రేషన్ తెచ్చివ్వను.. దిక్కున్నోడికి చెప్పుకో పో..
posted on Apr 5, 2021 @ 12:02PM
ఇంటింటికీ రేషన్. లబ్ధిదారుల చెంతకే వాహనాల ద్వారా రేషన్. జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం. ఇంటింటి రేషన్ కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసింది. భారీ ప్రచారంతో ఊదరగొట్టింది. అదంతా అనవసర ఖర్చు.. ఉపయోగం తక్కువంటూ ప్రతిపక్షం ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ చెప్పినట్టే జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ రేషన్ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. రేషన్ ఇంటికి తెచ్చి ఇచ్చేది లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఎందుకు తెచ్చివ్వరని లబ్దిదారులు అడిగితే.. అది అంతే. సీఎం నుంచి ఎమ్మార్వో వరకు ఎవరికైనా చెప్పుకో పో అంటూ వాహన నిర్వాహకుడు వార్నింగ్ ఇస్తున్నాడు. జగన్ హయాంలో బరితెగిస్తున్న పాలనకు ఈ ఘటన నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
కృష్ణా జిల్లాలోని నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో జరిగిందా ఘటన. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేషన్ ఇంటికి తెచ్చి ఇస్తా అన్నారు కదా అని అడిగితే... సీఎం నుంచి ఎమ్మార్వో వరకు ఎవరికైనా చెప్పుకో పో అంటూ వాహన నిర్వాహకుడు మండిపడ్డాడు.
ఆ వీడియోను టీడీపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘వందల కోట్ల ప్రజాధనం తగలేసి పాలకులు చేసిన బుర్ర తక్కువ పనులకు ఫలితం చూసారా? తమకేదో ఒరగపెడతారనుకుంటే చివరికి "నీకు దిక్కున్నోడికి చెప్పుకో పో" అన్న మాటలతో ప్రజలు అవమానాలు పడాల్సివస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం, లింగాలపాడు గ్రామంలో ఇంటింటికీ డోర్ డెలివరీ పథకం తీరు ఇది’’ అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది టీడీపీ.