తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ!
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో దొంగ ఓటర్లు ఉన్నట్లు తేలింది. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారులు కానీ.. పోలీసులు స్పందించలేదు. అయితే ఈ విషయాన్ని అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్వగ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం పోలింగ్ బూత్‌లో టీడీపీ, బీజేపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి రాకుండా వైసీపీ నేతలు, పలువురు కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పోలింగ్ అధికారులు, పోలీసులు అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. తొట్టంబేడు మండలం గుండెలుగుంటలోనూ టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అధికార పార్టీ ఇంత దౌర్జన్యం చేస్తున్నా నిలువరించాల్సిన అధికారులు, పోలీసులు వారికే వత్తాసు పలకడమేంటి..? అని స్థానిక టీడీపీ నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతల హడావుడి చేశారు. పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లి ఓటర్లను వైసీపీ నేతలు ప్రలోభపెడుతున్నారు. అయితే.. వైసీపీ నేతలు కొందరు ఇలా చేస్తున్నారని టీడీపీ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే జిల్లాలో వాలంటీర్లు కూడా దగ్గరుండి మరీ పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్నప్పటికీ పోలీసులు.. కనీసం పోలింగ్ అధికారులు పట్టించుకోలేదు.
నెల్లూరు జిల్లాలో వాలంటీర్లు పలువురు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఓటర్లని నేరుగా బూత్‌ల వద్దకి తీసుకొవచ్చి ఓటేయిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున అధికార పార్టీ నేతలు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓట్లు బాగా వేయిస్తే అవార్డులు.. రివార్డులు ఇప్పిస్తామని, తగ్గితే ఉద్యోగాలే ఉండవంటూ కొందరు వాలంటీర్లను అధికార పార్టీ నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీలేక ఉద్యోగాలు కాపాడుకోవడానికి వాలంటీర్లు ఇలా దగ్గరుండి మరీ ఓటర్లను బూత్‌లకు తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌లో జరుగుతున్న అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్‌తో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, లారీల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొచ్చారని కేంద్ర ఎన్నికల అధికారులకు బాబు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైసీపీ వారిని టీడీపీ శ్రేణులు పట్టుకున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే, పలు చోట్ల అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటోల ఆధారాలను తన లేఖకు చంద్రబాబు నాయుడు జత చేశారు.
రెండు బస్సుల్లో బయటి వ్యక్తుల్ని వైసీపీ నేతలు తిరుపతిలోకి తరలించారని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నేతలు కొన్ని బూత్‌లలో టీడీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. తొట్టెంబేడు మండలం కందేలుగుంటలో టీడీపీ నేతలను అడ్డుకున్నారని వివరించారు. స్థానికేతరులతో తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడే ప్రయత్నాలు జరుపుతున్నారని ఆయన అన్నారు.