రోజుకు లక్ష.. కుమ్మేస్తున్న కరోనా
posted on Apr 5, 2021 @ 1:12PM
కొవిడ్ సెకెండ్ వేవ్ తారాస్థాయిలో ఉండొచ్చు. కరోనా కట్టడికి మినీ లాక్‌డౌన్‌లు అవసరం. ప్రజలు సాధ్యమైనంత వరకూ ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చేసిన హెచ్చరికలు ఇవి. ఆయన అన్నట్టే జరుగుతోంది. కరోనా తొలి వేవ్‌లో 70,000 కేసులు రావడానికి చాలా నెలల సమయం పడితే.. ప్రస్తుతం ఒక్కరోజే లక్ష కేసులతో ఇండియాలో సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. గత వారం ఏకంగా 5.45లక్షల పాజిటివ్ కేసులతో దడ పుట్టిస్తోంది.
కేవలం 24 గంటల వ్యవధిలో దేశంలో 1,03,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన దేశంగా అమెరికా తర్వాత రెండో స్థానంలో భారత్ నిలవడం మరింత ఆందోళనకరం. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మన దేశంలో 1.03లక్షల మందికి వైరస్ సోకింది. ఇందులో అత్యధిక మహారాష్ట్ర నుంచే. నెల రోజుల కిందట రోజువారీ కొత్త కేసులు 15వేల వరకూ ఉండగా.. ఇప్పుడు ఏకంగా ఆరు రెట్లు పెరిగి లక్ష దాటడం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అమెరికా, భారత్ మినహా ఏ దేశంలోనూ ఇప్పటివరకు ఒక రోజులో లక్షకు పైగా కేసులు నమోదు కాలేదు.
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. గత సెప్టెంబరులో రోజువారీ మరణాలు వెయ్యికి పైనే నమోదవగా.. గడిచిన 24 గంటల్లో 478 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.25కోట్లు దాటింది. వీరిలో 1.16కోట్ల మంది వైరస్‌పై విజయం సాధించారు. ప్రస్తుతం 7.41లక్షల యాక్టివ్ కేసులున్నాయి.