షాపులు 4 గంటలే.. నిత్యవసరాలకూ ఆంక్షలే..
posted on Apr 20, 2021 @ 3:58PM
ఇప్పటికే నైట్ కర్ఫ్యూ. వీకెండ్ లాక్‌డౌన్. జనతా కర్ఫ్యూ. ఇవి చాలవన్నట్టు.. నిత్యావసరాలపై కూడా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. కిరాణా, కూరగాయలు, పండ్లు తదితర షాపులు ఉదయం వేళ.. కేవలం 4 గంటల పాటు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించింది. కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
‘‘కిరాణాలు, కూరగాయల దుకాణాలు, పండ్ల విక్రయాలు, బేకరీలు, అన్ని రకాల ఆహార దుకాణాలు (మాంసం విక్రయాలు కూడా), వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు అమ్మే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. హోం డెలివరీలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య చేయాలి’’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ ఆంక్షలు మంగళవారం రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది.
రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి ఉన్నప్పటికీ నిత్యావసర సరుకుల పేరుతో చాలా మంది జనం బయటకు వస్తున్నారని, దీంతో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్ 14 రాత్రి నుంచి జనతా కర్ఫ్యూ పేరుతో లాక్‌డౌన్ తరహా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అయితే ఇందులో కూరగాయలు, కిరాణా దుకాణాలు, ఆహారశాలలు తదితర నిత్యావసరాలకు మినహాయింపు కల్పించింది. తాజాగా వాటిపైనా ఆంక్షలు విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం.