సైకిల్ గుర్తుకు ఓటేయమన్న వైసీపీ ఎమ్మెల్యే
posted on Apr 5, 2021 @ 11:41AM
సైకిల్ గుర్తుకే మీ ఓటు. మామూలుగానైతే ఇది సాధారణ డైలాగే. కానీ, ఇదే మాట ఓ వైసీపీ ఎమ్మెల్యే నోటి నుంచి వస్తే? అది ఇక ట్రోలింగ్ న్యూసే. అదే జరుగుతోంది ఇప్పుడు. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు.. తన ప్రత్యర్థి పార్టీ అయిన సైకిల్ గుర్తుకు ఓటేయమంటూ ప్రజలకు పిలుపిచ్చారు.
ఎమ్మెల్యే నినాదం విని అక్కడి వారంతా అవాక్కయ్యారు. ఇదేంటి? వైసీపీ ఎమ్మెల్యే.. సైకిల్ గుర్తుకు ఓటు వేయమంటున్నారేంటి? అని ఆశ్చర్యపోయారు. వారంతా షాక్‌కు గురయ్యారు. ఫక్కున నవ్వారు. మీటింగ్‌కు వచ్చిన వారంతా పగలబడి నవ్వుతుండటంతో.. ఏదో పొరబాటు జరిగుంటుందని సదరు ఎమ్మెల్యేకు అర్థమైంది. వాసుబాబు వెంటనే కవర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. సైకిల్ గుర్తుపై ఓటేయాలంటూ తాను జోక్ చేశానని చెప్పుకొచ్చారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఒక్కసారి నాలుక జారాక.. అది వీడియోలో రికార్డ్ అయ్యాక.. ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా? ట్రోల్స్‌తో చెడుగుడు ఆడుకోదూ? ఇప్పుడు అదే జరుగుతోంది. సైకిల్ గుర్తుకు ఓటేయమన్న వైసీపీ ఎమ్మెల్యే వాసుబాబు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.