పరీక్షల పంతం.. ప్రాణాలతో చెలగాటం! వైదిస్ ఎగ్జామ్స్ వర్రీ?
posted on Apr 20, 2021 @ 1:20PM
దేశమంతా కరోనా కల్లోలం. లక్షల్లో కేసులు. వందల్లో చావులు. అనేక రాష్ట్రాల్లో మరణ మృదంగం. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బడులకు సెలవులు. తెలుగు స్టేట్స్‌లో కూడా స్కూల్స్ మూత. ఇంత వరకూ ఓకే. మరి, పరీక్షల మాటేమిటి? దేశ వ్యాప్తంగా అన్నిచోట్ల పది పరీక్షలు వాయిదా పడితే.. ఏపీలో మాత్రం ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 10వ తరగతి పరీక్షలు జరిపి తీరుతామంటూ పట్టుదలకు పోతోంది జగన్ ప్రభుత్వం. ఎందుకింత మొండితనం? విద్యార్థుల ఆరోగ్యంతో ఎందుకిలా చెలగాటం? అంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్స్ రద్దు చేయాలంటూ నారా లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి వారు సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. పరీక్షల పేరుతో స్టూడెంట్స్‌ను ప్రమాదంలో పడేయవద్దంటూ హితవు పలికారు. అయినా, ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. పది పరీక్షల నిర్వహణపై నిర్ణయం మార్చుకునేందుకు సుముఖంగా లేదు.
ఇప్పటికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సైతం థెన్త్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసింది. తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ను నేరుగా సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేస్తున్నాయి. ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్, జేఈఈ టెస్ట్ సైతం వాయిదా పడ్డాయి. దేశమంతా ఒక లెక్క. ఏపీ మాత్రం మరో లెక్క అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ పది, ఇంటర్ పరీక్షలు జరుపుతామంటూ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఎందుకో మరి..? విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి ఏం సాధిద్దామనో..? అని తల్లిదండ్రులు మండి పడుతున్నారు.
ఏపీలో నిత్యం వేల సంఖ్యల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెద్ద సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. అయినా, ప్రభుత్వం తరఫున చెప్పుకోదగ్గ చర్యలు లేవు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కేసులు కాస్త తక్కువే. అయినా, అక్కడి ప్రభుత్వం నైల్ కర్ఫ్యూ విధించింది. పది పరీక్షలు ఇప్పటికే రద్దు చేసింది. అటు, కేంద్ర బోర్డులు సైతం పది పరీక్షలు వద్దన్నాయి. ఇలా, అంతా క్యాన్సిల్, క్యాన్సిల్ అంటుంటే.. జగన్‌రెడ్డి సర్కారు మాత్రం ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ అంటూ మొండిగా వ్యవహరిస్తోంది. దేశంలోని స్టూడెంట్స్ అంతా పది పరీక్షలు రాయకుండా.. ఒక్క ఏపీ విద్యార్థులే రాస్తే.. వీరి కోసం స్పెషల్‌గా అవకాశాలేమైనా వస్తాయా? ఇప్పటికే పది పరీక్షలు చూచిరాత పోటీలంటూ వాటి విలువ ఎప్పుడో తగ్గిపోయింది. అలాంటిది.. కరోనా మరణమృదంగం మోగిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు పెట్టడం.. ఎవరి ప్రాణాలు తీయడానికంటూ.. పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. హైకోర్టునూ ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. టీడీపీ సైతం ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇలా లోకమంతా వద్దు అంటుంటే.. జగన్‌రెడ్డి ఒక్కరే కావాలంటూ కాక రేపుతున్నారు. ఏపీలో ఇప్పుడు పది పరీక్షల షెడ్యూల్‌పై రచ్చ నడుస్తోంది. ఇలానే మొండిగా ఎగ్జామ్స్ పెట్టి.. స్టూడెంట్స్‌కి పారాసిటమాల్ టాబ్లెట్స్ ఫ్రీగా సప్లై చేస్తారో? లేక, ఎగ్జామ్ హాల్‌లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి పరీక్షలు నిర్వహిస్తారో చూడాలి మరి...