మావోల చెర నుంచి కోబ్రా కమాండో రిలీజ్ 

ఈ నెల 3న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భీకర కాల్పుల అనంతరం బందీగా చేసుకున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్ రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల చేశారు. గత ఐదు రోజులుగా వారి చెరలో ఉన్న ఆయన్ని గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో టెర్రం అడవుల్లో వదిలిపెట్టారు. మావోయిస్టుల చెర నుంచి విడుదలైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ రాకేశ్వర్‌ సింగ్‌.. టెర్రం క్యాంపస్ కు చేరుకున్నారు.  కోబ్రా జవాన్ రాకేశ్వర్ మాన్హాస్ నక్సలైట్లను పట్టుకున్న 6 రోజుల తరువాత విడుదల చేశారు. పద్మశ్రీ ధర్మపాల్ సైని, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెలం బోరయ్య, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల మధ్యప్రదేశ్ జట్టు సభ్యుడు సహా వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో నక్సలైట్లు జవాన్లను విడుదల చేశారు. విడుదలైన తరువాత, మీడియా వ్యక్తుల బృందం జవాన్‌తో బసగుడకు తిరిగొచ్చింది. జవాన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించిన ఇద్దరు సభ్యుల బృందంతో పాటు బస్తర్‌కు చెందిన 7 మంది జర్నలిస్టుల బృందం కూడా ఉంది. నక్సలైట్ల పిలుపు మేరకు జవాన్లను విడుదల చేయడానికి చర్చల బృందంతో సహా మొత్తం 11 మంది సభ్యులు కఠినమైన బస్తర్ ప్రాంతానికి వెళ్లింది.  గత శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో 23 మంది సైనికులు అమరులయ్యారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్‌ను నక్సల్స్‌ బందీగా చేసుకున్నారు. చర్చలకు మధ్యవర్తులను ప్రకటించాలని.. అడవుల్లో ఏర్పాటు చేసిన భద్రతా బలగాల క్యాంపులను వెంటనే తొలగించాలని మావోయిస్టులు డిమాండ్‌   చేశారు. అప్పుడే రాకేశ్వర్‌ విడిచిపెడతామని షరతు విధించారు. జవాన్‌ తమ వద్ద క్షేమంగానే ఉన్నట్లు బుధవారం ఓ ఫొటోను కూడా విడుదల చేశారు. రాకేశ్వర్‌ను ఎలాగైనా సురక్షితంగా విడిపించుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన కూతురు సైతం నాన్నను విడిచిపెట్టాలని మీడియా ద్వారా నక్సల్స్‌ను కోరింది. ఈ పరిణామాల అనంతరం నేడు ఎట్టకేలకు రాకేశ్వర్‌ తిరిగొచ్చారు. ఆయన విడుదలపై భార్య మీనూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రైవేట్ టీచర్లకు కేసీఆర్ బాసట

కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడం తో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని  గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కి  నెలకు రెండు వేల రూపాయల ఆపత్కాల  ఆర్ధిక సాయం తో పాటు  కుటుంబానికి  25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారు.ఇందుకు సంబంధించి ప్రయివేటు  విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో  స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ  విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సిఎం ఆదేశించారు. ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను  మానవీయ దృక్ఫథంతో  ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కి లబ్ధిచేకూరుతుంది. కరోనా లాక్ డౌన్ తో గత ఏడాది మార్చి లో స్కూల్స్ , కాలేజీలు మూతపడగా.. అందులో పని చేసే అద్యాపకులు, సిబ్బంది రోడ్డున పడ్డారు. వాళ్లు పనిచేసే యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఆర్థిక ఇబ్బందులకు తాళలేక కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. తాజాగా కరోనా వ్యాప్తితో మరోసారి విద్యాసంస్థలు మూసివేయడంతో... వాళ్లకు మళ్లీ కష్టాలు వచ్చాయి.

సొంతూళ్లకు కూలీలు.. లాక్‌డౌన్ భయాలు..

కరోనా కమ్మేస్తోంది. రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, కర్ణాటక.. ఇలా అనేక చోట్ల రాత్రి కర్ఫ్యూ. పలుచోట్ల వీకెండ్ లాక్‌డౌన్. దీంతో, కూలీలకు కష్టాలు. ఉపాధికి ఇబ్బందులు. గతంలో మాదిరే దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని కూలీల్లో భయాందోళనలు మొదలయ్యాయి. నైట్ కర్ఫ్యూతో కొన్ని కంపెనీల్లో ఉత్పత్తి తగ్గిపోగా కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతూళ్లకు తిరిగి వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. అందుకే, ఢిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో వలస కూలీలు స్వగ్రామాలకు తరలిపోతున్నారు. వలస కూలీలతో రైళ్లు, లారీలు నిండుతున్నాయి.  మళ్లీ లాక్‌డౌన్ పెడతారనే భయం వారి కళ్లల్లో, మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత లాక్‌డౌన్ సమయంలో వాళ్లు పడిన కష్టాలు, రవాణా సదుపాయం లేక వందల కిలోమీటర్లు కాలి నడకన నడిచిన ఇబ్బందులు వారిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే, నైట్ కర్ఫ్యూ అనగానే తట్టాబుట్టా, పెట్టాబేడా సర్దేసుకుంటున్నారు. కనిపించిన వాహనం ఎక్కేసి.. అడిగిన కాడికి ఇచ్చేసి.. బతుకు జీవుడా అంటూ సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. వలస కూలీలతో కరోనా ముప్పు.. మహారాష్ట్రపై కరోనా పంజా విసిరింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. కొవిడ్ భయం అక్కడి వారిని వణికిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు తెలంగాణ ఊళ్లతో సంబంధాలు ఉండటంతో అక్కడి వారంతా ఇక్కడికి తరలివస్తున్నారు. ఇక, ఉపాధి కోసం ముంబై, పుణే, బీవండి, గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు సైతం తెలంగాణకు తిరిగి వస్తున్నారు. వస్తూ వస్తూ వారితో పాటు కరోనా వైరస్‌ను మోసుకొస్తున్నారు. ఎలాంటి పరీక్షలు లేకుండానే వాళ్లంతా సొంతూళ్లకు రావడంతో నిర్మల్, ఆదిలాబాద్ తరితర జిల్లాల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ విషయం హైకోర్టు సైతం గుర్తించింది. మహారాష్ఠ్ర నుంచి వచ్చే వారికి ఎలాంటి టెస్టులు చేస్తున్నారంటూ సర్కారును ప్రశ్నించింది. అటు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం మహారాష్ట్ర నుంచి వచ్చే వారి వల్ల కేసులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  సెకండ్ వేవ్, నైట్ కర్ఫ్యూ కారణంగా వలస కూలీలంతా సొంతూళ్లకు ప్రయాణమవుతూ వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం తరఫున సరైన విధానం లేకపోవడం.. కూలీల రాకపై పక్కా సమాచారం లేకపోవడం.. కొవిడ్ విజృంభణకు కారణం అవుతోంది. మళ్లీ లాక్‌డౌన్ పెడతారో లేదో తెలీదు కానీ.. లాక్‌డౌన్ భయాలు మాత్రం అటు కూలీలకు, ఇటు ప్రజలను వెంటాడుతూనే ఉంది. 

ఏపీలో లాక్ డౌన్? ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్ పై  కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ఏపీలో 2 వేల 5 వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. స్కూళ్లు, కాలేజీల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా భయపెడుతున్నా జనాల్లో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. మాస్కులు లేకుండానే రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భౌతిక దూరం అన్న మాటే మర్చిపోయారు. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ తో.. థియేటర్ల దగ్గర రద్దీ కనిపిస్తోంది. బార్లు, పబ్బుల్లో విచ్చల విడిగా జనం నిబందనలను గాలికి వదిలేస్తున్నారు.  కరోనా సెకెండ్ వేవ్ లో ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడం మరింత ఆందోళన కల్గిస్తోంది. కరోనా సోకిన వారికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో యదేచ్ఛగా రోడ్లపై తిరేగేస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తుండటంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే లాక్ డౌన్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఏపీలో కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అని.. అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నామన్నారు. కోవిడ్ హాస్పిటళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్స్ సంఖ్య పెంచమని ఇప్పటికే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. అయితే లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.   ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం‌, వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం చేయాలి అని కోరారు ఆళ్ల నాని.  ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా వ్యాక్సిన్ కొరత లేదన్నారు మంత్రి. ఏపీ వ్యాప్తంగా 3.80 లక్షల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్రానికి కొత్త ఇండెంట్ పంపించామని.. రెండు మూడు రోజుల్లో 2 లక్షల డోసులు, వారంలో మరో 15 లక్షల డోసుల కేంద్ర నుంచి రానున్నాయని స్పష్టం చేశారు మంత్రి ఆళ్ల నాని. 

జగన్ నే పూజిస్తారా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తితో పోల్చుతూ టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు  రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీక్షితుల వ్యాఖ్యలపై విపక్షాలతో పాటు హిందుత్వ సంఘాలు, స్వామిజీలు మండిపడుతున్నారు. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. టీటీడీ బోర్డు రాజకీయాలకు అడ్డాగా మారిందనిఆరోపించారు.  ముఖ్యమంత్రిని  విష్ణుమూర్తితో పోల్చడం జగన్‌కే ప్రమాదమన్నారు పరిపూర్ణానంద స్వామి. విష్ణు అనుగ్రహంతో రాజయోగం ఉంటుందని.. రాజునే విష్ణువుగా పోల్చకూడదని చెప్పారు. వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామికి చేసినట్లు జగన్‌కూ పూజలు చేస్తారా? అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణదీక్షితుల వ్యాఖ్యలను సీఎంతో పాటు వైసీపీ నేతలంతా ఖండించాలన్నారు. పింక్‌ డైమండ్‌ ఏమైందని..   వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎందుకు దానికి ప్రస్తావన రావడం లేదని ఆయన నిలదీశారు.   తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తున్న సీఎం జగన్ కు ఆయన మూడు ప్రశ్నలు సంధించారు పరిపూర్ణానంద స్వామి. టీటీడీని సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రెండేళ్లుగా తితిదే ఆస్తులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని.. ఆలయాల కూల్చివేతలపై స్పందించడం లేదెందుకని నిలదీశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని కోరారు పరిపూర్ణానంద స్వామి. 

ఆమెను అమ్మేశాడు.. 

ఇద్దరు మంచి ఈడు జోడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ళ వివాహ జీవితం. కలతలు లేని కాపురం .. వారి ప్రేమకు, పెళ్లి బంధానికి పండంటి పాప పుట్టింది. ఎంతో సంతోషంగా ఉన్న కాపురంలో కలతలు ప్రారంభమయ్యాయి. భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ, ద్వేషంగా మారింది. నిత్యం ఏవో చిన్న చిన్న గొడవలు. ఆ గొడవలు భరించలేని భార్య  పుట్టింటికి వెళ్ళింది.. భర్త వచ్చి తీస్కపోతాడని ఎదురు చూసింది.. అయినా భర్త రాలేదు. ఆ  దూరం ఆ భార్య భర్తల మధ్య మరింత దూరం పెంచింది.  ఓపెన్ చేస్తే.. ఇంతలో యువతికి గద్దరికి సర్వేశ్ అనే వ్యక్తి వచ్చాడు. తన భర్త పిలుస్తున్నాడని చెప్పడంతో తెలిసిన అన్ననే కదా అని నమ్మింది. అతనితో పాటు వెళ్ళింది. ఆమెను హైదరాబాద్ లోని ఒక రూమ్ లో రెండు రోజులు ఉంచాడు. ఆ తర్వాత అనుమానమొచ్చిన ఆమె సర్వేశ్ ని నిలదీసింది. దీంతో అసలు రంగు బయటపెట్టిన అతడు యువతిని చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు. ఆమె దగ్గర ఉన్న నగదు, బంగారాన్ని లాక్కుని వ్యభిచారిగా మార్చాడు. రోజూ సిగరెట్లతో కాలుస్తూ వ్యభిచారం చేయాలనీ బలవంత పెట్టాడు..లేకపోతే పాపను చంపేస్తానని బెదిరించాడు. పాపను సైతం వదలకుండా మద్యం మత్తులో ఆమె వీపుపై సిగరెట్లతో కాల్చి రాక్షసానందం పొందేవాడు. ఈ నరకయాతన భరించలేని యువతి అద్దె గది యజమాని సాయంతో అక్కడినుండి బయటపడి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. 

బోనాల్లో కరోనా.. 40మందికి వైరస్

అమ్మ వారికి భక్తితో బోనమ్. ఉగాదికి ముందు అనేక ప్రాంతాల్లో బోనాలు చేస్తున్నారు భక్తులు. అలానే ఆ కాలనీ వాసులు కూడా ఇటీవల బోనాలు చేశారు. చుట్టాలు, స్నేహితులను పిలిచి ఘనంగా వేడుక జరుపుకున్నారు. అంతా ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.  కట్ చేస్తే.. ఆ కాలనీలో ఒకరికి అస్వస్థత. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాడు. అనుమానంతో కొవిడ్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. ఇక అంతే, ఆ కాలనీ వాసులంతా హడలిపోయారు. విషయం అధికారులకు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆ కాలనీ మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించింది. 70మందికి టెస్టులు చేస్తే అందులో 40మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో.. టెస్టులు పెంచుతున్నారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.  ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల ఎస్సీ కాలనీలో జరిగింది. ఒక చిన్న కాలనీలో ఏకంగా 40మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల జరిగిన బోనాలకు హాజరైన వారందరికీ కరోనా టెస్టులు చేయిస్తోంది. అందరినీ హౌజ్ క్వారంటైన్ చేసింది. మల్యాల ఎస్సీ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు.    ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయినా, జనాలు కొవిడ్‌ను పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. బోనాలు, సినిమాలు, షాపింగ్ అంటూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. సామూహిక వేడుకల్లో పాల్గొంటున్నారు. జగిత్యాల జిల్లాలో అదే జరిగింది. మల్యాల ఎస్సీ కాలనీలో బోనాల పేరుతో ప్రజలు పండగ జరపడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జనాలు.. ఇప్పటికైనా జర జాగ్రత్త.

క్షేమంగా తిరిగొచ్చిన కోబ్రా కమాండో 

కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ క్షేమంగా తిరిగొచ్చారు. ఛత్తిస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో  విముక్తి కలిగింది. 5 రోజులుగా తమ దగ్గర బందీగా ఉన్న రాకేశ్వర్‌సింగ్‌ ను  మావోయిస్టులు విడిచిపెట్టారు. మావోయిస్టుల బందీ నుంచి బయటపడిన కోబ్రా కమాండో బెటాలియన్ కు రానున్నారు.  ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో.. నక్సలైట్లు రాకేశ్వర్‌సింగ్‌‌ను బందీగా తీసుకెళ్లారు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. మధ్యవర్తుల పేర్లు చెప్పాలని కోరారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని మావోయిస్టులు చెప్పారు. బుధవారం తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు.  అయితే మావోయిస్టుల డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగానే ఉన్నాయి. మావోయిస్టులు తమ అధీనంలో కి తీసుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌‌ను  వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల దిశగా ముందడుగు వేయాలని కోరాయి. ఈ నేపథ్యంలో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.  

వామ్మో వాజే.. అంబానీ కేసులో సంచలనాలు

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన, మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న ముకేష్ అంబానీకి బెదిరింపుల కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజకీయ పెద్దలకు ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో  ఎన్ఐఏ విచారించే కొద్ది షాకింగ్ అంశాలు బయటకు వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సచిన్‌ వాజే  ఎన్‌ఐఏకు రాసిన నాలుగు పేజీల సంచలనం సృష్టించింది. లేఖలో అనిల్‌ దేశ్‌ముఖ్‌తో సహా, అనిల్‌ పరాబ్‌(శివసేన), అజిత్ పవార్‌ కీలక సహాయకుడి పేర్లను ప్రస్తావించాడు సచిన్ వాజే. తనకు పోస్టింగ్‌ ఇచ్చేందుకు రూ.2 కోట్లు కోరడంతో పాటు.. ఇతర వసూళ్లకు పురమాయించారన్నది ఈ లేఖ సారాంశం. ఇవన్నీ అప్పటి సీపీ పరంబీర్‌కు సింగ్‌కు కూడా తెలుసని వాజే చెప్పారు. వాజే లేఖ మహారాష్ట్ర సర్కార్ లో కలకలం రేపుతోంది.  సచిన్‌ వాజే నియామకం తొలి నుంచీ రాజకీయ రంగు పులుముకొంది. కరోనా సమయంలో పోలీసు బలగాలు అవసరం కావడంతో సస్పెన్షన్‌లో ఉన్నవారిని విధుల్లోకి తీసుకోవాలనే నిర్ణయం వాజేకు కలిసొచ్చింది. వాజేను తీసుకోవడంలో నాటి సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ పాత్ర చాలా ఉంది. ఘాట్కోపర్‌ పేలుళ్ల కేసులో అనుమానితుడు ఖ్వాజా యూనిస్‌ లాకప్‌ డెత్‌ కేసులో వాజే 2004లో సస్పెండ్‌ అయ్యాడు.  అతడిని మళ్లీ 2020లో విధుల్లోకి తీసుకోవడంపై ఖ్వాజా కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కానీ  పోలీసులు తమ నిర్ణయాన్ని సమర్థించుకొని వాజేకు పోస్టింగ్‌ కొనసాగించారు. లోకల్‌ ఆర్మ్స్‌ యూనిట్‌లో పోస్టింగ్‌తో తిరిగి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అడుగుపెట్టిన వాజేను కొన్ని రోజుల్లోనే కీలకమైన క్రిమినల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు మార్చేశారు.  సీపీ అండతో సచిన్ కు పోస్టింగ్  సచిన్ వాజే నియామకాన్ని అప్పటి క్రైమ్‌ విభాగానికి చెందిన జాయింట్‌ సీపీ మిలింద్‌ బరాంబే  వ్యతిరేకించినట్లు.. ముంబయి పోలీస్‌ కమిషన్‌ హేమంత్‌ నగ్రాలే సమర్పించిన నివేదికలో ఉన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో  కథనాలు వెలువడ్డాయి. సచిన్‌ వాజేను కేవలం నాటి సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ మౌఖిక ఆదేశాలతోనే క్రిమినల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు అధిపతిని చేసినట్లు తేలింది. వాస్తవానికి ఈ విభాగానికి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారి నాయకత్వం వహించాలి. కానీ, వాజే అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే.  ఈ అంశాలన్నీ ముంబయి పోలీస్‌ విభాగంలో డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి.   పరమ్ బీర్ అండదండలతో పోస్టులోకి వచ్చిన సచిన్‌ వాజే ఇష్టారాజ్యాంగా వ్యవహరించారని తెలుస్తోంది. తన పై అధికారులను ఎవరినీ పట్టించుకోకుండా  సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌కు మాత్రమే అతను రిపోర్టు చేసినట్లు తేలింది. క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు టాటాసుమో, ఇన్నోవా, స్కార్పియో వాహనాలు ఉన్నాయి. కానీ, సచిన్‌ వాజే మాత్రం ఆఫీస్‌కు మెర్సెడెస్‌ బెంజ్‌, ఆడీ వంటి విలాసవంతంమైన కార్లలో వచ్చేవాడు. తాజాగా అంబానీ ఇంటి వద్ద ఉంచిన స్కార్పియోను కూడా చివరి వరకు తన కార్యాలయంలోనే ఓ మూల ఉంచినట్లు తేలింది. ఆఫీస్‌కు చెందిన ఇన్నోవానే బాంబు అమర్చే సమయంలో కూడా వినియోగించాడంటే.. సచిన్ వాజే ఎంత ధైర్యంగా ఉన్నాడో ఊహించవచ్చు.  సచిన్ వాజే లగ్జరీ లైఫ్  సచిన్‌ వాజే వాడిన లగ్జరీ కార్లను చూసి ఎన్‌ఐఏ అధికారులే అవాక్కయ్యారు.  మూడు బెంజి స్పోర్ట్స్‌ కార్లు, ఒక వోల్వో, ఒక టయోటా ప్రాడో, ఒక మిత్సింబిషి ఔట్‌ ల్యాండర్‌, ఒక ఆడీ, ఒక స్కోడా కారును అధికారులు స్వాధీనం చేసుకొన్నాయి. ఇవి కాకుండా ఒక స్కార్పియో, ఇన్నోవా, మారుతీఎకో వాహనాలను కూడా సీజ్‌ చేశాయి. వాజేకు సహకరించిన ఓ మహిళ వద్ద నుంచి రూ.7లక్షలు విలువైన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకొన్నారు. దీనిని విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్నారు. అంతేకాదు వాజే బస చేయడానికి ఓ ఐదు నక్షత్రాల హోటల్లో  ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా ఓ వ్యాపార వేత్త రూ.12లక్షలు చెల్లించి 100 రోజులపాటు గదిని బుక్‌ చేశాడు. ఈ హోటల్‌కు వచ్చిన సమయంలో వాజే తెచ్చిన బ్యాగుల నిండా డబ్బులు ఉన్నట్లు హోటల్‌ ఎక్స్‌రే యంత్రాల్లో స్పష్టంగా కనిపించిందని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఒక అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌ హవా ఈ స్థాయిలో నడవడానికి రాజకీయ బంధాలే కారణమని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.     రాజకీయ నేతల్లో వణుకు వాజే వసూళ్ల కేసులో రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తుండటంతో నేతలంతా సైలెంట్ అయిపోయారు. మొదట ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా సచిన్‌ వాజేను సమర్థించినా.. బాంబు బెదిరింపుల కేసులో వాజే పాత్ర బయటపడ్డాక దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛను ఇచ్చారు.  ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఈ కేసులో కీలక విషయాలను బయటపెట్టి సర్కారుపై ఆరోపణలు చేయడం ఇరుకున పెట్టింది. ఇక తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముంబయి కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ను హోంగార్డ్స్‌ విభాగానికి బదిలీ చేయడంతో మరో కొత్త వివాదానికి బీజం పడింది. ఆ తర్వాత పరమ్‌బీర్‌ సింగ్‌ రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్వయంగా వాజేను పిలిచి రూ.100 కోట్లు వసూలు చేయమన్నారంటూ అవినీతి ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. ఈ లేఖలో పరమ్‌బీర్‌ సింగ్‌ ప్రస్తావించిన తేదీల్లో అనిల్‌ దేశ్‌ముఖ్‌ కరోనాతో బాధపడుతున్నారని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ స్వయంగా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత అనిల్‌ దేశ్‌ముఖ్‌ పర్యటన వివరాలు, విలేకర్లతో మాట్లాడిన అంశాలు బయటకు రావడంతో  పవార్ కూడా మౌనం పాటించారు.  

టికెట్ రేట్స్ డబుల్..?

నిత్యం ఉరుకులు పరుగుల జీవితం. వారం అంత జాబ్ చేసి. బిజినెస్ వ్యవహారాలు. ఇతర పనులతో టైడ్ అవుతామని. వీకెండ్ కదా.. థియేటర్ కి వెళ్లి కాస్త రిలాక్స్ అవుదామనుకుంటున్నారా.. అయితే ఒక్కసారి ఆలోచించండి..? ఎందుకంటే ఇక పై ప్రేక్షకుల జేబుకు చిల్లు పడనుంది. సినిమా టికెట్ రేట్లు పెరుగనున్నాయి. టికెట్ రేట్లు డబుల్ కానున్నాయి..ఇప్పటికే మధ్య తరగతి ప్రేక్షకులకు ముల్టీప్లెక్సర్ దూరమైయింది. ఇక పై ఈ దెబ్బతో మాస్ థియేటర్లు కూడా సామాన్య ప్రజలకు దూరం కానున్నాయా..?  లాక్‌డౌన్‌ వల్ల చాలా నష్టపోయాం... పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు. తొలి రెండు వారాల్లోనే మొత్తం పెట్టుబడిని రాబట్టుకోవాలి... ఇది జరగాలంటే టికెట్‌ ధరను రూ.300కు పెంచాలి’’ అన్నది నిర్మాతలు, పంపిణీదారుల ప్రతిపాదన. కాగా ఎగ్జిబిటర్ల వాదన భిన్నంగా ఉంది. ‘‘టికెట్‌ ధర రూ.300 పెంచడం సరికాదు. ఇది ప్రేక్షకులకు భారమవుతుంది. ప్రస్తుతం ఉన్న ధరను రూ.200-250 పెంచితే సరిపోతుంది. నిర్మాతలు టికెట్‌ ధర ఎంత పెంచినా కొత్త ధరల ప్రకారమే మా వాటాను నిర్ణయించాలి’’ అంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వమే ప్రత్యేకం గా ఉత్తర్వులు జారీ చేస్తోంది. బాహుబలి చిత్రం విడుదలైనపుడు మొదలైన ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల, వచ్చే నెలలో ప్రముఖ హీరోల చిత్రా లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  రాష్ట్రంలో మొత్తం 1200 థియేటర్లు ఉన్నాయి. వీటి లో సుమారుగా 150 వరకూ మల్టీప్లెక్స్‌ స్ర్కీన్లు ఉన్నా యి. మల్టీప్లెక్స్‌లో రూ.200, రూ.150 టికెట్‌ ధరలు ఉన్నాయి. సింగిల్‌ థియేటర్లలో రూ.150, రూ.125 వరకూ ఉన్నాయి. కొన్ని మల్టీప్లెక్స్‌లో టికెట్‌ ధరలు రూ.184, రూ.112గా ఉన్నాయి. కొత్త సినిమాలు విడుదల కానుండటంతో టికెట్‌ ధరలను రూ.300 చేయాల ని పంపిణీదారులు, నిర్మాతలు భావిస్తున్నారు.  రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా బడా నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయి. ఇక, సింగిల్‌ థియేటర్లు ఎగ్జిబిటర్ల చేతుల్లో ఉన్నా, సినిమాను బట్టి పంపిణీదారులు వారి కి వాటా ఇస్తున్నారు. ఒకరోజు ఆదాయంలో 65 శాతం వాటాను పంపిణీదారులు తీసుకుంటుంగా, మిగిలిన 35 శాతాన్ని ఎగ్జిబిటర్లకు ఇస్తున్నారు. ఎగ్జిబిటర్లకు ఇ చ్చే వాటాను కొత్తగా నిర్ణయించే ధరల ప్రకారం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విష యం నిర్మాతలు, పంపిణీదారులకు చేరింది. దీనిపై చర్చించేందుకు హైదరాబాద్‌కు రావాలని ఎగ్జిబిటర్లకు నిర్మాతలు కబురు పంపారు. ఏపీకి విజయవాడలోనే ఫిలిం చాంబర్‌ ఉన్నందున ఇక్కడే మాట్లాడుకుందామని వారికి ఎగ్జిబిటర్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఎగ్జిబిటర్లు విజయవాడలో ఉన్న తెలుగు ఫిలించాంబర్‌లో గురువారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కాగా, కరోనా ప్రభావంతో ఓటీటీకి డిమాండ్‌ పెరిగింది. కొత్త చిత్రాలు ఓటీటీ వేదికపై అందుబాటులో ఉన్నా యి. దీంతో థియేటర్లలో విడుదలయ్యే కొత్త చిత్రాలను నాలుగు, ఐదు వారాల వరకూ ఓటీటీలో విడుదల చేయకూడదని ఎగ్జిబిటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.  లాక్ డౌన్ వల్ల  ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఉపాధి లేదు. ఉద్యోగాలు కూడా పోయాయి. ఆర్థికంగా మరింత క్రుంగి పోయారు. ఎప్పుడో సినిమా కు వెళ్లి రిలాక్స్  అవుదాం అనుకునే సామాన్య ప్రేక్షలులపై ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి. ఇలాంటి  పరిస్థితిలో టికెట్ ధరలు పెంచితే ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి వస్తారా? అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దల ముందు ఉన్న ప్రశ్న అని చెప్పాలి.  కరోనా పరిస్థితిలో వల్ల ఇప్పటికే అనుకున్న స్థాయిలో  ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు.. ఎప్పుడు టికెట్ రేట్స్ పెంచితే వస్తారా అనేది మరో  ప్రశ్న అని చెప్పాలి. ఇప్పటికే ఓటీటీకి మంచి ఇలాంటి గిరాకీ ఉంది. రాబోయే రోజుల్లో అంత ఓటీటీకి మయం అయిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో థియేటర్స్  లో మిస్ అయినా సినిమా 3 వీక్స్ లో ప్రైమ్ లోనో , నెట్ఫ్లిక్ లోనో కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చూడొచ్చని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.. 

మగాడికి వితంతు పెన్షన్..

దేశంలో ప్రస్తుతం పాలనంతా సంక్షేమ పథకాల చుట్టే సాగుతోంది. కేంద్ర సర్కార్ కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సొంతంగా మరికొన్ని రూపొందించాయి. వృద్దాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు ఇస్తున్నాయి. అయితే అందించే సాయం మాత్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం భారీగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. తెలంగాణ సర్కార్ ఆసరా పేరుతో పెన్షన్లు ఇస్తుండగా.. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద అర్హులైన వారికి నెలనెలా పలు సామాజిక పెన్షన్లను అందజేస్తోంది. ఇందులో వితంతు పెన్షన్ల కూడా ఉన్నాయి. భర్త చనిపోయి ఒంటరైన మహిళలకు ఈ ప్రభుత్వం ఈ పెన్షన్ అందిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. అర్హులకు ఇవ్వకుండా.. తమకు కావాల్సిన వారికి అర్ఙత లేకపోయినా అధికార పార్టీ నేతలు పెన్షన్ ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన మాత్రం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.  ఓ గ్రామంలో పురుషుడికి వితంతు పింఛన్ వస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన వాలంటీర్లు కూడా దీనిని గుర్తించలేదు. కర్నూలు జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట గ్రామానికి చెందిన ఖాశీం అనే వ్యక్తికి వితంతు పెన్షన్ వస్తోంది, అతడి పెన్షన్ ఐడీ 113529781. ప్రతి నెలనెల అతను పెన్షన్ తీసుకుంటున్నాడు. అధికారులు గుర్తించడంతో ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. అసలు పురుషుడికి వితంతు పెన్షన్ ఎలా మంజూరైందనేది ఎవరికీ అర్ధంకావడం లేదు. కాశీ కొంతకాలం క్రితం తన స్వగ్రామం నుంచి గుంటూరు జిల్లాకు వలసవెళ్లారు. వినుకొండ మండలం చిట్టాపురంలో ఉంటున్నారు. ఈ క్రమంలో చిట్టాపురం గ్రామ సచివాలయంలోని వెల్ ఫేర్ అసిస్టెంట్ వద్దకు పెన్షన్ తీసుకునేందుకు ఈనెల 4న వెళ్లారు. ఐతే పెన్షన్ కార్డు చూసి వితంతు పెన్షన్ ఎలా వస్తుందని ప్రశ్నించడంతో కాశీం సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు కాశీ స్వగ్రామమైన డోన్ మండలం ఎద్దుపెంట మండల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి అదికారులు పొరబాటును గుర్తించి విచారణ చేపడతామని తెలిపారు.పెన్షన్ మంజూరు చేసిందెవరు అనేది చర్చనీయాంశమైంది. ఇలాంటి పెన్షన్ ఇదొక్కటేనా.. ఇంకా ఎమైనా ఉన్నాయా..? అనేది అధికారులు విచారణ చేపట్టారు. ఒక పురుషుడికి వితంతు పెన్షన్ మంజూరవడమే విడ్డూరంగా ఉంది. ఇది ఎవరైనా కావాలని చేశారా...? లేక పొరబాటున మంజూరు చేశారా అనేది సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 

మహిళలపై వైసీపీ నేతల దాడి.. 

ముందు బెదిరిస్తారు.. ఆ తరవాత ఝలక్ ఇస్తారు.. మాట వినకుంటే దాడులు చేస్తారు.. అవసరం అనుకుంటే అంతం చేస్తారు. ఆ జిల్లా పచ్చని  పొలాలకు పెట్టింది పేరు.. అలాంటి జిల్లాలో కూడా రక్తం చిందిస్తున్నారు.. దాడులు చేస్తున్నారు.. మహిళలు అని చూడకుండా కొట్లాటకు తెగబడుతున్నారు. వైసీపీ నాయకులు.  అది పచ్చని పైరు చీరగా కట్టుకున్నజిల్లా. ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామం. అతని పేరు వేంకటేశ్వరావు కుటుంబం సాపాటు కోసం ఆటో నడుపుతున్నాడు. ఏపీలో ఎన్నికలు వచ్చాయి. కొంత మంది పండుగ చేసుకుంటున్నారు. అతను మాత్రం బతుకుదెరువు కోసం తన ఆటోను ఎన్నికల ప్రచారంలో పెట్టాడు..  కట్  చేస్తే.. కాకర్లమూడి లో మహంకాళమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఊరి జనం అంత ఉత్సవాల్లో మునిగిపోయారు. వెంకటేశ్వరావు కుటుంబం కూడా మహంకాళమ్మ ఉత్సవాల్లో పాల్గొంది. అంతలో ఎక్కడి నుండి వచ్చారో తెలియదు.. 15 మంది  పెను ఉప్పెనలా విరుచుకుపడి వెంకటేశ్వరావు కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు. ఏంటి ఎక్కడో సినిమాలో సీన్ లా ఉందనుకుంటున్నారా.. కానేకాదు. మరి వాళ్ళు ఎవరు. అసలు వెంకటేశ్వరావు కుటుంబం పై ఎందుకు దాడి చేశారు. తనకి ఆ దుండగులకు పాత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా.. అని అనుకుంటున్నారా.. మీరే చూడండి.     పంచాయతీ ఎన్నికలే ఈ దాడికి కారణం. అతను తెదేపా మద్దతుదారుల ప్రచారం కోసం ఆటో పెట్టారు. వైసీపీ కి సపోర్ట్ చేయకుండా.. టీడీపీకి చేస్తావా అని పగ పెట్టుకుని మంగళవారం రాత్రి గ్రామంలో మహంకాళమ్మ ఉత్సవాలు జరుగుతుండగా సుమారు 15 మంది కలిసి వెంకటేశ్వరరావు కుటుంబంపై కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో వెంకటేశ్వరరావు, అతని కుమార్తె మార్తారత్నంతోపాటు ఆపడానికి ప్రయత్నించిన వారి బంధువులు మద్దాల పండు, దారం మరియమ్మ, మద్దాల మహంకాళి, దారం కాంతారత్నంలపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితులు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై చేబ్రోలు ఎస్సై వీర్రాజు మాట్లాడుతూ అది మద్యం మత్తులో జరిగిన గొడవని, దీనికి రాజకీయ కక్షలు కారణం కాదన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.    

కరోనా కేంద్రాలుగా వైన్ షాపులు!

మద్యం షాపులు కరోనా కేంద్రాలుగా మారుతున్నాయంటూ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైన్స్, పబ్స్, రెస్టారెంట్స్, థియేటర్స్‌లో రద్దీపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే వాటి లైసెన్స్‌లు రద్దు చేసి, వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేయాలని సూచించింది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, పెళ్లిళ్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని న్యాయస్థానం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 70 శాతం పెంచాలని సూచించింది. మద్యం దుకాణాలు కరోనా వనరులుగా మారాయని ఈ సందర్భంగా హైకోర్టు  వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి వ్యాక్సిన్ అందజేయాలని.. నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.  కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలపై సుమారు 22వేల కేసులు నమోదు చేసినట్టు డీజీపీ నివేదికలో వెల్లడించారు. సామాజిక దూరం పాటించని వారిపై 2,416 కేసులు, రోడ్లపై ఉమ్మి వేసిన వారిపై 6 కేసులు నమోదు చేశామని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16లక్షల మందికే  జరిమానానా? అని హైకోర్టు ప్రశ్నించింది. పాతబస్తీ ప్రాంతంలో రెండు రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లాక్‌డౌన్‌ లేకపోయినా.. కంటైన్‌మెంట్‌ జోన్లు కచ్చితంగా ఉండాలని సూచించింది హైకోర్టు. 

లంకె బిందెల్లో 5 కిలోల బంగారం.. 

యేరు సెనగ కొరకు మట్టిని తొవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే.. సాంగ్ చాలా ఫేమస్. అందరు ఏ వంద సార్లో వినే ఉంటారు. నిజంగానే మట్టిని తవ్వితే లంకె బిందెలు దొరికాయి.. ఒకటి కాదు రెండు కాదు ఆ లంకె  బిందెలో 5 కిలోల బంగారం బయట పడింది. ఆ పేరు వింటే ఎవరికైన జోష్ వస్తుంది. లైఫ్ లో ఒక లంకె బిందె అయినా దొరికితే చాలు అనుకుంటారు చాలా మంది. లంకె బిందెలు అనే మాట పురాతన కాలం నుండి వింటున్నాం.  కానీ అవి ఎప్పుడో కనుమరిగిపోయాయి.  అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట బయట పడుతుంటాయి. తాజాగా తెలంగాణాలో లంకెబిందెలు బయటపడ్డాయి.   అది జనగామ జిల్లా పెంబర్తి. చుట్టూ దేవాలయాలు. పురాతన కట్టడాలు. పెంబర్తి పేరు వింటే అస్త కళలకు పెట్టింది పేరు. నర్సింహా అనే రైతు తన భూమిని చదును చేస్తుండగా లంకె బిందెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో సుమారు 5 కిలోల బంగారం ఉండటంతో రైతు  అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని అధికారులకు సమాచారమందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు లంకెబిందెలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

బేగంబజార్‌లో 100మందికి కరోనా

కరోనా. కరోనా. కరోనా. ఎటు చూసినా కొవిడ్ కేసులే. సెకండ్ వేవ్ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సైతం నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులతో హడలెత్తిస్తున్నాయి.  జనాలు జాగ్రత్తలు పాటించకపోవడమే కొవిడ్ విజృంభణకు కారణం. రద్దీ ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్‌కు పేరు గాంచిన హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో కరోనా కోరలు చాస్తోంది. బేగం బజార్ మార్కెట్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మార్కెట్లో ఏకంగా 100మందికి పైగా వ్యాపారులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.  దీంతో, మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మార్కెట్ ను తెరవాలని నిర్ణయించింది. సాయంత్రం 5 తర్వాత అన్ని షాపులను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా ప్రభావం తగ్గేంత వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఒకే మార్కెట్లో ఏకంగా వంద మందికి కొవిడ్ సోకడం మామూలు విషయమేమీ కాదు. నిత్యం ఎంతో బిజీగా ఉండే బేగం బజార్ పై కరోనా పంజా విసరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. బేగం బజార్ మార్కెట్‌లో ప్రతిరోజూ పెద్ద ఎత్తున కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. వివిధ జిల్లాలకు చెందిన చిన్న వ్యాపారులు.. బేగం బజార్ హోల్‌సేల్ మార్కెట్లో సరుకులు కొని తమ షాపుల్లో అమ్ముతుంటారు. అంటే, ఆ సరుకులు, ఆ వ్యాపారులతో పాటు కరోనా వైరస్ కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్ట్ అయి ఉంటుందనే భయం వారిని వేధిస్తోంది. బేగంబజార్ మార్కెట్‌లోనే 100మందికి కరోనా సోకిందంటే.. వారి నుంచి ఇంకెంత మందికి వైరస్ వ్యాపించిందోనని భయపడిపోతున్నారు వ్యాపారులు. అందుకే, సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా కొంత కాలం పాటు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. నిర్లక్ష్యం ప్రాణానికే ప్రమాదం. 

శ్రీ‌వారి సేవలో చంద్ర‌బాబు.. దీక్షితులపై డైలాగ్స్ 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు. దర్శనం అనంతరం చంద్రబాబుకు అర్చ‌కులు తీర్థ‌ప్ర‌సాదాలు అందించి ఆశీర్వ‌దించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు చంద్రబాబు. ప్రచారం ప్రారంభించడానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి  చేరుకున్న చంద్రబాబు...  ప‌లువురు స్థానిక టీడీపీ నేత‌ల‌తో క‌లిసి తిరుమలకు వెళ్లారు.   శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపారు చంద్రబాబు.  2003లో త‌న‌పై  దాడి జ‌రిగినప్పుడు వెంక‌టేశ్వ‌ర స్వామే కాపాడార‌ని అన్నారు. ధ‌ర్మాన్ని కాపాడితే అది మ‌న‌ల్ని కాపాడుతుంద‌ని చెప్పారు. మ‌నుషుల‌ను దేవుళ్ల‌తో పోల్చ‌డం స‌రికాద‌ని చెప్పారు చంద్రబాబు. మ‌నిషి ఎప్పుడూ దేవుడు కాలేడ‌ని, మ‌నిషి మ‌నిషేన‌ని, దేవుడు దేవుడేన‌ని వ్యాఖ్యానించారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని తెలిపారు. కోట్ల మంది మ‌నోభావాల‌కు సంబంధించిన అంశాల‌పై బాధ్య‌త‌గా ఉండాల‌ని చెప్పారు.   ఇటీవలే టీటీడీ ప్రధాన అర్చకుడిగా తిరిగి నియమితులయ్యారు రమణ దీక్షితులు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్‌ను క‌లిసిన‌ టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు జ‌గ‌న్‌ను విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించారు. దీనికి కౌంటర్ గానే చంద్రబాబు అలా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.  

ఎన్‌కౌంటర్‌లో అసలేం జరిగింది?

చిన్న పొరబాటు. చిన్న నిర్లక్ష్యం. పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు తీసింది. ఉన్నతాధికారులు చెప్పినా వినలేదు. అక్కడి నుంచి తిరిగొచ్చేయండంటూ ఆదేశాలు ఇచ్చినా పాటించలేదు. ఫలితం 23మంది జవాన్ల మరణమృదంగం. నక్సల్స్ ఆపరేషన్స్‌పై సరైన అవగాహన లేకపోవడమే ఆ జవాన్లు ప్రాణాలు పోవడానికి కారణం. కూంబింగ్‌లో బేసిక్ రూల్స్ పాటించకపోవడం వారి ప్రాణాలు తీసింది. సీఆర్పీఎఫ్ బలగాల ఓవర్ కాన్ఫిడెన్స్‌ వల్లే దండకారణ్యంలో మావోయిస్టులది అప్పర్ హ్యాండ్ అయింది.    ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై విశ్లేషణ చేస్తున్న పోలీస్ ఎక్స్‌పర్ట్స్‌ కీలక సమాచారం సేకరించారు. కూంబింగ్‌లో ఎక్కడ తప్పిదం జరిగింది? అంత పెద్ద ఎత్తున జవాన్లు చనిపోవడానికి కారణమేంటి? అనే దిశగా ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. 5 మృతదేహాలతో 6 గంటలపాటు జవాన్లు ఒకేచోటు వేచి ఉండటమే ఇంతటి ప్రాణనష్టానికి కారణమని తెలుస్తోంది.    అవును, 5 మృతదేహాలు.. 6 గంటలు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఎపిసోడ్ ఒకేసారి జరిగింది కాదు. రెండు విడతలుగా.. రెండుసార్లు ఫైరింగ్ చోటు చేసుకుంది. మావోయిస్టులు బీజాపుర్‌ జిల్లా పువర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్నారని పోలీస్‌ బలగాలకు ఇన్ఫర్మేషన్ అందింది. పువర్తి పేరు వినగానే పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అలర్ట్ అయ్యారు. ఎందుకంటే.. పువర్తి గ్రామం మావోయిస్టు దళ కమాండర్‌ మడావి హిడ్మా స్వగ్రామం. హిడ్మా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. అతడ్ని ఎలాగైనా పట్టుకోవాలని ఎప్పటి నుంచో గట్టిగా ప్రయత్నిస్తున్నాయి భద్రతా బలగాలు. అందుకే, పువర్తి పేరు వినగానే పోలోమంటూ కూంబింగ్‌కు బయలు దేరాయి భద్రతా బలగాలు. ఈ నెల 3న ఉదయం సీఆర్పీఎఫ్‌, కోబ్రా, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జవాన్లు ఆపరేషన్‌ హంట్ మొదలుపెట్టాయి.  పువర్తి పరిసర ప్రాంతాలైన టేకులగూడెం, జొన్నగూడెం, జీరగూడెం, ఉసంపురా.. తదితర ప్రాంతాల్లో కూంబింగ్‌ చేపట్టాయి. మావోయిస్టులు స్నానాల కోసం తరచూ టేకులగూడెం శివార్లలోని ఓ బావి వద్దకు వస్తున్నారనే సమాచారంతో ఓ బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో సమీపంలోని గుట్టపై కూంబింగ్‌ చేపట్టింది. అక్కడ మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు చనిపోయారు. కాసేపటికి, కాల్పులు ఆగిపోవడంతో డెడ్‌బాడీస్‌ను మిగతా జవాన్లు టేకులగూడెం తీసుకొచ్చారు.  అప్పటికే 5 గంటలు గడిచిపోయాయి. ఆ ఎన్‌కౌంటర్ విషయం తెలిసి పరిసర ప్రాంతాల నుంచి మావోయిస్టు దళాలు పెద్ద ఎత్తున అటు వైపు వస్తున్నాయంటూ బీజాపూర్‌ ఎస్పీ కార్యాలయంకు ఇన్ఫార్మర్ల నుంచి సమాచారం వచ్చింది. దీంతో.. జవాన్లను అప్రమత్తం చేశారు. వెంటనే అక్కడి నుంచి వచ్చేయమంటూ ఆదేశించారు. ఉన్నతాధికారుల హెచ్చరికలను సీఆర్పీఎఫ్ బలగాలు పట్టించుకోలేదు. బెటాలియన్‌లోని నాగాలాండ్‌కు చెందిన జవాన్లు మృతదేహాలు తరలించకుండా వెనక్కి వచ్చేది లేదని పట్టుబట్టారు. హెలికాప్టర్‌లో మృతదేహాలను తరలిద్దామనే ఉద్దేశంతో మరో గంట పాటు అక్కడే ఉండిపోయారు. మొత్తంగా దాదాపు 6 గంటల పాటు వాళ్లు ఒకే ప్రదేశంలో ఉన్నారు. ఆలోగా చుట్ట పక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్న మావోయిస్టు దళాలన్నీ ఏకమై.. జవాన్లను చుట్టుముట్టి.. పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. భీకర ఎన్‌కౌంటర్‌లో 23మంది జవాన్లు నేలకొరిగారు. నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఒక కోబ్రా కమెండోను బందీగా పట్టుకెళ్లారు.  ఇంతటి భారీ ఎన్‌కౌంటర్‌కు స్కెచ్ వేసింది మావోయిస్టు దళ కమాండర్ మడావి హిడ్మా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, తనకు బాగా పట్టున్న తన స్వగ్రామం చుట్టూ పక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ.. భద్రతా బలగాలకు వల విసిరాడని.. ఆ ట్రాప్‌లో చిక్కుకుని జవాన్లు అమరులయ్యారని అంటున్నారు. అయితే.. దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ప్రత్యక్షంగా ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొనలేదని నిఘా వర్గాలు అంటున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన దళానికి డైరెక్షన్ మాత్రమే చేశాడని.. షూట్అవుట్‌ స్పాట్‌లో అతను లేడని భావిస్తున్నారు.  కూంబింగ్‌కు వెళ్లిన బలగాలు ఒకేచోట ఎక్కువ సమయం ఉండకూడదనేది ప్రాథమిక నిబంధన. సీఆర్పీఎఫ్ బలగాలు ఈ రూల్‌ను బ్రేక్ చేయడమే ఇంతటి ప్రాణనష్టానికి కారణం. తమ సహచరుల మ‌ృతదేహాలను తరలించడంలో ఆలస్యం జరగడం.. వెనక్కి వచ్చేయమంటూ ఉన్నతాధికారులు చేసిన హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే ఇంతమంది జవాన్లు చనిపోయారని చెబుతున్నారు. అందుకే, కూంబింగ్‌లో చిన్నపాటి నిర్లక్ష్యానికి పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.

కేసీఆర్ కేబినెట్ లోకి సండ్ర! టీడీఎల్పీ విలీనంతో క్లియర్ 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు త్వరలో ప్రమోషన్ దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన చోటు ఖాయమైందని చెబుతున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే యోచనలో ఉన్న గులాబీ బాస్.. సండ్రకు సంకేతమిచ్చారనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి సత్తుపల్లిలో విజయం సాధించారు సండ్ర. రాష్ట్రమంతా కేసీఆర్ హవా వీచినా... సత్తుపల్లిలో సండ్ర ఘన విజయం సాధించారు. తనతో పాటు అశ్వారావుపేటలో మచ్చా నాగేశ్వవరావును గెలిపించుకున్నారు.  కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండోసారి అధికారం చేపట్టాకా టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే సండ్ర ఒక్కరే టీఆర్‌ఎస్‌లో చేరారు.ఆయన కూడా అధికారికంగా గులాబీ కండువా కప్పుకోకుండా... మద్దతు ఇస్తూ వచ్చారు. మరో ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు టీడీపీలోనే ఉండటంతో.. టీడీపీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడానికి సాంకేతికంగా ఇబ్బంది వచ్చింది. దీంతో  ఇంతకాలం టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూనే.. పార్టీపరంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారుడిగా ఉన్నారు సండ్ర వెంకట వీరయ్య. మచ్చాను టీఆర్ఎస్ లోకి తీసుకురావడానికి సండ్ర ప్రయత్నించినా... ఆయన అంగీకరించకపోవడంతో టీడీఎల్పీ విలీనం జరగలేదు.  ఇటీవల అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో సీనియర్‌ నేత మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సండ్ర పలుసార్లు మంతనాలు జరిపారని తెలుస్తోంది. సండ్ర మొదటి నుంచి తుమ్మల అనుచరుడిగానే ఉన్నారు. గతంలో సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు తుమ్మల. ఆ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో సండ్రను నిలబెట్టి గెలిపించుకున్నారు. తుమ్మల టీఆర్ఎస్ లో ఉన్నా సండ్ర ఆయనతో సంబంధాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో సండ్ర, తుమ్మల కలిసే.. మచ్చాతో మంతనాలు సాగించి కారెక్కించారని చెబుతున్నారు. సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శాసనసభ స్పీకర్‌కు లేఖ ఇవ్వడంతో టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ  విలీనం అధికారికంగా జరిగిపోయింది.  తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు సండ్ర వెంకట వీరయ్య. సత్తుపల్లి నుంచి ఆయన మూడోసారి గెలిచారు. సీఎం కేసీఆర్ తో సండ్రకు మంచి సంబంధాలున్నాయి. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ దాదాపుగా స్వీప్ చేసింది. దీంతో ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటానని గతంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా గెలుపులో సండ్ర కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో పల్లాకు ఎక్కువ ఓట్లు వచ్చేలా కష్టపడ్డారని అంటున్నారు. ఈ అంశాలన్ని బేరీజు వేసుకున్న కేసీఆర్.. సండ్రకు ప్రమోషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.  కేసీఆర్ పురమాయించడం వల్లే.. మచ్చాతో మాట్లాడి ఆయన టీఆర్ఎస్ లో చేరేలా సండ్ర పావులు కదిపారని అంటున్నారు. ఇప్పుడు సాంకేతిక సమస్యలు కూడా లేకపోవడంతో సండ్రను కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే కేబినెట్ మార్పుల్లో ఆయనకు  బెర్త్ ఖాయమంటున్నారు. సండ్రకు మద్దతుగా తుమ్మల కూడా కేసీఆర్ తో చర్చించారని చెబుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో ఖాళీలు లేవు. దళిత కోటాలో  ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు. ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్న కేసీఆర్... అతన్ని తప్పించి సండ్ర వెంకట వీరయ్యను తీసుకోవాలని నిర్ణయించారని చెబుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సండ్రను కేబినెట్ లోకి తీసుకోవడం వల్ల.. తెలంగాణలో మెజార్టీగా ఉన్న ఆ వర్గ ప్రజల మద్దతు పొందవచ్చని కేసీఆర్ ప్లాన్ అని తెలుస్తోంది.     

బ్యాలెట్ లో విపక్షాల గుర్తులు మాయం.. పరిషత్ ఎన్నికల్లో గందరగోళం

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లో  అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల కార్యకర్తల మధ్య  గొడవలు జరుగుతున్నాయి. బ్యాలెట్ పేపర్లలో తప్పులు రావడంతో కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సాకుర్రుగున్నెపల్లె ఎంపీటీసీ ఎన్నికలో బ్యాలెట్ పేపర్ లో జన సేన సింబల్ మిస్సైంది. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో పోలింగ్ కేంద్రంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  బ్యాలెట్ పేపర్ పై జనసేన  గుర్తు మిస్ అవడంపై పోలింగ్ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. పొరబాటున ఇలా జరిగి ఉంటుందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు.  జనసేన మాత్రం అధికార పార్టీ కుట్రతోనే జనసేన గుర్తు లేకుండా చేసిందని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని  డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు పోలింగ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. బ్యాలెట్ పేపర్ పై విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థి ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు పోలింగ్ ను  వాయిదా వేశారు.ఇక ముమ్మిడి వరం మండలంలో బ్యాలెట్ పేపర్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. సత్తెనపల్లి మండలం గోనెపూడిలో టీడీపీ ఏజెంట్లు, ఓటర్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కూడా వైసీపీకే సహకరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం, మాముడూరులో వైసీపీ ఏజెంట్లపై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం తెలపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షన జరిగింది. రౌడీ షీటర్లను పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారంటూ మహిళా అభ్యర్థి అభ్యంతరం చెప్పడంతో ఏజెంట్లు ఆమెపై దాడి చేశారు. దీంతో అధికారులు పోలింగ్ నిలిపేశారు.