అర్నాబ్‌కు రాజ్యసభ రక్ష!
posted on Apr 5, 2021 @ 4:48PM
అర్నాబ్ గోస్వామి. ఇండియాలో మోస్ట్ పాపులర్ న్యూస్ రీడర్. జాతీయ మీడియా గురించి అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన వ్యక్తి. న్యూస్ డిబేట్స్ స్టైల్‌నే మార్చేసిన పర్సన్. ఆయన చేసే చర్చల్లో చర్చ కంటే రచ్చ ఎక్కువ అనేది కామెంట్. అంతా అరుపులు.. కేకలు. ఎవరు ఎక్కువ గట్టిగా మాట్లాడితే.. ఎవరు ఎక్కువ గట్టిగా అరిస్తే.. వాళ్లు అంత గొప్ప అన్నట్టు ఉంటుంది ఆ చర్చ. గెస్ట్స్ కంటే యాంకర్‌గా అర్నాబ్ చేసే గోలే ఎక్కువ. పాకిస్తాన్ ప్రస్తావన వస్తే తోక తొక్కిన పాములా బుసలు కొడతాడు. 'ఇండియా వాంట్స్ టూ నో'.. అంటూ ఎవరినైనా ఏదైనా అడిగేస్తాడు. కడిగేస్తాడు. కుమ్మేస్తాడు. నానా హంగామా చేస్తాడు. అతని హాట్ హాట్ మసాలా న్యూస్ కోసం ప్రతి రోజు రాత్రి కోట్లాది మంది ప్రేక్షకులు టీవీల ముందు అతుక్కుపోతారు. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే.
మరోవైపు.. అర్నాబ్ గోస్వామి బీజేపీ ప్రతినిధి అంటూ ఆరోపణ. అతను చేసే ప్రతీ చర్చ.. అధికార బీజేపీకి అనుకూలంగా ఉంటుందనే విమర్శ. కమలనాథులకు సపోర్ట్‌గా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశ ప్రజలను రెచ్చగొడతారని అంటారు. ముంబైలో ఓసారి అతనిపై ఇంకుతో దాడి కూడా జరిగింది. అది చేయించింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే అంటూ నానా రచ్చ చేశాడు అర్నాబ్. ఇక, TRP రేటింగ్స్ గోల్‌మాల్‌తో అర్నాబ్ పరువు పాతాళానికి పడిపోయింది. రిపబ్లిక్ టీవీ బార్క్ రేటింగ్స్‌ను ట్యాంపరింగ్ చేశాడంటూ అతనిపై కేసు నమోదైంది. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. అర్నాబ్ చుట్టూ కేసు ఉచ్చు బిగిసింది. జైలుకూ వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం అతన్ని అంతలా టార్గెట్ చేసినా.. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. రిపబ్లిక్ టీవీలో మళ్లీ అదే దూకుడు.
తమకు అంత మంచి చేసిన అర్నాబ్ గోస్వామికి ఇంతటి దారుణమైన దుస్థితి దాపురించడంతో బీజేపీలో కలవరం మొదలైంది. కాస్త ఆలస్యమైనా.. ఖతర్నాక్ ఐడియా వచ్చింది. అర్నాబ్‌కు రాజ్యాంగబద్ద రక్షణ కల్పించేలా.. ఆయన్ను పెద్దల సభకు పంపించే ఆలోచన చేస్తోంది. అనుకోకుండా రాజ్యసభలో ఏర్పడిన ఓ ఖాళీని అర్నాబ్ గోస్వామితో బర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నామినేటెడ్ కోటాలో అర్నాబ్‌ను పార్లమెంట్‌కు పంపిస్తారని అంటున్నారు.
కొన్ని వారాల క్రితమే రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. స్వపన్ దాస్ గుప్తా రాజీనామాతో ఏర్పడిన ఖాళీని అర్నాబ్‌తో భర్తీ చేయాలనేది బీజేపీ ప్రయత్నం. మీడియా ప్రతినిధిగా.. రాష్ట్రపతి కోటాలో.. రాజ్యసభకు పంపించే దిశగా కమలనాథులు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే.. త్వరలోనే ఈ ఫైర్ బ్రాండ్ న్యూస్ రీడర్.. రాజ్యసభలో 'అధ్యక్షా' అనడం టీవీలో చూడొచ్చు. మరి, టీవీ ఛానెల్ చర్చ మాదిరే పెద్దల సభలోనూ పెద్ద పెద్ద కేకలు, అరుపులతో నానా రచ్చ చేస్తాడా? లేక, హుందాగా వ్యవహరిస్తాడా? అనేది ఆసక్తికరం.