కరోనా కౌగిలింత.. జర జాగ్రత్త.. మాస్క్ మంచికే..
posted on Apr 20, 2021 @ 1:20PM
వైద్యులంతా మొత్తుకుంటున్నారు. జర జాగ్రత్త అంటూ హితవు పలుకుతున్నారు. కరోనా మహా ఖతర్నాక్. మాస్క్ లేకుండా బయటకు రావొద్దు. జనంలో తిరగొద్దు. గుంపులుగా ఉండొద్దు. చెబితే వినాలిగా! ఎవరూ వినట్లే. ఆఖరికి పెద్ద పెద్ద నాయకులు, ప్రముఖులు సైతం కొవిడ్‌ను కేర్ చేయటంలే. ఫలితం.. వారంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. వారి అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నారు.
ఎవరి వరకో ఎందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌నే తీసుకొండి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న వేళ.. నాగార్జున సాగర్‌లో బహిరంగా సభ నిర్వహించారు. మాస్క్ లేకుండా స్టేజ్‌పై కలియతిరిగారు. వేదికపై ఉన్న నేతలతో దగ్గరగా సంభాషించారు. కేసీఆర్ చుట్టూ గుంపులు గుంపులుగా నేతలు చేరారు. కట్ చేస్తే.. సీఎం కేసీఆర్‌తో సహా ఆ వేదికపై ఉన్నా చాలామందికి కరోనా పాజిటివ్. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, కోటిరెడ్డి, అంజయ్య.. ఇలా స్టేజీపై ఉన్న వారిలో సగానికి పైగా నాయకులకు పాజిటివ్ వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం కరోనా సోకడం కలకలం రేపుతోంది. ప్రజలు పానిక్ అవుతున్నారు. అంత జాగ్రత్తగా ఉండే సీఎంకే కరోనా వస్తే.. ఇక తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. హాలియా సభలోనే కేసీఆర్‌కు వైరస్ అంటి ఉంటుందని అంటున్నారు. కరోనా టైమ్‌లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోయేదిగా. పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చేది కాదుగా. అని చర్చించుకుంటున్నారు. కేవలం ముఖ్యమంత్ఉరికే కాదు.. ఆ బహిరంగ సభ తర్వాత నాగార్జున సాగర్‌లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటం కలకలం రేపుతోంది.
ఒక్క కేసీఆర్ అనే కాదు.. వకీల్ సాబ్‌నూ వదలలేదు కరోనా. పవన్ కల్యాణ్ విషయంలోనూ ఇలానే జరిగింది. ఎక్కువ సమయం ఇంటికే పరిమితమయ్యే పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఫంక్షన్ కోసం జనసమూహంలోకి వచ్చారు. అసలే సినిమా హీరో కదా. మాస్క్ పెట్టుకుంటే గ్లామర్ లుక్ పోతుందనుకున్నారో ఏమో.. వేదికపై మాస్క్ లేకుండానే కనిపించారు. అసలే క్లోజ్డ్ హాల్. ప్రాంగణమంతా జనం కిక్కిరిసి ఉన్నారు. అందులో ఎవరి నుంచో వైరస్ సోకినట్టుంది. పవన్‌కు పాజిటివ్ వచ్చింది. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది. ఫ్యాన్స్, ఫ్యామిలీలో ఒకటే కంగారు. తాను కాస్త కోలుకున్నానని పీకే ప్రకటించే వరకూ అభిమానుల్లో హైటెన్షన్. అదే వకీల్‌సాబ్ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు, బండ్ల గణేశ్ ఇలా అనేక మంది కొవిడ్ బారిన పడ్డారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ షోలో మాస్క్ పెట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు మాత్రం కరోనా సోకలేదు. అదీ, మాస్క్ ఇంపార్టెన్స్.
ఇటీవల ఖమ్మంలో జరిగిన షర్మిల సభలోనూ కరోనా కల్లోలమే. షర్మిలతో పాటు వేదిక మీదున్న చాలా మందికి పాజిటివ్ వచ్చింది. షర్మిల తర్వాత పార్టీలో కీలక నేతగా ఉంటున్న కొండా రాఘవరెడ్డి ఖమ్మం సభలో కొవిడ్ బారిన పడ్డారు. అందుకే, రాఘవరెడ్డి ఇందిరాపార్కు దగ్గర జరిగిన షర్మిల దీక్షకు రాలేదు. ఆ సభకు, దీక్షకు హాజరైన అనేక మందికి పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది.
కరోనా టైమ్‌లో మాస్కే శ్రీరామరక్ష. ఇంత చిన్న లాజిక్ వదిలి.. మాస్క్‌ను మరిచి.. కరోనాను కౌగిలించుకోవడం.. క్షమించరాని నేరం. అది ప్రముఖులైనా.. సామాన్యులైనా. బీకేర్ ఫుల్ విత్ కొవిడ్.