తిరుపతి పోలింగ్ రద్దు? హైకోర్టులో బీజేపీ అభ్యర్థి పిటిషన్
posted on Apr 20, 2021 @ 6:34PM
దొంగ ఓట్ల కలకలంతో వివాదంగా మారిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక రద్దు కానుందా? తిరుపతిలో మళ్లీ పోలింగ్ నిర్వహిస్తారా? తిరుపతి లోక్ సభ పరిధిలో ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. పోలింగ్ రోజున భారీగా దొంగ ఓటర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మీడియా సాక్షిగా బోగస్ ఓటర్ల బాగోతం బయటపడింది. దీంతో పోలింగ్ ను రద్దు చేయాలని విపక్షాలు, తిరుపతి బరిలో నిలిచిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు డిమాండ్ చేశారు. పోలింగ్ ను రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఏపీ హైకోర్టును అశ్రయించారు. పోలింగ్ ను రద్దు చేయాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తన పిల్ లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చారు రత్నప్రభ. దీంతో తిరుపతి ఉప ఎన్నిక రద్దు కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బోగస్ ఓట్లకు సంబంధించి పక్కా అధారాలు ఉన్నందున హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
ఈ నెల 17న జరిగిన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా వందలాది మంది దొంగ ఓటర్లను ప్రతిపక్ష పార్టీల నేతలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వేల మంది తిరుపతికి వచ్చారు. సొంతంగా ముద్రించిన ఓటర్ కార్డుల వెనుక ఓటర్ల జాబితా సీరియల్ నెంబర్ స్టిక్కర్ కూడా వేసి దొంగ ఓటర్ల చేతికి ఇచ్చి పంపారు. ఇవన్నీ వీడియోల్లో రికార్డయ్యాయి. దొంగ ఓటర్లు తాము తీసుకువచ్చిన ఓటర్ కార్డులోని ఓటరుకు సంబంధించిన వివరాలు చెప్పలేక తెల్లమొహం వేశారు. గట్టిగా నిలదీస్తే కొంత మంది పారిపోయారు. కొంత మంది తెలియక వచ్చామని ఒప్పుకొన్నారు. టీడీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలు కూడా దొంగ ఓటర్లను పట్టుకొన్నారు. 250 బస్సులను వెనక్కు పంపామని డీజీపీనే స్వయంగా ప్రకటించారు. దొంగ ఓటర్ల వ్యవహారాన్ని టీవీ ఛానళ్లు సమగ్రంగా వెలుగులోకి తెచ్చి చూపించాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని బస్సుల్లో పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి దొంగ ఓట్లను వేయించడానికి రచించిన ప్రణాళికపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమ పార్టీ నేతతో మాట్లాడిన ఫోన్ సంభాషణ బహిర్గతమైంది.దీంతో దొంగ ఓట్ల అంశం తీవ్ర దుమారం రేపింది.
తిరుపతిలో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానం వరకూ ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. సోమవారం ఆయన సీఈసీకి 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. చెవిరెడ్డి ఫోన్ సంభాషణల ఆడియో క్లిప్పింగ్‌తో పాటు పోలింగ్ రోజు తిరుపతిలో చోటు చేసుకొన్న దొంగ ఓట్ల దందాకు సంబంధించి 11 వీడియో క్లిప్పింగులను లేఖకు జత చేశారు. దొంగ ఓటర్ల అరాచకంతో తిరుపతిలో అసలు ఓటర్లు ఓటు వేయడానికి రాలేదని, అందుకే గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గిందని తన లేఖలో చంద్రబాబు వెల్లడించారు. 80ఏళ్లు పైబడిన వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్లను వైసీపీ నాయకులు బలవంతంగా లాక్కొని తమకు అనుకూలంగా వేసుకొన్నారని ఆరోపించారు. ఇంత బహిరంగంగా ప్రజాస్వామ్యం అపహాస్యం అయినా చర్యలు తీసుకోకపోతే ఎన్నికలకు విలువ ఉండదన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం వరకూ ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్ నిర్వహించండి అని చంద్రబాబు లేఖలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.