ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావుకు ఘన నివాళి

ప్రపంచ ప్రఖ్యాత రేడియాలజిస్ట్ ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో  శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ కాకర్ల వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా అందుకున్నారు. 1951లో హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లోనే ఉత్తీర్ణత సాధించారు. కాకర్లసుబ్బారావు ఎమ్.బి.బి.యస్., యమ్.ఎస్, ఎఫ్.ఆర్.సి.ఆర్ , ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఐ.సి.పి చేశారు. హైదరాబాదులోని ప్రసిద్ధ ఆసుపత్రి నిమ్స్ కు డైరెక్టర్ గా పని చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మెట్టమెదటి అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకులు కాకర్ల సుబ్బారావు.   కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జనవరి 25, 1925 సంవత్సరంలో జన్మించారు డాక్టర్ కాకర్ల సుబ్బారావు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో కళాశాల విద్యాభ్యాసం బందరు లోని హిందు కళాశాలలో 1937-1944 సంవత్సరాల మధ్య జరిపారు. విశాఖపట్టణం ఆంధ్ర వైద్య కళాశాలలో చేరి వైద్య పట్టా  1950లో సంపాదించారు. 1951 సంవత్సరంలో హౌస్‌ సర్జన్ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళారు. అమెరికాలోని వివిధ నగరాల్లోని ఆసుపత్రులలో పనిచేశారు.  1986 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరపు సుబ్బారావు భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాదులోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో చేరారు. నిమ్స్ ఆసుపత్రి సుబ్బారావు చేరక మునుపు వరకు ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. సుబ్బారావు అక్కడ చేరాక అన్ని విభాగాలనూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు దీటైన స్థాయికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు నిమ్స్ సంస్థ రాష్ట్ర మరియు దేశ వ్యాప్తంగా రోగుల చికిత్సా , వైద్య వృత్తి శిక్షణా ,  వైద్య పరిశోధన పరంగా ప్రముఖ వైద్య సంస్థగా నిలిచిందంటే అందుకు కారణం కాకర్ల సుబ్బరావే.  డాక్టర్ కాకర్ల సుబ్బారావు రేడియాలజిలో అనేక పుస్తకాలు మరియు జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు వ్రాశారు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చారు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందారు. కాకర్ల సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు మార్చి 17, 2001న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేశారు.  రాజీవ్ చక్ర నేషనల్ అవార్డు, నేషనల్ యూనిటీ అవార్డు సహా  లెక్కలేనన్ని పురస్కారాలను డాక్టర్ కాకర్ల సుబ్బరావు అందుకున్నారు.  

మద్యం బాటిల్ లో పాము.. 

పాములు పుట్టలో ఉంటాయి. లేదంటే అడవిలో ఉండాయి.. పొలాల్లో ఉంటాయి. మనుషులు ఉన్న చోట కూడా అప్పుడుడప్పుడు దర్శనం ఇస్తుంటాయి. మరి ఎంజాయ్ కోసం, బాధను మరువడం కోసం, రకరకాల సాకులతో  తాగుతున్న మందు బాటిల్ లో పాము ప్రత్యేక్షం అయితే. ఆ మందు బాటిల్ ఒకడు తాగితే ఓకే..  పది మంది కలిసి తాగితే, వారికి ప్రాణాలు పొతే, దానికి ఎవరు బాద్యులు. ప్రభుత్వాల, మద్యం వ్యాపారుల. ఒక మద్యం తాగితే పోతారు అని చెప్పిన తాగుతున్న మందుబాబులదేనా. నిజానికి మద్యపానం ప్రాణానికి హానికరం అన్న మాట, ఈ సంఘటన వాళ్ళ రుజువైయిందని చెప్పాలి. ఎనుకటికి ఎవడో జొన్న గింజతో కొడితే చనిపోయాడని చెపితే విన్నాం.. కానీ మన టైం బాగాలేకపోతే డబ్బులు పెట్టి తీసుకున్న మందు బాటిల్ లో పాము ఉంది దాని వాళ్ళ చనిపోతే మన కుటుంబం ఒంటరి అవుతుంది. రోడ్డున పడుతుంది. ఇదంతా ఎందుకు చెపుతున్నారు అనుకుంటున్నారా మీరే చూడండి తెలుస్తుంది ఏం జరిగిందో..   అతని పేరు సురేష్‌ . అతడు ఒక వ్యవసాయదారుడు. రోజంతా పొలంలో కష్టపడి సాయంత్రం కాస్త మందు తాగడం అనుకున్నాడు. స్థానిక ప్రభుత్వ టాస్మాక్‌ దుకాణంలో మద్యం బాటిల్ తీసుకుని.. దాహం మీద ఉండడంతో నాలుక లాగుతుందని కంగారు కంగారుగా రెండు పెగ్గులు వేశాడు.. కొంచం మత్తు ఎక్కింది.. మద్యం సీసాను కిందికి మీదికి చూశాడు.  కట్ చేస్తే ఆ అప్పటి వరకు తాను తాగిన మందు సీసాలో పాము పిల్ల ఉంది. ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. ఈ విషయం పై టాస్మాక్‌ సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అతడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. ప్రాథమిక చికిత్స అందించి జయంకొండం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తమిళనాడులోని అరియలూరు సుత్తమల్లి గ్రామంలో జరిగింది. 

6 నెలల బిడ్డను బలిచ్చిన తల్లి?

మూఢభక్తి జనాలను మూర్కులుగా మార్చేస్తోంది. అతీత శక్తుల కోసం దారుణాలకు తెగబడుతున్నారు. సొంత వారినే హతమారుస్తున్నారు. దేవుడి పేరుతో మారణహోమానికి పాల్పడుతున్నారు.  మదనపల్లిలో అక్కా చెల్లెళ్ల దారుణ హత్యలు మరవకముందే... తమిళనాడులో అలాంటి ఘటనే వెలుగుచూసింది. పిల్లలు ముందే అప్రమత్తం కావడంతో తమిళనాడులో ఘోరం జరగలేదు. ఇప్పుడు అలాంటి దారుణ ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. బీఎస్సీ, బీఈడీ చదివి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమైన ఓ మహిళ మూఢభక్తితో తన ఆరేళ్ల బిడ్డను దేవుడి పటాల ముందు బలిచ్చింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారంసూర్యాపేట జిల్లాలోని మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతి బీఎస్సీ, బీఈడీ చదువుకుంది. ఉద్యోగాలకు కూడా సన్నద్ధమైంది. ఎనిమిదేళ్ల క్రితం మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే మనస్పర్థల కారణంగా కొన్ని రోజులకే విడిపోయారు. అప్పటి నుంచి  పుట్టింటిలోనే ఉంటున్న భారతి.. రెండేళ్ల క్రితం తండాకే చెందిన కృష్ణ అనే యువకుడిని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పెద్దలు వారి పెళ్లి చేశారు. ఆరు నెలల క్రితం వీరికి కూతురు పుట్టింది. అయితే భారతి నిత్యం యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ గడిపేది. తనను తాను శివుడిగా భావించేది.  ఇటీవల గ్రామానికి ఓ సాధువు రాగా, ఆమెకు నాగదోషం ఉన్నట్టు చెప్పాడు. అప్పటి నుంచి భారతి మానసిక పరిస్థితి మరింత దిగజారింది. నిత్యం పూజలతోనే గడిపేది. భర్త  పనిమీద సూర్యాపేటకు వెళ్లగా, అత్తమామలు పొలం పనులకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన భారతి కుమార్తె రీతును దేవుడి పటాల ముందు పడుకోబెట్టి కత్తితో గొంతుకోసి హతమార్చింది. తర్వాత పుట్టింటికి వెళ్లింది. ఒంటరిగా రావడంతో గమనించిన భారతి తల్లి కుమార్తె ఎక్కడని ప్రశ్నించింది. సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికెళ్లి చూడగా దేవుడి పటాల ముందు రక్తపు మడుగులో చిన్నారి విగతజీవిగా కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జగన్ బెయిల్ రద్దేనా? జైలు ఖాయమేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొంత కాలంగా ఓ చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు పదేపదే అదే చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో  బీజేపీ నేతలు కూడా అదే చెప్పారు. బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దేవదర్.. ఇటీవల కాలంలో ఎక్కడ మాట్లాడినా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. త్వరలోనే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దు కాబోతుందంటూ టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లు ఏపీలో ఆసక్తిగా మారాయి. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు స్వీకరించింది.  రఘురామకృష్ణరాజు ఇటీవలే ఈ పిటిషన్ దాఖలు చేయగా, పలు అంశాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరమైన పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించింది. కోర్టు నిర్దేశించిన మేరకు రఘురామకృష్ణరాజు తగిన పత్రాలు సమర్పించడంతో పిటిషన్ ను కోర్టు అధికారులు స్వీకరించారు. తన పిటిషన్ లో రఘురామ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం బెయిల్ పై బయటున్న సీఎం జగన్ 11 చార్జిషీట్లలో ఏ1 నిందితుడిగా ఉన్నారని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు స్వీకరించడంతో.. ఈ కేసులో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. రఘురామ చెబుతున్నట్లు జగన్ బెయిల్ రద్దు అవుతుందా... టీడీపీ, బీజేపీ నేతలు మాటలు నిజమై జగన్ జైలుకు పోతారా అన్న దానిపై జనాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.  జగన్ కేసులో తన పిటిషన్ పై సీబీఐ కోర్టు స్వీకరించడంపై స్పందించారు  ఎంపీ రఘురామకృష్ణరాజు. జగన్ కేసుల అంశంపై ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా లేఖ రాశానని, పీఎంఓ నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల నివేదికలను కూడా తానే రాస్తున్నట్టు తెలిసిందని అన్నారు. మూడు రాజధానుల వంటి నిర్ణయాలతో భారతదేశంలో ఎక్కడా లేని ఆలోచనలు ముఖ్యమంత్రికి వస్తున్నాయని సెటైర్ వేశారు రఘురామ. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిన సలహాలే అందుకు కారణం అయ్యుంటాయని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన అలాంటి సలహాలను ఖండించడానికి రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసిన ఓ ప్రజాప్రతినిధిగా తనకు బాధ్యత ఉందని భావిస్తున్నానని రఘురామ స్పష్టం చేశారు. 

జగన్ , కేసీఆర్ కు షాక్... షర్మిల హల్ చల్ 

ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారింది. కొలువు దీక్ష తర్వాత ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన వైఎస్ షర్మిల పాదయాత్ర భగ్నమైంది. ఇందిరా పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకు యత్నించారు. దీంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై షర్మిల మద్దతుదారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలు చోటు చేసుకున్నాయి. తోపులాటలో షర్మిల సృహ తప్పి పడిపోయారు. షర్మిల తేరుకున్నాక ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.      పోలీస్ స్టేషన్ నుంచి లోటస్ పాండ్ తీసుకెళ్లి షర్మిలను తన నివాసం దగ్గర వదిలిపెట్టారు పోలీసులు. దీంతో తన నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ పై మరోసారి విరుచుకుప్డడారు. ఏదో ఒకరోజు తెలంగాణకు CM అవుతానన్నారు షర్మిల. కార్యకర్తలను వదిలేవరకు మంచినీళ్లు కూడా ముట్టనన్నారు. ఇంకోసారి తన మీద చెయ్యి పడితే ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు. అంతకుముందు ఇందిరా పార్క్ దగ్గరలోని ధర్నాచౌక్‌లో ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షలో ఆసక్తిర ఘటన చోటుచేసుకుంది. అడ్డుగా ఉన్న కెమేరాలను తొలగించమంటూ మీడియాకు సూచించిన షర్మిల... అక్కడే ఉన్న సాక్షి ఛానెల్‌కు చురకలు వేశారు. ‘‘కవరేజ్ చేసింది చాల్లేమా... ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ సెటైర్ వేశారు. ఆమె పక్కనే ఉన్న తల్లి వైఎస్ విజయలక్ష్మి ఒక్కసారిగా బిత్తరపోయారు. వెంటనే తేరుకుని.. షర్మిలను మెల్లగా చేత్తో తట్టారు. అయినా ఏమాత్రం తగ్గకుండా సాక్షి మీడియాను తనదైన శైలిలో షర్మిల ట్రీట్ చేశారు. తన సోదరుడి ఛానెల్ ను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.   

వైఎస్‌ షర్మిల అరెస్ట్.. దీక్ష భగ్నం

నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాల భర్తీపై వైఎస్ షర్మిల చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిల దీక్షకు పోలీసులు ఒక్కరోజుకే అనుమతి ఇవ్వగా.. ఆమె మాత్రం 72గంటల పాటు దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. దీంతో.. సాయంత్రం కాగానే దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. తాను 72 గంటల దీక్షకు పూనుకున్నానని.. తనను ఎక్కడికి తరలించినా అక్కడే దీక్ష కొనసాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు. పాదయాత్రగా ఇందిరాపార్కు నుంచి లోటస్ పాండ్‌కు బయలు దేరారు షర్మిల. దీంతో.. పాదయాత్రకూ అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులతో తోపులాట జరిగింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ఱ దగ్గర షర్మిలను అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పది పరీక్షలు రద్దు.. ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా..

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలు రద్దు కాగా, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ కావడంతో విద్యార్థుల్లో అయోమయం.  కరోనా ఉధృతితో దేశవ్యాప్తంగా పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. సెకండ్ వేవ్ కేసులతో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు స్కూల్స్‌ను మూసి వేశాయి. పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారడంతో.. ఎగ్జామ్స్ లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పంపాలని పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. పంజాబ్‌, హరియాణా, ఒడిశా రాష్ట్రాలు పరీక్షల రద్దు లేదా వాయిదాకు సిద్ధమవుతున్నాయి.  పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే 5, 8, 10 తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తోంది. 8, 10 తరగతుల విద్యార్థుల ఉత్తీర్ణతను.. ప్రీ-బోర్డ్‌ ఎగ్జామ్స్‌, ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా నిర్ణయిస్తారు.   విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. 10వ తరగతి పరీక్షల రద్దుతో పాటు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హరియాణా సర్కారు తెలిపింది.   కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్న యూపీలో మే 15 వరకు పాఠశాలలను మూసి వేస్తున్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది. 10, 12 తరగతుల బోర్డ్‌ ఎగ్జామ్స్‌ను కూడా మే 20 వరకు వాయిదా వేశారు. 

సాక్షి మీడియాపై షర్మిల చిందులు..

తెలంగాణలో ఉద్యోగల భర్తీ కోసం ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నాచౌక్‌లో షర్మిల దీక్షకు కూర్చున్నారు. దీక్షా సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనకు ఎదురుగా, అడ్డుగా ఉన్న కెమెరాలను పక్కకు జరపమంటూ మీడియాకు షర్మిల సూచించారు. ఆ సందర్భంగా అక్కడే ఉన్న.. తన అన్న జగన్‌కు చెందిన సాక్షి ఛానెల్‌పై సెటైర్లు వేశారు షర్మిల. ‘‘కవరేజ్ చేసింది చాల్లేమా.. ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు షర్మిల. ఇంకా ఏదో అనబోతుండగా.. పక్కనే ఉన్న తల్లి వైఎస్ విజయలక్ష్మి ఆమెను వారించారు. వద్దు, ఇక చాలంటూ షర్మిలను చేత్తో తట్టారు. అయినా.. షర్మిల ఊరుకోలేదు. నవ్వుతూనే.. చేతులతో సైగలు చేస్తూ.. తనకు అడ్డుగా ఉన్న సాక్షి కెమెరాలను పక్కకు తరలించే వరకూ వదల్లేదు. ఈ ఘటనపై అక్కడ ఉన్నవారంతా ఆసక్తిగా చర్చించుకున్నారు. జగన్ వేరు.. తాను వేరు.. షర్మిల జగనన్న సంధించిన బాణం కాదనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లాలనే.. కావాలనే ఇలా చేసుంటారని కొందరు అంటున్నారు. కారణమేదైనా.. జగన్‌కు చెందిన సాక్షి మీడియాపై ఆయన చెల్లెలు షర్మిలనే చిందులేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

'డు నాట్ డిస్ట్రబ్ మీ'.. మదమా? కొవ్వా?

"మీరు అసలు మనుషులేనా.. ఇదేనా పాలన? దోచుకోవడం.. దాచుకోవడం తప్ప.. వైసీపీ పాలనలో మరేమీ లేదు. సీఎం జగన్ మొద్దు నిద్ర పోతున్నారు. జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయి. మదమా.. కొవ్వా అర్థం కావడం లేదు." అంటూ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.  తిరుపతి ఎన్నికల ప్రచారం ముగించి మీడియాతో మాట్లాడారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో విస్తృతంగా తిరిగానని.. ప్రజల్లో ఎంతో ఆవేదన ఉందని అన్నారు. అప్పులు చేయడంలో ఏపీని నెంబర్ వన్‌గా నిలబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువగా ఉంది. అక్రమ కేసులు బనాయిస్తూ, అమాయకులను హత్య చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. సీఎం జగన్ 'డు నాట్ డిస్ట్రబ్ మీ' అని బోర్డు పెట్టారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి అసలేమీ పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు.  ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల ఇస్తే... వచ్చే నెల ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. కుక్కలు చింపిన విస్తరిలా పాలన మారింది. ఎక్కడికక్కడ అప్పులు చేస్తున్నారు. ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేదు. సీపీఎస్ అతీగతీ లేదు. పీఆర్సీ కమిటీ వరకే ఆగిపోయింది. ఫీరీయింబర్స్‌మెంట్ సకాలంలో ఇవ్వడంలేదని, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. పాలనానుభవం లేకపోవడంతో.. జగన్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సీఎం ఉన్నాడు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 164 ఆలయాలపై దాడులు జరిగితే.. ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్థంలో నాపై కేసులు పెట్టారు. తిరుపతిలో రాళ్లు వేస్తారు. నన్నే సాక్ష్యం ఇమ్మంటున్నారు. ఈ సీఎం ఆనందిస్తున్నాడు తప్ప.. తప్పును సరి చేసుకోవడం లేదు’’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు చంద్రబాబు. 

పసుపు ప్రభంజనం.. టీడీపీ జోష్.. వైసీపీ షేక్..

ఇసుకేస్తే రాలనంత జనం. నేల ఈనిందా అనేంతగా జన ప్రవాహం. అవేమీ అలనాటి ఎన్టీఆర్ సభలు కావు. తిరుపతి ఉప ఎన్నికల్లో నేటి చంద్రబాబు సునామీలు. బాబు వచ్చారు.. జనం కదలివచ్చారు. ఇంతింతై.. జన సంద్రమంతై.. చంద్రబాబు రోడ్ షోలన్నీ కిక్కిరిసిపోయాయి. తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో ఏ మూలకెళ్లినా.. ఏ ప్రాంతానికెళ్లినా.. జనమే జనం. అంతా పసుపు మయం. ఎటు చూసినా చంద్రన్న ప్రభంజనం.  ముందుగా లోకేశ్‌బాబు ప్రచారంతో టీడీపీకి ఫుల్ మైలేజ్ వచ్చింది. ఇక చంద్రబాబు ఎంట్రీతో ఆ జోష్ మరో రేంజ్‌కు చేరింది. ముందు చంద్రన్న.. ఆ వెనకాలే పసుపు దండు. బండెనక బండి కట్టి.. జెండా వెనుక జెండా పట్టి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో పది రోజులుగా పసుపు పండుగ. జై తెలుగుదేశం.. జై చంద్రన్న నినాదాలతో తిరుపతి మారు మోగిపోయింది. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా ఆయనకు అడుగడుగునా ఘనమైన స్వాగతమే. అధినేత ఎక్కడ రోడ్ షో నిర్వహించినా.. మరెక్కడ సభ పెట్టినా.. జన సందోహమే. పసుపు కోలాహలమే. గతంలో ఎక్కడైతే సభలు డల్‌గా కనిపించాయో.. ఇప్పుడు అదే చోట చంద్రబాబు రోడ్ షోలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో వైసీపీ సభలు జనం లేక వెలవెలబోయాయి. అధికార పార్టీ నిర్వహించిన సభలు, రోడ్ షోలు అట్టర్ ఫ్లాప్ అవడం తిరుపతి వాసులు కళ్లారా చూశారు.  చంద్రబాబు ప్రచారంతో ప్రధాన కూడళ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మైదానాలు మెగా సభలతో మైమరిపించాయి. ఇంటింటి ప్రచారంతో, పాదయాత్రలతో హోరెత్తించారు. తిరుపతి వాసులను తన ప్రచారంతో మెప్పించి మెస్మరైజ్ చేశారు చంద్రబాబు. పగలు, రాత్రి ప్రచారం చేస్తూ.. జగన్ ప్రభుత్వ అన్యాయాలు, అరాచకాలపై విరుచుకుపడుతూ.. జనాలకు కనువిప్పు కలిగించారు చంద్రబాబు. ఆయన ప్రసంగంలో వాడి, వేడి పెరిగింది. మునపటిలా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడారు. ఓటర్లను ఆలోచింపజేసేలా.. నేరుగా వారి గుండెలను తాకేలా ఆయన వాగ్ధాటి కొనసాగింది.  "కరోనా వైరస్ కన్నా జగన్ వైరస్ అత్యంత ప్రమాదకరం. ఎమ్మెల్యేలు రిటైల్‌గా.. సీఎం జగన్ హోల్‌సేల్‌గా సహజ వనరులు దోచేస్తున్నారు. వాళ్లు నాయకులా? మాఫియా గ్యాంగ్‌లా? జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారు. జగన్‌కు ఇదే చివరి అవకాశం కావాలి. తిరుపతి ఎన్నికల్లో మీరు వేసే ఓటుతో జగన్‌కు కనువిప్పు కావాలి. లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఫ్యాన్‌ను తుక్కు తుక్కుగా విరగొట్టాలి." ఇలా చంద్రబాబు తన ప్రసంగాలతో వైసీపీపై, సీఎం జగన్‌పై ఉప్పెనగా విరుచుకుపడ్డారు. ఓటర్లలో ఉత్సాహం, ఉద్రేకం కలిగించారు.  తిరుపతి ఎన్నికల నగారా మోగినప్పుడు అంతా టీడీపీని లైట్ తీసుకున్నారు. పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించాక, ముందుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రంగంలోకి దిగారు. ఆ యువనేత ఉప్పెనలా తిరుపతిని ముంచెత్తాడు. చుట్టూ జనం. జనం మధ్యలో లోకేశ్. తిరుపతిలో అడుగడుగునా నారా వారి నినాదం. ప్రజలతో ఇట్టే మమేకమయ్యారు లోకేశ్. యువతతో సెల్ఫీలు దిగారు. టీ షాపులో టీ తాగారు. వృద్ధులను పరామర్శించారు. మహిళల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. పేదల కన్నీళ్లు తుడిచారు. నారా లోకేశ్ ప్రచారంతో టీడీపీ శ్రేణుల్లో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఆ ఉత్సాహాన్ని మరింత ఉధృత స్థాయికి తీసుకెళ్లారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.  చంద్రబాబు సునామీలాంటి ప్రచారంతో తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపై టీడీపీ ధీమాగా కనిపిస్తోంది. ఓటర్ల ఆలోచనలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రీ పోల్ సర్వేల్లో స్పష్టమవుతోంది. ఒకప్పుడు వైసీపీ మెజార్టీపై పందేలు కాసిన వారంతా, ఇప్పుడు టీడీపీ గెలుపుపై బెట్టింగ్‌లు పెంచేశారు. ఈ మార్పుతో అధికార వైసీపీలో కలవరపాటు. మరోవైపు, ఫ్యాను పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. గురుమూర్తిలాంటి బలహీన అభ్యర్థి.. ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. జగన్ విధించిన 5 లక్షల మెజార్టీ మాటేమో కానీ, గెలిస్తే అదే చాలు అన్నరీతిలో స్థానిక వైసీపీ నేతల్లో కంగారు మొదలైంది.  చంద్రబాబు, లోకేశ్‌బాబులు తిరుపతి గెలుపోటములను అమాంతం మార్చేశారని అంటున్నారు. అప్పటి దాకా ఓ లెక్క.. వారిద్దరూ వచ్చాక మరో లెక్కగా మారింది పరిస్థితి. నారా లోకేశ్ ముందస్తుగా జనాలను సంసిద్ధం చేస్తే.. చంద్రబాబు ఎంట్రీతో తిరుపతి ఎలక్షన్ సినారియో పూర్తిగా మారిపోయింది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా.. వైసీపీలో నిరుత్సాహం.. టీడీపీలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుపై తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. జై తెలుగుదేశం.. జై చంద్రన్న.. అంటూ ఓట్ల పండగకు సన్నద్దమవుతున్నారు తిరుపతి ఎంపీ నియోజకవర్గ ఓటర్లు.  

10 నిమిషాల్లో సాధ్యమా? రాజారెడ్డి రాజ్యాంగమా?

మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఐడీ ఇచ్చిన నోటీసులు వివాదాస్పదంగా మారుతున్నాయి. నెల్లూరులో ఉమా ఉండగా.. ఉదయం 10.20 గంటలకు విజయవాడలోని ఆయన ఇంటికి నోటీసు అట్టించి.. 10 నిమిషాల్లో కర్నూలు సీఐడీ ఆఫీసుకు రమ్మనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీడీపీ ఘాటుగా ట్వీట్ చేసింది.  ‘‘తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న దేవినేని ఉమాకు ఒక కేసు విషయమై నోటీసులు ఇవ్వాల్సిన పోలీసులు ఉదయం 10.20గంటలకు విజయవాడలోని గొల్లపూడి నివాసానికి నోటీసు అంటించారు. ఆశ్చర్యం ఏంటంటే 10.30గంటల కల్లా కర్నూలు సీఐడీ ఆఫీస్‌లో ఉండాలని ఆ నోటీసులో ఉంది. తిరుపతి ప్రచారంలో ఉన్న వ్యక్తికి విజయవాడలో నోటీసు ఇచ్చిన విషయం తెలియడానికే పది నిమిషాలు పడుతుంది. అలాంటిది నెల్లూరులో ఉన్న వ్యక్తి పది నిమిషాల్లో కర్నూలు ఎలా వెళ్లగలడు? కక్ష సాధింపునకు కూడా హద్దులు ఉండాలి కదా! 10 నిమిషాల్లో జిల్లాలు దాటి రావాలంట.. ఇది అంబేడ్కర్ రాజ్యాంగమా.. రాజారెడ్డి రాజ్యాంగమా’’ అంటూ ట్వీట్టర్‌లో మండిపడింది టీడీపీ. 

ఢిల్లీలో కర్ఫ్యూ.. త్వరలో తెలంగాణలోనూ..!

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మాల్స్, జిమ్స్, ఆడిటోరియం, స్పా మూసివేయాలని ఆదేశించారు. థియేటర్స్‌లో సీటింగ్‌ను 30శాతానికి కుదించారు. రెస్టారంట్లలో కేవలం హోం డెలివరీకి మాత్రమే అనుమతి.  వివాహాలకు కర్ఫ్యూ పాస్‌లు జారీ చేస్తారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉండనున్నాయి.  ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు సీఎం కేజ్రీవాల్. మాస్క్‌లు లేకుండా కన్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో ఎలాంటి పడకల కొరత లేదన్నారు. ఐదు వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.     ఉదయం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం కేజ్రీవాల్‌ ఈ ప్రకటన చేశారు. ‘‘ప్రజల ఆరోగ్యం దృష్ట్యానే ఈ ఆంక్షలు విధించాల్సి వస్తోంది. వీటి వల్ల మీరు ఇబ్బంది పడతారని తెలుసు.. కానీ, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆంక్షలు అత్యవసరం’’ అని సీఎం కేజ్రీవాల్ వీడియో ప్రసంగంలో అన్నారు. మీడియా కూడా సంయమనం పాటించాలని, ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దన్నారు.  అటు.. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి కర్ఫ్యూ దిశగా ఆలోచిస్తోంది కేసీఆర్ సర్కారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీఎస్ సోమేష్ కుమార్ అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమీక్షిస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

మళ్లీ ఎన్నికల నగారా.. టీఆర్ఎస్‌లో టెన్షన్..

తెలంగాణలో మళ్లీ ఓట్ల పండగ. పుర పోరుకు నగారా మోగింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. 22 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు.  ఏప్రిల్ 30న పోలింగ్. మే 3న కౌంటింగ్.  జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి అంచు నుంచి బయటపడిన అధికార పార్టీకి ఈ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. ఇటీవలే రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడంతో టీఆర్ఎస్‌లో ధీమా పెరిగింది. అయితే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బాగా పట్టుంది. వరంగల్, ఖమ్మంలో కాంగ్రెస్ సైతం స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పరిధి 3 జిల్లాలకు విస్తరించడంతో గులాబీ పార్టీ ఏదో విధంగా మేనేజ్ చేసి బయటపడింది. కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఒక్క నగరానికే పరిమితం. గతంలో వరదల ఎఫెక్ట్, ఎల్‌ఆర్‌ఎస్ అంశాలు జీహెచ్ఎమ్సీ ఎన్నికలపై బాగా ప్రభావం చూపించాయి. అవే వరదలు, అదే ఎల్‌ఆర్‌ఎస్.. వరంగల్ వాసులనూ బాగా ఇబ్బంది పెట్టింది. అందుకే, వరంగల్ కార్పొరేషన్‌కు కైవసం చేసుకోవడం అధికార పార్టీకి అంత ఈజీ మాత్రం కాదు. ఆ భయంతోనే రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేసి పెండింగ్ పనులన్నిటీకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేశారు. ఆయన కళ్లల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని విపక్షాలు విమర్శించాయి. ఇటీవల జరిగిన వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా తీన్మార్ మల్లన్న, కోదండరాం మధ్య చీలిపోయింది. అందుకే టీఆర్ఎస్ గెలిచింది. లేదంటే, ఫలితం మరోలా ఉండేది. అది, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్‌లో బయటపడుతుందని ప్రతిపక్షాలు సవాల్ చేస్తున్నాయి. తమ సత్తా ఏంటో కేసీఆర్‌కు తెలుసొచ్చేలా చేస్తామంటూ తొడగొడుతున్నాయి.  అటు, ఖమ్మంలోనూ కారు పార్టీకి కష్టాలే. అధికార పార్టీ నేతల మధ్య వర్గ పోరే ఆ పార్టీకి పెద్ద మైనస్. టీఆర్ఎస్‌ను గులాబీ నేతలే పరస్పరం ఓడించుకుంటారని ప్రచారం నడుస్తోంది. అందుకే, ఖమ్మంలో కారు ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగకపోవచ్చు. మరోవైపు, బీజేపీ చాలా కాలంగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇప్పటికే అనేక సార్లు ఖమ్మం, వరంగల్‌లను చుట్టేసి వచ్చారు. కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేశారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తోంది. టీఆర్ఎస్‌కు జీహెచ్ఎమ్సీ మాదిరే గట్టి షాక్ ఇచ్చేందుకు సై అంటోంది.  అటు, కాంగ్రెస్ సైతం ఈ రెండు నగరాల్లో బలంగానే కనిపిస్తోంది. హస్తం పార్టీకి వరంగల్, ఖమ్మంలో మంచి కేడర్ ఉంది. కొండా మురళి దంపతులు, నాయిని రాజేందర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి స్వర్ణ లాంటి నేతలు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తారు. అటు, ఖమ్మంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ స్పెషల్ నజర్ పెట్టారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ ఈ ఇరువురు నేతలు ఖమ్మంలో విస్తృత ప్రచారం చేశారు. ఈసారి మరింతగా గెలుపు కోసం కృషి చేస్తారు. ఇలా, బీజేపీ, కాంగ్రెస్ దూకుడుతో అధికార పార్టీకి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కత్తి మీద సవాలే. 

విశాఖ ఉక్కుపై కేంద్రానికి నోటీసులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ రిటైర్డ్ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్పందించిన ఉన్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.  కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చన్నారు. సమస్యకు ప్రైవేటీకరణ పరిష్కారం కాదని పిటిషన్‌లో తెలిపారు. విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు లక్ష్మీనారాయణ. తాజాగా, హైకోర్టులో పిల్ దాఖలు చేయడం, కేంద్రానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.  మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. కార్మికులు, స్థానికులు, ప్రతిపక్ష పార్టీలు.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు  అంటూ ఉద్యమిస్తున్నాయి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే ఆసక్తి మొదలైంది. 

72 గంటల దీక్ష.. తగ్గేదే లే..

కేసీఆర్‌ది గుండెనా.. బండరాయా? చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్‌కి కనిపించడం లేదా అంటూ ఘాటుగా విమర్శించారు షర్మిల. ఇందిరాపార్కు దగ్గర తాను చేపట్టిన దీక్షను.. 72గంటల పాటు కొనసాగిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. షర్మిల దీక్షకు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. అలాంటిది, సడెన్‌గా దీక్షా శిబిరం నుంచి 72 గంటలు దీక్ష చేస్తానంటూ షర్మిల ప్రకటించడం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసుల స్పందన రావాల్సి ఉంది.  ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేపట్టారు షర్మిల. యువతకు న్యాయం జరగాలని, నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్‌లో చలనం రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందని, అసలు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. యువతకు అండగా తాము పోరాటం చేస్తామన్నారు. షర్మిల దీక్షకు మద్దతుగా ఆమె అభిమానులు జిల్లాల్లో దీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, షర్మిల దీక్షకు బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, రచయిత కంచె ఐలయ్య తమ మద్దతు ప్రకటించారు.

దేవినేని ఉమాకు సీఐడీ నోటీసులు.. టార్గెట్ టీడీపీ?

మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదైంది. గురువారం ఉదయం కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని గొల్లపూడిలోని ఉమా నివాసంలో నోటీసులు అందజేశారు.   ఈనెల 7న దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారనేది అభియోగం. ఈమేరకు 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) సెక్షన్ల కింద ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసులో సూచించారు. దేవినేని ఉమాకు సీఐడీ నోటీసులు ఇవ్వడం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలేనంటూ ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. 

మిస్టరీ డెత్స్.. క్రైమ్ కేపిటల్‌గా విశాఖ?

ప్రశాంత విశాఖ నగరం.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా మారాక క్రైమ్ కేపిటల్‌గా మారిపోతోంది. నేరాలు, ఘోరాలతో సాగరతీరంలో రక్త తర్పణం జరుగుతోంది. లేటెస్ట్‌గా, విశాఖ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మధురవాడ, మిథిలాపురి కాలనీ, ఆదిత్య టవర్స్‌లో నలుగురు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు సజీవ దహనమవడం సంచలనంగా మారింది. మృతులు బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, దీపక్, కశ్యప్‌గా పోలీసులు గుర్తించారు.  హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎన్నారై కుటుంబం మృతికి పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు జరిగుంటాయనే దిశగానూ పోలీసులు విచారిస్తున్నారు.  విశాఖలోని పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగురు దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఒకే కటుంబానికి చెందిన ఆరుగురిని దుండగులు హత్య చేశాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వచ్చిన దుండుగుడు ఆరుగుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో 6 నెలల పాప, 2 నెలల బాబు ఉండటం కలచివేస్తోంది. ఈ హత్యలకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పలరాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.  నిందితుడిగా భావిస్తున్న అప్పలరాజు కుమార్తెకు విజయ్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని తెలుస్తోంది. 2018లో జరిగిన లవ్ మేటర్ కారణంగా విజయ్ కుటుంబంపై కక్ష పెంచుకున్న అప్పలరాజు అర్ధరాత్రి ఈ దారుణ హత్యలకు తెగించినట్టు సమాచారం. అప్పలరాజు కుమార్తెతో.. విజయ్ ఫోన్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన తండ్రి.. ఆ యువకుడిపై పెందుర్తి పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌ను అప్పట్లో అరెస్టు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినప్పటికీ విజయ్‌పై, అతని కుటుంబంపై పగ పెంచుకున్న అప్పలరాజు బుధవారం అర్ధరాత్రి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.  ఈ రెండు ఘటనల్లో మొత్తం 10 మంది చనిపోయారు. వరుస ఘటనలతో విశాఖ హడలిపోతోంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా మారాక.. నగరం నేర రాజధానిగా మారిపోతోందని భయాందోళన వ్యక్తం అవుతోంది. ప్రశాంత విశాఖలో ఇంతటి దారుణ నేరాలు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు నగర వాసులు.

జగన్‌కు ఓటేసినందుకు చెప్పు దెబ్బలు

"జగన్‌కు ఒక్క చాన్స్‌ ఇచ్చినందుకు అనుభవిస్తున్నాం. మేము చేసిన తప్పుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం. అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకానికి సీఎం జగన్‌ తూట్లు పొడుస్తున్నారు" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం ‘జై భీమ్‌’ సంస్థ జిల్లా అధ్యక్షుడు బీకేఎస్‌ ఆనంద్‌. చెప్పుతో తనను తాను కొట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.  రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరిట ఏర్పాటు చేసిన ‘అంబేడ్కర్‌ విదేశీ విద్య’ పథకానికి సీఎం జగన్‌ తూట్లు పొడుస్తున్నారని దళిత వర్గాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంబేడ్కర్‌ 130వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు ‘జై భీమ్‌’ సంస్థ జిల్లా అధ్యక్షుడు బీకేఎస్‌ ఆనంద్‌ నేతృత్వంలో దళితులు భారీగా హాజరయ్యారు.  ‘‘నేను ఉన్నాను.. నేను విన్నాను.. అన్నావ్‌! ఈ రోజు మా ఆశలను, ఆశయాలను అడియాశలు చేశావ్‌. ఒక్క చాన్స్‌ అని అడిగావ్‌.. ఇచ్చినందుకు ప్రతిఫలంగా మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం’’ అంటూ అక్కడే తన చెప్పుతో ఆనంద్‌ తలపై బాదుకుని నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విదేశీ ఉన్నత విద్య పథకంపై సీఎం జగన్‌ ఉక్కుపాదం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే.. విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఆత్మహత్యలు జరుగుతాయని హెచ్చరించారు.  గత సీఎం చంద్రబాబు పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో అంబేడ్కర్‌ విదేశీ విద్యను ప్రవేశ పెట్టారని, జగన్‌ దీనిని రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆనంద్‌ చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులుగానీ, అధికారులుగానీ స్పందించకుండా అటు నుంచి అటే వెళ్లిపోవడంతో దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

2లక్షల కేసులు.. వెయ్యి మరణాలు..

10 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. ఒక్క రోజులో 2లక్షలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులతో రికార్డులు బద్దలయ్యాయి. మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. ప్రస్తుతం దేశంలో 14 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదంతా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిన వివరాలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య అంతకు మించే ఉంటుందంటున్నారు.  కరోనా ఉగ్రరూపం ఇది. వైరస్ మోగిస్తున్న మరణమృదంగం అది. భారీగా ప్రాణనష్టం. లక్షల్లో కల్లోలం. గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564 కి చేరింది. 1,73,123 మంది మరణించారు. రోజువారి కేసుల సంఖ్య దాదాపు 10 రోజుల్లో రెట్టింపు అయ్యాయి.  దేశంలో ప్రస్తుతం 14,71,877 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు పది శాతానికి చేరువై కలవరపెడుతోంది. బుధవారం ఒక్కరోజే 93,528 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య కోటీ 24 లక్షలను దాటేసింది. ఫిబ్రవరిలో 97 శాతానికి పెరిగిన రికవరీ రేటు..ఇప్పుడు 88.92 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  మహారాష్ట్ర కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అంటే, దేశంలో నమోదవుతున్న కేసుల్లో నాలుగోవంతు మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఢిల్లీని సైతం కొవిడ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుట్టలుగా శవాలు పేరుకుపోతున్నాయి. శ్మశానవాటికల్లో స్థలం ఖాళీలేదని వార్తలు వస్తున్నాయి.  జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ సైతం కరోనా కబ్జాలో కూరుకుపోతోంది. మహారాష్ట్ర తర్వాత యూపీలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉండటం, పండగల సీజన్ కావడంతో కొవిడ్ కు రాచమార్గం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో యూపీలో 20,439 కొత్త కేసులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీని సైతం కరోనా గడగడలాడిస్తోంది. ఢిల్లీలో ఒక్కరోజులో 17,282 మందికి కరోనా సోకింది.   ఇక, ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్ మాత్రమే ఉన్నాయి. గతంలో అమెరికాలో ఒకే రోజు అత్యధికంగా 3 లక్షలకుపైగా రోజూవారీ కేసులు నమోదవగా.. తాజాగా భారత్‌లో ఒకే రోజు అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది.  ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు వ్యాక్సినేషన్ సైతం అంతే జోరుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మూడు దశల్లో నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద బుధవారం 33,13,848 మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో, ఇప్పటి వరకు మొత్తం 11,44,93,238 టీకా డోసుల పంపిణీ పూర్తైంది.