మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా
posted on Apr 5, 2021 @ 3:21PM
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. అనిల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్ హోం మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పంపించారు.
హోంమినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్‌సింగ్ అవినీతి ఆరోపణలు చేయగా.. వాటిపై విచారణ జరపాలంటూ జయశ్రీ పాటిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ధర్మాసనం.. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి సూచించింది. విచారణలో అనిల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభిస్తే.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
అంబానీ ఇంటి ముందు బాంబు కేసు అటూ ఇటూ తిరిగి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ వరకూ దారి తీయడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. బార్లు, వైన్స్ నుంచి నెలకు 100 కోట్ల వసూళ్లు టార్గెట్‌గా పెట్టారంటూ హోంమంత్రిపై మాజీ ముంబై పోలీస్ కమిషనర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం.. ఆ వెంటనే అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే అధికార శివసేన, ఎన్సీపీ కూటమిలో లుకలుకలతో మరాఠా రాజకీయం రంజుగా మారింది.