ఒక్క రోజులో 35 మరణాలు.. ఏపీలో కరోనా బీభత్సం
posted on Apr 20, 2021 @ 5:49PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా బీభత్సం స్పష్టిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 35 మందిని బలి తీసుకుంది. గత 24 గంటల్లో ఏపీలో దాదాపు 9 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 37,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అంటే పరీక్ష చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా సోకింది. టెస్టుల సంఖ్య పెంచితే ఇంతకు రెండింతలు కేసులు నమోదవుతాయని భావిస్తున్నారు. గతంలో ఏపీలో రోజుకు లక్ష వరకు టెస్టులు చేసేవారు. కాని ప్రస్తుతం 40 వేల లోపే కరోనా టెస్టులు చేస్తున్నా.. 9 వేల వరకు కేసులు రావడం ఆందోళన కల్గిస్తోంది.
చిత్తూరుతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది మరణించగా, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు కరోనాతో కన్నుమూశారు. తిరుపతి ఉప ఎన్నిక జరిగిన నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో కరోనా పంజా విసురుతుందని అధికారులు చెబుతున్నారు. కొవిడ్ రూల్స్ పట్టించుకోకుండా ప్రచారం చేయడం వల్లే కరోనా విజృంభించిందని చెబుతున్నారు.
గత 24 గంటల వ్యవధిలో ఏపీలో 3,116 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 9,76,987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,15,626 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 53,889 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 7,472కి పెరిగింది.