశారు నారా లోకేశ్. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాగేస్తున్నారంటూ సీఎం జగన్‌ దోపిడీని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. తిరుపతిలో నారా లోకేశ్ స్పీచ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన మాటల్లో వాడి-వేడీ బాగా పెరిగింది. పంచ్ డైలాగ్‌లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుమ్మేస్తున్నారు లోకేశ్. ప్రధాని మోదీని చూసి ప్యాంట్ తడుపుకునే బ్యాచ్ కాదు.. పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతు కావాలి. కేంద్రం ఏమి చెబితే దానికి తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే లాభం ఉంటుందా? వైసీపీ వాళ్లు 21 మంది లోక్‌సభ‌లో, ఆరుగురు రాజ్యసభ‌లో ఎంపీలుగా ఉండి ఏం సాధించారు? టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలే అయినా పార్లమెంట్‌లో సింహాల్లా పోరాడుతున్నారు. ఇలా ఓ రేంజ్‌లో డైలాగులను డైనమైట్లలా పేలుస్తున్నారు నారా లోకేశ్.  కేంద్రమంత్రిగా పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించమంటూ ఓటర్లను కోరుతున్నారు. "ఒక మహిళగా ఇంట్లో ఆడవాళ్లు పడే కష్టం ఆమెకు తెలుసు. ఒక ఎంపీగా ప్రజల సమస్యలు పరిష్కరించడం కూడా ఆమెకు తెలుసు. పార్లమెంట్‌లో గర్జించి ప్రజలకు సేవ చేసే మీ ఇంటి లక్ష్మి కావాలో.. పార్లమెంట్‌లో పడుకొని జగన్ రెడ్డి పాదసేవ చేసే ఎంపీ కావాలో మీరే తేల్చుకోవాలంటూ.. నారా లోకేశ్ తిరుపతివాసులకు పిలుపిస్తూ అద్భుతంగా ప్రసంగిస్తున్నారు. ప్రతిపక్షం ఎగతాళి చేస్తున్నట్టు నారా లోకేశ్ పప్పు కాదు.. ఫైర్. దమ్ముంటే టచ్ చేసి చూడండి.. మీకు కాలిపోద్ది అంటూ సవాల్ విసురుతున్నారు తెలుగు తమ్ముళ్లు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో లోకేశ్ దూకుడు.. నెవ్వర్ బిఫోర్.

కేసీఆర్ సారూ.. జర కాపాడు..

అతని పేరు  గడప చంద్రశేఖర్‌. ప్రైవేట్ బడి పంతులు. అతనికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొడుకు ఆరోగ్యం బాలేదు. కుటుంబం గడవడం కోసం అతని భార్య బీడీలు చుడుతోంది. చాలి చాలని జీతాలతో జీవితం వెళ్లదీస్తున్నాడు. కరోనా వల్ల ఆ బడి పంతులు బతుకు బండి కి బ్రేక్ పడింది. కరోనా అందరి పొట్ట కొట్టినట్లే బడిపంతులు పొట్ట పై వేటు పడింది. బతుకు బండి నెట్టుకురావడానికి  అప్పు చేశాడు. లోన్ లో బైక్ తీసుకున్నాను. ఈఎంఐలు కూడా కట్టలేక పోతున్నాను సర్ అంటూ కేసీఆర్ ని వేడుకున్నాడు. ఆ బాధల నుండి బయట వేయమని బతిమాలుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ దుస్థితి వివరిస్తూ వీడియో రూపొందించారు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.  మా భార్య, పిల్లలకు రెండు పూటలా తిండి పెట్టే స్థితి లేక పస్తులు ఉంటున్నాం. మమ్మల్ని ఆదుకోండి, కాపాడండి, మాకు జీవితాన్నివ్వండి సార్‌. మా కుటుంబం కూడా మరో సునీల్‌ కుటుంబంగా మారకముందే.. మా కుటుంబం ఆత్మహత్యలు చేసుకోకముందే మమ్మల్ని కాపాడండి సార్‌. మమ్నల్ని కాపాడే బాధ్యత మీదే సార్‌. మీరు మమ్నల్ని కాపాడితే మీకు శాశ్వతంగా రుణపడి ఉంటాం సార్‌. అని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ని కోరాడు. 

మండుటెండల్లో గోదారి పరవళ్లు... కాళేశ్వరంలో మరో అద్బుతం

తెలంగాణ ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టు కాళేశ్వరం పథకంలో మరో అద్భుతం ఆవిష్క్రతమైంది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరుకున్నవి. కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ కు తరలించే కార్యక్రమం చేపట్టారు సీఎం కెసిఆర్. తర్వాత  కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు. దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం ఉదయం  ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లి కి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ  కాళేశ్వర  జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలాలను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు చేరుకుంటాయి. ఆ తర్వాత, మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం కెసిఆర్  ప్ర‌త్యేక పూజ‌లు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని ... పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చే బర్తి చెరువు, ప్రజ్ఞా పుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి.     

బీజాపూర్ ఎన్ కౌంటర్ లో షాకింగ్ నిజాలు

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది భద్రతా బలగాలు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మావోయిస్టులను దెబ్బకు దెబ్బ కొట్టేలా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల వద్ద బంధీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ కోసం బలగాలు గాలిస్తున్నాయి. అయితే బీజాపూర్ ఎన్ కౌంటర్ కు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి.  ‘‘వాళ్లు అంతా పొడవుగా ఉన్నారు సార్‌..! వారిపై ఫైర్‌ చేస్తున్నా.. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ధరించి.. జంకు లేకుండా నిలబడ్డారు..! ఏ ఒక్కరూ పొట్టిగా కనిపించలేదు..! అంతా బలంగా ఉన్నారు..! భారీ కసరత్తు, శిక్షణ తీసుకున్న వారిలా కనిపించారు. అలాంటి వారిని మావోయిస్టుల్లో ఎన్నడూ చూడలేదు.’’..అని ఛత్తీ‌సగఢ్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడి, బీజాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాన్‌ చెప్పారు.   ఆదివారం నాటి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు దళంలోని పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) దళాలు పాల్గొన్నాయని భావిస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు పీఎల్‌జీఏ ఒకటో బెటాలియన్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. అతను తన దళంలో రిక్రూట్మెంట్ల సమయంలోనే ఎత్తుగా, బలంగా ఉన్న యువకులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గెరిల్లా యుద్ధ విద్యలతోపాటు.. శారీరక వ్యాయామాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. క్షతగాత్రుల వద్దకు వారు కొండలు, గుట్టలు, అడవుల నుంచి పరుగెత్తుకొచ్చిన తీరును బట్టి.. ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘మాకు వాళ్లు అతి దగ్గరగా వచ్చారు. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపినా.. వాళ్లకు చిన్న గాయం కూడా కాలేదు. ముఖంలో భయం కనిపించలేదు. అంతా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ధరించారు’’ అని మరో జవాను చెప్పడాన్ని బట్టి పీఎల్‌జీఏ దళాలు ప్రత్యక్ష యుద్ధానికి అవసరమైన శిక్షణ తీసుకున్నట్లు అర్థమవుతోంది. ‘‘మావోయిస్టుల్లో అలాంటివాళ్లను ఇంతవరకు చూడలేదు. చూడడానికే రాక్షసుల్లా కనిపించారు. ఇంతకుముందు కూంబింగ్‌లలో మావోయిస్టులు తారసపడ్డా బక్కచిక్కి కనిపించారు. ఆదివారం నాటి ఘటనలో మావోయిస్టులు భిన్నంగా ఉన్నారు’’ అని ఆ జవాను వెల్లడించారు.ఉన్నతాధికారులు సైతం ఈ విషయాలను నిర్ధారిస్తున్నారు. మావోయిస్టులు ఈ ఆపరేషన్‌ కోసం బలంగా ఉన్నావారినే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.  

జగన్ కు జైలు ఖాయమా? ఢిల్లీ నుంచి సిగ్నల్స్ వచ్చాయా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గండం ముంచుకొస్తుందా? ఆరు నెలల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమా? ఏపీకి కొత్త సీఎం రాబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత కాలంగా దీనిపై చర్చ జరుగుతోంది. తనపై ఉన్న అక్రమాస్తుల కేసులో గతంలో జైలుకు వెళ్లారు జగన్. ఇప్పుడు కూడా ప్రతి శుక్రవారం జగన్ కేసుల విచారణ సీబీఐ , ఈడీ కోర్టుల్లో జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం విచారణకు హాజరుకావడం లేదు. జగన్ కేసుల్లో ఉన్న ఇతర నిందితులంతా వారం వారం విచారణకు హాజరవుతున్నారు. అయితే  కేంద్రం పెద్దలకు మోకరిల్లడం వల్లే జగన్ కేసుల్లో విచారణ స్లోగా సాగుతుందని.. త్వరలోనే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.  ఆరు నెలల తర్వాత సీఎం జగన్‌ అధికారంలో ఉండరని తెలిపారు. ఆరు నెలల్లోనే జగన్ జైలుకు వెళతారని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తిరుపతి లోక్ సభ సభ్యుడిగా నాలుగు సార్లు గెలిచారు  చింతా మోహన్. కేంద్ర మంత్రిగానూ పని చేశారు. సుదీర్ఘ కాలం ఎంపీగా పని చేసిన చింతా మెహన్ కు ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలున్నాయి. రాజకీయాల్లో నిజాయితిపరుడిగా పేరున్న చింతా మోహన్ కు  కాంగ్రెస్ తో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలతోనూ సంబంధాలున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల విషయంలోనూ ఆయనకు మంచి పట్టు ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే చింతా మోహన్.. ఆరు నెలల్లో జగన్ సీఎం పదవి పోతుందని చెప్పారంటున్నారు.  2019లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాకా కేంద్ర సర్కార్ తో సఖ్యతగా ఉంటున్నారు సీఎం జగన్. తరచూ ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలతో సమావేశమవుతున్నారు. జగన్ కేసుల్లో ఏ2గా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి... బీజేపీ పెద్దల చుట్టే తిరుగుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తమపై ఉన్న కేసుల్లో రాజీ కోసం జగన్ కోసం విజయసాయి కేంద్రంలోని కీలక నేతలతో మంతనాలు చేస్తుంటారని విపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఇటీవల వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేక హోదాను మరిచిపోయిన కేంద్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిధులకు కొర్రీలు వేస్తోంది. ఇంత జరుగుతున్నా కేంద్రాన్ని జగన్ ప్రశ్నించడం లేదనే విమర్శలు ఉన్నాయి. తన కేసుల కోసం కేంద్రానికి రాష్ట్రాన్ని జగన్ రెడ్డి తాకట్టు పెట్టారనే ఆరోపణలు కూడా కొందరు చేస్తున్నారు.  అయితే కొన్ని రోజులుగా వైసీపీ పట్ల బీజేపీ స్టాండ్ మారినట్లుగా కనిపిస్తోంది. తిరుపతి లోకసభ ప్రచారంలో జగన్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు కమలనాధులు. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ తో పాటు జగన్ కు అనుకూలమనే ఆరోపణలు ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జగన్ త్వరలో జైలుకు వెళతారని కామెంట్లు చేస్తున్నారు.  ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. జగన్ టార్గెట్ గా పావులు కదుపుతుందనే ప్రచారం జరుగుతోంది. తిరుపతి లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ మరింత స్పీడ్ పెంచే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే చింతా మోహన్ లాంటి సీనియర్ నాయకుడు కూడా జగన్ ముఖ్యమంత్రి పదవి ఆరు నెలల్లో పోతుందని ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లో ఏపీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని, సీఎం జగన్ కష్టాల్లో పడపోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.   

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ.. లాక్‌డౌన్ తప్పదా?

లాక్ డౌన్ దిశగా దేశం అడుగులేస్తోంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ఆంక్షలు విధిస్తోంది. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ విధించారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకూ నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అనుమతులు లేకుండా బయటకు వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.  ప్రస్తుతానికి నైట్ కర్ఫ్యూ వరకే పరిమితమని.. లాక్ డౌన్ విధించే ఆలోచన ఇప్పట్లో లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. అయితే, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అవసరానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సెకండ్ వేవ్ లో భాగంగా దేశ రాజధానిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 3,548 మందికి కరోనా సోకగా.. 15 మంది చనిపోయారు. మొత్తంగా 6,79,962 మంది వైరస్ బారినపడ్డారు. 11,096 మంది ప్రాణాలు కోల్పోయారు. 

బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు లేవు?

బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడంలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంది. నిబంధనలు పాటించని వారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలు వెల్లడిస్తూ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై నివేదిక సమర్పించింది.  ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు అతితక్కువగా చేస్తున్నారని, పూర్తిగా ర్యాపిడ్‌ టెస్టులపైనే దృష్టి పెట్టారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 10 శాతం కూడా లేవని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ఏజీ వివరణ ఇవ్వగా.. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలని స్పష్టం చేసింది.  రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పాజిటివ్‌, మరణాల రేటు వెల్లడించాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని.. అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. 

బీటెక్ లో లవ్.. జాబ్ వచ్చాక బ్లాక్ మెయిల్.. 

వాళ్ళు ఇద్దరు ఒకే కాలేజీ లో చదువుకున్నారు. అమ్మాయి  ఇంజినీరింగ్‌, అబ్బాయి  ఎంబీఏ.  కాలేజ్ చదువుకునే రోజుల్లో కలిసి మెలిసి తిరిగారు. స్నేహంగా ఉన్నారు. ఫోటోలు దిగారు. స్నేహం ముసుగులో తాచుపాముల కాటు వేయడానికి కాచుకూచున్న మణికంఠ ఆమె ఇంజినీరింగ్‌ ఫోర్త్ ఇయర్ లో  అతడి ఇంటికి తీసుకువెళ్లాడు.  అత్యాచార* చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె అక్కడి నుండి  తప్పించుకుని బయటకు వచ్చింది. కట్ చేస్తే.. ఆ అమ్మాయి హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ జాబ్ జాయిన్ అయింది. ఆ అమ్మాయికి తల్లి దండ్రులు పెళ్లి సంబంధం చూడడం కోసం. మ్యాట్రీమోని వెబ్‌సైట్‌ లో ఫొటోస్ తో పాటు ప్రొఫైల్ పెట్టారు. మ్యాట్రీమోని వెబ్‌సైట్ ఫోటోలు చూసిన  మణికంఠ గత నెల 25వ తేదీన ఆమె ఇంటికి వచ్చి  తనను వివాహం చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు.    ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తుండగా..లాక్ డౌన్ కారణంగా వర్క్ ‌ఫ్రం హోం కావడంతో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నారు. మళ్ళీ తిరిగి  ఈ నెల 1వ తేదీన ఆమె ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడారు మణికంఠ. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. ఆ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడటంతో పాటు తనతో దిగిన ఫొటోలతో బెదిరిస్తున్నట్లుగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.     

ఎంఐఎం లీడర్ల రేవ్ పార్టీ ..

జల్సాలకు యువతే కాదు. పార్టీల నాయకులు కూడా తామేం తక్కువ కాదంటూ జల్సాలు చేస్తున్నారు. మద్యం మత్తులో మగువలతో చిందేశారు. అర్ధ రాత్రి మహిళలతో అశ్లీల నృత్యాలు చేశారు. పాతబస్తీ చాంద్రాయణగుట్టలో ఎంఐఎం కార్యకర్తలు రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీలో మద్యం సేవించి మగువలతో చిందులు, అశ్లీల నృత్యాలు చేయించారు.  మజ్లిస్ నేత పర్వేజ్, అతని స్నేహితులు.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేటు గదిలో ఇతర రాష్ట్రాల మహిళలతో రేవ్ పార్టీ నిర్వహించారు. అశ్లీల నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో చాంద్రాయణగుట్ట  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పర్వేజ్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వెంటనే దాడి చేస్తే వివరాలు తెలిసేవని, ప్రస్తుతం కేవలం వీడియో మాత్రమే ఉన్నందున దానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. మహిళలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. వాళ్లు ఇక్కడి వాళ్లేనా? లేక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.    

సుప్రీంకోర్టు సీజేగా ఎన్వీ రమణ

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ రమణ పేరును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన 2022 ఆగస్టు 26వరకు పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ పదవి అలంకరించిన రెండవ తెలుగు వాడిగా జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తింపు పొందనున్నారు. జస్టిస్ ఎన్‌వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు.  వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. 2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. 2014లో సుప్రీం కోర్టులో నియమితులయ్యారు. 

చిన్నమ్మ ఓటు గల్లంతు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. అయితే తమిళనాడు ఓటర్ లిస్టులో సంచలనం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళ పేరు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. ఓటరు జాబితాలో పేరు లేని కారణంగా శశికళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోయింది. మూడు దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ చిరునామాలోనే ఉంటున్న శశికళ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లిన తర్వాత జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అక్కడే నివసిస్తున్న శశికళ, ఇళవరసి సహా 19 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ శశికళ, ఇళవరసి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. మరోవైపు, శశికళ పేరును జాబితాలో చేర్చకపోవడంపై థౌజండ్ లైట్స్ ఏఎంఎంకే అభ్యర్థి వైద్యనాథన్ సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు 3,998 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తమిళనాడులో ఈ ఎన్నికల కోసం 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, తమిళ మానిల కట్చి ఓ కూటమి కాగా... విపక్ష డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే మరో కూటమిగా పోటీ పడ్డాయి. 

 జగన్, షర్మిల అభిప్రాయాలు వేరు! విజయమ్మ సంచలనం

తెలంగాణలో కొత్త పార్టీ పెడుతోంది వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, దివంగత వైఎస్సార్ కూతురు తెలంగాణలో సొంతంగా పార్టీ పెడుతుండటం సంచలనంగా మారింది .వైసీపీ ఉండగానే తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ వస్తుండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంత కాలంగా జగన్ తో షర్మిలకు విభేదాలున్నాయనే, అన్నపై కోపంతోనే షర్మిల సొంతంగా పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరిగింది. రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చి షర్మిలకు జగన్ మోసం చేశారని కొందరు నేతలు ఆరోపించారు. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న గోనే ప్రకాశ్ రావు వంటి నేతలు కూడా షర్మిలకు జగన్ అన్యాయం చేశారని చెప్పారు. షర్మిల పార్టీపై జోరుగా చర్చలు సాగుతుండగానే వైఎస్ విజయమ్మ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్, షర్మిల అభిప్రాయాలు వేరుగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. ఇద్దరి అభిప్రాయాలు వేరు అయినా... భేదాప్రాయాలు మాత్రం లేవని చెప్పారు విజయమ్మ. షర్మిల పార్టీకి తన సపోర్ట్ ఉందనే సంకేతమిచ్చారు విజయమ్మ. షర్మిల పార్టీపై విజయమ్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జగన్, షర్మిల అభిప్రాయాలు వేరు అని విజయమ్మే స్పష్టం చేయడంతో... ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం నిజమేనని తెలుస్తోంది.  వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతి కేసులో  కొన్ని రోజులుగా  వస్తున్న కథనాలపై స్పందించారు వైఎస్ విజయమ్మ. ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో సంచలన విషయాలు చెప్పారు విజయమ్మ. వివేకా హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబానికి మరో అభిప్రాయం లేదని పేర్కొన్నారు. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందన్న విషయం పవన్ కల్యాణ్ కు తెలియదా? సీబీఐ దర్యాప్తు కేంద్రం చేతిలో ఉంటుందని తెలిసి కూడా పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రమాదవశాత్తు సంభవించిన మరణమా? లేక హత్యా? అని తమకు అనుమానం వచ్చినా, ఏంచేయలేకపోయామంటూ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన కేసు అయినా, తన బాబాయ్ కేసు అయినా సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏం చేయగలడని విజయమ్మ ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకులను గుర్తించి చట్టప్రకారం శిక్షించాల్సిందేనన్న విజయమ్మ, ఈ విషయంలో ఆయన కుమార్తె సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.