వ్యాక్సిన్ తీసుకుంటే రేషన్, ఎగ్స్ ఫ్రీ!
posted on Apr 20, 2021 @ 5:17PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ లో భయంకరంగా విరుచుకుపడుతోంది. ప్రస్తుతం కరోనా పంజాతో భారత్ విలవిలలాడుతోంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కొవిడ్ వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేశారు. టీకా తీసుకోవడానికి భయపడే జనాలకు అవగాహన కల్పిస్తూ.. అందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పించినా టీకాలు తీసుకోవడానికి జనాలు ఆసక్తి చూపడం లేదు. దీంతో వ్యాక్సిన్ తీసుకునేవారికి రాయితీలు, ఆఫర్ లు ప్రకటిస్తున్నారు. రేషన్ ఫ్రీగా ఇస్తామని, గుడ్లు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఉన్నది ఎక్కడో కాదు.. కొవిడ్ కు పుట్టినిల్లు చైనాలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ ను సమర్థంగానే కట్టడి చేయగలిగింది. అయితే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక మాత్రం చైనా ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. వ్యాక్సిన్లు వేయించుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో ప్రజలను ఆకర్షించేందుకు చైనా ఆఫర్లు ప్రకటిస్తోంది.
వ్యాక్సిన్ తీసుకున్నవారికి 3 కిలోల గుడ్లు ఉచితం అని, సూపర్ మార్కెట్ షాపింగ్ కూపన్లు ఫ్రీ అని ఊరిస్తోంది. రేషన్ సరకులపై రాయితీలు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. అయినా జనాల్లో ఆశించిన మేర స్పందన రావడంలేదు. సుమారు 140 కోట్ల జనాభా కలిగిన చైనాలో ఇప్పటివరరకు టీకా వేయించుకుంది 19 కోట్ల మందే. దాంతో మిగతావారిని ఎలా వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకురావాలో అర్థంకాక చైనా ప్రభుత్వం తలపట్టుకుంటోంది