హే ర‌మ‌ణా.. ర‌చ్చ అవ‌స‌ర‌మా?

వ‌డ్డించే వాడు మ‌న‌వాడైతే ప‌ద‌వులు వెతుక్కుంటూ వ‌స్తాయి. టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు విష‌యంలో ఇదే జ‌రిగింది. టీడీపీ హ‌యాంలో ప‌ద‌వి కోల్పోయారు. జ‌గ‌న్ రెడ్డి కాలంలో మ‌ళ్లీ ప్ర‌ధాన అర్చ‌కులుగా నియ‌మితుల‌య్యారు. పింక్ డైమండ్‌, నేల‌మాళిగ‌లంటూ చంద్ర‌బాబుపై చేసిన ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌తిఫ‌లంగానే ఈ ప‌ద‌వి ఇచ్చార‌నేది ప్ర‌తిప‌క్షం మాట. అందుకు త‌గ్గ‌ట్టుగానే.. శ్రీవారి ఆలయంలో ప్ర‌ధాన అర్చ‌కులుగా చేరాక ర‌మ‌ణ స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శించుకున్నారు. సీఎం జ‌గ‌న్‌ను విష్ణుమూర్తితో పోల్చారు. తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చారం లేదంటూ కితాబు ఇవ్వ‌డం కాంట్ర‌వ‌ర్సీగా మారింది.  శ్రీవారి ఖ‌జానాలో పింక్ డైమండ్‌. అస‌లు ఉందో లేదో ఎవ‌రికీ తెలీదు. ఉందంటూ అప్ప‌ట్లో గ‌ట్టిగా వాదించారు ర‌మ‌ణ దీక్షితులు. దేవుని మీద ఒట్టేసి మ‌రీ తాను చెప్పేదంతా నిజ‌మ‌న్నారు. ఆల‌య నేల‌మాళిగ‌ల్లో ఖ‌జానా త‌‌వ్వుకుపోయారంటూ ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల‌న్నీ అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టార్గెట్‌గా చేసిన‌వే. పింక్ డైమండ్ వివాదం మ‌రింత ముద‌ర‌డం.. కోర్టుకు చేర‌డం,.. నిజ‌నిర్ధార‌ణ‌కు క‌మిటీ వేయ‌డం.. అలాంటిదేమీ లేదంటూ తేల‌డంతో.. ర‌మ‌ణ దీక్షితులు నోటికి తాళం ప‌డింది. ఆ త‌ర్వాత‌ వ‌య‌సురిత్యా ఆయ‌న్ను ప్ర‌ధాన అర్చ‌కుడి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది అప్ప‌టి ప్ర‌భుత్వం.  క‌ట్ చేస్తే.. ఏపీలో ప్ర‌భుత్వం మారింది. ర‌మ‌ణ దీక్షితుల‌కు మ‌ళ్లీ టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కుల‌య్యారు. ప‌ద‌వి అలంక‌రించిన వెంట‌నే జ‌గ‌న్ రెడ్డిని విష్ణుమూర్తితో పోలుస్తూ ఆకాశానికి ఎత్తేశారు. ఉడ‌తా భ‌క్తిగా స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించారు. ప‌నిలో ప‌నిగా జ‌గ‌న్ స‌ర్కారు ఉదాసీన‌త వ‌ల్ల తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ‌ల మ‌కిలీని తుడిచేసే ప్ర‌య‌త్న‌మూ చేశారు.  అస‌లు తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చార‌మే లేదంటూ క్లీన్‌చీట్ ఇచ్చేశారు.  ర‌మ‌ణ దీక్షితులు వ్యాఖ్య‌ల‌పై బీజేపీ మండిప‌డింది. వైసీపీ అధికార ప్రతినిధిగా రమణ దీక్షితులు వ్యవహరిస్తున్నారని, అంతగా పార్టీలో సేవలు చేయాలనుకుంటే టీటీడీ ప్రధాన అర్చకుడిగా రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్ర‌తినిధి భానుప్ర‌కాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో అన్యమత ప్రచారం జరగడం లేదని ఆయన సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గతంలో దేవస్థానంపై చేసిన ఆరోపణలుపై సమాధానం చెప్పిన తర్వాత రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడుగా రావాలన్నారు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను భంగం కలిగించే విధంగా పింక్ డైమండ్ ఉందని, నేలమాళిగలు ఉన్నాయని ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు.. ఇప్పుడు ప్రధాన అర్చకుడుగా ఏముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని తాను నిరూపిస్తానని, రమణ దీక్షితులు విచారణకు వస్తారా? అని భానుప్ర‌కాశ్‌రెడ్డి స‌వాల్ విసిరారు.  ర‌మ‌ణ దీక్షితులు తిరుమ‌ల శ్రీవారి ఆల‌య‌ ప్ర‌ధాన అర్చ‌కులుగా నియ‌మితులు కావ‌డంతో పాత ఆరోప‌ణ‌ల‌న్నీ మ‌ళ్లీ కొత్త‌గా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. తిరుమ‌ల వివాదాల తేనెతెట్టును మళ్లీ క‌దిలినా ఆశ్చ‌ర్యం అవ‌స‌రం లేదు.

ఎమ్మెల్యేల అనుచరులకు కరోనా! సాగర్ టీఆర్ఎస్ లో టెన్షన్ 

నల్గొండ జిల్లా  నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తమ బలగాన్ని మెత్తం సాగర్ లోనే మోహరించాయి పార్టీలు. అన్ని జిల్లాల నుండి పార్టీ నేత‌ల‌ను తీసుకొచ్చి ప్ర‌చారం చేయిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అయితే మండ‌లానికో ఎమ్మెల్యే, ప‌లువురు మంత్రుల‌ను రంగంలోకి దింపింది. ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేల వెంట.. వాళ్ల నియోజకవర్గానికి చెందిన నేతలు భారీగా సాగర్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి సాగర్ లో ప్రచారం చేస్తున్న వారిలో కొందరికి కరోనా సోకిందనే ప్రచారం.. స్థానిక నేతలను, జనాలను కలవరపెడుతోంది.  మ‌హారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో క‌రోనా కేసుల సంఖ్య అధికంగా ఉంది. ప్ర‌తిరోజు వంద‌ల కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. అయితే ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డితో పాటు  ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం అంతా నిజామాబాద్ నుండి వ‌చ్చి సాగ‌ర్ లో మ‌కాం వేసింది.  మాస్కులు, భౌతిక దూరం లేకుండానే వాళ్లంతా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే జీవ‌న్ రెడ్డి టీంలో దాదాపు 10 మందికి కరోనా వైర‌స్ సోకిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. జీవ‌న్ రెడ్డితో పాటు మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపులో ఎడుగురికి వైర‌స్ సోకిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. పైగా వీరికి ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డితేనే టెస్టులు చేశారు. పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల టీంను కలిసిన వారు, వాళ్లతో కలిసి ప్రచారం చేసిన వారిలో టెన్ష‌న్ నెల‌కొంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల అనుచరులకు కరోనా సోకిందన్న ప్రచారంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయపెడుతున్నా ఇలా వందలాది మంది వచ్చి ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కరోనా వైర‌స్ కేసుల్లో అత్య‌ధికంగా ల‌క్ష‌ణాలు లేని కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో మిగిలిన వారికి కూడా వైర‌స్ వ్యాప్తి అయ్యే అవ‌కాశం ఉంది. ఏప్రిల్ 14న సాగ‌ర్ లో సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. దీంతో సాగ‌ర్ లో  వైర‌స్ విజృంభ‌ణ భారీగా పెరిగే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతుంది. 

రబ్బర్ స్టాంపేనా?

ఏప్రిల్ 1న నోటిఫికేష‌న్‌. ఏప్రిల్ 8న పోలింగ్‌. ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌క‌న్నా స్పీడ్‌గా ఎన్నిక‌లు నిర్వ‌హ‌ణ‌కు న‌గారా మోగించారు ఎస్ఈసీ నీలం సాహ్ని. అంటే, జ‌స్ట్ 6 రోజులే స‌మ‌యం. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌ల్లో ఉండాలి. ఇది సుప్రీంకోర్టు తీర్పు. ఇంత చిన్న విష‌యం అంత సీనియ‌ర్ మోస్ట్ అధికారికి తెలియ‌దా? లేక అంతా తెలిసే త‌న విచ‌క్ష‌ణాధికారంతో ఇలా నోటిఫికేష‌న్ ఇచ్చారా? ప్ర‌భుత్వ మాటే త‌న మాట‌గా పాటించారా? రూల్ బుక్ చూడ‌కుండానే.. ‘పరిషత్‌ ఎన్నికలు ఆపేందుకు నాకు ఎలాంటి కారణమూ కనిపించలేదు’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని తేల్చేచేరా? ఇలా అనేక స‌మాధానం లేని ప్ర‌శ్న‌లు.  గ‌త ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ హ‌యాంలో రూల్ అంటే రూలే. నిబంధ‌న‌ల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. అందుకే.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌రిత్ర‌లో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ పేరు శాశ్వ‌తంగా గుర్తుండిపోతుంది. ప్ర‌భుత్వం నుంచి ఎంత‌గా స‌హాయ నిరాక‌ర‌ణ ఎదురైనా.. స‌ర్కారు నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు, ఎంత ఒత్తిడి వ‌చ్చినా.. అద‌ర‌లేదు బెద‌ర‌లేదు నిమ్మగ‌డ్డ‌. పైగా ప్ర‌భుత్వానికే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిం‌చి, మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఎస్ఈసీ నిర్ణ‌యాల‌పై జ‌గ‌న్ రెడ్డి గ‌వ‌ర్న‌మెంట్ ఎన్నిసార్లు కోర్టుల‌కు వెళ్లినా ప్ర‌భుత్వానికే చుక్కెదుర‌య్యేది. నిమ్మ‌గ‌డ్డ నిర్ణ‌యానికే కోర్టులు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేవి. మ‌రి, కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని ప‌నితీరు ఆదిలోనే అర్థ‌మైపోతోంది. ఆమె ఎజెండా ఏమిటో ప‌రోక్షంగా స్ప‌ష్ట‌మ‌వుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 1. ఆ రోజే ఎస్ఈసీగా ఛార్జ్ తీసుకున్నారు. అదే రోజే ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు రీనోటిఫికేష‌న్ ఇచ్చేశారు. 7 రోజులే గ‌డువు. 8న పోలింగ్. ఆమె చార్జ్ ఎప్పుడు తీసుకున్నారు?  రూల్స్ ఎప్పుడు చ‌దివారు?  సుప్రీంకోర్టు తీర్పును ఎప్పుడు ప‌రిశీలించారు? అంత హ‌డావుడిగా నోటిఫికేష‌న్ ఎందుకు ఇచ్చారు? ఇలా ప్ర‌తిప‌క్షాలు అనేక ప్ర‌శ్న‌లు సంధిస్తున్నాయి. ఎవ‌రి కోస‌మో.. ఎవ‌రి సూచ‌న మేర‌కో.. సుప్రీంకోర్టు తీర్పును స్పష్టంగా ఉల్లంఘించార‌ని అంటున్నారు. సుప్రీం తీర్పు మేరకు 4 వారాల కోడ్‌తో ఎన్నికలు నిర్వహించేందుకు తనకు సమయం లేనందునే పరిషత్‌ ఎన్నికలు జరపడంలేదని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టంగా చెప్పారు. కానీ... నీలం సాహ్ని మాత్రం, ‘పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు నాకు ఎలాంటి అడ్డంకులూ కనిపించడం లేదు’ అంటూ తొలి రోజే నోటిఫికేషన్‌ ఇచ్చేశారు. నిబంధ‌న‌ల తేనెతెట్టును క‌దిలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో అనేక వివాదాలు. ఎప్పుడో ఏడాది కిందట ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియ ఇది. అప్పట్లో అధికార పార్టీ దౌర్జన్యాలు, బలవంతపు ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు జరిగాయి . మ‌ళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి జరపాలన్నది విపక్షాల డిమాండ్‌. దీనిపై కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇన్ని వివాదాల మ‌ధ్య ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన రీనోటిఫికేష‌న్ మ‌ళ్లీ వివాదాస్ప‌దం అవ‌డం కాక‌తాళీయ‌మా?. లేక‌, ఉద్దేశ్య‌పూర్వ‌క‌మా? అనే అనుమానం.

నైట్ ఇంట్లో.. మార్నింగ్ మృత్యువు వడిలో 

ఆ యువకుడి పేరు జశ్వంత్‌. వయసు 15 సంవత్సరాలు. ఆరో తరగతి చదువుతున్నాడు. రాత్రి అందరితో పాటు ఇంట్లో పడుకున్నాడు. వేకువజామున రోజుల లాగే తండ్రి నిద్ర లేచి చూశాడు. కొడుకు కనిపించలేదు. స్కూల్ బ్యాగ్ కూడా కనిపించలేదు.ఇంట్లోని హోండా యాక్టివా బైక్‌ కూడా కనిపించలేదు. ఆ కుటుంబ సభ్యులంతా ఆందోళన పడ్డారు..జశ్వంత్ కోసం వెతకడం ప్రారంభించారు.  కట్ చేస్తే.. జశ్వంత్ ఫాదర్ రంగయ్యకి ఒక ఫోన్ వచ్చింది.  ఆ ఫోన్ కాల్ పంజాగుట్ట  పోలీసులు చేశారు. మీ కుమారుడు ద్విచక్రవాహనంపై రాజ్‌భవన్‌రహదారిలో సోమాజిగూడ వైపు వెళ్తుండగా, రాజ్‌ భవన్‌ చిల్లా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొని మృతి చెందాడు’’ అని సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.  తమ కుమారుడు ద్విచ్రకవాహనం ఎందుకు తీసుకెళ్లాడు. ఎక్కడికి వెళ్లాడో తెలియదని, తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రంగయ్య పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. యువకులు కొంచెం పెద్దగా కాగానే.. తల్లి దండ్రులను కేర్ చేయడం లేదు. మీసాలు వస్తే దేశాలు కనిపించవు. అన్న సామెత నిజం చేస్తూనే ఉన్నారు. దయచేసి ఎవరు ఎక్కడికి వెళ్లిన.  ముందు ఇంట్లో వాళ్లకు చెప్పండి.. ఎందుకంటే మనకు ఏమన్నా అయితే వల్లే కదా బాధపడేది, కన్నీరు కార్ఛేది.. మనం చనిపోతే ఆ వార్త వేరే ఎవరో మన వాళ్లకు చెప్పే దుస్థితి తెచ్చుకోకండి.   

లంచం డబ్బును కాల్చేసిన టీఆర్ఎస్ నేత

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడానికి వస్తుండగా కొత్త ఎత్తు వేశాడు. తాను లంచంగా తీసుకున్న నోట్ల కట్టలను  ఇంట్లోని స్టౌవ్ పై పెట్టి తగులబెట్టాడు. అయితే నోట్లు పూర్తిగా కాలకపోవ‌డంతో ఏసీబీకి దొరికిపోయాడు.  ఈ విచిత్ర‌మైన ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో జ‌రిగింది. వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్ కోసం టీఆర్ఎస్ మాజీ మండల ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ రూ. 5 లక్షలు లంచం తీసుకున్నారు. బాధితుడు నుంచి 5 లక్షల రూపాయలు వెంకటయ్యగౌడ్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అధికారులను చూసి 5 లక్షల రూపాయలను వెంకటయ్య గౌడ్ తగులబెట్టారు. రంగారెడ్డి జిల్లా కోరింటతండా సర్పంచ్‌ రాములునాయక్ క్వారీ ఏర్పాటు కోసం మహబూబ్‌నగర్‌ జిల్లా మైనింగ్‌ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఆశాఖ అధికారులు ఎన్‌వోసీ ప‌నిని వెల్దండ తహ‌సిల్దార్ సైదులు గౌడ్‌కు అప్పగించారు. దీంతో రాములు నాయక్ సైదులుగౌడ్‌ను క‌ల‌వ‌గా.. ఆయ‌న‌ చెదురుపల్లికి చెందిన వెంకటయ్యగౌడ్ అనే వ్య‌క్తిని క‌ల‌వాలంటూ సూచించాడు. రాములు నాయ‌క్ ఆయ‌న ద‌గ్గ‌రకూ వెళ్ల‌గా.. ఎన్‌వోసీ కోసం రూ.6 లక్షలు డిమాండ్‌ చేశాడు. చివ‌రికి రూ.5 లక్షలకు డీల్ మాట్లాడుకున్న‌ రాములునాయక్ ఆ త‌ర్వాత‌ మహబూబ్‌నగర్‌ ఏసీబీ అధికారులను ఆశ్ర‌యించాడు. ఏసీబీ అధికారుల‌ సూచ‌న మేర‌కు రూ. 5 ల‌క్ష‌లు వెంకటయ్యగౌడ్‌కు ఆయ‌న ఇంట్లో అప్ప‌గించి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఆ త‌ర్వాత‌ నోట్ల లెక్కింపు ప‌నిలో బిజీగా ఉండ‌గా.. త‌లుపుచ‌ప్పుడైంది. వ‌చ్చిన‌వారు ఏసీబీ అధికారులు అని గ్ర‌హించిన వెంక‌ట‌య్య గౌడ్.. వెంట‌నే ఆ నోట్ల‌ను వంటిట్లో స్టవ్‌పై పెట్టి కాల్చే ప్ర‌య‌త్నం చేశాడు. అప్ప‌టికే త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టుకుని వ‌చ్చిన ఏసీబీ అధికారులు.. వెంక‌ట‌య్య‌గౌడ్‌ను ప‌ట్టుకున్నారు.హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో తహశీల్దార్‌ సైదులుగౌడ్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. కల్వకుర్తి, జిల్లెలగూడ, వెల్దండ చెదురుపల్లిలోని వెంకటయ్య గౌడ్ ఇళ్లు ఉన్నాయి. ఈ ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు తహశీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డారనే విషయం తెలియడంతో వెల్దండ మండల ఎంఆర్ఓ కార్యాలయానికి వందలాది మంది రైతులు, జనాలు చేరుకున్నారు. విచారణ ఎమ్మార్వో ఆఫీస్ కు తీసుకొచ్చిన వెంకటయ్య గౌడ్ పై స్థానికుల దాడి చేశారు. పోలీసులు అందరిని చెదరగొట్టారు. తర్వాత అవినీతి ఎమ్మార్వోకు తగిన శాస్త్రి జరిగిందంటూ కొందరు రైతులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

100 రోజుల కిడ్నాప్ కేసు చివరికి ఇలా..

అది గత డిసెంబర్ 17. ఖమ్మం జిల్లా. ఎర్రపాలెం మండలం. రేమిడిచర్ల గ్రామం. ఓ మైనర్ బాలిక వెల్లంకి రాజశ్రీ కిడ్నాప్ అయ్యింది. ఆ తల్లి ఆవేదన చెందారు బోరున ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కి పరుగులు తీసింది.  స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. 360 డిగ్రీస్ లో కేసు గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు.  ఒకటి కాదు, రెండు కాదు వరసగా వందలు. పోలీసులకు కంటిమీద కునుకులేదు. కేసుకు సంబందించిన ఒక క్లూ దొరకలేదు.  కట్ చేస్తే.. ఖమ్మం లో మిస్ అయిన అమ్మాయి. ఉత్తర ప్రదేశ్ లో ప్రత్యక్షం అయింది. అక్కడే ఆ బాలికను బంధించారు. ఈ దారుణానికి పాల్పడిన వాళ్ళు రాజశ్రీ సమీప బంధువు ఒకరు అయితే .. బెంగుళూరు కు చెందిన పూజారి మరొకరు. అని చివరికి పోలీసులు గుర్తించారు. అసలు విషయంలోకి వెళ్తే..  రాజశ్రీ బంధువు తన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, మూఢ నమ్మకంతో నట్టింట్లో ముప్పై అడుగుల లోతున ఓ పెద్ద గొయ్యి తొవ్వి. ఆ నిధులను చేజిక్కించుకోడానికి బెంగళూరుకు చెందిన సూర్యప్రకాష్‌శర్మ అనే పూజారిని రప్పించిన విషయం గతంలో తెలిసిందే. అయితే ఎప్పుడో పూర్వీకులు నిక్షిప్తం చేసిన గుప్త నిధులు ఎలాంటి దోషాలు లేకుండా చేజిక్కాలంటే రక్తం చిందాల్సిందేనన్న పూజారి సూచించాడు. పూజారి సూచనతో నిత్యం నాటు కోళ్లను కోయడం.. రక్తంతో అభిషేకం చేయడం.. ప్రతిరోజు అర్థరాత్రి ఊరోళ్లంతా నిద్రపోతున్న సమయంలో పెద్దపెద్ద కేకలు వేస్తూ క్షుద్రపూజలు చేస్తుండడం.. అయినా నిధి దక్కకపోవడంతో నరబలి కావాల్సిందేనన్న పూజారి డిమాండ్‌కు అనుగుణంగా పేదరికంలో ఉన్న తన సమీప బంధువు కుమార్తెను టార్గెట్‌ చేసి. ప్రధాన పాత్రధారి , పూజారి ఇద్దరు కలిసి పధకం వేశారు.  మైనర్‌ బాలిక దొరకాలంటే ఆమె తల్లిదండ్రులు అక్కడ లేకుండా పోవాల్సి ఉంటుంది కనుక.. రాజశ్రీ అమ్మానాన్నను గుంటూరు జిల్లా పెదకాకాని గుడికి వెళ్లి రావాలని పూజారి సూచించాడు. ఈమేరకు మైనర్‌ బాలిక తల్లి గుడికి వెల్లడి. ఇంటికి వచ్చి చూస్తే కూతురు కనిపించడం లేదు. ఈమేరకు ఆమె తల్లి రాణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఈ గుప్త నిధులను చేజిక్కించుకునే వ్యవహారం అప్పటికే నెలరోజుల నుంచి సాగుతోందని.. తమ గ్రామానికి చెందిన నరసింహారావు నివాసంలో ప్రతిరోజు రాత్రి పెద్దపెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయని.. తమకు భయం వేస్తోందని గ్రామస్తులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధ్యులైన వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మైనర్‌బాలిక కనిపించకుండా పోయిన విషయంపై సీరియస్‌గా దృష్టి సారించారు.  క్షుద్ర పూజల కోసం ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన పూజారి ఆమెను ఉత్తరప్రదేశ్‌కు తరలించాడు. అక్కడే ఆమెను బందీగా ఉంచాడు. ఎట్టకేలకు మైనర్‌ బాలికతో సహా, ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన పూజారి సూర్యప్రకాష్‌శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ బాలిక వెల్లంకి రాజశ్రీ ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అసలు ఎందుకు కిడ్నాప్‌ చేశాడు.. ఉత్తరప్రదేశ్‌ దాకా ఎందుకు తీసుకెళ్లాడు.. ఇన్నాళ్లూ అక్కడేం చేశాడు.. ఈ వ్యవహారంలో ఇంకెవరెవరి పాత్ర ఉందన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర వత్తిడికి గురై.. అనేక విమర్శల పాలైన పోలీసులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్‌కిరణ్‌ ఈ కేసును సవాల్‌గా తీసుకుని మైనర్‌ బాలికను కిడ్పాపర్‌ చెర నుంచి విడిపించడమే కాకుండా.. కిడ్నాపర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎస్సై ఉదయ్‌కిరణ్‌పై ప్రసంశల జల్లు కురుస్తోంది. అసలేంటి ఈ కేసు.. అప్పుడేం జరిగిందంటే.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పూజారి సూర్యప్రకాష్‌శర్మను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. ఇంకా కేసుకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది..? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మైనర్‌ బాలికను పూజారి ఎందుకు తీసుకెళ్లాడన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మూణ్నెళ్లకు పైగా ఆమెను అదుపులో ఉంచుకుని అనేక రాష్ట్రాలు తిప్పిన పూజారి సూర్యప్రకాష్‌శర్మ ఏంచేశాడన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే సూర్యప్రకాష్‌శర్మకు ఇది చాలా కామన్‌ విషయమని.. కష్టాల్లో ఉన్నవారిని లంకె బిందెలు.. గుప్త నిధులని నమ్మించి వారి నుంచి భారీగా డబ్బు గుంజడం లాంటి వాటిని అలవాటుగా మార్చుకున్నాడని.. ఇతను ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పూజలను జరిపించినట్టు చెబుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

నిమిషానికి 40 కేసులు! దేశంలో కరోనా విలయం

దేశంలో కరోనా పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ ఉధృతి మరింత తీవ్రమైంది. మంగళవారం దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏకంగా లక్షా 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మంగళవారం ఒక్కరోజే కరోనా సోకి 630 మంది చనిపోయారు. దేశంలో కరోనా వ్యాప్తి ఊహించిన దాని కంటే తీవ్రంగా ఉందని వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. గడచిన కొద్ది రోజులుగా వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. రాష్ట్రంలో మంగళవారం కొత్త 55 వేలకు మించిన కరోనా కేసులు వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 297 మంది మృతి చెందారు. దీని ప్రకారం చూస్తే మహారాష్ట్రలో నిమిషానికి దాదాపు 40 మంది కరోనా భారీన పడుతున్నారు. ప్రతీ ఐదు నిముషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నారని తెలుస్తోంది.  గత ఏడాది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ కేసులు 50 వేలకు దాట లేదు. మరణాలు కూడా ఈ స్థాయిలో నమోదు కాలేదు. గత 24 గంటల్లో ముంబై నగరంలోనే 10 వేలకు పైగా కేసులు వచ్చాయి. గతంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. పుణెలో పరిస్థితి మరి దారుణంగా తయారైంది. హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. రోగులను వెయిటింగ్ ప్రాంతంలోనే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పింప్రి, నాగపూర్ లోనూ రోగులతో హాస్పిటల్స్ నిండిపోయాయి. ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదని తెలుస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడంతోపాటు రాత్రిపూట లాక్‌డౌన్ విధించింది. ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేయగానే వలస కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. భివండీలోని పవర్‌లూమ్‌లో పనిచేస్తున్న వలస కూలీలు గత ఏడాదిలో ఎదురైన లాక్‌డౌన్ ఇక్కట్లు మరోమారు రాకూడదని కోరుకుంటున్నారు. అందుకే గ్రామాలకు తిరిగి వెళ్లాపోయే ప్రయత్నాల్లో ఉన్నారు జార్ఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రాత్రి 8గంటల తర్వాత అన్ని షాపులు, రెస్టారెంట్లు, క్లబ్‌లు తెరచి ఉంచరాదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ స్థలాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడ రాదని, అన్ని పాఠశాలలను మూసివేయాలని సీఎం ఆదేశించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ ను మూసివేశారు. అన్ని పార్కులు, క్రీడా పోటీలను నిషేధించారు. ఎగ్జిబిషన్లు, మేళాలను నిషేధించారు.   

చెల్లెలిపై.. అన్నల దారుణం..   

ఏమిటో ఈ లోకమంతా.. మనుషుల జీవితాలు నిత్యా జీవితంలో కంటే.. అప్పుడప్పుడు వచ్చే సినిమాల్లోనే నయ్యం అనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మనుషులకన్నా మృగాలే ఇంకా నయ్యం. మృగాలకు కాస్త విచక్షణ జ్ఞానం అయిన ఉంటుంది. కానీ మనిషి మాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వరసలు మరిచి. మానవత్వం విడిచి. మారణహోమాలు చేస్తున్నాడు. తాజాగా ఇద్దరరు  అన్నలు సొంత చెల్లెలిపై అఘాయిత్యానికి పాలుపడ్డాడు.    అతను  కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పని చేస్తున్నాడు. అమ్మ, చెల్లితో కలిసి ఉంటున్నాడు.. తండ్రి చిన్నప్పుడే వదిలేశాడు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. చాలా హ్యాపీ గా ఉన్నారు.  కట్ చేస్తే తన  చెల్లెలు పెళ్లీడుకు వచ్చింది. చెల్లెలిపై వాడి కన్ను పడింది. అన్నగా తన స్థానం మరిచి, బాధ్యత గాలికి వదిలేసి. మృగంలా ప్రవర్థించి సొంత చెల్లిని  శారీరకంగా లోబర్చుకున్నాడు. చిత్రహింసలు పెట్టి నరకం చూపిస్తున్నాడు. ఆ యువతీ చేసేదేమి లేక రక్షణ కోసం పెదమ్మ ఇంటికి వెళితే అక్కడా కూడా ఆమెకు అదే నరకం. వరుసకు బ్రదర్ అయ్యే  పెద్దమ్మ కుమారుడూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ దారుణం వెలుగుచూసింది.  అన్న అఘాయిత్యాల గురించి బాధితురాలు.. కన్నతల్లికి, పెద్దమ్మ కుటుంబసభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక స్నేహితులు, గతంలో తనకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. విషయాన్ని బయటపెడితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని బాధితురాలు వాపోతోంది. ఘటనపై బాధితురాలి సోదరుడు, ఆమెతల్లి, పెద్దమ్మ, ఆమె భర్త, కుమారుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

అమ్మకానికి విశాఖ భూములు.. జగన్ సర్కార్ సేల్ స్కీమ్ 

విశాఖపట్నంలోని ఖరీదైన భూములను అమ్మకానికి పెట్టింది జగన్ సర్కార్. ఉద్యోగులకు జీతాలివ్వడానికి నానా తంటాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం...పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలోని అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ భూములను విక్రయించేందుకు కేంద్రప్రభుత్వ ఆధ్వరంలోని నవరత్న సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) ప్రకటన చేసింది. ఇందులో బీచ్ రోడ్డులో  ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాల భూమి సహా మొత్తం 18 ఆస్తులు ఉన్నాయి.  బీచ్ రోడ్డు మార్గంలోని భూమి ధరను రూ. 1,452 కోట్లుగా ఎన్‌బీసీసీ నిర్ణయించింది. స్థలాల వివరాలు, వాటి ఫొటోలు, లే అవుట్ కాపీలు, ప్లాట్ నంబర్లు, మ్యాప్‌లు, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అవి ఎంత దూరంలో ఉన్నాయి? వంటి పలు వివరాలను ఎన్‌బీసీసీ ఇంటర్నెట్‌లో పెట్టింది. ‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా కొన్ని స్థలాలను ఏపీ ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయించిందని, ఆయా స్థలాలకు ప్రభుత్వం తరపున తాము ఈ-వేలం నిర్వహిస్తున్నామని పేర్కొంది. దరఖాస్తు ఫారాన్ని కూడా ఇంటర్నెట్‌లో పెట్టింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ప్రీబిడ్ ముందస్తు మొత్తం (ఈఎండీ) సమర్పించాలని సూచించింది. ఇంతకు ముందు కూడా ‘బిల్డ్‌ ఏపీ మిషన్‌’ పేరుతో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్న స్థలాలను, పరిశ్రమలకు ఉద్దేశించిన భూములను వేలం వేస్తామని ప్రకటించింది. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌కి (ఎన్‌బీసీసీ) అప్పగించింది. ఏడాది పూర్తయినా ఆ ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా మరో నాలుగు స్థలాలను అమ్ముతామంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘ఎన్‌బీసీసీ’ ప్రకటన వచ్చింది. అందులో ముఖ్యమైనది బీచ్‌ రోడ్డులో 13.59 ఎకరాల స్థలం. గత టీడీపీ ప్రభుత్వం ఇక్కడ పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌, స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించేందుకు దుబాయ్‌కు చెందిన లులూ గ్రూపుతో రూ.2,200 కోట్లకు ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వానికి (ఏపీఐఐసీ దగ్గర) 10.65 ఎకరాలే ఉండగా, దానిని ఆనుకొని బీచ్‌కు అభిముఖంగా వున్న 3.4 ఎకరాలను సీఎంఆర్‌ గ్రూపు నుంచి తీసుకుంది. అందుకు ప్రతిఫలంగా వారికి నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఖరీదైన భూములను ఇచ్చింది. ఇక్కడ నిర్మించే కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌ వల్ల ఐదు వేలమందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం. దీనికి పెట్టుబడిదారుల సదస్సులో శంకుస్థాపన కూడా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లులూతో ఒప్పందం రద్దు చేసుకుంది. రెండేళ్లుగా ఆ భూమి ఖాళీగానే ఉంది.  కొన్నాళ్ల క్రితం భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించడానికి ఆసక్తి గల సంస్థలు ముందుకురావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించి, అడుగు రూ.6,500 చొప్పున అమ్మి తమకు నిధులు ఇవ్వాలని పేర్కొంది. దానికి పెద్దగా స్పందన లభించలేదు. దాంతో ఇప్పుడు బీచ్‌రోడ్డు స్థలంతో పాటు గాజువాక సమీపాన ఉన్న అగనంపూడి, ఫకీర్‌తకియాల్లో మరో మూడు ఎకరాలు కలిపి మొత్తం రూ.1,465 కోట్లకు అమ్మకానికి పెట్టింది. అందులో బీచ్‌ రోడ్డులో 13.59 ఎకరాలకు రూ.1,452 కోట్లు విలువ నిర్ణయించింది. వీటిని ఈ నెల 22న ఆన్‌లైన్‌లో వేలం వేస్తామని ప్రకటించింది. దానికి ప్రీబిడ్‌ వేలం 19న నిర్వహిస్తామని ప్రకటించింది. ఇంతకు ముందు బీచ్‌ రోడ్‌లో 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలని ప్రకటించి, ఇప్పుడు దానిని 10 లక్షలు పెంచి 40 లక్షల చదరపు అడుగుల నిర్మాణం అని పేర్కొంది. ప్రభుత్వం అమ్మదలచిన బీచ్‌ రోడ్డు స్థలానికి సంబంధించి.. తప్పనిసరిగా కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్‌) అనుమతులు తీసుకోవాలి. తీరానికి అతి సమీపాన అంత పెద్ద భారీ భవంతుల నిర్మాణానికి అనుమతులు లభిస్తాయా అనేది అనుమానమే. విశాఖలోని ఖరీదైన భూములను అమ్మకానికి పెట్టిన జగన్ సర్కార్ పై విశాఖ వాసులు మండిపడుతున్నారు. భూములు అమ్మడం కోసమే పరిపాలనా రాజధాని పేరుతో డ్రామాలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఎమ్మెల్సీ కవిత పేరుతో ఘరానా మోసం 

టీఆర్ఎస్ ముఖ్య నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘరానా మోసం జరిగింది.  కవిత పేరు చెప్పి ఓ వ్యక్తి నుంచి ఆరున్నర లక్షల రూపాయలు కొట్టేశారు ఇద్దరు కేటుగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన మహేశ్, వినోద్‌లు తాము యూట్యూబ్ చానల్ విలేకరులమని చెప్పుకునేవారు. ఇటీవల వీరు మహమ్మద్ అనే వ్యక్తిని కలిసి తాము కొత్తగా న్యూస్ చానల్ ప్రారంభిస్తున్నామని, దీనికి ఎమ్మెల్సీ కవిత చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నట్టు నమ్మబలికారు. చానల్‌కు డైరెక్టర్‌గా తీసుకుంటామంటూ అతడి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని మరో రూ. 4 లక్షలు వసూలు చేశారు. మరోసారి మహమ్మద్‌ను కలిసి చానల్ ప్రారంభించడంలో కొంత ఆలస్యం జరుగుతోందని, కాబట్టి మరో చానల్‌లో ఫొటోగ్రాఫర్‌గా చేరుస్తామని నమ్మించారు. ఐడీకార్డు కోసం రూ. 50 వేలు వసూలు చేశారు. అయినప్పటికీ ఐడీ కార్డు రాకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకటి, వేములవాడ లో ఒక  డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తామని చెప్పారు మహేష్ గౌడ్, వినోద్. ఇందుకు సంబంధించి డబుల్ బెడ్రూం ల  ఇంటి తాళాలు కూడా ఇచ్చారు. మహమ్మద్ అనే వ్యక్తి ఇటీవల దువాఖతర్ నుంచి రావడంతో ఎమ్మెల్సీ కవిత శాలువా పంపించిందని అందచేశారు మహేష్ గౌడ్, వినోద్. అంతేకాదు ఎమ్మెల్సీ కవిత తో సీక్రెట్ గా మాట్లాడవచ్చంటూ మహమ్మద్ కు వాకీటాకీ ఇచ్చారు మహేష్ గౌడ్, వినోద్. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు కామారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.  

హాస్పిటల్స్ ఫుల్.. ఆక్సిజన్ నిల్! కరోనా కల్లోలం 

దేశం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది.  ముంబయి, పుణె, నాగ్‌పూర్‌లలో మహమ్మారి విజృంభిస్తున్న తీరు బెంబేలెత్తిస్తోంది. పుణెలో పలు ప్రాంతాల్లో ఆస్పత్రులు పూర్తిగా నిండిపోయాయి. కొత్తగా వచ్చి చేరుతున్న వారికోసం తాత్కాలిక గదులు ఏర్పాట్లు చేసి చికిత్స అందించాల్సిన అవసరం ఏర్పడుతోంది. పింప్రిలోని ఆసుపత్రిలో వెయిటింగ్‌ ఏరియాలోనూ బాధితులకు ఆక్సిజన్‌ అందిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.  పింప్రిలోని యశ్వంత్‌రావ్‌ చవాన్‌ మెమోరియల్‌ ఆసుపత్రి సామర్థ్యం 400 పడకలు. వీటిలో 55 ఐసీయూ పడకలు. ప్రస్తుతం కొవిడ్‌ బాధితులతో బెడులన్ని నిండిపోయాయి. అయినా తాకిడి మాత్రం తగ్గడం లేదు. బాధితుల పరిస్థితి అర్థం చేసుకొన్న వైద్యులు తాత్కాలిక ఏర్పాట్లు చేసి చికిత్స అందజేస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారికి వెయిటింగ్‌ ఏరియాలోనే ఆక్సిజన్‌ అందిస్తున్నారు.పుణె వ్యాప్తంగా కేవలం 79 మాత్రమే వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న పడకలు ఉన్నాయి. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. సోమవారం పుణెలో 8,075 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు రికార్డయిన కేసుల సంఖ్య 5.8 లక్షలకు చేరింది. ఒక్క పింప్రి-చించ్వాడ్‌ ప్రాంతంలోనే  2,152 కేసులు వెలుగులోకి వచ్చాయి.  

పోలీసులకు వ్యతిరేకం కాదు.. జవాన్ ను అప్పగిస్తాం! మావోయిస్టుల లేఖ 

ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. దండకారణ్య స్పెషల్ జోనల్  కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరుతో లేఖ విడుదలైంది. జీరగూడెం భద్రతా బలగాల పై  దాడి చేసింది తామేనని లేఖలో మావోయిస్టులు అంగీకరించారు. కాల్పుల్లో 23మంది జవాన్లు చనిపోయారని,  ఒకరు తమ  ఆధీనంలో ఉన్నారని తెలిపారు. నలుగురు మావోయిస్టులు కూడా ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయారని వెల్లడించారు. సురేష్, ఓడి సన్ని, లక్మా, భద్రు ఎన్ కౌంటర్ లో చనిపోయారని మావోయిస్టులు చెప్పారు. ఘటనా ప్రదేశం నుంచి సన్ని మృతదేహాన్ని తీసుకెళ్లలేకపోయామన్నారు.  అమరులైనా పోలీసు కుటుంబాలకు  సంతాపం తెలిపారు మావోయిస్టులు. తాము పోలీసులకు వ్యతిరేకం కాదన్నారు. ఫాసిస్టు ప్రభుత్వ విధానాలకు తాము వ్యతిరేకమని లేఖలో వెల్లడించారు. విస్పస్టమైన విధానంతో చర్చలకు తాము సిద్ధమన్నారు. మధ్య వర్తల పేర్లు ప్రకటిస్తే  తమ వద్ద ఉన్న జవాన్  రాకేశ్వర్ సింగ్ అప్పగిస్తామని మావోయిస్టులు తమ లేఖలో స్పష్టం చేశారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్–సుక్మా సరిహద్దుల్లో ఆదివారం మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో 24 మంది జవాన్లు అమరులయ్యారు.  పథకం ప్రకారం ‘యూ’ ఆకారంలో చుట్టుముట్టిన నక్సలైట్లు.. జవాన్లను కాల్చి చంపారు. ఎటు పోవడానికి లేకుండా చేసి దాడికి పాల్పడ్డారు. .24 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న మావోయిస్టు హిడ్మా ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  భద్రతా బలగాలను ట్రాప్ చేసి హతమార్చిన మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లక్ష్యంగా ‘ఆపరేషన్ ప్రహార్ 3’ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మరో 8 మంది మావోయిస్టులనూ హిట్ లిస్ట్ లో పెట్టింది. వారికి సంబంధించి వాంటెడ్ జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టండి.. 

దేశంలో కరోనా విలయం తీవ్రంగా  కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు  పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఎక్కువ భారీగా కేసులు నమోదు కాగా..  గుజరాత్‌లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే  పెరుగుతుండటంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గుజరాత్ హైకోర్టు కోరింది. వారాంతంలో కర్ఫ్యూ విధించడంపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో హాజరు అయ్యే రాజకీయ సమావేశాలు, ఇతర వేడుకల నిర్వహణను నిలిపేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.

ఇ-హెల్త్‌కేర్ సేవలు 

ఇ-హెల్త్‌కేర్ ప్రారంభం. ఇంటివద్దే వైద్య సేవలు. 24/7 సేవలు అందుబాటులోకి. అపోలో హాస్పిటల్స్‌కు చెందిన హెల్త్‌కేర్‌ మొబైల్‌ యాప్‌ అపోలో 24/7, టెలికామ్‌ సేవల సంస్థ ఎయిర్‌టెల్‌తో జోడి  కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి ఇ-హెల్త్‌కేర్‌ సేవలను దేశవ్యాప్తంగా అందించాలని. ఆ స్థాయికి విస్తరించాలని నిర్ణయించాయి. వైద్యుల ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ సేవల నుంచి డయాగ్నస్టిక్స్‌, ఫార్మసీ, వెల్‌నెస్‌ సేవలు అపోలో 24/7 హెల్త్‌కేర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా లభిస్తాయి. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా ఈ సేవలను వినియోగించుకునే వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఎయిర్‌టెల్‌ ప్రీమియర్‌ వినియోగదార్లకు, 12 నెలల పాటు ‘అపోలో సర్కిల్‌’ సభ్యత్వం లభిస్తుంది. ఎయిర్‌టెల్‌ గోల్డ్‌ వినియోగదార్లకు 3 నెలల పాటు సభ్యత్వం లభిస్తుంది. డిజిటల్‌ హెల్త్‌ సేవల విస్తరణకు ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం ఉపకరిస్తుందని అపోలో 24/7 సీఈఓ ఆంథోనీ జాకబ్‌ పేర్కొన్నారు. అపోలోతో కలిసి వైద్య సేవలను ప్రజలకు వారి ఇళ్లవద్దే అందించనున్నామని ఎయిర్‌టెల్‌ ముఖ్య మార్కెటింగ్‌ అధికారి శాశ్వత్‌ శర్మ వివరించారు.     

వివేకా హత్య వెనుక బంధువులే..? 

రెండేళ్ల క్రితం తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్. హత్యపై సీబీఐ విచారణ జరుగుతున్నా కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. వివేకా హత్యపై రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి.. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగడం లేదని ఆరోపించడం కలకలం రేపుతోంది.  వైఎస్ వివేకానందారెడ్డిని గొడ్డలి పోటు పొడించింది ఎవరు? అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డిని ప్రశ్నించారు. వివేకానందారెడ్డికి కట్లు కట్టింది ఎవరు.. ఆ వైద్యులు ఎవరో తేలాలని వైసీపీ సర్కారును నిలదీశారు. హత్య సమాచారం రాగానే అక్కడి సీఐతో ఎంపీ ఏం మాట్లాడారు? అని ప్రశ్నించారు. సీబీఐ అధికారులతో ఓ ఎంపీ వీడియో కార్ఫరెన్స్‌లో ఏం మాట్లాడారు? అని నిలదీశారు. వివేకా హత్య వెనుక బంధువులే ఉన్నారని తెలుస్తోందని చెప్పారు. పార్లమెంట్‌లో కూడా వివేకా హత్య విషయం ప్రస్తావిస్తానని రఘురామ స్పష్టం చేశారు. తనపై కేసులు పెట్టాలని సీఎం జగన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ కలిసి.. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌పై ఒత్తిడి తెస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతి కేసులో  కొన్ని రోజులుగా  వస్తున్న కథనాలపై స్పందించారు వైఎస్ విజయమ్మ. ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో సంచలన విషయాలు చెప్పారు విజయమ్మ. వివేకా హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబానికి మరో అభిప్రాయం లేదని పేర్కొన్నారు. జగన్ తన కేసు అయినా, తన బాబాయ్ కేసు అయినా సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏం చేయగలడని విజయమ్మ ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన కుమార్తె సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది.  ఎంపీటీసీ,  జడ్పీటీసీ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ కు పోలింగ్ కు మధ్య నాలుగు వారాల గడువు ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ ఎస్ఈసీ పాటించలేదని హైకోర్టు పేర్కొంది. ఏప్రిల్ 1న ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ లో తదనంతర చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో గురువారం జరగాల్సిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ఆగిపోయింది.  పరిషత్ ఎన్నికల నిర్వహణపై విపక్షాలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ పట్టించుకోలేదని విమర్శించాయి. ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాకా అఖిలపక్ష సమావేశం జరపడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ఎస్ఈసీ సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అంతేకాదు పరిషత్ ఎన్నికలను కూడా తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది.   

తెలంగాణ సీఎస్ కు కరోనా.. ఇటీవల కేసీఆర్ తో వరుస సమీక్షలు 

తెలంగాణలో రోజురోజుకు కరోనా పంజా విసురుతోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా భారీన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇటీవల  ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. సీఎస్ కు కరోనా సోకడంతో తెలంగాణ సచివాలయంలో భయాందోళన నెలకొంది. కొన్నిరోజులగా సీఎస్ చాలా సమీక్షలు నిర్వహించారు. ఆయనతో సమావేశాలకు హాజరైన అధికారులంతా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.  సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ సమావేశమయ్యారు.  ప్రతీ రోజు సీఎంతో సోమేష్‌కుమార్‌ సమీక్షల్లో పాల్గొంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణలు కనిపిస్తే వెంటనే  కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు.ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లోనూ ఆందోళన నెలకొంది.  మరోవైపు ఈ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వ్యాధి నియంత్రణకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణ, కరోనావ్యాప్తి నివారణ చర్యలపై బుధవారం కలెక్టర్లతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కరోనా నియంత్రణ చర్యలను పకడ్భందీగా చేపట్టాలన్నారు.కరోనా పరీక్షలు పెంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం రోజు వంద పరీక్షలను, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 150 పరీక్షలను, సివిల్ ఆస్పత్రిలో 3 వందల టెస్టులను నిర్వహించాలని తెలిపారు. వాటి ఫలితాలను కోవిడ్ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు.  కరోనా పరీక్షల ఫలితాల ఆధారంగా కోవిడ్ వ్యాప్తిస్తున్న వారిని గుర్తించి హోం క్వారంటైన్ చేయాలని, ఇళ్లలో వసతి లేనివారిని ప్రభుత్వ క్వారంటైన్ హోంలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు సీఎస్ సోమేష్ కుమార్. కరోనా అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి సదరు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని, జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సామూహిక కార్యక్రమాలు, సభలకు అనుమతి ఇవ్వరాదన్నారు. ప్రజలు తప్పనిసరిగ్గా మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కరోనా వైద్యానికి చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్ సోమేష్ కుమార్.

వాక్సిన్ వేసుకుంటే బీర్ ఫ్రీ..

వాక్సిన్ వేసుకోండి.. బీర్ ఫ్రీ అంటున్నారు. ఓ రెస్టారెంట్ క్రేజీ ఆఫర్ పెట్టింది. వాక్సిన్  మహమ్మారి కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లను డబ్ల్యూహెచ్ఓ ఆమోదించగా, పలు దేశాలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన విషయం విదితమే. భారత్‌లో ఇప్పటికే 45 ఏళ్లకు పైబడిన వారికి వరస పెట్టి  టీకా వేస్తున్నారు. ఈ నేపథ్యం లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఓ రెస్టారెంట్ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తే ఒక బీర్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. రేపు (ఏప్రిల్ 7) నేషనల్ బీర్ డే సందర్భంగా ‘సెలబ్రేట్ యువర్ వ్యాక్సినేషన్ విత్ ఇండియన్ గ్రిల్ రూమ్’ స్లోగన్‌తో ఈ ఆఫర్ ఇస్తున్నట్లు గురు గ్రామ్‌లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు కొవిడ్ ఫస్ట్ ప్లస్ సెకండ్ డోస్ తీసుకున్న వారు వ్యాక్సినేషన్ కార్డు లేదా ఇంకేదైనా తీసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తే ఈ నెల 5 నుంచి ఒక బీర్‌ను ఇస్తున్నారు. వారం రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని తెలిపారు. అయితే వ్యాక్సిన్ నిబంధనల మేరకు ఆల్కహాల్ తీసుకోవద్దని సూచిస్తుండగా, వ్యాక్సిన్ పేరిట బీర్ల ఆఫర్ ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్కహాల్ లేని నార్మల్ డ్రింక్స్ లేదా పర్సంటేజ్ అతి తక్కువ ఉన్న డ్రింక్స్ మాత్రమే ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.  

24 గంటలు.. 43 లక్షల టీకాలు.. 

దేశంలో కరోనా మహమ్మారి  కోరలు చాస్తోంది. ప్రజలతో పాటు ప్రభుత్వాలను కూడా పెరుగెట్టిస్తోంది. ఈ తరుణంలో వైరస్‌ను చెక్ పెట్టే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను స్పీడ్ పెంచింది కేంద్రం. 24 గంటల వ్యవధిలో 43 లక్షల మందికి పైగా టీకాలు అందించింది. దేశంలో టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం ఇదే తొలిసారి.   ఏప్రిల్‌ 5న మొత్తం 43,00,966 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో తొలి డోసు తీసుకున్నవారు 39 లక్షల మంది కాగా..  రెండో డోసు తీసుకున్నవారు 4 లక్షల మంది ఉన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 8.3 కోట్లు దాటినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఉదయం 7 గంటల సమయానికి దేశంలో మొత్తంగా 8,31,10,926 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మహారాష్ట్రలో 81 లక్షలు, గుజరాత్‌లో 76లక్షలు, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 71 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 65 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు.    8 రాష్ట్రాల్లోనే 80 శాతం కేసులు వస్తుండగా.. మరోవైపు దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 96,982 మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే కొత్త కేసుల్లో 80 శాతం మహారాష్ట్రలో 47,288, ఛత్తీస్‌గఢ్‌లో 7,302, కర్ణాటకలో 5,279 కొత్త కేసులు బయటపడ్డాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడు, దిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లోనూ నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  దేశంలో కొత్త కేసులు పెరుగుతుండటంతో  క్రియాశీల కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,88,223 యాక్టివ్‌ కేసులుండగా, క్రియాశీల రేటు 6.21 శాతంగా ఉంది. అయితే వీటిలో 57.42శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 4.51 లక్షల క్రియాశీల కేసులున్నాయి. 13 రాష్ట్రాల్లో వైరస్‌ అదుపులోనే  ఉండటం ఊరటనిస్తోంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించలేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒడిశా, అస్సాం, పుదుచ్చేరి, మేఘాలయ, మణిపూర్‌, త్రిపుర, లక్షద్వీప్‌, మిజోరం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌, లద్దాఖ్‌, నాగాలాండ్‌, దాద్రానగర్‌ హవేలీ-డయ్యూడామన్‌లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు కరోనా మరణాలు లేవన్న సమాచారం ఊరట కలిగించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.