కరోనా కోరల్లో ఇండియా.. ఏపీ, తెలంగాణలో డేంజర్ బెల్స్ 

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు వేలల్లో కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. 10 రోజుల్లోనే యాక్టివ్ కేసులు ఐదు లక్షలు పెరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. నాలుగు రోజులుగా అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో నమోదైనన్ని కేసులు తిరిగి తాజాగా నమోదవుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 81,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  గురువారం  ఒక్కరోజే కరోనా కారణంగా 469 మంది మృతి చెందారు.  దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,03,131కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,15,25,039 కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1,63,396 మంది మృతి చెందారు. గురువారం   50,356 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.68% కాగా.. మరణాల రేటు 1.33%గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. గురువారం 965 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందారు. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య  9 వేలు దాటింది. మార్చి తొలివారంలో ఇది 12 వందలుగా ఉంది. జీహెచ్ఎంసీలో 254 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 110, రంగారెడ్డిలో 97, నిజామాబాద్‌లో 64, నిర్మల్‌లో 39, జగిత్యాల్‌లో 35 కేసులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లోనూ  కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.  గురువారం 12 వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలోని ఐదుగురు హాస్టల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యాజమాన్యం 14 రోజుల పాటు సెలవు ప్రకటించి హాస్టల్‌ను మూసివేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మంచికలపాడులో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందాడు. గ్రామ సచివాలయంలో బుధవారం టీకా వేయించుకున్న పొన్నపల్లి గాలయ్య(63) గురువారం మృతిచెందారు. కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే నొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయాడు. ఆయన మృతికి వ్యాక్సిన్‌ కారణం కాదని వైద్యాధికారులు చెబుతున్నారు. 

కేసీఆర్ ని ఉతికారేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

ఆయన ఒక ప్రజా ప్రతినిధి. తనకు నోటి దురుసు ఎక్కువ. అందుకే ఎప్పుడు ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు.. అవగాహన లేకనో, లేక మైక్ ముందు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడకపోతే పరువుపోతుందనో లేక కావాలనే మనసులో మాట మాట్లాడుతారో గానీ.. అప్పుడప్పుడు వాస్తవాలు మాట్లాడుతుంటారు.. ఇలాంటి ప్రజా ప్రతినిధులు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే దళితులపై నోరుజారిన ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి. ఈ సారీ ఏకంగా టీఆర్ఎస్ పార్టీ పెద్ద దిక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఉతికిపారేశాడు.ఉద్దేశాన్నే బ‌య‌ట‌పెట్టేశారా? లేదా పొరపాటున అన్నారా? అనేది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం కంఠాత్మకూరులో ప‌ర్యటించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నూత‌న‌ వ్యవ‌సాయ చ‌ట్టాలను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ కేంద్రంగా 140 రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా.. ప్రధాన‌మంత్రి మోదీ, కేసీఆర్‌లు ప‌ట్టించుకోని పుణ్యాత్ములంటూ వ్యాఖ్యనించ‌డం సొంత పార్టీలోనూ మీడియా లోను దుమారం లేపుతుందనే చెప్పాలి .  ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి నోరు జారితే జారాడు గానీ.. నిజమే మాట్లాడాడంటూ.. నోరు ఉండి, నిజం  మాట్లాడలేని టీఆరఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారని. ప్రతిపక్షాల్లోనూ ప్రజల్లోనూ అదే వాస్తవం అనే మాట వినిపిస్తున్నాయి.   

టీఆర్ఎస్ నేత కవిత ఇంట్లో సీబీఐ సోదాలు  

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన  ఓ మహిళా కీలక నేత  చిక్కుల్లో పడ్డారు. ఆమె నివాసంలో ముడుపుల భాగోతం వెలుగు చూసింది. టీఆర్ఎస్ మహిళా నేత ఇంట్లో ముగ్గురు నిందితులను సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కలకలం రేపుతోంది.  ఢిల్లీలోని మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత అధికార నివాసంలో ముగ్గురు వ్యక్తులు ముడుపులు తీసుకుంటూ సీబీఐకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  ఢిల్లీ సీబీఐ వివరాల ప్రకారం.. రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తా అనే వ్యక్తులు.. ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పైరవీల కోసం ముడుపులు డిమాండ్‌ చేశారు. సర్దార్‌నగర్‌లోని ఓ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా.. అధికారుల నుంచి కాపాడతామని ఆ నిర్మాణం యజమాని మన్మిత్‌సింగ్‌ లాంబాను సంప్రదించారు. అందుకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో లాంబా సీబీఐని ఆశ్రయించారు. తనకు తొలుత రాజీవ్‌ భట్టాచార్య ఫోన్‌చేసి.. ఎంపీ మాలోతు కవిత పీఏగా పరిచయం చేసుకున్నాడని బాధితుడు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత శుభాంగీ గుప్తా అనే మహిళ రంగంలోకి దిగిందని చెప్పారు. ఆ తర్వాత వీరంతా.. రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కవిత డ్రైవర్‌ దుర్గేశ్‌కుమార్‌ కూడా వీరితో కలిసి ఉన్నాడని మన్మిత్‌సింగ్‌ పేర్కొన్నారు. బీడీమార్గ్‌లోని సరస్వతి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ నంబర్‌-401కు డబ్బు తీసుకురావాలని రాజీవ్‌ భట్టాచార్య సూచించాడు. అప్పటికే వలపన్నిన సీబీఐ అధికారులు.. రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తాలను డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారితో పాటు ఉన్న దుర్గేశ్‌ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో అతని పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అరెస్టు చేసిన ఇద్దరూ.. తమను తాము ఎంపీ కవిత పీఏలుగా చెప్పుకొంటున్నారని, దర్యాప్తులో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. ఢిల్లీలో తనకు వ్యక్తిగత కార్యదర్శులు ఎవరూ లేరని ఎంపీ మాలోతు కవిత స్పష్టం చేశారు. తనకు తెలంగాణలో మాత్రమే ప్రభుత్వం కేటాయించిన పీఏలు, మహబూబాబాద్‌ క్యాంపు కార్యాలయంలో ఒక ప్రైవేటు పీఏ ఉన్నారని చెప్పారు. ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని రెండు నెలల క్రితమే కేటాయించారని వివరించారు. దుర్గేశ్‌ అనే డ్రైవర్‌ను ఢిల్లీలో ఇటీవలే నియమించుకున్నానని, అతనికి సర్వెంట్‌ క్వార్టర్‌ కూడా ఇచ్చానని చెప్పారు. మిగతా ఇద్దరు ఎవరో తనకు తెలియదన్నారు. ఏది ఏమైనా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సీబీఐని కోరారు.

ఏప్రిల్ 8న ఏపీలో పరిషత్ ఎన్నికలు 

ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 8వ తేదీ గురువారం పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అవసరమైన చోట్ల ఈనెల 9న రీపోలింగ్ నిర్వహించనుంది ఎస్ఈసి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా గురువారం ఉదయం నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె పరిషత్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. గవర్నర్ ను కలిసి చర్చించారు. మధ్యాహ్నాం సీఎస్, డీజీపీతో పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సన్నద్దతపై సమీక్షించిన తర్వాత ఎన్నికల ప్రకటన చేశారు ఎస్ఈసీ నీలం సాహ్నీ. 2020 మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియతో పాటు పరిశీలన, ఉప సంహరణ కూడా ముగిసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు కరోనా కారణాంగా  ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అప్పడు ఆగిపోయిన ప్రక్రియ నుంచే ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టారు కొత్త ఎస్ఈసీ. వారం రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మరోవైపు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని ఆరోపిస్తున్న టీడీపీ..   త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

పసుపు బోర్డు.. ప్రత్యేక హోదా.. బీజేపీ డబుల్ గేమ్

నిజామాబాద్‌లో పసుపు బోర్డు. బీజేపీ ఎన్నికల హామీ. పసుపు బోర్డుతో రాజకీయం చేసి ఎంపీ సీటు ఎగరేసుకుపోయింది కమలం పార్టీ. గెలిచాక పసుపుబోర్డు ఊసే ఎత్తడం లేదు ఎంపీ అరవింద్. రైతులు ఎంతగా డిమాండ్ చేస్తున్నా.. బీజేపీలో ఉలుకూ పలుకూ లేదు. ఏదో గెలిచాం.. మళ్లీ ఎలక్షన్ నాటికి చూసుకుందాం అన్నట్టు ఉంది తీరు. అటు, కేంద్రం సైతం ఇప్పట్లో తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. అసలు అలాంటి ఆలోచనే లేదంటూ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది.  కట్ చేస్తే.. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో ప్రకటించింది బీజేపీ. అందులో తాము గెలిస్తే తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చింది. నవ్విపోదురు గాక నాకేంటి అన్నట్టు ఉంది కమలనాథుల వైఖరి. పసుపు బోర్డు పేరుతో తెలంగాణలో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీ అప్లై చేసిందో.. సేమ్ అలానే ఇప్పుడు తమిళ ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.  గతంలో తమ సమస్యలపై తమిళ రైతులు ఢిల్లీలో నెలల తరబడి ఆందోళన చేసినా పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు అడగకుండానే పసుపు బోర్డు తెస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటిస్తే నమ్మేంత అమాయకులు కాదు అరవ ఓటర్లు. ఎలాగూ గెలిచేది లేదు.. ఇచ్చేది లేదు అనుకున్నారో ఏమో.. తమిళనాడుకు పసుపు బోర్డు పేరుతో ఓటర్లకు గాలం వేశారు. అయితే, ఆ గాలానికి చిక్కడానికి వారేమీ నిజామాబాద్ ఓటర్లు కాదు. తమిళనాడులో ప్రాంతీయతత్వం ఎక్కువ. జాతీయ పార్టీలను ఆదరించిన చరిత్ర తక్కువ. అందుకే, అక్కడ బీజేపీ పప్పులు ఉడకవంటున్నారు విశ్లేషకులు. అచ్చం ఇలాంటిదే మరో ఎత్తుగడ పుదుచ్చేరిలోనూ అమలు చేస్తోంది బీజేపీ. తాము గెలిస్తే పుదుచ్చేరికి ప్రత్యేక హోదా తెస్తామంటోంది. ఇదేమి విడ్డూరం! ఏపీ వాసులు ఎంత మొత్తుకుంటున్నా.. ఎన్ని ఉద్యమాలు చేసినా.. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ మొండిగా వాదిస్తోంది కేంద్రం. కేసులకు భయపడి సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని అంటున్నారు. నీతిఅయోగ్‌ను బూచీగా చూపించి స్పెషల్ స్టేటస్‌పై ఏపీకి మొండిచేయి చూపించిన కేంద్రం.. పుదుచ్చేరిలో ఎన్నికలు వచ్చే సరికి మాత్రం ప్రత్యేక హోదా పల్లవి అందుకోవడం విమర్శల పాలవుతుంది.  తమిళనాడులో పసుపుబోర్డు.. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా.. ఈ రెండు హామీలు ఎన్నికల జిమ్మిక్కులే అంటున్నారు. రాష్ట్రానికో రకంగా ఆడుతున్న బీజేపీ డబుల్ గేమ్‌పై అంతా మండిపడుతున్నాయి. ఓట్ల కోసం మరీ ఇంతగా దిగజారాలా? తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాలరాయాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలుగుజాతి.

పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ!

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని ఆరోపిస్తున్న టీడీపీ..   త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నప్పుడే అధికార పార్టీ రెచ్చిపోయిందని, ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజార్చడం ఖాయం అని టీడీపీ అభిప్రాయపడుతోంది. నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్నీ తాజాగా ఎస్ఈసీగా రావడంతో టీడీపీ పరిషత్ ఎన్నికల సరళిపై ఓ అంచనాకు వచ్చింది. ఏపీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. శుక్రవారం రాజకీయ పార్టీలతో సమావేశమై పరిషత్ ఎన్నికల అంశం చర్చించనున్నారు. పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు. గురువారం ఉదయం ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్ని.. వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఫోకస్ చేశారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా హాజరయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు నీలం సాహ్నీ స్పష్టం చేశారు. ఈ భేటీ సందర్భంగా జిల్లాల్లో కరోనా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పవన్ చెవిలో సీఎం పువ్వు! 

ఆంధ్రప్రదేశ్ బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనతో అంతా షాక్. ఒక్కసారిగా ఉలికిపాటు. మోదీయే తనకు ఈ విషయం చెప్పారంటున్నారు వీర్రాజు. అబ్బే.. అలాంటిదేమీ లేదంటున్నాయి బీజేపీ శ్రేణులు.  ఇది సోము వ్యక్తిగత స్టేట్‌మెంటే అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏపీ పార్టీ బాధ్యతలు స్వీకరించాక సోము వీర్రాజు ప్రధాని మోదీని ఒక్కసారి కూడా కలవలేదు. ప్రధానిని ఎవరూ కలిసినా ఫోటోలు బయటికి వస్తాయి. కాని సోము వీర్రాజు ఇటీవల కాలంలో ప్రధాని మోడీని కలిసినట్లు ఒక్క ఫోటో కూడా లేదు. అలాంటిది ప్రధాని చెప్పారంటూ.. పవన్ కల్యాణే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎలా  ప్రకటిస్తారని పార్టీ అధ్యక్షుడి తీరును తప్పుబడుతున్నారు క్రిందిస్థాయి నాయకులు.  అసలు బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించే సంప్రదాయమే లేదు. తమకు బలమున్న చోట.. గెలిచే ఛాన్స్ ఉన్న రాష్ట్రాల్లో.. ఫలితాలు వచ్చాకే సీఎంను ఎంపిక చేస్తారు. అప్పటి వరకూ రేసులో ఎవరున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న బెంగాల్ విషయాన్నే తీసుకోండి. బెంగాల్‌లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? అంటే సమాధానం లేదు. గెలిచాక ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర కమిటీ. అప్పటి వరకూ పార్టీలో ఆ ప్రస్తావనే రాదు. అసోంలోనూ అంతే. ఇది బీజేపీ స్టైల్ పాలిటిక్స్. అయితే ఈ తరహా విధానాన్ని బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. తమకు బలం లేని చోట్ల మాత్రం ముందే అభ్యర్థిని ప్రకటించి కొత్త ఎత్తులు వేస్తోంది. కేరళలో బీజేపీకి బలమే లేదు. అక్కడ ఒక్క సీటైనా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేకపోతోంది. అలాంటి చోట మాత్రం మెట్రో శ్రీధరన్ ను తీసుకొచ్చింది. మెట్రో మేన్ ను పార్టీలో చేర్చుకొని.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించేసింది కమలదళం. కనీసం ఆయన్ను చూసైనా కాసిన్ని ఓట్లు పడతాయనే ఆశ. ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ తీరు అలాగే కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఈ రెండేండ్లలో ఆ పార్టీ బలపడింది కూడా లేదు. అయినా తామే అధికారంలోకి వస్తామంటూ కలలు గంటోంది. ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థినే ప్రకటించారు సోము వీర్రాజు.  దీంతో కేరళలో శ్రీధరన్ లానే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్.. బీజేపీ పాలిటిక్స్‌లో పావుగా మారుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయాలను చూస్తే... ఆ పార్టీ తన మిత్రపక్షాన్ని కూడా ఎదగకుండా చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. వేరే పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అలవాటు బీజేపీకి లేదు. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ బలహీన పడటానికి బీజేపీ కుట్రలే కారణమని అంటారు. మహారాష్ట్రలో తమకు సుదీర్గ కాలం మిత్రపక్షంగా ఉన్న శివసేన విషయంలోనూ బీజేపీ కుట్రపూరితంగానే వ్యవహరించిందని చెబుతారు. శివసేనకి ముఖ్యమంత్రి పీఠం దక్కకుండా బీజేపీ పావులు కదిపింది. ఎన్సీపీకి సీఎం పోస్టు దక్కినా ఫర్వాలేదు కాని శివసేనకు వద్దన్నట్లుగా బీజేపీ పెద్దలు కథ నడిపించారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. బీహార్ లో మాత్రమే నితీష్ కు మద్దతు ఇచ్చారు. అది కూడా విధి లేని పరిస్థితుల్లోనే ఇచ్చారని అంటున్నారు. నితీశ్ ను సీఎం చేయకపోతే... ఆయన అర్జేడీకి సపోర్ట్ చేస్తారనే భయం వల్లే అక్కడ బీజేపీ తలొగ్గింది.  దేశ వ్యాప్తంగా బీజేపీ రాజకీయాలు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ సీన్ క్లారిటీగా కనిపిస్తోంది. తమకు బలం లేని చోట పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి బలపడాలనే ఎత్తులు బీజేపీ వేస్తుందని తెలుస్తోంది. తమ మిత్రపక్షాలనే తొక్కేసే అలవాటున్న బీజేపీ చేతిలో పవన్ పావుగా మారుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకమాండ్ వద్ద తమకే దిక్కులేని సునీల్ దియోదర్, సోము వీర్రాజు .. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడమే విచిత్రమనే చర్చ సాగుతోంది. తిరుపతిలో  తామే పోటీ చేస్తామని పట్టుబట్టినా అవకాశం ఇవ్వని బీజేపీ... ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తుందని జన సేన నేతలు కూడా అంటున్నారు. నిజానికి తిరుపతిలో 2019 ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా ఆ సీటు కూడా పొత్తులో భాగంగా బీజేపీనే తీసుకుంది. తమకు పట్టున సీటులో ఎంపీ సీటే ఇవ్వని బీజేపీని ఎలా నమ్మాలని కొందరు జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   సోము వీర్రాజు  ప్రకటన అటు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదెక్కడి ఖర్మ, ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి, బీజేపీ కార్యకర్తలు ఎందుకు పనిచేయాలి, అనే ప్రశ్నలు కొందరు కమలం నేతల నుంచి వినిపిస్తున్నాయి. సోమువీర్రాజు ప్రకటన పార్టీని అవమానించే విధంగా ఉందని, పార్టీ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉందన్న బాధ, అగ్రహం, పార్టీ కార్యకర్తలు వ్యక్త పరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ సీఎం అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేతలు కూడా అంగీకరించే పరిస్థితి లేదు.   

గులాబీలో ఎమ్మెల్సీ  రచ్చ! కడియం జంపింగ్ ఖాయమేనా?

తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే జూన్ తర్వాత సంచలన పరిణామాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాకులు తగులనున్నాయనే చర్చ జరుగుతోంది. జూన్ లో ఏడుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. ఎమ్మెల్యే కోటాలో గెలిచిన ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, నేతి విద్యాసాగర్ రావు, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి పదవి కాలం జూన్ 3తో ముగియనుండగా.. తెలంగాణ భవన్ ఇంచార్జ్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం జూన్ 16తో ముగియనుంది. అయితే వీరిలో ఈసారి ఎంతమందికి రెన్యువల్ ఉంటుందన్నిది ఆసక్తిగా మారింది. తెలంగాణ భవన్, టీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఒకరిద్దరికి తప్ప మిగితా వారికి రెండోసారి కేసీఆర్ అవకాశం ఇవ్వకపోవచ్చంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నియామకం తర్వాత గులాబీ పార్టీలో కలకలం రేగడం ఖాయమంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆయనకు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అన్నది చర్చగా మారింది. అయితే కడియంకు రెన్యూవల్ దాదాపుగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కడియానికి కూడా దీనిపై సిగ్నల్స్ అందాయని, అందుకే ఆయన భవిష్యత్ కార్యాచరణలో ఉన్నారంటున్నారు. బీజేపీ నేతలతో కడియం టచ్ లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై కడియం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయానికి వచ్చినందువల్లే కడియం బహిరంగంగానే ప్రకటన చేశారని చెబుతున్నారు. 2018లో రెండోసారి టీఆర్ఎస్ సర్కార్ వచ్చాకా.. మంత్రిపదవి తనకు ఖాయమనుకున్నారు కడియం. కాని కేసీఆర్ ఆయన్ను తీసుకోలేదు. అప్పటినుంచి  శ్రీహరి అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. గతంలో ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగినా.. ఆయన ఖండించారు. ఈసారి మాత్రం కడియం.. కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు.  వరంగల్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లుకు కూడా మరో ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. దీంతో ఆయన కూడా కడియంతో పాటు బీజేపీ వైపు వెళ్లవచ్చని అంటున్నారు. శాసనమండలి చైర్మెన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి రెండో సారి అవకాశం తక్కువే అంటున్నారు. గుత్తా ప్లేస్ లో మండలి చైర్మెన్ గా ఇటీవల హైదరాబాద్ స్థానంలో గెలిచిన సురభి వాణిదేవీని తీసుకోవచ్చంటున్నారు. అదే జరిగితే గుత్తాను కేబినెట్ లోకి తీసుకోవాలి. ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రివర్గం రేసులో ఉన్నారు. ఈ లెక్కన గుత్తాకు ఎమ్మెల్సీ ఇవ్వపోవచ్చని భావిస్తున్నారు. ఫరీదుద్దీన్, ఆకుల లలితకు కూడా మరో అవకాశం ఇవ్వడం అనుమానమే. ఇప్పటికే నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. నేతి విద్యాసాగర్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ దగ్గర లాబీయింగ్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ భవన్ ఇంచార్జ్ గా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఆరోగ్య కారణాలతో ఎమ్మెల్సీగా తిరిగి నియమించకపోవచ్చని తెలుస్తోంది.  జూన్ లోనే ఏడుగురు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో.. వాటి కోసం టీఆర్ఎస్ లో పోటీ తీవ్రంగానే ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ జిల్లాకు చెందిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన కర్నె ప్రభాకర్ పదవి కాలం గత నవంబర్ లో ముగిసింది. ఆయనకు మరోసారి అవకాశం వస్తుందని భావించిన... సామాజిక సమీకరణలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు రెన్యూవల్ రాలేదు. జూన్ లో అవకాశం ఇస్తానని కర్నెకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెబుతున్నారు. నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఆయన కూడా రేసులో ఉండే అవకాశం ఉంది. మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. 

బీరు చాలా ఛీప్ గురు..  

మందేస్తూ చిందేయరా.. చిందిస్తూ మందేయిరా.. చుక్కల్లో పక్కేయిరా.. పక్కేసి చుక్కేయిరా.. ఇదేంటి టైటిల్ కి కంటెంట్ కి సంబంధం లేదు అనుకుంటున్నారా.. కంగారొద్దు గురు క్లారిటీ ఇస్తానుగా.. వైట్ చేయండి అంటే.. అక్కడ బీర్ చాలా చీప్.. ఎంతో తెలిస్తే జాతిరాతలు సినిమాలో హీరోల మామా అని గంతేస్తారు.. అలా అని అది గోవా కాదు.. గోవా ను మంచి ఆఫర్ ఇంకోచోట ఉంది. మరింకేంటి అసలే ఎండాకాలం.. చీఫ్ లో బీర్ వస్తుందంటే చీర్స్ కొట్టడానికి ఒకేసారి అయినా అక్కడికి టూర్ వేయాల్సిదే అనుకుంటున్నారా.. మరింకెందుకు ఆలస్యం.. గెట్ రెడీ ఫర్ ఎంజాయ్..  మందుబాబులు అంటే మామూలోళ్లు కాదు మరి. కారణం ఏదైనా కావచ్చు కానీ బారుకి వెళితే ప్రభుత్వం ఖజానా నిండాలే అది మందు బాబుల సత్తా..  బీర్ రేట్ బార్గెట్ అంత పెరిగినా కూడా మందుబాబులు మాత్రం కొనడం, తాగడం ఆపరు. అయితే కరోనా కారణంగా దేశంలో మద్యం విక్రయాలు తగ్గాయి. దీంతో ప్రభుత్వం మందుబాబులకు ఒక శుభవార్తను తెలిపింది. ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీగా రెవెన్యూ త‌గ్గ‌డంతో బీర్ల అమ్మ‌కాల‌కు సంబంధించి ఎక్సైజ్ పాల‌సీలో స్వ‌ల్ప మార్పులు తీసుకొచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లోనా అని అనుకుంటున్నారా.. అసలు కాదు. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా రెవెన్యూ తగ్గిపోవడంతో రాజస్థాన్ ప్రభుత్వం ఒక్క బీర్ పై ఏకంగా రూ. 30 నుంచి రూ. 35 తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ కారణంగా మద్యం తాగడానికి మందుబాబులు ఆసక్తి చూపకపోవడం వలనే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.. బీర్ చౌక గా వస్తే మందుబాబులు పరిగెత్తుకుంటూ వస్తారని వారి ప్లాన్. ఇక దీంతో పాటు బాటిల్స్ ఎమ్మార్పీ ధరలపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్ ఛార్జీని తగ్గించారు.మరి ఈ విషయం తెలిసాక కూడా మందుబాబులు ముసుకు తన్ని పాడుకుంటారో.. లేక ఆవేశం లో బార్ల వెంట వైన్స్ ల వెంట పరుగుపెడుతారో చూడాలి.  

మతమేల? అవినీతి మరకేల?

తిరుపతి బరిలో మాజీ ఐఏఎస్ రత్నప్రభ. బీజేపీ అభ్యర్థిగా పోటీ. గెలుపు, ఓటమి మాటెలా ఉన్నా.. ఆమె చుట్టూ అనేక కాంట్రవర్సీలు. క్రిమినల్ కేసులు.. అవినీతి ఆరోపణలు.. మత వివాదం.. ఇలా నామినేషన్ వేసినప్పటి నుంచీ రత్నప్రభ చుట్టూ రాజకీయ రచ్చ నడుస్తోంది. అయినా.. ఆమె దేనికీ స్పందించకపోవడం మరింత అనుమానాస్పదమవుతోంది.  తిరుపతి ఎస్సీ స్థానంలో రత్నప్రభ పోటీ చేస్తున్నారు. ఆమె సామాజిక వర్గంపై వివాదం నడుస్తోంది. రత్నప్రభ దళితురాలు అయినప్పటికీ.. ఆమె క్రైస్తవ మతం స్వీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ.. ఓ వ్యక్తి ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు. దీంతో.. రత్నప్రభ హిందువా? క్రిష్టియనా? అనే ఇష్యూ నడుస్తోంది. ప్రముఖ మీడియాలో రత్నప్రభ క్రైస్తవ మతానికి చెందిన వారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది.  తిరుపతి సీటును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆధ్యాత్మిక నగరంలో గెలుపు ఆ పార్టీకి అత్యంత కీలకం. అందుకే, మిత్రపక్షం జనసేనతో పోట్లాడి మరి తిరుపతి ఎంపీ స్థానంలో పోటీ చేస్తోంది. జాతీయ నేతలనూ ప్రచారానికి తీసుకురానుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తిరుపతిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇటీవలే ఆయన భగవద్గీతకు మద్దతిస్తారా? బైబిల్‌ పార్టీకి ఓటేస్తారా? అంటూ వైసీపీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. అలాంటిది.. ఇప్పుడు అదే బీజేపీ అభ్యర్థి హిందువు కాదు.. క్రిష్టియన్ అంటూ వివాదం చెలరేగడం ఆ పార్టీకి మింగుడు పడని అంశం. బండి సంజయ్ తిరుపతి ప్రచారానికి వస్తే.. ఈ కాంట్రవర్సీ మరింత పీక్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

బీజేపీ ఫాల్కే పాలి..ట్రిక్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఆ అత్యుత్తమ అవార్డుకు ఆయన వంద శాతం అర్హుడు. తలైవాకి ఫాల్కే రావడం అందరికీ సంతోషం. నటనతో, తనదైన శ్టైల్‌తో, ప్రత్యేక మేనరిజంతో.. ఏళ్ల పాటు భారత ప్రేక్షకులను అలరించిన అద్బుత నటుడు రజనీకాంత్. అయితే.. ఆ తమిళ తలైవాని 'బంగారు కమలం' వరించిన సమయం, సందర్భం, విధానం మాత్రం నిస్సందేహంగా వివాదాస్పదమే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కమలనాథులు విసిరిన రాజకీయ పాచిక.. ఫాల్కే అవార్డు. సినిమారంగంలో దేశంలోకే ఉన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. భారతీయ సినిమాకు అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే అవార్డు ఈ సారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రావడం కాకతాళీయమా? లేక, వ్యూహాత్మకమా? అనే అనుమానం. ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళ ఓటర్లను ఆకర్షించేందుకే కేంద్రం రజనీని ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసిందని అంటున్నారు. రజనీకాంత్ కోసం అనేక నియమ, నిబంధనలను సైతం పక్కన పెట్టేశారని అంటున్నారు. తమిళనాడు ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల ముందర.. ఉన్నట్టుండి ఉరుము ఉరిమినట్టు.. రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటిస్తూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.  ఫాల్కే అవార్డుకు ఎంపిక ఆశామాషీగా ఉండదు. దానికంటూ ఓ విధివిధానం ఉంది. ముగ్గురు సభ్యుల కమిటీ భేటీ అవుతుంది. దేశవ్యాప్తంగా సినిమారంగ ప్రముఖుల పేర్లను పరిశీలిస్తుంది. అందులో అత్యుత్తమ వారిని అవార్డుకు ఎంపిక చేస్తారు. అయితే, రజనీకాంత్ విషయంలో ఇలా జరగలేదు. ఫాల్కే అవార్డు ఎంపికకు ముగ్గురు సభ్యులతో కమిటీయే ఏర్పడ లేదు. ఎలాంటి సమావేశమూ నిర్వహించలేదు. ఫాల్కే అవార్డుకు ఇంకెవరి పేర్లూ పరిగణలోకి తీసుకోలేదు. కమిటీతో కాకుండా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్‌తోనే రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిందంటూ ట్రోలింగ్ కూడా నడుస్తోంది. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రకాశ్ జవదేకర్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీనే రజనీకి ఫాల్కే అవార్డు కట్టబెట్టారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.  బీజేపీ రాజకీయ పన్నాగాలు ఇలానే ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే.. అక్కడ వరాల జల్లు కురిపిస్తూ.. ఇలానే ఓటర్లకు బిస్కెట్లు వేస్తారని ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ.. పార్టీలన్నీ ప్రచారంతో ఊదరగొడుతున్న సమయంలో.. సడెన్‌గా రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటూ న్యూస్ రావడం సంచలనమే. ఇది ముమ్మాటికీ బీజేపీ రాజకీయ ఎత్తుగడే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే.. జాత్యాభిమానం అధికంగా ఉండే తమిళులు బీజేపీని అంత ఈజీగా ఆదరించే అవకాశమే లేదంటున్నారు. ఆ విషయం కమలనాథులకూ తెలియంది కాదు. అందుకే, అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకొని.. రెండాకులను అడ్డుపెట్టుకొని.. తమిళనాట కమల వికాసం కోసం కుతంత్రాలు చేస్తోంది బీజేపీ. ఎన్నికలకు ముందు ఓటర్లను మరింతగా మచ్చిగ చేసుకునేందుకే.. రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారనేది రాజకీయ విమర్శ. కారణమేదైనా.. రజనీకాంత్‌ మాత్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు హండ్రెడ్ పర్సెంట్ అర్హుడనేది అందరి మాట. 

ఐపీఎస్ భార్యకి వికటించిన టీకా.. 

ప్రజలు కరోనా వస్తుందని ఆందోళన పడుతుంటే. మరో వైపు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా అవుతుందేమో అన్న భయం కూడా లేకపోలేదు ప్రజలకు. ఈ నేపధ్యం లో కొంతమంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కొంత మంది అయితే వ్యాక్సిన్ వేస్తున్నారంటే అటువైపు కూడా వెళ్లడం లేదు..  తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి షా నవాజ్ ఖాసీం భార్య హీనాకు కోవిడ్ వ్యాక్సిన్ వికటించింది. కింగ్ కోఠీలోని ఏరియా ఆస్పత్రిలో ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న హీనాను పరామర్శించి.. ఆమె పరిస్థితి, వైద్య సేవలపై ఆరాతీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

మధ్య బంగ్లాలో బీజేపీదే హవా పీపుల్స్  పల్స్ అంచనా

పాకిస్తాన్, బాంగ్లాదేశ్ శరణార్థులు గణనీయ సంఖ్యలో ఉన్న మధ్య బెంగాల్’లో బిజెపి మూడింట రెండొంతుల సీట్లు గెల్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఏడు లోక్ సభ స్థానాలు (కృష్ణ నగర్, రాణాఘాట్, బరధామాన్ పుర, బర్ధమాన్ దుర్గాపూర్, అసన్సోల్, బొల్పూర్, బీర్బహుమ్) ఉండగా, మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.వీటిలో బిజెపి సునాయనంగా 30 సీట్లు గెల్చుకొంటుందని, టిఎంసి 11 సీట్లు గెల్చుకోగా, లెఫ్ట్ ఒక సీట్ గెల్చుకొంటుందని పీపుల్స్  పల్స్ అంచనా వెల్లడిస్తున్నది. మరో 7 సీట్లలో టిఎంసి – బిజెపిల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు చెబుతున్నారు. నదియా జిల్లాలో బెంగాలీ హిందూ శరణార్ధుల ఆధిపత్యం కొనసాగుతున్నది. వారిలో ముఖ్యంగా మహిష్యాలు, జీవాల ఘోష్, భద్రలోక్ లు ఎక్కువగా ఉన్నారు. తూర్పు పాకిస్థాన్ నుండి వలస వచ్చిన నమోశూద్ర/మాటువ దళితులు కూడా ఉన్నారు. వీరితో పాటు స్థానిక ముస్లింలు ఉన్నారు.   రెండు లోక్ సభ నియోజకవర్గాలున్న బీర్బహుమ్ ప్రాంతంలో హిందూ బెంగాలీలు, ముస్లింలు, షెడ్యూల్డ్ కులాల వారు ఎక్కువగా ఉన్నారు. కొన్ని చోట్ల సంథాల్, ముండా, ఒరన్ గిరిజనులు ఉన్నారు. రెండు లోక్ సభ స్థానాలున్న పశ్చిమ బార్డహ్మన్ ప్రాంతంలో హిందీ భాషీలు, హిందూ బెంగాలీలు, చైన్ మండల్, బాఘ్దిలు వంటి షెడ్యూల్డ్ కులాల వారితో పాటు ముస్లింలు, కొద్దిమంది ఆదివాసీయులు కూడా ఉన్నారు.   ఇక, తూర్పు బార్డహ్మన్ ప్రాంతంలో ఆగురిలు, మహిష్యాలు, ఘోష్, భద్రలోక్ వంటి బెంగాలీ హిందువులు; బాఘ్దిలు వంటి ఎస్సిలు, ముస్లింలు ఉన్నారు. హిందువులలో త్యధికులు తృణమూల్ వ్యతిరేకతతో ఉండగా, ముస్లింలు మొత్తంగా తృణమూల్ వెనుక సమీకృతం అవుతున్నారు. ముఖ్యంగా నదియా జిల్లాలో ఎస్సీలలో  తృణమూల్ వ్యతిరేకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నది.అవినీతి, నిరుద్యోగం, రాజకీయ హింస కారణంగా ప్రధానంగా హిందువులలో అత్యధికులు తృణమూల్ కాంగ్రెస్’కు దూరం అయిన్నట్లు స్పష్టం అవుతున్నది. ముఖ్యంగా బిర్భుమ్, బార్డహ్మన్ ప్రాంతాలలో ఇసుక మాఫియా, స్టోన్ మాఫియా ప్రత్యామ్న్యాయ ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్నాయి.ఇక, అధికార పార్టీకి సన్నిహితమైన సిండికెట్ లు నడుపుతున్న బొగ్గు, తుక్కు ఇనుము, ఇసుల సంబంధం అవినీతి కారణంగా అధికార పక్షం పట్ల ఆగ్రవేశాలు వెల్లడి అవుతున్నాయి.   ఇక నదియా జిల్లాలో, సరిహద్దు అవతలి నుండి నిరాటంకంగా జరుగుతున్న బంగారం, మందులతో పాటు ఆవుల స్మగ్గ్లింగ్ వ్యాపారం తీవ్రమైన అవినీతికి, ఆధిపత్య ధోరణులకు, హింసకు దారితీస్తుంది. పశ్చిమ బెంగాల్ అంతటా నెలకొన్న సాధారణ అవినీతితో పాటు ఈ ప్రాంతంలో ఈ రంగాలలో ప్రత్యేకంగా అవినీతి ప్రజల నిత్యజీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.   ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నప్పటికీ బిర్భుమ్ ప్రాంతంలో 37 శాతం, పశ్చిమ బార్డహ్మన్ , ప్రుబాబార్డహ్మన్ ప్రాంతంలో 20.7 శాతం, నదిలో 26.8 శాతంగా గల మద్దతు తృణమూల్ కాంగ్రెస్ కు కీలకంగా మారనున్నది. 60 నుండి 70 శాతంకు పైగా హిందువుల జనాభా ఉండడంతో బిజెపి కి బలమైన రాజకీయ మద్దతు లభిస్తున్నదని,  ప్యూపిల్స్ పల్స్’ సంస్థ పేర్కొంది.  

కన్వర్షన్ క్వీన్.. కమీషన్ క్వీన్! 

కల్వకుంట్ల కవిత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ మాజీ ఎంపీ.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవితది కీ రోల్. వైఎస్ షర్మిల... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోదరి.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు షర్మిల. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరగనున్న సభలో ఆమె పార్టీ పేరును ప్రకటించనున్నారు. గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల. ఈ ఇద్దరు మహిళా నేతలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  వైఎస్ షర్మిలను కన్వర్షన్ క్వీన్ గా అభివర్ణించారు ఎంపీ అర్వింద్. తెలంగాణలో మత మార్పిడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని షర్మిలను హెచ్చరించారు. తెలంగాణ వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అని గతంలో మాట్లాడిన  వైఎస్ కూతురు.. ఇప్పుడు  తెలంగాణలో వీసా తీసుకుని పార్టీ పెడుతున్నారా? అని అర్వింద్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితను కమీషన్ క్వీన్ అన్నారు. తెలంగాణలో జరిగే ప్రతి పనిలో కవితకు కమీషన్ వెళుతుందని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు బీజేపీ ఎంపీ.  పార్టీ కార్యాలయంలో మీడియాతో  చిట్ చాట్ చేసిన ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునరుజివం అయ్యే అవకాశం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోనుందని చెప్పారు. నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు ఎంపీ అర్వింద్. నాగార్జున సాగర్ ఎన్నికలో టీఆరెస్ అధికార దుర్వినియోగాయానికి పాల్పడుతుందని విమర్శించారు. ఇతర పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తమిళనాడు బీజేపీ మ్యానిఫెస్టేలో పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిందని అర్వింద్ చెప్పారు. బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని పార్లమెంటులో స్పష్టంగా ప్రకటించిందని తెలిపారు. రీజనల్ స్పైసెస్ పార్క్ ద్వారా పసుపు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. దిగుబడులు నిలిపేయటంతో పసుపు కి ధర కూడా పెరిగిందని వెల్లడించారు.  నిజామాబాద్ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కేసీఆర్ విసిరే బిస్కట్లు తినే కుక్కలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అర్వింద్. తనను విమర్శించటం తప్ప జిల్లా నేతలకు వేరే పనే లేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తేరుస్తానని కేసీఆర్ ఈ ప్రాంత చెరుకు రైతులను మోసం చేశారని మండిపడ్డారు.  జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని మంత్రి ప్రశాంత్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్, కేటీఆర్ జైలుకి వెళ్ళటం ఖాయమన్నాుర నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.   

తెలంగాణకు 12 అవార్డులు .. 

కేంద్రం ఇచ్చే ప్రతిష్టాత్మక దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ అవార్డులను ప్రకటించారు. వీటిలో తెలంగాణ 12 అవార్డులను అందుకుంది. ఆ అవార్డుల్లో  ఒకటి ఉత్తమ జిల్లా పరషత్, రెండు ఉత్తమ మండల పరిషత్, మొత్తం తొమ్మిది ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు కైవసం చేసుకోగా.. ఉత్తమ జిల్లా పరిషత్ గా మెదక్, ఉత్తమ మండల పరిషత్ గా జగిత్యాల జిల్లా లోని కోరుట్ల, పెద్దపల్లి జిల్లా లోని ధర్మారం, ఉత్తమ గ్రామపంచాయతీలుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాస్ నగర్ , సిద్దిపేట జిల్లా మిట్టపల్లి, సిద్దిపేట జిల్లా మల్యాల, ఆదిలాబాద్ జిల్లా రుయ్యడి, మహబూబ్ నగర్ జిల్లా చక్రాపూర్, పెద్దపల్లి జిల్లా సుందిళ్ల, సిరిసిల్ల జిల్లా మోహినికుంట, పెద్దపల్లి జిల్లా సుందిళ్ల గ్రామపంచాయతీలకు 12 అవార్డులు వచ్చాయి. అందులో చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు  మోహినికుంట గ్రామపంచాయతీ దక్కించుకోగా. గ్రామపంచాయతీ డెవలప్మెంట్ అవార్డును సుందిళ్ల కైవసం చేసుకుంది. రాష్ట్రానికి అవార్డులు రావటం పై పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపు, చొరవ, మార్గనిర్దేశం వల్లనే ఈ అవార్డులు వచ్చాయన్నారు. దేశం లో ఉన్న రాష్ట్రంలోని గ్రామాల, మండలాల అభివృద్ధిని కేంద్రం గుర్తించి ప్రతి యేటా అవార్డులు ఇస్తోందన్నారు. సీఎం కేసీఆర్ కి, కేంద్రానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.   

ముఖ్యమంత్రా? విదేశీ తీవ్రవాదా?

10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 59 మంది ఎస్ఐలు, 147 మంది ఏయేస్సైలు, 647 మంది కానిస్టేబుల్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గుంటూరు పర్యటనలో మోహరించిన సెక్యూరిటీ. ఇంత సెక్యూరిటీతో ముఖ్యమంత్రి పాల్గొన్నద్ది పెద్ద సభేమి కాదు. కొవిడా తీసుకున్నారంతే. కొవిడ్ వ్యాక్సిన్ కోసం గుంటూరు నగరంలోని భారత్‌పేట ఆరోలైన్‌లో ఉన్న 140వ వార్డు సచివాలయానికి వచ్చారు జగన్. ఆ కార్యక్రమం కోసమే ఇంత మంది పోలీసులను మోహరించారు. అంతేకాదు  7 కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ పర్యటన ముగిసే వరకు అటు వైపుగా ఎవరూ రానీయలేదు. దాదాపు 40 గంటల పాటు ఆ ప్రాంత వాసులను ఇళ్ళల్లో బందీలుగా ఉంచారనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ టీకా తీసుకునేందుకు వస్తే..  దాదాపు వెయ్యి మందితో భద్రత కల్పించడం... ఏకంగా 10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలను నియమించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ తలపెట్టిన మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా 14 నెలలుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లోనూ వాళ్ల ఉద్యమం ఆగలేదు. భారీ వర్షాలు కరిసినా.. చలి వణికించినా.. భానుడు భగభగమండినా రైతులు విశ్రమించలేదు. అమరావతి ఉద్యమంతో అటువైపుగా వెళ్లాలంటేనే సీఎం జగన్ భయపడిపోతున్నారని చెబుతున్నారు. సచివాలయానికి వెళ్లినా.. భారీ భద్రత మధ్యే వెళుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. కొవిట్ టీకా కోసం గుంటూరు వెళ్లడంతో ఇలా బలగాలను మోహరించారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాక్సిన్ వేయించుకునేందుకు పోలీసు పహారా ఎందుకు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూటి ప్రశ్న వేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక విదేశీ తీవ్రవాదా? అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు ప్రజలు వైసీపీని గెలిపించినా జగన్‌కు భయమెందుకని నిలదీశారు. ఇంత మందితో  భద్రత కల్పించటానికి గుంటూరు ఏమన్నా ఆఫ్ఘనిస్తానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేసి, 40 గంటల పాటు ఆ ప్రాంత వాసులను ఇళ్ళల్లో బందీలుగా చేయటం తగునా? అంటూ రామకృష్ణ ప్రశ్నలు సంధించారు.  

అబ్బాయి 2.. అమ్మాయి 4..

2 అడుగుల అబ్బాయి. 4 అడుగుల అమ్మాయి. ఇద్దరు కలిసి ఏడు అడుగులు నడిచారు. పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ పెళ్లి  జంట ఆదర్శ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి మనసుండాలి గానీ.. హైట్ తో పనేముంది అనిపించారు.   అబ్బాయిది ముమ్మిడివరం గ్రామం. పేరు దేవరపల్లి శ్రీనుబాబు. డిగ్రీ పూర్తి చేశాడు. అమ్మాయిది అమలాపురం మండలం సమనస గ్రామం. పేరు  సత్యదుర్గ. 8వ తరగతి వరకు చదివి ఆపేసింది. కట్ చేస్తే.. ఇద్దరు జన్యుపరమైన సమస్యలతో జన్మించారు. ఈ కారణంగా శ్రీనుబాబు 2 అడుగులు, సత్యదుర్గ 4 అడుగుల ఎత్తు వరకే పెరిగారు. అందువల్ల వీరికి పెళ్లి చేయడం తల్లిదండ్రులకు సమస్యగా మారింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు అబ్బాయి, అమ్మాయి గురించి తెలుసుకున్నారు. ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల సమమతితో రెండు అడుగుల అబ్బాయి.. నాలుగు అడుగుల అమ్మాయి ఒక  జంట అయ్యారు. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ముమ్మడివరంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఆదర్శ జంటను చూసిన పలువురు హైట్ ది ఏముంది.. మంచి మనసుండాలి గానీ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

ఎన్టీఆర్ కూతురు.. నాదెండ్ల కొడుకు..

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరం కోసం ఎవరు ఎవరితోనైనా కలుస్తారు అనేందుకు చరిత్రలో అనేక ఉదాహరణలు. తాజాగా, తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల వేళ అలాంటి అరుదైన కలయిక కనిపిస్తోంది. ఎన్టీఆర్ కూతురు, నాదెండ్ల కొడుకు కలిసి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పురందేశ్వరీ.. జనసేన నెంబర్ 2 నేత నాదెండ్ల మనోహర్‌కు.. తమ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. చరిత్రలో జరిగిన గాయాన్ని తుడిపేసుకొని.. కొత్త చరిత్ర సృష్టించేందుకు కలిసి పని చేస్తున్నారు. ఆ అరుదైన కలయిక.. ఆ ఇద్దరు నేతలకు ఎలా ఉందో గానీ.. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిహాసం గురించి తెలిసిన వారంతా వారిద్దరినీ చూసి ఈసడించుకుంటున్నారు. ఆనాటి అరాచకాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు... అది 1984 ఆగష్టు. ఆనాడు జరిగిన ఆ సంక్షోభమే.. ఆ తర్వాత కాలంతో టీడీపీలో ఆగష్టు సంక్షోభంగా ముద్ర పడింది. నేటికీ ఆగష్టు నెల వస్తోందంటే తెలుగుదేశం పార్టీలో కాస్తో కూస్తో కలవరమే. 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీ స్థాపించి.. 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు ఎన్టీఆర్. దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించేశారు. ఐరన్ లేడీ ఇందిరను గడగడలాడించారు. 1983 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు నందమూరి తారకరామారావు. వెండితెర ఇలవేల్పు ఎన్టీవోడు ముఖ్యమంత్రి కావడం ఓ సంచలనం. బూజు పట్టిన కాంగ్రెస్ పార్టీ విధానాలను స్వస్తి చెప్పి.. అనతికాలంలోనే తనదైన శైలిలో అనేక పథకాలు, పాలనలో సంస్కరణలు చేసి చూపించారు ఎన్టీఆర్. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. రామారావు ప్రభుత్వం పాలనలో దూసుకుపోతుండగా.. అంతలోనే అనుకోని ఉపద్రవం. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలానికే.. సర్కారును కూల్చేసే కుతంత్రం. నేటి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు నేతృత్వంలో జరిగిందా ప్రజాస్వామ్య పరిహాసం. ఇందిరాగాంధీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు నాదెండ్ల భాస్కర్‌రావు.  అప్పట్లో అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగొచ్చే లోగా ఇక్కడ ప్రభుత్వం మారిపోయింది. కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో.. అప్పటి గవర్నర్ రామ్‌లాల్ సాయంతో.. నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి పదవిని కొల్లగొట్టారు. అదంతా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కనుసన్నల్లోనే జరిగింది. విషయం తెలిసిన ఎన్టీఆర్ ఆగ్రహంతో ఊగిపోయారు. నాదెండ్ల సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి తెరతీశారు. "ధర్మ యుద్ధం" పేరుతో నల్ల డ్రెస్ వేసుకొని ఢిల్లీపై దండయాత్ర చేశారు ఎన్టీఆర్. రామారావు చేపట్టిన ధర్మ యుద్ధానికి దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. సీపీఐ, సీపీఎమ్, బీజేపీ, జనతాపార్టీ ఇలా అంతా ఎన్టీఆర్ వెంట నడిచారు. ధర్మ యుద్ధంతో ఢిల్లీని గడగడలాడించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రదర్శించిన చాణక్యం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచింది. ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలందరితో కలిసి రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ నిర్వహించారు. ఇందిరా దిగొచ్చారు. నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. గవర్నర్ రామ్‌లాల్ మారిపోయారు. టీడీపీలో ఆగస్టు సంక్షోభం సుఖాంతమైంది. ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200కు పైగా ఎమ్మెల్యేలతో సత్తా చాటి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1984 ఆగస్టు 16 నుంచి 1984 సెప్టెంబర్ 16 వరకు.. కేవలం 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాదెండ్ల భాస్కర్‌రావు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరి చివరి వరకూ కొనసాగారు. తండ్రి వారసత్వంగా నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ సైతం కాంగ్రెస్‌లోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో స్పీకర్‌గా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి.. జనసేనలో చేరి.. పవన్‌కల్యాణ్ తర్వాత పార్టీలో నెంబర్ 2గా ఎదిగారు.  ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి, నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడు నాదెండ్ల మనోహర్‌లు.. ఆనాటి రాజకీయ వైరాన్ని మరిచి.. నేడు తిరుపతిలో రాజకీయ పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా.. ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కోసం బీజేపీలో తరఫున పురంధేశ్వరి, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌లు కలిసి ప్రచారం చేయడం కొందరికి కంపరంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌కు అంత ద్రోహం చేసిన నాదెండ్ల కుటుంబాన్ని ఆయన కూతురు పురంధేశ్వరి క్షమించారా? లేక, సమయానుకూలంగా అంతా మరిచిపోయారా? రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ ప్రశ్నిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అయితే, తండ్రి చేసిన పాపం కొడుక్కు ఎలా వర్తిస్తుందని సమర్థిస్తున్నాయి జనసేన వర్గాలు. ఏదిఏదైనా.. ఎన్టీఆర్ కూతురు, నాదెండ్ల కొడుకు ఒకే వేదికపై కనిపించడం రాజకీయల్లో ఏదైనా సాధ్యమే అనేందుకు నిదర్శనం.

టీకా తీసుకున్నజగన్.. 

ఈ మధ్య కాలంలో దేశంలోని రాజకీయ నాయకులూ, సెలబ్రెటీలు కరోనా మహమ్మారి భారీన పడుతున్న విషయం తెలిసిందే.. అందరూ ముందు చూపుగా టీకా వేసుకుంటున్నారు. తాజాగా  ఏపీ సీఎం జగన్‌ గుంటూరులో కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. భారత్‌పేట ఆరోలైన్‌లో ఉన్న 140వ వార్డు సచివాలయంలో ఉదయం రిజిస్ట్రేషన్‌ చేయించుకుని అక్కడే ముఖ్యమంత్రి జగన్ టీకా వేయించుకున్నారు. అనంతరం కాసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వార్డు సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బందితో మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్‌ టీకా వేయనున్నారు వైద్య అధికారులు తెలిపారు.