ఊరికి ఊరే రిజిస్ట్రేషన్! వ్యాపారికి రాసిచ్చిన అధికారులు 

భూ రిజిస్ట్రేషన్లలో భారీగా అక్రమాలు జరుగుతుంటాయి. ఒకరి భూమిని ఒకరికి తెలియకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు అధికారులు, కాసుల కక్కుర్తిలో ప్రభుత్వ భూములను అప్పనంగా పట్టాలు ఇచ్చేస్తుంటారు. ఫారెస్ట్, ఇరిగేషన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన ఘటనలు గతంలో చాలా వెలుగుచూశాయి. అయితే తాజాగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన బాగోతం మాత్రం అందరిని షాకింగ్ కు గురి చేస్తోంది.  నిర్మల్ జిల్లాలో 19 ఏళ్ల క్రితం జరిగిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పెంబి మండలంలోని వేణునగర్‌ ఆదివాసీలు గతంలో అటవీ ప్రాంతంలోని కొత్తచెరువుగూడలో నివసించేవారు. ఆ గ్రామం నుంచి పెంబి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న 4.32 ఎకరాల అసైన్డ్ వ్యవసాయ భూమిని  రూ. 60 వేలకు కొనుగోలు చేసిన ఆదివాసీలు అక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ భూమిపై కన్నేసిన  పెంబికి చెందినఓ వ్యాపారి 2002లో.. అక్కడ ఉంటున్న వారికి , విక్రయించిన వారికి కానీ తెలియకుండా తన భార్య పేరున గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ భూమి ధర కోటి రూపాయలకు పైగా పలుకుతోంది. ‘ధరణి’లో ఈ భూమి వ్యాపారి పేరుపైనే అసైన్డ్ భూమిగా నమోదై ఉంది. అంతేకాదు  గత మూడేళ్లుగా రైతు బంధు సాయం కూడా ఆ వ్యాపారి తీసుకుంటున్నారు.   తాజాగా వ్యాపారి వచ్చి ఆ భూమి తనదేనని చెప్పడంతో రైతులు విస్తుపోయారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సర్పంచ్ రాధతో కలిసి తహసీల్దార్‌కు గ్రామస్థులు విన్నవించారు. తమకు పట్టాలు ఇవ్వమంటే ఇవ్వని అధికారులు వ్యాపారికి మాత్రం అక్రమంగా పట్టా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామాన్నే రాసివ్వడంపై అంతా ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. 

వైసీపీ నేతను చితక్కొట్టిన ఓటర్లు! 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. బురదగాలి కొత్తపాళెంలో వరప్రసాద్‌ను ఓటర్లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేతో వెళ్లిన వైసీపీ నాయకుడిని చితక్కొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రెండేళ్లుగా తమ సమస్యలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్టమూరు మండలం బురదగాలి కొత్త పాళెం పంచాయతీలో సుమారు 2,000మంది ఓటర్లు ఉన్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు రోడ్డు, తాగునీటి సమస్య తీర్చ లేదని అప్పట్లో ఓటు వేయకుండా స్థానికులు బహిష్కరించారు. అప్పటి ఎమ్మెల్యే  అభ్యర్థి డా. వెలగపల్లి వరప్రసాద్ రావు ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు వేస్తే గెలిచిన 6 నెలలకే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అయితే ఎమ్మె‌ల్యేగా గెలిచిన తరువాత ఇచ్చిన హామీ నెరవేర్చ లేదు ఎమ్మెల్యే వరప్రసాద్.  తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఎవ్వరు సమస్యలను గుర్తించలేదని ఎంపీ ఎన్నికలను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ బురద గాలి కొత్త పాళెం వెళ్లి ఓటర్ల‌కు సర్ది చెప్పినా వినలేదు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ద్వారా సర్ది చెప్పినా ఓటర్లు వినలేదు.

నాగార్జున సాగర్ ఎగ్టిట్ పోల్.. గెలుపు ఆ పార్టీదే? 

తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్ గా నిలిచిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ నమోదైంది.  కరోనా భయపెడుతున్నా సాగర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు కనిపించాయి. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉండగా.. రికార్డ్ స్థాయిలో 85 శాతానికి పైగానే ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నిక‌ల్లో 41 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. అంచనా కంటే మించి ఓటింగ్ నమోదు కావడంతో ఫలితంపై పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది. పోలింగ్ ఎక్కువ నమోదు కావడం తమకే లాభిస్తుందని అధికార పార్టీ భావిస్తుండగా.. ప్రజా వ్యతిరేకత వల్లే ఓటింగ్ పెరిగిందని, తమకే కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.  నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. త్రిపురారం, గుర్రంపోడు,తిర్మలగిరి సాగర్, పెద్దవూర, అనుమల,నిడమనూర్ తో పాటు మాడ్గుల మండలంలోని పది గ్రామాల్లో సాగర్ పరిధిలోకి వస్తాయి. అన్ని మండలాల్లోనూ ఓటింగ్ భారీగానే నమోదైంది. గుర్రంపొడు మండలంలో 34 వేల 622 మంది ఓటర్లు, పెద్దవూర మండలంలో 44 వేల 658,  తిరుమలగిరి మండలంలో 31 వేల 431 మంది ఓటర్లు,అనుముల మండలంలో  33 వేల 753, నిడమనూరు మండలంలో 34 వేల 214 ఓట్లు వున్నాయి. మాడుగులపల్లి మండలంలో  7 వేల 225 ఓట్లు ఉండగా.. త్రిపురారం మండలంలో 33 వేల 842 మంది ఓటర్లున్నారు. అయితే అన్ని మండలాల్లోనూ 85 శాతంగా పోలింగ్ జరిగింది.  నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎవరూ గెలుస్తారన్న దానిపై పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. గతంలో మూడు సార్లు ప్రీపోల్ సర్వే నిర్వహించిన పల్స్ టుడే.. ఎగ్టిట్ పోల్ కూడా నిర్వహించింది. ఎగ్జిట్ పోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు లీడ్ కనిపిస్తోంది. 48 - 51 శాతం ఓట్లు టీఆర్ఎస్ కు వస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి 38-42  శాతం ఓట్లు సాధిస్తారని సర్వేలో తేలింది. సాగర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి మాత్రం డిపాజిట్ వచ్చే అవకాశం కన్పించడం లేదు. రవినాయక్ కు కేవలం 10 -12 శాతం ఓట్లే లభిస్తాయని సర్వేలో వెల్లడైంది.  మండలాల వారీగా చూస్తే మొత్తం ఏడు మండలాల్లో  మూడు మండలాల్లో టీఆర్ఎస్ కు మంచి లీడ్ వస్తుండగా  ఒక మండలంలో కాంగ్రెస్ కు ఆధిక్యత వస్తుందని పల్స్ టుడే అంచనా వేసింది. మూడు మండలాల్లో మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గుర్రంపోడు, తిరుమల గిరి సాగర్, మాడ్గుల మండలాల్లో కారుకు లీడ్ రానుండగా... హాలియా అనుమల మండలంలో కాంగ్రెస్ కు మంచి మెజార్టీ రానుంది. పెద్దవూర,  నిడమనూర్ , త్రిపురారం మండలాల్లో రెండు పార్టీల మధ్య టప్ ఫైట్ నడిచింది. పెద్దవూర మండలంలోని 11 గ్రామాల్లో టీఆర్ఎస్, 10 గ్రామాల్లో కాంగ్రెస్ కు అనుకూలత కన్పించింది. త్రిపురారం మండలంలో 11 గ్రామాల్లో టీఆర్ఎస్, ఐదు గ్రామాల్లో కాంగ్రెస్ కు లీడ్ కనిపించగా.. 8 గ్రామాల్లో హోరాహోరీ ఉంది. నిడమనూర్ మండలం 11 గ్రామాల్లో టీఆర్ఎస్, 4గ్రామాల్లో కాంగ్రెస్ కు లీడ్ వస్తుండగా.. ఆరు గ్రామాల్లో టఫ్ ఫైట్ ఉంది. ఇక హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు పోలింగ్ సానుకూలంగా ఉండగా.. నాగార్జున సాగర్ పట్టణంలో మాత్రం కారుకు ఏకపక్షంగా సాగిందని పల్స్ టుడే సర్వేలో తేలింది.   సామాజిల వర్గాల వారీగా చూస్తే యాదవ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగా.. రెడ్డి సామాజిక వర్గ ఓట్లలో మెజార్టీ జానారెడ్డికి పడ్డాయని సర్వే అంచనా వేసింది. గిరిజనుల ఓట్లను ఈసారి టీఆర్ఎస్ భారీగానే సాధించవచ్చని తెలుస్తోంది. అయితే లంబాడీల ఓట్లలో బీజేపీ అభ్యర్థికి కూడా కొంత ఓటు పడింది. ఇవన్ని జానారెడ్డికి మైనస్ అయిందని చెబుతున్నారు. దళితుల ఓట్లు చెరిసగం పడే అవకాశం ఉంది. మైనార్టీ ఓట్లలో ఎక్కువగా అధికార పార్టీకి పడ్డాయని పల్స్ టుడే అంచనా. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేసిన ఓటర్లు మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కన్పించింది. మొత్తంగా నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు.. జానారెడ్డి కంటే దాదాపు 8-11 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పల్స్ టుడే అంచనా వేసింది. టీఆర్ఎస్ పోల్ మేనేజ్ మెంట్ ముందు కాంగ్రెస్ ఢీలా పడిందని తెలుస్తోంది. కేసీఆర్ సభ తర్వాత టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడంతో కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది కల్గిందని చెబుతున్నారు.నెల్లికల్ లిఫ్ట్ కూడా టీఆర్ఎస్ కు భారీగానే ఓట్లు కురిపించిందని పల్స్ టుడే నిర్వాహకులు కంబాలపల్లి కృష్ణ వివరించారు.   

ఇంట్లో కూడా మాస్క్ పెట్టాల్సిందే!

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతుండటంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని తెలంగాణ హెల్త్‌  డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సుమారు 5 వేల కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. వైరస్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ప్రపంచదేశాలు కరోనాకి మొకరిల్లుతున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ మొదటి వేవ్‌లో 30 నుంచి 50 లక్షల మంది చనిపోయారని శ్రీనివాసరావు  తెలిపారు. స్పానిష్ ఫ్లూ రెండో వేవ్‌లో 2 నుంచి 7 కోట్ల మంది మృతి చెందినట్టు సమాచారం. మార్చ్ 24న తెలంగాణలోని ఓ జిల్లాకి మహారాష్ట్ర నుంచి 20మంది ఉత్సవం కోసం వచ్చారని పేర్కొన్నారు. మరో 30 మంది తెలంగాణ వాళ్లు వారికి జత కలిశారని ఆయన చెప్పారు. ఈ నెల 4న టెస్ట్‌లు చేస్తే అందులో 34 మందికి కరోనా వచ్చిందని తెలిపారు. ఆ ఘటన తర్వాత 433 మందికి వైరస్ సోకిందన్నారు. తెలంగాణలో ఇదే అతి పెద్ద ఔట్ బ్రేక్ అన్నారు. రాష్ట్రంలో డబుల్ మ్యుటేషన్ లు వచ్చాయన్నారు హెల్త్‌  డైరెక్టర్‌ శ్రీనివాసరావు. టెస్ట్ ల సంఖ్య పెంచామన్నారు. పాజిటివిటీ రేట్ 2.98 శాతంగా ఉందన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 1.5 మాత్రమే పాజిటివిటీ రేట్ ఉండేదని చెప్పారు.ప్రైమరీ హెల్త్ కేంద్రాలకు టెస్ట్ ల కోసం జనం భారీగా వస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు.  రాష్ట్రంలో 38 వేల 600 బెడ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో 53 వేలకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 5 వేల ఆక్సిజన్ బెడ్స్ ప్రైవేట్ లో   ఉన్నాయని వెల్లడించారు.కొన్ని పెద్ద ఆస్పత్రుల్లో మాత్రమే బెడ్స్ లేవని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ లు, ఆక్సిజన్, బెడ్స్, మందులు, సిబ్బంది కొరత లేదని చెప్పారు శ్రీనివాసరావు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందాలని సూచించారు. మందులను అతిగా వాడటం మంచిది కాదన్నారు. రేమిడిస్వీయర్  వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాడాలని హెచ్చరించారు.  మరో  6 నుంచి 8 వారాల వరకు ప్రజలు జాగ్రత్త గా ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించాలని  హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. lancet జర్నల్ లో కూడా గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని తెలిపిందన్నారు. ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 1300 లకు పైగా కేంద్రాల్లో వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు.ఇప్పటి వరకు 28 లక్షల మందికి వ్యాక్సిన్. అందులో 25 లక్షల మందికి మొదటి డోస్ పూర్తి అయిందని, మరో 3 లక్షల మంది కి రెండో డోస్ కూడా పూర్తి అయిందని వెల్లడించారు. శుక్రవారం  ఒక్కరోజే 170000 వేల మందికి వ్యాక్సినేషన్ వేశామన్నారు శ్రీనివాసరావు. 2020 కన్నా ఇప్పుడు వైరస్ తీవ్రంగా ఉందని గాంధీ సూపరిండెంట్ డాక్టర్ రాజారావు చెప్పారు.  వేగంగా ఒకరినుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతోందన్నారు. లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఉండీ చికిత్స పొందవచ్చని సూచించారు. అత్యంత తీవ్రంగా వైరస్ లక్షణాలు ఉన్న వారికి మాత్రమే  ఐసీయూ అవసరం అవుతుందన్నారు రాజారావు. ప్రస్తుతం యువతలో ఎక్కువగా కోవిడ్ సోకుతోందని తెలిపారు. ఉన్న బెడ్స్ ని సరిగా వాడుకుంటే అవసరం అయిన వారికి చికిత్స అందించడం సులభం అవుతుందన్నారు డాక్టర్ రాజారావు.

అత్తకోడళ్ల గొడవ.. తల్లిని చంపిన కొడుకు.. 

అతని పేరు మంకిలి శివ. ప్రేమ వివాహం చేసుకున్నాడు. జేసీబీ నడుపుతూ జీవనం సాగించేవారు. ఏ కుటుంబంలోనైనా అత్త కోడల మధ్య గొడవ సహజం. కానీ శివ కుటుంబంలో అత్త కోడల్ల గొడవతో విసిగిపోయిన కొడుకు కన్న తల్లినే దారుణంగా చంపేశాడు. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పోలికేపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలికేపాడు గ్రామంలో మంకిలి శివ తల్లి మంకిలి కషమ్మ ,భార్య తో నివాసముంటున్నది.  అయితే ఇటీవల శివ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. చీటికి మాటికి అత్తకొడళ్లు గొడవలు పెట్టుకునేవారు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి సుమారు 6 నుండి 7 గంటల మధ్య శివ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. అతను రావడంతోనే అత్త కోడళ్ళ మధ్య గొడవ మాట మాట పెరగడం మొదలైంది. అప్పటికే శివ మద్యం సేవించి ఉన్నాడు. దీంతో తల్లి మాటలకు ఆవేశం తట్టుకోలేని శివ గొడ్డలి తో మెడపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన డీఎస్పీ కిరణ్ కుమార్,సీఐ సూర్యనాయక్. నిందితుడిని అదుపులోకి తీసుకొని,మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించామని ఎస్సై వామన్ గౌడ్ తెలిపారు.  

సచివాలయంలో క‌రోనా డెత్‌.. ఉద్యోగుల్లో టెన్ష‌న్‌

ఏపీ సచివాలయంలో కరోనాతో ఉద్యోగి చ‌నిపోవ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పని చేసే వి. పద్మారావు కొవిడ్‌తో కన్నుమూశారు. దీంతో సచివాలయం ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది.  సెకండ్ వేవ్ క‌రోనా క‌ల్లోలం మొద‌ల‌య్యాక ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో పాజిటివ్ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. వివిధ విభాగాల్లో ఇప్పటికే 50 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో సచివాలయంలో పని చేసేవారికి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా, సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. భారీగా పాజిటివ్ కేసులు నమోదైన‌ట్టు తెలుస్తోంది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబాలకు కరోనా వైరస్ సోకింది. కొవిడ్‌ భయంతో ఉన్నతాధికారులు మాత్రం విజయవాడ, గుంటూరుల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కారణంగా మరోసారి ‘వర్క్‌ ఫ్రం హోం’ ఇవ్వాల్సిందిగా ఉద్యోగులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

కూతురితో లవ్ .. తల్లితో.. 

వాళ్లిద్దరూ ఇద్దరు ప్రేమికులు. రెండేళ్లు ఏళ్ళు ప్రేమ కథలు చెప్పుకున్నారు . ఒకరి మనసులు ఒకరికి ఇచ్చుకున్నారు. వారి ప్రేమ కులాల అడ్డుగోడలతో విడిపోయింది..  ఒక్క సరిగా వారి కలలు చెదిరిపోయాయి.  నాకు త్వరలో పెళ్లి చేయబోతున్నారు. అని తన ప్రియుడితో చెపింది ఆ యువతి.. ప్రియురాలు నోటినుండి ఆ మాట విన్న ప్రియుడు గొంతు మూగబోయింది. ఏం చేయలేని పరిస్థితిలో అక్కడి నుండి వెనుతిరిగాడు. తల్లిదండ్రుల బలవంతంతో యువతి పెళ్లికి ఓకే చెప్పింది. దీంతో వెంటనే అమ్మాయికి వేరే యువకుడితో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి.  కట్ చేస్తే.. ప్రియుడు షాక్ ఇచ్చాడు. రూ.ల‌క్షా 50 వేలు ఇవ్వాల‌ని, లేక‌పోతే త‌న‌తో ఏకాంతంగా గ‌డిపిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టుచేస్తాన‌ని బెదిరించాడు. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ళ యువకుడు తన కాలేజీ లో చదివే యువతి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో కులాలు వేరు.. ఈ పెళ్లి జరగదు అంటూ అమ్మాయికి వేరే సంబంధం చూశారు. దీంతో కొద్దికాలం మౌనంగా ఉన్న ప్రియుడు, ప్రియురాలి పెళ్లికి మరికొన్ని రోజులు ఉందనగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రూ.ల‌క్షా 50 వేలు ఇవ్వాల‌ని, లేక‌పోతే త‌న‌తో ఏకాంతంగా గ‌డిపిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టుచేస్తాన‌ని యువతిని బెదిరించాడు. అమ్మాయి పెళ్లి ఆగిపోతుంది, పరువు పోతుంది అని గ్రహించిన యువతి తల్లి అతడు అడిగిన మొత్తాన్ని చెల్లించింది. అయిన‌ప్ప‌టికీ అత‌డు.. యువ‌తి పెళ్లిచేసుకోబోయే వ్య‌క్తికి ఆ వీడియోల‌ను పంపించాడు. ఆ వీడియోలను చూసిన పెళ్ళికొడుకు తనకు పెళ్లి వద్దని రద్దు చేశాడు. దీంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ప్రియుడును అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

రియల్ స్టార్ కి కరోనా.. 

రియల్‌ హీరో, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కి కరోనా భారీన పడ్డారు.  దీంతో ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం సోనూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ఈరోజు ఉదయం నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. కానీ, మీరు ఏమాత్రం బాధపడకండి.. మీ సమస్యలను తీర్చేందుకు దీనివల్ల నాకు మరింత సమయం దొరికింది. గుర్తుపెట్టుకోండి నేను ఎప్పటికీ మీకు అండగా ఉంటాను. మీకోసం ఉంటాను’ అని సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు.   ఉపాధి వేటలో భాగంగా వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలకు గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో సోనూసూద్‌ ఎన్నో సేవలు అందించారు. ప్రయాణ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీల కోసం బస్సులు, రైళ్లను ఆయన ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా విదేశాల్లో చిక్కుకున్న కొంతమంది భారతీయ విద్యార్థులను సైతం స్వదేశానికి తీసుకువచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే గత కొన్నిరోజుల క్రితం ఆయన ‘ఆచార్య’ షూట్‌లో పాల్గొన్నారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్‌ ప్రతినాయకుడి పాత్రలో మెప్పించనున్నారు.  

దొంగ ఓట్లు, రిగ్గింగ్ కలకలం.. తిరుపతి ఉపఎన్నిక రద్దు? 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అధికార పార్టీ దౌర్జన్యాలకు దిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తరలించారని తెలుస్తోంది. నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ఓటర్లు ప్రయత్నించారని  ఉదయం నుంచే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఫేక్ ఓటరు కార్డులతో ఓటేసేందుకు కడప నుంచి వచ్చినట్లు గుర్తించారు. బయటి నుంచి వచ్చిన ఓటర్లకు స్లిప్‎లను వాలంటీర్లు పంపిణీ చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు.బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా ఆమె పట్టుకున్నారు. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చారని  విపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నా యథేచ్చగా వైసీపీ నేతలు తిరుగుతున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.   తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. ఉప ఎన్నిక పోలింగ్‌ రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల సాయంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఉన్న ఆధారాలను పరిశీలించి మిగతా చోట్ల రీపోలింగ్‌ పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు  తిరుపతి ఉపఎన్నికకు  వందల బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సరిహద్దులు మూసివేసి తనిఖీలు చేసి పంపాల్సిందని.. ఎందుకు చెక్‌పోస్టులను ఎత్తివేశారు? అని నిలదీశారు. తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో వేల మందిని ఉంచితే.. పోలీసులు నిద్రపోతున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ నేత శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారన్నారు.  దొంగ ఓటర్లను పట్టిస్తే టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. బందిపోట్లను మైమరిపించేలా వైసీపీ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. తండ్రి పేరు చెప్పలేని వాళ్లు దొంగ ఓటర్లు కాక మరేంటి? అని  ప్రశ్నించారు. మంత్రులు బరితెగించి తిరుపతిలో ఉంటే.. అధికార పార్టీకి ఊడిగం చేస్తామన్నట్లు పోలీసుల తీరుందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.  వైసీపీ మాఫియా చేతిలో ప్రజాస్వామ్యం బలైపోవాలా? అని చంద్రబాబు నిలదీశారు.  ఎక్కడి నుంచో ముఠాలను దించి తిరుపతిపై దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై అరాచకాలు చేశారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఏం పని?.. ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు.. వైసీపీ మరో వైపు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌  పంపిన మైక్రో అబ్జర్వర్లు ఏమయ్యారు? అని  చంద్రబాబు ప్రశ్నించారు.  ఇలానే వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్ర‌జాస్వామ్య‌మా? దొంగ‌స్వామ్య‌మా?

నీ పేరేంటి? అటునుంచి మౌనం. మీ ఊరేంటి? మ‌ళ్లీ సైలెన్స్‌. మీ ఇంటి అడ్ర‌స్ చెప్పు? తెలీదు. ఇక్క‌డికి ఎందుకొచ్చారు? దేవుడి ద‌ర్శ‌నానికి. ఇక్క‌డేం ప‌ని? హాస్పిట‌ల్‌కు వ‌చ్చా. ఇవ‌న్నీ తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల్లో దొంగ ఓట‌ర్ల డ్రామాలు. పోలింగ్ బూతు ముందు క్యూ లైన్ల‌లో ద‌ర్జాగా నిలుచున్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ చాంతాడంత క్యూలు. అంద‌రి చేతిలో ఓట‌ర్ ఐడీ కార్డులు ఉన్నాయి. కానీ, వారెవ‌రో అక్క‌డి పోలింగ్ ఏజెంట్ల‌కు తెలీదు. ఇదేంటీ ఇంత‌మంది ఉన్నారేంటి?  వీరెవ‌రూ ఇక్క‌డి వారిలా క‌నిపించ‌డంలేదే. ఇన్నేళ్ల‌లో వీళ్ల‌ను ఎప్పుడూ చూడ‌లేదే? ఇదీ స్థానికుల‌కు వ‌చ్చిన అనుమానం. అదే అనుమానంతో క్యూ లైన్ల‌లో ఉన్న ఓట‌ర్ల‌ను ప్ర‌శ్నించారు. మీ పేరేంటి? ఏ ఏరియా? ఇంటి నెంబ‌ర్ చెప్పు? ఇలా ఏ ప్ర‌శ్న‌కూ ఆ ఓట‌ర్ల ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. ఎందుకంటే వారెవ‌రూ అక్క‌డి వారు కాదు కాబ‌ట్టి. వారంతా దొంగ ఓట‌ర్లు. అధికార వైసీపీకి ఓటేసేందుకు ప‌క్క జిల్లాల నుంచి త‌ర‌లించారు.  ఏ ప‌ది మందో.. పాతిక మందో కాదు. తెల్ల‌వార‌క ముందే బ‌స్సుల‌కు బ‌స్సులు తిరుప‌తిలో దిగాయి. క‌డ‌ప జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నేత ఈ బ‌స్సుల‌ను అరేంజ్ చేశాడ‌ట‌. మొత్తం 8 ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సులు. మ‌రో 8 స్కూల్ వ్యానులు. బ‌స్సుల నిండా కిక్కిరిసిన జ‌నం. బ‌స్సుల‌ను ఏరియాల వారీగా పార్క్ చేశారు. క‌డ‌ప నుంచి తీసుకొచ్చిన జ‌నాన్ని ప్రాంతాల వారీగా పంపించారు. వాళ్లంతా దొంగ‌ ఓట్లు వేయ‌డంతో ఎక్స్‌ప‌ర్ట్స్ అట‌. తిరుప‌తిలో ఎలాగైనా గెల‌వాల‌ని, సాధ్య‌మైనంత మెజార్టీ పెంచుకోవాల‌ని ఇలా ప‌క్క జిల్లాల నుంచి దొంగ ఓట‌ర్ల‌ను డంప్ చేశారు వైసీపీ నాయ‌కులు. క‌డ‌ప‌కు చెందిన ఒక్క లీడ‌రే అన్ని బ‌స్సుల్లో జ‌నాల్ని త‌ర‌లిస్తే.. ఇక మిగ‌తా నాయ‌కులు ఎంత‌మందిని త‌ర‌లించి ఉంటారో?  దొరికిన వాళ్లే దొంగలు.. దొర‌క్కుండా దొంగ‌చాటుగా ఓటేసిన కేటుగాళ్లు ఇంకెంద‌రో. పోలీసుల లెక్క ప్ర‌కార‌మే 250కి పైగా బ‌స్సుల‌ను తిరుప‌తి రాకుండా వెన‌క్కి పంపించారంటే ఏ రేంజ్‌లో దొంగ ఓట్ల‌కు అధికార పార్టీ ప్లాన్ చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. వెంక‌న్న భ‌క్తుల ముసుగులో కొంద‌రు.. ఆసుప‌త్రిలో చూపించుకోవాలంటూ రోగులమంటూ మ‌రికొంద‌రు.. చుట్టాలింటికొచ్చామ‌ని ఇంకొంద‌రు‌.. ప‌క్కా ట్రైనింగ్‌తో వ‌చ్చిన‌ట్టున్నారు దొంగ ఓట‌ర్లు. కాస్త లేటైనా.. ఎట్ట‌కేల‌‌కు టీడీపీ శ్రేణులు దొంగ ఓట‌ర్ల‌ను గుర్తించి ఎక్క‌డిక‌క్క‌డ వారిని అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ గుడుపుఠాని మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ విష‌యం తెలిసినా, మీడియా సాక్షిగా దొంగ ఓట‌ర్లు దొరికిపోయినా.. పోలీసులు ప‌ట్టించుకోక‌పోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఎన్నిక‌ల సిబ్బంది ఉదాసీన‌త‌తోనే ఇంత భారీ స్థాయిలో దొంగ ఓటింగ్ జ‌రుగుతోంద‌ని టీడీపీ శ్రేణులు ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌కు దిగారు. అయినా, అధికారుల్లో స్పంద‌న లేక‌పోయింది. పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా, దొంగ ఓట‌ర్ల‌ను ప‌ట్టుకున్న తెలుగుదేశం నాయ‌కుల‌పైనే కేసులు పెట్ట‌డం విచిత్రం. పోలింగ్ జ‌రుగుతున్న చోట ఆ ప్రాంతం కాని వారు అక్క‌డ ఉండ‌టం నిషిద్ధం. ఈ రూల్ అంద‌రికీ తెలుసు. తెలిసి కూడా మంత్రి పెద్దిరెడ్డితో స‌హా ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయ‌కులు పోలింగ్ జ‌రుగుతున్న ఏరియాల్లో మ‌కాం వేసి ఓటింగ్ స‌ర‌ళిని మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు. తిరుప‌తిలో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌లు ఆరోపిస్తున్నా ప్ర‌యోజ‌నం లేకుండాపోయింది. అధికారులు, పోలీసుల సాయంతో.. అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లో.. తిరుప‌తిలో ప్ర‌జాస్వామ్యం ప‌రిహాస్యం జ‌రుగుతోందని టీడీపీ మండిప‌డుతోంది. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో 6 ల‌క్ష‌ల మెజార్టీ సాధిస్తామంటూ అధికారు పార్టీ ప్ర‌గల్బాలు ప‌లుకుతుంటే ఏమో అనుకున్నాం.. ఇలా దొంగ ఓట్ల‌తోనా? అని ప్ర‌తిప‌క్షాలు క‌న్నెర్ర చేస్తున్నాయి.‌

ప‌వ‌న్‌కు ఫ‌స‌క్‌.. గాజుగ్లాసు గ‌ల్లంతు  

ప‌వ‌న్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అదే రోజు గాజుగ్లాసు గ‌ల్లంతైంది. ఏరుకోరి ఎంచుకున్న గ్లాసు. ముచ్చ‌ట‌ప‌డి తెచ్చుకున్న గ్లాసు గుర్తు. ప‌వ‌న్‌కు ఎర్ర కండువా ఎంత ఇష్ట‌మో.. సామాన్యులు చాయ్ తాగే గాజుగ్లాసు అంటే కూడా అంతే ఇష్టం. జ‌న సైనికులు ఎప్పుడో గాజుగ్లాసుతో ఎంతో క‌నెక్ట్ అయిపోయారు. గ్లాసు గుర్తుకే మ‌న ఓటంటూ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఊద‌ర‌గొట్టారు. ఓ చేతిలో గాజుగ్లాసు.. మ‌రోచేతిలో త‌ల‌రాత మార్చే ఓటు. జ‌న‌సేన పార్టీకి ఇంత సెంటిమెంట్‌గా మారిన గాజుగ్లాసు ఇక‌పై ఆ పార్టీకి చెంద‌దు. జ‌న‌సేన‌కు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును ఎన్నిక‌ల క‌మిష‌న్ ర‌ద్దు చేసింది. ఈసీ నిర్ణ‌యంతో జ‌న‌సైన్యంలో తీవ్ర నిరుత్సాహం. అదేంటి? ఇంత ప‌ని జ‌రిగిపోయిందేంటని క‌ల‌వ‌రం.  ఒక్క పొర‌బాటు. ఒకే ఒక్క పొర‌బాటు.. గాజుగ్లాసును జ‌న‌సేన‌కు దూరం చేసింది. ఈ మ‌ధ్య జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే ఆ పార్టీ చేసిన త‌ప్పిదం. అందుకు ఫలితం.. ఎంతో ఇష్ట‌మైన గాజుగ్లాసు ప‌గిలిపోవ‌డం.  GHMC ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లకు కూడా పోటీ చేయని కారణంగా జ‌న‌సేన గాజుగ్లాసు గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు.  GHMC ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది జ‌న‌సేన‌. ఆ కారణంగా పోటీ నుంచి తప్పుకుంది. అప్పట్లో ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘంకి లేఖ రూపంలో తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దాని ప్రభావం ఇప్పుడు పడుతుందని అప్పుడు ఆ పార్టీ ఊహించలేదు. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ల‌తో పాటు ప‌లు మున్సిపాలిటీల్లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. అక్క‌డ పోటీ చేయాల‌ని జ‌న‌సేన భావిస్తోంది. త‌మ అభ్య‌ర్థుల‌కు గాజుగ్లాసు సింబ‌ల్ కొన‌సాగించాల‌ని ఎస్ఈసీని కోరింది. కానీ, జనసేన ఇచ్చిన వినతిపత్రంలో అంశాలు సంతృప్తికరంగా లేవని SEC చెబుతోంది. అందుకే ఈ వినతిని ఒప్పుకోవట్లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. జనసేనకు 2025 నవంబర్‌ 18 వరకు కామన్‌ సింబల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లేదని స్పష్టం చేశారు. దీంతో జ‌న‌సేన‌లో క‌ల‌వ‌ర‌పాటు. ఎన్నిక‌ల్లో కామన్ సింబ‌ల్ ఉంటే ఆ కిక్కే వేర‌ప్పా. ఏ పార్టీకైనా ఎల‌క్ష‌న్ సింబ‌ల్ చాలా ఇంపార్టెంట్‌. బీజేపీ అన‌గానే పువ్వు గుర్తు,  కాంగ్రెస్ అన‌గానే చేతి గుర్తు, టీఆర్ఎస్ అంటే కారు, టీడీపీ అంటే సైకిల్‌, వైసీపీ అంటే ఫ్యాను.. ఇలా జ‌నాలు గుర్తు చూడగానే ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఇంకా ప‌క్కాగా చెప్పాలంటే చాలా మంది ఓట‌ర్లు ఈవీఎంల‌లో అభ్య‌ర్థుల పేర్లు, ఫోటోల కంటే సింబ‌ల్ చూసే ఓటేస్తారు. పార్టీ గుర్తుతో అంత‌లా క‌నెక్ట్ అవుతారు ఓట‌ర్లు. జ‌న‌సేన‌కు ఓటేయాలంటే గాజుగ్లాసు ఎక్క‌డుందా అని వెతుకుతారు కానీ, అభ్య‌ర్థి ఎవ‌రో చూడ‌రు. ఎందుకంటే జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కంటే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మీదున్న అభిమానంతోనే ఆ పార్టీకి ఎక్కువ మంది ఓటేస్తుంటారు. అందుకే వారంద‌రికీ స్థానిక‌ కేండిడేట్ కంటే.. ప‌వ‌న్ కల్యాణ్ పార్టీకి చెందిన గాజుగుర్తే ఎక్కువ గుర్తుంటుంది. అలాంటిది తెలంగాణ‌లో మినీ ఎన్నిక‌ల సంగ్రామం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆ పార్టీ ఎన్నిక‌ల గుర్తైన గాజుగ్లాసును కోల్పోవ‌డం జ‌న‌సేన‌కు పెద్ద మైన‌స్. జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని త‌ప్పిదానికి ఇంత పెద్ద శిక్ష ప‌డుతుంద‌ని ఆ పార్టీ ఎప్పుడూ ఊహించ‌క‌పోవ‌చ్చు. అందుకే రాజ‌కీయాల్లో ప్ర‌తీ చిన్న విష‌యంలోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాలంటారు. కొత్త పార్టీ జ‌న‌సేన‌కు ఆ విష‌యం ఇప్పుడు బాగా తెలిసొచ్చి ఉంటుంది. అయితే, గాజుగ్లాసు గుర్తు తెలంగాణ‌లో మాత్ర‌మే ర‌ద్దు కావ‌డం.. ఏపీలో కొన‌సాగుతుండ‌టం కొంత‌లో కొంత ఊర‌ట‌.

కుంభమేళాలో క‌రోనా క‌ల్లోలం.. రంగంలోకి ప్రధాని మోదీ..

కుంభ‌మేళా క‌రోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. ఇప్ప‌టికే వంద‌లాది మంది సాధువులు, వేలాది మంది భ‌క్తులకు కొవిడ్ సోకింది. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న స‌మ‌యంలో హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో కుంభమేళాను నామ‌మాత్రంగానే జరపాలంటూ సాధువులను కోరారు మోదీ.    జునా అఖాడాహెడ్‌ స్వామి అవధేశానంద్‌ గిరితో ప్ర‌ధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సాధువుల ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని.. వారికి ప్రభుత్వం అన్ని విధాలా వైద్యసాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కుంభమేళాను కుదించేలా చూడాలని జునా అఖాడాహెడ్‌ను కోరారు మోదీ.    ‘‘రెండు షాహీ స్నాన్ ‌(రాజ స్నానాలు) పూర్తయ్యాయి కనుక ఇప్పుడున్న కరోనా సంకట పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా(భక్తులెవరూ లేకుండా కేవలం లాంఛనప్రాయంగా కొనసాగించడం) జరపాలని స్వామి అవధేశానంద్‌ గిరిని ప్రార్థించాను. ఈ నిర్ణయం మహమ్మారిపై పోరాటానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది’’అని మోదీ ట్వీటర్‌లో తెలిపారు.    ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో నిత్యం లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు. ఇటీవల ఏప్రిల్‌ 12, 14 రోజుల్లో జరిగిన షాహీ స్నాన్‌లలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కుంభమేళాలో పాల్గొన్న అనేక మంది భక్తులు, పలు అఖాడాలకు చెందిన సాధువులు కరోనా బారినపడ్డారు.  కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో కుంభమేళాను ముగిస్తున్నట్లు నిరంజని అఖాడా ప్రకటించింది. అయితే దీనిపై మిగతా అఖాడాలకు చెందిన సాధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా మూడు, నాలుగు నెలల పాటు కుంభమేళా జరగాల్సి ఉండగా.. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది కుదించి ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయినా, క‌రోనా క‌మ్మేయ‌డంతో ప్ర‌ధాని జోక్యం చేసుకొని త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి! 

తిరుప‌తి  లోక్ సభ ఉప ఎన్నిక‌లో పెద్ద ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందంటూ  ఓ వీడియోను పోస్ట్ చేస్తూ వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు.  'పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి.. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు' అని నారా లోకేష్ ఆరోపించారు. 'పెద్దిరెడ్డి మ‌నుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పీఎల్ఆర్ క‌ల్యాణ మండపంలో మ‌కాం వేసి దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తుంటే టీడీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోలీసులు అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎల‌క్ష‌న్ జ‌ర‌గ‌కుండా సెల‌క్ష‌న్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న తిరుపతి ఎన్నిక‌ని అక్ర‌మార్గంలో గెల‌వాల‌ని నేరుగా తానే రంగంలోకి దిగారు' అని లోకేశ్ చెప్పారు.   'తిరుప‌తి ఉప‌ఎన్నిక‌లో రిగ్గింగ్‌, దొంగ ఓట్ల‌తో నెగ్గాల‌ని వేసిన ప్ర‌ణాళిక‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఇప్ప‌టికైనా కేంద్ర ఎన్నిక‌‌ల క‌మిష‌న్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసేందుకు ఇత‌ర ప్రాంతాల త‌ర‌లివ‌చ్చిన వేలాది మందిని అరెస్ట్‌చేసి సూత్ర‌ధారులపై చ‌ర్య‌లు తీసుకోవాలి' అని ట్విట్ ద్వారా లోకేశ్ డిమాండ్ చేశారు.  

కొంప ముంచిన పేస్ బుక్.. 

అతని పేరు తారక మహేష్. అతడు ఓ మగాడు. ఆమె ఒక ట్రాన్స్ జెండర్. ఇద్దరు పేస్ బుక్ లో ముందు చాటింగ్ చేశారు. ఒకరి నొకరు ఇష్టపడ్డారు. ఆమె ట్రాన్స్ జెండర్ అని తెలిసి కూడా ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు.  వీరిద్దరూ కలిసి ఎల్‌బీ నగర్ లో ఉంటున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వరకట్నం వేధింపులు చేశాడు. దీంతో ఎల్ బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లాడు.    కట్ చేస్తే.. ఇటీవల జైలు నుంచి విడుదలైన తారక మహేష్ తన భార్య మరో ఫేస్ బుక్ వినియోగిస్తున్నట్టు గుర్తించాడు. దీంతో తన స్నేహితుడు మొబైల్ ఫోన్ ద్వారా ఫేక్ ఫేస్ బుక్ ఐడీని క్రియేట్ చేసుకున్న మహేష్.. భార్యను వేధించసాగాడు. వివిధ రకాల అసభ్యకర సందేశాలతో పాటు అశ్లీల ఫోటోలు, వీడియోలు సెండ్ చేశాడు. ఫేస్ బుక్ లో వేధింపులపై బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, భర్తే వేధించినట్టుగా పోలీసులు నిర్థారించారు. దీంతో నిందితుడు మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ పి.యాదగిరి, ఏసీపీ హరినాథ్, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ ఎం.శంకర్ లను సీపీ అభినందించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో జరిగింది. 

పసుపులో కసి.. బాబుదే భవిష్యత్ 

తిరుప‌తి ఎంపీ ఉప‌ ఎన్నిక‌. అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం. తెలుగుదేశం పార్టీకి మ‌రింత‌ ముఖ్యం. లెక్క‌కు ఒక్క సీటే. ఆ స్థానంతో ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భుత్వాలేమీ తారుమారు కావు. కానీ, తిరుప‌తి బైపోల్‌తో రాజ‌కీయ లెక్క‌ల‌న్నీ మారిపోయేంత సీనుంది. లెక్క‌కు మించి రాజ‌కీయ వ్యూహాలు అందులో దాగున్నాయి. టీడీపీ గెలిచినా ఓకే, ఓడినా డ‌బుల్ ఓకే. తిరుప‌తి ఎన్నిక‌ల ప్ర‌చారంతోనే కావాల‌సిన ప‌నంతా పూర్తైంది. ఇప్పుడు ఫ‌లితం ఎలా ఉంటుందోన‌నే ఉత్కంఠ టీడీపీ నాయ‌కుల‌కు అన‌వ‌స‌రం. ఆ టెన్ష‌న్ అంతా అధికార వైసీపీకే అవ‌స‌రం. తిరుప‌తి కేంద్రంగా ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామాలు జ‌రిగాయి. వాటిని జాగ్ర‌త్త‌గా విశ్లేషిస్తే.. భ‌విష్య‌త్ అంతా తెలుగుదేశానిదేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. క‌సి.. తెలుగు త‌మ్ముళ్ల‌లో మునుపెన్న‌డూ లేనంత క‌సి. పంతం.. ప‌సుపు ద‌ళంలో ప‌ట్టువ‌ద‌ల‌ని పంతం. ప‌ట్టుద‌ల‌.. మ‌ళ్లీ ఎలాగైనా స‌త్తా చాటాల‌నే ప‌ట్టుద‌ల‌. ఈ మార్పులు చాల‌వా ఈ స‌మ‌యంలో తెలుగుదేశానికి. కేడ‌ర్‌లో కొండ‌ల‌నైనా పిండి చేసేంత జోష్‌. వైసీపీని ఎలాగైనా మ‌ట్టిక‌రిపించాల‌నేంత క‌రేజ్‌. డౌట్ ఉంటే ఓసారి గ‌డిచిన కొన్ని వారాలుగా తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో టీడీపీ ప్ర‌చార స‌భ‌ల‌ను ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ వ‌చ్చేస్తుంది. ముందు నారా లోకేశ్ ఎంట్రీ ఇచ్చారు. త‌మ్ముళ్ల‌లో జోష్ నింపారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు దిగిపోయారు. రోడ్ షోల‌తో దుమ్మురేపారు. జ‌న‌మే జ‌నం. ఫుల్ జ‌నం. ఎవ‌రికీ మందు పోయ‌లేదు. బిర్యానీ పొట్లాలు పంచ‌లేదు. డ‌బ్బులిచ్చి తీసుకొచ్చిన జ‌నం కాదు వారు. వాహ‌నాలు పెట్టి త‌ర‌లించిన షో పీసులు కాదు వారంత‌. నికార్స‌యిన తెలుగు త‌మ్ముళ్లు. పార్టీ కోసం, చంద్ర‌న్న కోసం స్వ‌చ్చందంగా త‌ర‌లివ‌చ్చిన జ‌నం.  ఈసారి మ‌న తెలుగుదేశాన్ని ఎలాగైనా గెలిపించుకోవాల‌నే క‌సి వారి క‌ళ్ల‌ల్లో క‌నిపించింది. అధికార పార్టీ ఆగ‌డాల‌ను ఓట్ల‌తో అడ్డుకొని.. బుద్ది చెప్పాల‌నే కోపం వారిలో కొట్టొచ్చింది. అందుకే, చంద్ర‌బాబు ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. లోకేశ్ మ‌రెక్క‌డ కాలు మోపినా.. చుట్టూ జ‌న‌మే జ‌నం. ప‌సుపు ప్ర‌భంజ‌నం. టీడీపీకి ఈ స‌మ‌యంలో కావ‌ల‌సింది ఇదే. గెల‌వాల‌నే త‌ప‌న కార్య‌క‌ర్త‌ల్లో క్రియేట్ అయింది. జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని జ‌నాలంతా డిసైడ్ అయ్యారు.  పోలింగ్ సంద‌ర్భంగా అధికార పార్టీ ఎన్ని అరాచ‌కాల‌కు పాల్ప‌డినా.. దొంగ ఓటర్ల‌ను బ‌స్సుల్లో భారీగా త‌ర‌లించినా.. గుట్టు చ‌ప్పుడు కాకుండా రిగ్గింగ్ జ‌రిపినా.. గెలుపోట‌ములు ప్ర‌భావిత‌మ‌వుతాయేమో కానీ కేడ‌ర్‌లో వ‌చ్చిన ఉత్సాహాన్ని మాత్రం ఎవ‌రూ కిల్ చేయ‌లేరు. కుదిరితే ఇప్పుడు.. వీలైతే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు.. టీడీపీని గెలిపించ‌డం ఖాయం.. జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వ‌డం ఖాయం. 2019 ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాళ‌హ‌స్తిలో సభ నిర్వ‌హించారు. జ‌నం లేక ఆ మీటింగ్ వెల‌వెల‌పోయింది. ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభ‌వించిన‌ త‌మ్ముళ్లు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ గెలుస్తాంలే అనుకున్నారు కానీ ఈసారి కూడా ఎలాగైనా గెల‌వాల‌నే క‌మిట్‌మెంట్ వారిలో ఏమాత్రం క‌నిపించ‌లేదు.‌ నిరుత్సాహం నిలువెల్లా ఆవ‌హించింది.  అప్పుడే టీడీపీ ఓట‌మి క‌న్ఫామ్ అయింది. ఇప్పుడు అదే కాళ‌హ‌స్తిలో.. మునుపు స‌భ జ‌రిగిన చోటే.. ఈసారి మ‌ళ్లీ చంద్ర‌బాబు మీటింగ్ జ‌రిగింది. ఇసుకేస్తే రాల‌నంత‌గా జ‌నంతో ఆ ప్రాంగ‌ణం నిండిపోయింది. రెండేళ్ల‌లో ఎంత తేడా. గ‌తంలో ఎక్క‌డైతే చంద్ర‌బాబు షోల‌కు జ‌నం క‌రువ‌య్యారో.. ఇప్పుడు అదే చోట జ‌నం ప్ర‌భంజ‌నంలా క‌దిలివ‌చ్చారు. టీడీపీకి ప్ర‌స్తుతం కావ‌ల‌సింది ఇదే. ఈ ఉత్సాహ‌మే.. మరో మూడేళ్ల‌లో తెలుగుదేశాన్ని అధికారం వైపు అడుగులు వేసేలా చేస్తుంది.‌‌ అప్ప‌ట్లో 2019 ఎల‌క్ష‌న్స్‌ను వైసీపీ కేడ‌ర్ స‌వాల్‌గా తీసుకుంది. అప్ప‌టికి ప‌దేళ్లుగా ప‌వ‌ర్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న వైసీపీ శ్రేణులు ఇప్పుడు కాక‌పోతే మ‌రెప్పుడు అన్న‌ట్టుగా ఫైట్ చేశారు. అందుకే జ‌గ‌న్ పాద‌యాత్రలు జ‌న ప్ర‌వాహంలా సాగాయి. జ‌గ‌నన్న‌ వెన‌క జ‌నం ఉప్పెన‌లా పోటెత్తారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక ఆ ఉత్సాహ‌మంతా నీరుకారిపోయింది. గ్రామాల్లో పెత్త‌న‌మంతా వాలంటీర్ల‌దే. ఇసుక‌లో కాసులు పిండుకుందామ‌ని భావించిన నేత‌లంద‌రికీ ఇప్పుడు చెక్ ప‌డింది. ఇసుక రీచుల‌ను కార్పొరేట్ల‌కు అమ్ముకొని జ‌గ‌నే సాంతం దోచుకోవ‌డంతో కిందిస్థాయి వైసీపీ కేడ‌ర్‌కు దిక్కుతోచ‌ని దుస్థితి. వైన్ షాపుల‌తోనైనా వ్యాపారం చేసుకుందామంటే అవీ ప్ర‌భుత్వ పాలు కావ‌డంతో కేడ‌ర్‌లో క‌ల్లోలం. జగన్ సర్కార్ రివర్స్ పాలనతో రియల్ ఎస్టేట్ ఢమాల్ అంది. దీంతో రియల్ వ్యాపారం చేసే రెడ్లంతా జగన్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. ఇలా.. వైసీపీ శ్రేణులంతా తీవ్ర నిరాశ‌, నిస్పృహాల్లో కూరుకుపోయాయి. అదే సమ‌యంలో తెలుగు తమ్ముళ్ల‌లో మాత్రం రెట్టించిన ఉత్సాహం.  ఓట‌మి ఎంత దారుణంగా ఉంటుందో టీడీపీ శ్రేణుల‌కు తెలిసొచ్చింది. అధికార పార్టీ ఆగ‌డాలు ఏ స్థాయిలో ఉంటాయో ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అనుభ‌వంలోకి వ‌చ్చింది. గ‌దిలో వేసి కొడితే పిల్లి అయినా తిరగ‌బ‌డుతుంది అన్న‌ట్టు.. పుంగ‌నూరులో అంజిరెడ్డి పులి బిడ్డ‌లా తొడ‌కొట్టి వైసీపీపై తిర‌గ‌బ‌డిన తీరు సంచ‌ల‌నం. చంద్ర‌బాబునూ ఆక‌ట్టుకుంది ఆయ‌న ధైర్యం. అంజిరెడ్డి స్పూర్తిగా తెలుగు త‌మ్ముళ్లు తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లో తెగువ ప్ర‌ద‌ర్శించారు. త‌రంగంలా చంద్ర‌న్న కోసం త‌ర‌లివ‌చ్చారు. ఈ ధైర్య‌మే, ఈ తెగువే.. తెలుగుదేశానికి ఆశాకిర‌ణంగా మారింది. ఆ వెలుగు 2024 గెలుపున‌కు మలుపు. ఇప్పుడు తిరుప‌తి ఫ‌లితం ఎలాగైనా ఉండొచ్చు. ఇది తాత్కాలికమే. కానీ, తిరుప‌తి ఉప ఎన్నిక వేదిక‌గా తెలుగు త‌మ్ముళ్ల‌లో క‌నిపించిన గెలిచి తీరాల‌నే తెగువ‌, అధికార‌ పార్టీకి బుద్ది చెప్పాల‌నే ప‌ట్టుద‌ల‌.. టీడీపీకి వెయ్యి ఏనుగుల బ‌లాన్నిచ్చింది. ఈ క‌మిట్‌మెంట్ ఇలానే కొన‌సాగితే.. భ‌విష్య‌త్తంతా తెలుగుదేశానిదే. అధికారం మళ్లీ టీడీపీని వెతుక్కుంటూ రావాల్సిందే. ఎనీ డౌట్స్?‌‌‌‌‌

అమ్మ కోసం గుండె ఆగింది..  

అమ్మంటే మెరిసే మేఘం. అమ్మంటే కురిసే వాన. అమ్మంటే  నూరేళ్ళ ఆశాదీపం. అమ్మ ఆరోప్రాణం. అమ్మ తారాదీపం. అమ్మే ఒక పూజా పుష్పం. అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...  నువ్వే లేక వసివాడనమ్మ పాట వినే ఉంటారు. తన పిల్లల కోసం తల్లీ గుండె ఆగిపోవడం చాలా చూసి ఉన్నాం. కానీ అదే తల్లీ కోసం కొడుకు గుండె ఆగిపోవడం ఎక్కడైనా ఎప్పుడైనా చూసి ఉంటారా.. మథెర్స్ డే రోజు మాత్రం ప్రేమించి.. మిగితా రోజుల్లో అమ్మపై అరవడం కాదు ప్రేమంటే.. అమ్మ కోసం బతకడం నిజమైన ప్రేమంటే అని నిరూపించాడు సత్తిరెడ్డి.    అమ్మంటే ఆ బిడ్డకు ఆకాశమంత  ప్రేమ. చిన్నప్పట్నుంచి అల్లారుముద్దుగా పెంచి, పెద్దచేసింది తల్లి. కన్నతల్లి  అనారోగ్యం బారినపడటంతో ఆ కొడుకు కుంగిపోయాడు. రెండేళ్లుగా ఆమె సేవలో ఉన్నాడు. ఉన్నట్టుండి తల్లి తనను వదిలి వెళ్లిపోయిందని.  తెలుసుకున్న కొడుకు గుండెలవిసేలా ఏడ్చాడు. బహుశా అమ్మ కోసం తాను పెట్టిన కన్నీళ్లతో తన గుండె ఆగిపోయిందో ఏమో! ఆ కొడుకు గుండె ఆగిపోయింది. తల్లితోటే ఆ కొడుకు కట్టె కాలిపోయింది.   నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లికి చెందిన యానాల సత్తిరెడ్డి, సత్యమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలిద్దరూ వివాహాలై అత్తవారింటికి వెళ్లారు. కుమారుడు నాగిరెడ్డి వ్యవసాయ పనులు చూసుకుంటూ కుటుంబానికి అండగా నిలిచాడు. సత్యమ్మ రెండేళ్ల క్రితం కేన్సర్‌ బారినపడ్డారు. అప్పట్నుంచి కుమారుడు తల్లిని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ ఆసుపత్రిలో మంచి చికిత్స దొరుకుతుందంటే అక్కడికంతా తీసుకెళ్లేవాడు. ఆమె వైద్యానికి సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీర్ఘకాలంగా వ్యాధితో పోరాడుతున్న ఆమె శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగిరెడ్డి పొలం నుంచి ఇంటికొచ్చాడు. తల్లి మృతదేహం వద్ద గుండెలవిసేలా ఏడుస్తూ కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తల్లీకొడుకులు గంట వ్యవధిలో చనిపోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.     

తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ!

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో దొంగ ఓటర్లు ఉన్నట్లు తేలింది. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారులు కానీ.. పోలీసులు స్పందించలేదు. అయితే ఈ విషయాన్ని అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్వగ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం పోలింగ్‌ బూత్‌లో టీడీపీ, బీజేపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి రాకుండా వైసీపీ నేతలు, పలువురు కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పోలింగ్ అధికారులు, పోలీసులు అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. తొట్టంబేడు మండలం గుండెలుగుంటలోనూ టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అధికార పార్టీ ఇంత దౌర్జన్యం చేస్తున్నా నిలువరించాల్సిన అధికారులు, పోలీసులు వారికే వత్తాసు పలకడమేంటి..? అని స్థానిక టీడీపీ నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతల హడావుడి చేశారు. పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లి ఓటర్లను వైసీపీ  నేతలు ప్రలోభపెడుతున్నారు. అయితే.. వైసీపీ నేతలు కొందరు ఇలా చేస్తున్నారని టీడీపీ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే జిల్లాలో వాలంటీర్లు కూడా దగ్గరుండి మరీ పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్నప్పటికీ పోలీసులు.. కనీసం పోలింగ్ అధికారులు పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లాలో వాలంటీర్లు పలువురు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఓటర్లని నేరుగా బూత్‌ల వద్దకి తీసుకొవచ్చి ఓటేయిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున అధికార పార్టీ నేతలు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓట్లు బాగా వేయిస్తే అవార్డులు.. రివార్డులు ఇప్పిస్తామని, తగ్గితే ఉద్యోగాలే ఉండవంటూ కొందరు వాలంటీర్లను అధికార పార్టీ నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీలేక ఉద్యోగాలు కాపాడుకోవడానికి వాలంటీర్లు ఇలా దగ్గరుండి మరీ ఓటర్లను బూత్‌లకు తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌లో జరుగుతున్న అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్‌తో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, లారీల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొచ్చారని కేంద్ర ఎన్నికల అధికారులకు బాబు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైసీపీ వారిని టీడీపీ శ్రేణులు పట్టుకున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. తిరుప‌తి ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతోంది. అయితే, ప‌లు చోట్ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటోల ఆధారాల‌ను త‌న లేఖ‌కు చంద్ర‌బాబు నాయుడు జ‌త చేశారు. రెండు బ‌స్సుల్లో బ‌య‌టి వ్య‌క్తుల్ని వైసీపీ నేత‌లు తిరుప‌తిలోకి త‌ర‌లించార‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ నేత‌లు కొన్ని బూత్‌ల‌లో టీడీపీ ఏజెంట్ల‌ను అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. తొట్టెంబేడు మండ‌లం కందేలుగుంట‌లో టీడీపీ నేత‌ల‌ను అడ్డుకున్నార‌ని వివ‌రించారు. స్థానికేత‌రుల‌తో తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ నేత‌లు అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డే ప్ర‌య‌త్నాలు జరుపుతున్నార‌ని ఆయ‌న అన్నారు. 

తెలంగాణకు కరోనా జ్వరం.. 

తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 4,446 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,414 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,11,008 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,809గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 33,514 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 22,118 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 598 మందికి క‌రోనా సోకింది.

ఇండియా కరోనా యమ డేంజర్!

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మరణ మృదంగం మోగిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే ఇండియాలో 2 లక్షల 34 వేల కేసులు నమోదయ్యాయి. రికార్డ్ స్థాయిలో 13వందల మరణాలు సంభంవించాయి. తాజాగా ఇండియాలో విస్తరిస్తున్న కరోనా గురించి మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఇండియాలో కరోనా వైరస్ డబుల్ మ్యూటెంట్ చెంది మరింత ప్రమాదకరంగా మారిందని  బ్రిటన్ వెల్లడించింది. ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆయనకు సూచించడం కలకలం రేపింది.  ఇండియాలో పుట్టిన కొత్త వేరియంట్ బ్రిటన్ కు కూడా వ్యాపించిందని అక్కడి ఉన్నతాధికారులు తెలిపారు. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ ను తొలిసారిగా ఇండియాలోనే కనుక్కున్నారని పేర్కొన్న అధికారులు, దీనికి బీ1617 అని నామకరణం చేశారు. ఈ డబుల్ మ్యూటెంట్  కొత్త వైరస్ విషయంలో ఎపిడెమాలజిక్, ఇమ్యునోలాజికల్, పాథోజెనిక్ విభాగాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఏప్రిల్ 14 నుంచి ఇంగ్లండ్ లో 77 భారత్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయని, స్కాట్లాండ్ లో సైతం కనిపించిందని అధికారులు వెల్లడించారు."ఈ వేరియంట్ తొలిసారిగా ఇండియాలోనే కనిపించింది. 484క్యూ, ఎల్452ఆర్, పీ681ఆర్ తదితర వేరియంట్ల కలయికగా ఇది ఏర్పడింది. ఈ వైరస్ నియంత్రణకై కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత ముఖ్యం. ఈ విషయంలో అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో పరిస్థితిని సమీక్షిస్తున్నాం" అని పీహెచ్ఈ పేర్కొంది. ఇందులో ఓ వేరియంట్ గత సంవత్సరం కాలిఫోర్నియాలో వెలుగులోకి రాగా, మరో వేరియంట్ సౌతాఫ్రికా, బ్రెజిల్ లో కనిపించింది. ఇప్పుడు ఈ రెండూ కలిసి ఇండియాలో సమ్మిళితమై ప్రపంచానికి వ్యాపిస్తున్నాయని అన్నారు. ఇండియాలో ఇప్పుడు రోజుకు మిగతా దేశాల కన్నా అత్యధికంగా 2 లక్షలకు పైగా కేసులు ప్రతి రోజూ నమోదవుతున్నాయని గుర్తు చేసిన పీహెచ్ఈ, ఈ వైరస్ వ్యాప్తిని తక్షణం అరికట్టాల్సి వుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు చండీగఢ్‌లో యూకే రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ నమోదైన కేసుల్లో 60 శాతం నమూనాలను ఢిల్లీలోని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రానికి పంపించి పరీక్షించగా వాటిలో 70 శాతం శాంపిళ్లలో యూకే స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.మరో 20 శాతం నమూనాల్లో 681 హెచ్ మ్యూటెంట్ ఉన్నట్టు గుర్తించారు. ఒక్క నమూనాలో మాత్రం డబుల్ మ్యూటెంట్‌ను గుర్తించారు. యూకే స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.