భయంకరంగా కరోనా వైరస్.. భారత ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేదం
భారత్‌లో కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. ఎవరూ ఊహించని విధంగా పంజా విసురుతోంది. గత ఏడాదిని మించి అల్లకల్లోలం రేపుతోంది. రోజు వారి కొత్త కేసులు లక్షకు పైగా నమోదువుతన్నాయి. ఐతే గడిచిన 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డు కేసులు వచ్చాయి. భారత్‌లో బుధవారం ఏకంగా 1,26,789 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు మనదేశంలో నమోదైన రోజు వారి కేసల సంఖ్యలో ఇదే అత్యధికం. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 685 మంది కరోనాతో చనిపోయారు. దీంతో కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 1,66,862కి చేరింది. ప్రస్తుతం మనదేశంలో 9,10,319 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అక్కడ 59,907 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఛత్తీస్‌గఢ్‌లో 10,310, కర్నాటకలో 6,976, కేరళలో 3502, తమిళనాడులో 3,986, పంజాబ్‌లో 2963, మధ్యప్రదేశ్‌లో 4043, గుజరాత్‌లో 3575 మందికి కొత్తగా కరోనా సోకింది. అయితే కొవిడ్ వ్యాక్సినేషన్‌లో కూడా భారత్ ముందు వరుసలోనే ఉంది.
భారత్‌లో ఇప్పటివరకు 9,01,98,673 మంది టీకా పంపిణి చేశారు.
భారత్‌లో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. న్యూజిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి న్యూజిలాండ్ వచ్చే భారత ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ నుంచి న్యూజిలాండ్ వెళ్లే ఆ దేశపు పౌరుల రాకపై కూడా న్యూజిలాండ్ తాత్కాలికంగా నిషేధం విధించింది. భారత్ నుంచి న్యూజిలాండ్ ప్రయాణాలపై రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్రకటన చేశారు. భారత్ ప్రయాణాలపై న్యూజిలాండ్ విధించిన ఆంక్షలు ఏప్రిల్ 11 నుంచి 28 వరకూ కొనసాగనున్నాయి.
న్యూజిలాండ్‌లో క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, బుధవారం 7 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ దేశ ప్రధాని తెలిపారు. గురువారం ఒక్కరోజే న్యూజిలాండ్‌కు వెళ్లిన వారిలో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ 23 మందిలో 17 మంది భారతీయులే కావడంతో అక్కడి సర్కార్ అప్రమత్తమైంది. భారత్ నుంచి ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది.