టీకాల భారం రాష్ట్రాలదే! కేంద్రం చేతులెత్తేసిందా?
posted on Apr 20, 2021 @ 12:17PM
దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ మూడో దశలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించింది. వ్యాక్సిన్ తయారీదారులు 50 వ్యాక్సిన్‌లను కేంద్ర ప్రభుత్వానికి, మరో 50 శాతం వ్యాక్సిన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఓపెన్ మార్కెట్‌కు కూడా సరఫరా చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర సర్కార్ తాజా నిర్ణయంతో కొవిడ్ టీకాల భారం ఇకపై రాష్ట్రాలపై పడనుంది. ఇప్పటివరకు కేంద్రమే టీకాలను పంపిణి చేస్తోంది.
కేంద్ర సర్కార్ నిర్ణయంపై కొన్ని రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొవిడ్ తో ఇప్పటికే ఆదాయం తగ్గిపోయి చాలా రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీకాల భారం మోపడం సరికాదనే అభిప్రాయం వస్తోంది. రాష్ట్రాలు ఫార్మా కంపెనీల నుంచి నేరుగా కొనే అవకాశం కల్పించడం కూడా సరికాదంటున్నారు. దీనివల్ల ధనిక రాష్ట్రాలు ఎక్కువగా టీకాలు కొనుగోలు చేసే అవకాశం ఉందనే చర్చ వస్తోంది. దేశంలో అవసరమున్న అందరికి టీకా అందకుండా.. ధనవంతులకే దక్కేలా కేంద్ర సర్కార్ నిర్ణయం ఉందంటున్నారు.
కొవిడ్ టీకా విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సమస్య తీవ్రంగా ఉంది.మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ను ధనిక, సంపన్న దేశాలు గంపగుత్తగా కొని పెట్టికుంటుండగా.. పేద దేశాలు మాత్రం చేతులెత్తేశాయి. వ్యాక్సినేషన్ ప్రారంభమై ఐదారు నెలలు అవుతున్నా.. ఇంకా కొన్ని దేశాలకు వ్యాక్సిన్ అందలేదు. పేద దేశాలకు టీకా అందని ద్రాక్షలానే మిగిలే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో దేశంలోని రాష్ట్రాల మధ్య టీకాల కోసం పోటీ ఏర్పడి.. అందరికి అందకుండా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మే1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించాలని కూడా కేంద్రం నిర్ణయించింది.దేశవ్యాప్తంగా కరోనా ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. కరోనాను అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచించారు. ఈ క్రమంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపాలన్న డిమాండ్ వినిపించింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రులు ఈ దిశగా కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తులు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.