విశాఖ ఉక్కు కేసు వకీల్ సాబ్ వాదించాలి..
posted on Apr 5, 2021 @ 2:17PM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేసును వకీల్ సాబ్ పవన్ కల్యాణ్ వాదించాలని కోరదామంటూ సెటైర్లు వేశారు రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి. ప్రభుత్వం చేతుల్లో లేని ఉక్కు ఫ్యాక్టరీతో పాలనా రాజధాని వచ్చినా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో రాజధాని గురించి ఎడతెగని, ప్రతిష్టంభన కొనసాగుతుందన్నారు. ముందు కోర్టు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. విశాఖలో ప్రశాంత వాతావరణాన్ని, ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉందన్నారు తెలకపల్లి రవి.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇవ్వాల్సిన ప్రతీదీ ఎగనామం పెడుతోందని విమర్శించారు. విడిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం మీద రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు పోరాడటం లేదన్నారు. ఇప్పటికి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్టీల్ ప్లాంట్‌పై ఏం కాలేదంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలకపల్లి రవి.
అటు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. జనసేన అధినేత తిరుపతి కొండపైన పాచిపోయిన లడ్డూలు తింటున్నారని ఎద్దేవా చేశారు. ఏ ముఖం పెట్టుకుని జనసేనాని బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తియ్యగా, కమ్మగా ఉన్నాయా? అంటూ నిలదీశారు నారాయణ.