కరోనాతో సీనియర్ జర్నలిస్ట్ మృతి
posted on Apr 20, 2021 @ 4:48PM
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో పరిస్థితి తీవ్రంగా మారింది. సీనియర్ జర్నలిస్ట్ అమర్ నాథ్ కరోనాతో చనిపోయారు. కరోనా సోకడంతో 10 రోజుల క్రితము నిమ్స్ ఆసుపత్రిలో చెరారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మధ్యాహ్నం అమర్ నాథ్ తుదిశ్వాస వదిలారు. అమర్ నాథ్ మృతితో జర్నలిస్టులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు కార్చారు.
తెలుగు జర్నలిజంలో అత్యంత సీనియర్ కోసూరిఅమర్ నాథ్. దశాబ్దాల పాటు ఆయన వివిధ సంస్థల్లో పని చేశారు. టీయూడబ్ల్యూజేలో కీలక నేతగా ఉన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా పని చేశారు. కోసూరి అమర్‌నాథ్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. జర్నలిస్టుగా సమాజం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. అమరనాథ్ మృతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకుపైగా జర్నలిజంలో అమర్ నాథ్ తనదైన ముద్ర వేశారన్నారు. జర్నలిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.