తిరుపతిలో బోగస్.. సాగర్ లో సైలెంట్! రాజన్న రాజ్యం స్పెషల్?  

రెండు తెలుగు రాష్ట్రాలు. రెండు ఉప ఎన్నిక‌లు. ఒక‌టి తిరుప‌తి. మ‌రొక‌టి నాగార్జున సాగ‌ర్‌. రెండూ అధికార పార్టీకి కీల‌క‌మే. రెండుచోట్లా బ‌ల‌మైన‌ ప్ర‌తిప‌క్షమే. అయినా, ఎంత తేడా? ఎంతో తేడా. సాగ‌ర్ అసెంబ్లీ ఎల‌క్ష‌న్‌.. సైలెంట్‌గా సాగింది. పోలింగ్ నాడు తిరుప‌తిలో నానా ర‌చ్చ జ‌రిగింది. దొంగ ఓట్ల దారుణంతో ద‌ద్ద‌రిల్లింది. నాగార్జున‌సాగ‌ర్‌లో చీమ చిటుక్కుమ‌న‌కుండా ప్ర‌శాంతంగా పోలింగ్‌. తిరుప‌తిలో దొంగ ఓట్ల సునామీ మ‌ధ్య కేవ‌లం 65 శాతం పోలింగ్ మాత్ర‌మే జ‌రిగింది. అదే, సాగ‌ర్‌లో ఏకంగా ఓటింగ్ 88 శాతం దాటేసింది. తిరుప‌తిలో దొంగ నోట్లు పోటెత్తితే.. సాగ‌ర్‌లో సాధార‌ణ ఓట‌ర్లు పోలింగ్‌కు క్యూ క‌ట్టి రికార్డు స్థాయిలో ఓటింగ్ చేశారు.  తిరుప‌తి బైపోల్‌ను టీడీపీ స‌వాల్‌గా తీసుకుంది. నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. అంద‌రికంటే ముందే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్ ప‌న‌బాక ల‌క్ష్మిని బ‌రిలో దించింది. ఈ విష‌యంలో వైసీపీ, బీజేపీలు చాలా వెన‌క‌బ‌డ్డాయి. ఆల‌స్యంగా అభ్య‌ర్థి ఎంపిక‌తో పాటు కొత్త ముఖాల‌తో అదృష్టం ప‌రీక్షించుకున్నాయి. తెలంగాణ‌లోనూ దాదాపు ఇదే త‌ర‌హా వ్య‌వ‌హారం న‌డిచింది. నోముల న‌ర్సింహ‌య్య మ‌ర‌ణంతో ఆయ‌న కొడుకు భ‌గ‌త్‌కే టికెట్ కేటాయించింది టీఆర్ఎస్‌. యువ‌కుడు, రాజ‌కీయాల‌కు కొత్త వాడైనా కూడా సెంటిమెంట్ క‌లిసొస్తుంద‌ని లెక్క‌లేసింది. బీజేపీ సైతం కొత్త లీడ‌ర్‌, అందులోనూ ఎస్టీ నాయ‌కుడిని నిల‌బెట్టి పొలిటిక‌ల్‌గా ప్ర‌యోగం చేసింది. ఇక కాంగ్రెస్ నుంచి మాత్రం కాక‌లుతీరిన రాజ‌కీయ యోథుడు జానారెడ్డి బ‌ల‌మైన కేండిడేట్‌గా బ‌రిలో నిలిచాడు. పోరు, జానారెడ్డి వ‌ర్సెస్ కేసీఆర్‌గా మారింది. ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌న్నీ ఒక లెక్క‌. తిరుప‌తి ఉప ఎన్నిక మ‌రోలెక్క అన్న‌ట్టు ప్ర‌చారం కాక‌రేపింది. ప్ర‌చారానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చినా.. బీజేపీలో పెద్ద‌గా జోష్ క‌నిపించ‌లేదు. అధికార వైసీపీ స‌భ‌లూ జ‌నం లేక వెల‌వెల‌పోయాయి. క‌రోనా కార‌ణంతో జ‌గ‌న్ సైతం మ‌డ‌మ తిప్పారు. ఇక‌, తిరుప‌తి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప్ర‌చార సంద‌డంతా ప్ర‌తిప‌క్ష టీడీపీదే. చంద్ర‌బాబు, లోకేశ్‌లు తిరుప‌తి అంతా చుట్టేశారు. ప‌రిస్థితి చ‌క్క‌బెట్టేశారు. వాళ్లిద్ద‌రు ఎక్క‌డ రోడ్ షో చేసినా.. జ‌నం భారీగా త‌ర‌లివ‌చ్చారు. తెలుగు త‌మ్ముళ్ల‌లో ఉత్సాహం ఉర‌క‌లెత్తింది. మీడియా అటెన్ష‌న్ ఆసాంతం తిరుప‌తిపైనే కొన‌సాగింది. అటు నాగార్జున సాగ‌ర్‌లో కేసీఆర్ స‌భ సాధాసీదాగా సాగింది. ఏ పార్టీ ఎక్క‌డ ప్ర‌చారం చేసిందో.. ఏ నేత ఎవ‌రిని క‌లిశారో.. బ‌య‌టి వారెవ‌రికీ తెలీదు. తిరుప‌తి ప్ర‌చారం రెండు తెలుగు రాష్ట్రాలు, మీడియాలో హోరెత్తితే.. సాగ‌ర్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారంపై స్థానికులే పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు.  పోలింగ్ విష‌యంలో మాత్రం సీన్ రివ‌ర్స్ అయింది. సాగ‌ర్‌లో ఓటేసేందుకు ఓట‌ర్లు వెల్లువ‌లా వ‌స్తే.. తిరుప‌తిలో మాత్రం దొంగ ఓట్లు కుమ్మేసేందుకు ప‌క్క నియోజ‌క వ‌ర్గాల నుంచి బ‌స్సులు క్యూ క‌ట్టాయి. పోలింగ్ రోజు ర‌చ్చ రంబోలా జ‌రిగింది. సాగ‌ర్‌లో అంతా సైలెన్స్‌. పోలింగ్ డే పీస్‌ఫుల్‌. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉంటే తిరుప‌తి ఎన్నిక‌ల్లో మాదిరి పోరాడుతారు. బ‌ల‌హీన విప‌క్షం ఉంటే సాగ‌ర్ మాదిరి సైలెంట్ అన్న‌ట్టు ప్ర‌చారం సాగుతుంది. చంద్ర‌బాబు, లోకేశ్‌లు వారాల పాటు మండుటెండ‌లో విప‌రీతంగా క‌ష్ట‌ప‌డ్డారు, ప‌గ‌లు, రాత్రి ఇంటింటి ప్ర‌చారంతో ఓట‌ర్ల‌ను ఉత్సాహ ప‌రిచారు. నాగార్జున సాగ‌ర్‌లో మాత్రం జానారెడ్డి గ‌ప్‌చుప్‌గా ప‌ని చేసుకు పోయారు.  ప్ర‌చారం, పోలింగ్ విధానంలో తేడా ఉన్నా.. ఫ‌లితాల్లో మాత్రం తిరుప‌తి, సాగ‌ర్‌లో ఒకే విధంగా వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. రెండు చోట్లా అధికార పార్టీపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని.. ఆ ఫ‌లితం ఈవీఎమ్‌ల‌లో భ‌ద్రంగా దాగుంద‌ని అంటున్నారు.  తిరుప‌తిలో 6 ల‌క్ష‌ల మెజార్టీ మాటేమో కానీ, బొటాబొటి ఆధిక్యంతో బ‌య‌ట‌ప‌డితే అదే చాలు అనే ఆందోళ‌న వైసీపీలో కొట్టొచ్చిన‌ట్టు క‌న‌బ‌డుతోంది. ఒక‌వేళ తిరుప‌తిలో అధికార పార్టీ బ‌య‌ట‌ప‌డితే.. అది దొంగ ఓట్ల మ‌హిమే కానీ మ‌రొక‌టి కాక‌పోవ‌చ్చు. సాగ‌ర్‌లో బ‌ల‌మైన నేత జానారెడ్డి బ‌ల‌మెంతో ఈ ఎన్నిక‌తో తేలిపోనుంది. కేసీఆర్ ప్ర‌జాధార‌ణ‌కూ ప‌రీక్ష కానుంది. ఇటు తిరుప‌తి, అటు సాగ‌ర్‌.. అధికార పార్టీల‌కు టెన్ష‌న్ టెన్ష‌న్‌.

మూడు రోజుల్లో 4 మరణాలు! సచివాలయంలో కరోనా పంజా 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్  సచివాలయం కరోనా హాట్ స్పాట్ గా మారిపోయింది. మూడు రోజుల్లో నలుగురు సచివాలయ ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. మరికొందరు ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వైరస్ భారీన పడ్డారు.  పంచాయతీరాజ్ శాఖ సెక్షన్ ఆఫీసర్ శాంతకుమారి కరోనాతో మరణించారు. రెండు రోజుల క్రితం శాంతకుమారి భర్త కరోనాతో మృతి చెందారు. హోంశాఖలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి కరోనాతో మరణించారు. కరోనా పంజాతో ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో కలకలం సృష్టిస్తోంది. భయంతో విధులకు రావడానికి ఉద్యోగులు జంకుతున్నారు. తమకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  సచివాలయం ఉద్యోగులు కరోనాతో మృతిచెందటం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తన చాంబర్‌లో రెండు నిమిషాల పాటు ఆయన మౌనం పాటించారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికాలోపమే ఉద్యోగుల మృతికి కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదన్నారు.  జగన్ అలసత్వం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులందరికీ తక్షణమే టీకా అందించాలని కోరారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని చంద్రబాబు తెలిపారు. 

ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్

కరోనా మహమ్మారి పంజా విసురుతుండటంతో ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆరు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం ఐదు గంటల వరకు లాక్ డౌన్ అమలవుతుందని తెలిపారు.  కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేజ్రీవాల్ చెప్పారు.  సోమవారం ఉదయం అధికారులతో అత్యవసర సమావేశం తర్వాత ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. లాక్‌డౌన్ సందర్భంగా మాల్స్, జిమ్‌లు, ఆడిటోరియంలు మొదలైనవి పూర్తి స్థాయిలో మూసివేయనున్నారు. అయితే సినిమా హాళ్లు 30 శాతం సామర్థ్యంతో నడపనున్నారు. ప్రయివేటు సంస్థలన్నీ వర్క్ ఫ్రమ్ హోం ద్వారా పనిచేయాలనీ... ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర సేవల విభాగాలు యధాతథంగా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. వీకెండ్ మార్కెట్ల నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చారు. దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,73,510 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,619 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 19.29 లక్షలు యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1.29 కోట్లు మంది డిశ్చార్జ్‌  అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 1.50 కోట్లు దాటాయి. కరోనా వల్ల లక్షా 78 వేల మంది మృతి చెందినట్లు సోమవారం కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో వెల్లడించింది. 

ప్రభుత్వం లేదా.. మేమే అదేశాలివ్వాలా? హైకోర్టు సీరియ‌స్‌ 

ఓవైపు ఊరూరా క‌రోనా. మ‌రోవైపు ప‌బ్బుల్లో, మ‌ద్యం షాపుల్లో తాగి తందానా. స్కూల్స్ క్లోజ్‌. సినిమా హాల్స్ మాత్రం హౌజ్‌ఫుల్‌. ఇదేం తీరు? ఇలాగైతే ఎలా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు నిల‌దీసింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదన్న‌ కోర్టు.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ‘ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా?  ఆదేశాలు ఇవ్వమంటారా?’ అని హైకోర్టు మండిపడింది.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాలు, అనేక న‌గ‌రాలు వీకెండ్ లాక్‌డౌన్‌, రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నాయి. తెలంగాణ‌లో మాత్రం అలాంటి చ‌ర్య‌లు ఏమీ లేక‌పోవ‌డం, క‌నీసం అలాంటి ఆలోచ‌న కూడా చేయ‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హైకోర్టు సైతం ఇదే విష‌యంపై నిల‌దీయడంతో స‌ర్కారు ఇర‌కాటంలో ప‌డింది.

వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ జల్లాలో  రంగురాళ్ల కోసం అక్రమ తవ్వకాలు జరపడం కలకలం సృష్టిస్తోంది. వైసీపీ నేతలు ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో  అక్రమ తవ్వకాల బాగోతం బయటపడింది.  విశాఖ జిల్లా గొలుసుకొండ మండలం, సాలిక మల్లవరం సమీపంలో రిజర్వుడ్ ఫారెస్టులో వైసీపీ నేతలు జేసీబీలతో అలెగ్జాండర్ రైట్ రంగురాళ్ల కోసం తవ్విన అక్రమ సొరంగ మార్గాలు బయటపడ్డాయి. వైసీపీ కౌన్సిలర్లుగా పోటీ చేసిన తమరాన శ్రీను, ఉండా భాస్కర్ ఈ తవ్వకాలు జరిపినట్లు సమాచారం. ఈ ఇద్దరూ స్థానిక ఎమ్మెల్యే గణేష్‌కు ప్రధాన అనుచరులుగా ఉన్నట్లు సమాచారం. విశాఖ రంగురాళ్ల అక్రమ తవ్వకాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు.   ఏపీ ప్రభుత్వం నవరత్నాలని చెబుతూ.. ప్రజల కళ్లుగప్పి మాయ చేస్తుంటే.. ఇదే అదనుగా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఇసుక, మట్టి, ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలు.. తాజాగా రంగురాళ్లు కూడా దోచుకునేందుకు సిద్ధమయ్యారని లోకేష్ ఆరోపించారు. విశాఖజిల్లాలోని గొలుగొండ మండలంలో నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు జరుపుతున్న తవ్వకాలను గురించి తెలిపారు.  సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్టులో జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరి తెగింపో చూడండని వాటికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్విస్తున్నారని.. ఇది వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. ఆ పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ‘‘ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటం.. ఈ నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు’’ అని  నిలదీశారు. రంగురాళ్ల అక్రమ తవ్వకాలపై  ప్రభుత్వం స్పందించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. చికిత్స అందక బాధితులు నరకయాతన పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్నా... జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మాస్కులు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. భౌతికదూరం మాటే మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు  ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ప్రాణాంతక వైరస్ కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ ప్రజల్లో భయం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, దీనిని అదుపు చేసేందుకు మిలటరీ బలగాలు అవసరమని ఝార్కండ్ ముఖ్యమంత్రి అన్నారు. మిలటరీని పంపాలని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ప్రజలను చూసి తాను షాకయ్యానని సోరెన్ తెలిపారు. మాస్కులు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండానే ప్రజలు తిరుగుతున్నారని, వాళ్లకు కరోనా అంటే అస్సలు భయం లేదని అన్నారు. ఇలాంటి వారందరికీ సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి లేఖ రాయబోతున్నట్టు చెప్పారు. 

అమరావతికి చెల్లు.. చెల్లెమ్మపై గొల్లు

ష‌ర్మిల రావాలి. త‌మ స‌మ‌స్య‌లు తీర్చాలి. ఇది అమ‌రావ‌తి రైతుల డిమాండ్‌. 2019 ఎన్నిక‌ల్లో మా అన్న‌కి ఓటేయండి.. రాజ‌న్న రాజ్యం వ‌స్తుందంటూ ఏపీలో ఊరూరా ప్ర‌చారం చేశారు ష‌ర్మిల‌. తీరా ఎన్నిక‌ల్లో జ‌గ‌న‌న్న గెలిచాక‌.. రాజ‌న్న రాజ్యం కాదు రావ‌ణ రాజ్యం వ‌చ్చిందంటున్నారు రైతులు. మ‌రి, ఆనాడు ఎన్నిక‌ల్లో ఓటేయ‌మ‌ని అడిగిన ఆ చెల్లెమ్మ‌.. ఇవాళ ఏకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి పారిపోయారు. తాను తెలంగాణ బిడ్డ‌నంటూ ప‌క్క రాష్ట్రంలో సెటిల‌య్యారు. ఇప్పుడు అక్క‌డా సేమ్ డైలాగ్‌. త‌న‌ను ఆద‌రించండి.. రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ ఊద‌ర‌గొడుతున్నారు. తెలంగాణ సంగ‌తి త‌ర్వాత‌.. ముందు ఏపీలో మీరు చెప్పిన రాజ‌న్న రాజ్యం ఎక్క‌డొచ్చిందో చూపించ‌మంటూ అడుగుతున్నారు అమ‌రావ‌తి రైతులు. జ‌స్ట్ అడ‌గ‌డ‌మే కాదు.. త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఏపీలోనూ పోరాడాల‌ని కోరుతున్నారు అక్క‌డి మ‌హిళ‌లు. ఆ రోజు మీరే క‌దా రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని ఓటేయ‌మ‌న్నారు? ఇప్పుడు అదే రాజ‌న్న రాజ్యం కోసం మా ప‌క్షాన పోరాడ‌మంటూ అమ‌రావ‌తి మ‌హిళా రైతులు ఓ వీడియో రిలీజ్ చేశారు. అదిప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ష‌ర్మిల క‌మిట్‌మెంట్‌పై చ‌ర్చ మొద‌లైంది. నిరుద్యోగ స‌మ‌స్య‌పై ఇటీవ‌ల ష‌ర్మిల చేసిన దీక్ష పై అమ‌రావతి మ‌హిళా జేఏసీ నేత‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముచ్చ‌ట‌గా మూడు రోజులు దీక్ష చేసి ప్ర‌భుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్న ష‌ర్మిల‌కు.. దాదాపు 500 రోజులుగా దీక్ష చేస్తున్న అమ‌రావ‌తి మ‌హిళ‌లు వారి క‌ళ్ల‌కు క‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా వైఎస్ విజ‌య‌మ్మ‌పైనా ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించారు. విజ‌య‌ల‌క్ష్మిని గాంధారితో పోల్చారు అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ. ఆ గాంధారి త‌న భర్త చూడని లోకం తాను చూడనని కళ్లకు గంతలు కట్టుకుంటే.. ఈ విజయమ్మ తన పిల్లలు చేస్తున్న అరాచకాలు కళ్లుండి చూడలేని గాంధారిలా మారారని విమర్శించారు.  ష‌ర్మిల దీక్ష భ‌గ్నం సంద‌ర్భంగా పోలీసుల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌, జాకెట్ చిన‌గ‌డంపైనా సెటైర్లు వేశారు అమ‌రావ‌తి మ‌హిళలు. ‘‘అమరావతి మహిళలను పోలీసులతో మీ కొడుకు రక్తం వచ్చేలా కొట్టిస్తే ఎక్కడున్నవమ్మా విజయమ్మ? షర్మిల ఒక్కరేనా మహిళ? అమరావతి మహిళా రైతులు మహిళలు కాదా? కడుపుతీపి మీ ఒక్కరికే ఉంటుందా? వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన మీరు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తుంటే నోరు మెదపడం లేదు ఎందుకు? జగన్‌కి ఒక్క అవకాశం ఇవ్వండి అని ఊరు వాడా తిరిగిన మీరు, షర్మిల ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని నిల‌దీశారు. అన్న ఏపీని నాశనం చేస్తుంటే.. చెల్లి తెలంగాణను నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు.  విజయమ్మ, జగన్, షర్మిల కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును బ్రష్టు పట్టిస్తున్నారు’’ అని ఘాటుగా విమ‌ర్శించారు అమ‌రావ‌తి మ‌హిళా రైతులు. 2019లో ఏపీలో విస్తృతంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు ష‌ర్మిల‌. జ‌గ‌న‌న్న కోసం అనేక నియోజ‌క‌వ‌ర్గాలు ప‌ర్య‌టించారు. అన్న‌ను గెలిపించారు. క‌ట్ చేస్తే.. రెండేళ్లు గ‌డిచే స‌రికి ఏకంగా రాష్ట్రం నుంచే ప‌రార్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ‌లో కొత్త దుకాణం తెరిచారు. అక్క‌డా రాజ‌న్న రాజ్య‌మేన‌ట‌. వేరే ఎజెండా లేద‌ట‌. ఏపీలో ఇన్నాళ్లూ జ‌గ‌న‌న్న కోసం ప‌ని చేసిన‌ట్టు.. ఇక‌పై, వ‌చ్చే మూడేళ్ల‌లో ప‌రోక్షంగా కేసీఆర్ కోస‌మో.. బీజేపీ కోస‌మే పని చేయ‌డం ప‌క్కా అని అనుమానిస్తున్నారు. ఆ ఎన్నిక‌లు ముగిశాక‌.. ఆ ఇద్ద‌రిలో ఒక‌రికి అధికారం క‌ట్ట‌బెట్టాక‌.. మ‌ళ్లీ అన్న కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ తిరుగొస్తార‌ని అంటున్నారు.  ఎందుకంటే, తిరుప‌తి ఎన్నిక‌ల‌తో ఇప్ప‌టికే టీడీపీ బాగా బ‌లం పుంజుకుంది. వైసీపీ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగి పోయారు. ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డేందుకు సిద్ధంగా ఉన్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు మ‌రింత బ‌ల‌ప‌డ‌తారు. అప్పుడు జ‌గ‌న‌న్న గెల‌వ‌డం అంత సులువు కాదు కాబ‌ట్టి అన్న కోసం చెల్ల‌మ్మ మ‌ళ్లీ ఏపీలో వాలిపోతుంద‌ని ఊహిస్తున్నారు. ఎందుకంటే, 2019లో ఏపీలో రాజ‌న్న‌రాజ్యం కావాల‌న్న ష‌ర్మిల‌, 2021 క‌ల్లా ఆంధ్ర‌ప్రదేశ్‌లో జెండా ఎత్తేసి.. తెలంగాణ‌లో కొత్త జెండా పాతేశారు కాబ‌ట్టి ఆమె చిత్త‌శుద్ధిపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు అమ‌రావ‌తి మ‌హిళా రైతులు. ముందు ఏపీకి వ‌చ్చి త‌మ త‌ర‌ఫున పోరాడి.. త‌మ‌కు న్యాయం చేసి.. ఇక్క‌డ రాజ‌న్న రాజ్యం తీసుకొచ్చాక‌.. ఆ త‌ర్వాత తెలంగాణ‌లో ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అంటున్నారు అమ‌రావ‌తి ప్ర‌జ‌లు.  

పేకాట డెన్ గా వైసీపీ నేత ఇల్లు! 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. కర్నూల్ జిల్లాలో వైసీపీ నేతల కనుసన్నల్లోనే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. తాజాగా వైసీపీ నేత ఇల్లే పేకాట డెన్ గా బాగోతం వెలుగు చూసింది. వైసీపీ నేత ఇంట్లో పేకాటలో.. ఎవరికి చిక్కకుండా కొత్త పద్దతులు అవలంభిస్తున్నారు. డబ్బుకు బదులుగా టోకెన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. టోకెన్ల విలువను బట్టి గెలిచినవారికి డబ్బు చెల్లిస్తున్నారని సీఐ తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోవైసీపీ నాయకుడి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్‌ఈబీ పోలీసులు దాడి చేశారు. 30 మందిని అరెస్టు చేశారు. తొమ్మండ్రు వీధిలోని వైసీపీ నాయకుడు సింగం భరత్‌రెడ్డి ఇంట్లో పేకాడుతున్న 30 మందిని అరెస్టు చేశామని ఎస్‌ఈబీ సీఐ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.6.23 లక్షల నగదు, మూడు కార్లు, మూడు మో టార్‌ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడిచారు.  పట్టుబడినవారిలో కడప జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల పట్టణాల నుంచి వచ్చిన వారున్నారని ఎస్‌ఈబీ సీఐ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ముగ్గురు వైసీపీ నాయకులనూ అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

హాస్పిటల్ నుంచి కరోనా ఇంజక్షన్లు మాయం!

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. బెడ్లు దొరక్క బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మందులు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ లో మందులు చోరీకి గురవుతున్నాయి.  ఆదిలాబాద్ లోని రిమ్స్ లో  కోవిడ్‌ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు మాయమయ్యాయి. 30 మంది రోగుల కోసం 48 డోసులు విడుదల చేశారు. అయితే..20 మందికి మాత్రమే ఇచ్చారు. మిగతా 10 మందికి వేయాల్సిన ఇంజక్షన్లు మాయమయ్యాయి.  రెమ్‌డెసివిర్‎కు బయట డిమాండ్ ఉండటంతో పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం.  రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు మాయం కావడం కలకలం రేపుతోంది. అధికారులు, డాక్టర్ల సమన్వయ లోపంతో కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ రావచ్చంటున్నారు డాక్టర్లు. అయితే దీని తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని.. అది రక్షణ ఇస్తుందని చెబుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ డిమాండ్, సప్లయ్ మధ్య గ్యాప్ ఉందని వైద్యులు అంగీకరిస్తున్నారు. ఫస్టు డోస్ వేసుకున్న వారు, కచ్చితంగా సెకండ్ డోస్ వేసుకోవాలన్నారు. రెండు రోజులు అటు, ఇటు ఆయినా నష్టం లేదంటున్నారు. కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్ ఒకవైపు టెస్టింగ్.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ  రెండూ జరుగుతున్నాయన్నారు. జనాలు జాగ్రత్తగా ఉండటమే కరోనా కట్టడికి మార్గమంటున్నారు డాక్టర్లు

కేంద్ర మంత్రి సోదరుడికే బెడ్ దొరకలేదు!

దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. సెకండ్ వేవ్ భయంకరంగా ఉండటంతో దారుణ పరిస్థితి నెలకొంటున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లో పరిస్థితి చేయి దాటి పోయిందని తెలుస్తోంది. మంత్రుల కుటుంబ సభ్యులకు కరోవా సోకినా... హాస్పిటల్స్ లో బెడ్లు దొరకని పరిస్థితి ఉందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఊహించవచ్చు.  తన సోదరుడికి కరోనా సోకిందని, ఆసుపత్రిలో అతడికి ఓ పడకను ఏర్పాటు చేయాలని ఘజియాబాద్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ కేంద్రమంత్రి వీకే సింగ్ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది.  కేంద్ర మంత్రి తన ట్వీట్‌కు ఘజియాబాద్ జిల్లా కలెక్టర్‌ను ట్యాగ్ చేశారు. ఆసుపత్రిలో బెడ్ కేటాయించాలంటూ స్వయంగా కేంద్రమంత్రి చేసిన ట్వీట్ కాసేపటికే వైరల్ అయింది. కరోనా చికిత్సకు బెడ్ కోసం కేంద్రమంత్రే కలెక్టర్  కు విజ్ఞప్తి చేయడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  శివసేన నాయకురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది మంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ ఆసుపత్రిలో ఓ బెడ్ కోసం సాక్షాత్తూ ఓ మంత్రే ఇలా ట్వీట్ చేయడం ఆయన నిస్సహాయతకు అద్దం పడుతోందంటూ ట్వీట్ చేశారు. కరోనా సోకిన ఆ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రియాంక చతుర్వేది ట్వీట్‌పై స్పందించిన వీకే సింగ్.. నిజానికి ఆయన తన సోదరుడేమీ కాదని, తన నియోజకవర్గ పరిధిలోని ఓ వ్యక్తి అని వివరణ ఇచ్చారు. అధికారులు వేగంగా స్పందిస్తారన్న ఉద్దేశంతోనే తాను ఆ ట్వీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. మానవతా దృక్పథంతోనే అలా ట్వీట్ చేసినట్టు పేర్కొన్న ఆయన వైద్య సాయం అందించాలంటూ చేసిన ట్వీట్‌ను తొలగించారు.   

కరోనా నుంచి కోలుకుంటున్నా.. సెకండ్ వేవ్ తో జాగ్రత్త

కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్న పవర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  పార్టీ నేతలు, అభిమానులకు మెసెజ్ ఇచ్చారు. కరోనా నుంచి తన ఆరోగ్యం కుదుట పడుతోందని, త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తున్నట్లు తెలిపారు పవన్ కల్యాణ్. తాను కరోనా బారిన పడ్డానని తెలిసినప్పటి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కావాలని అందరూ ఆశించారు, వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ నేతలు, జనసైనికులు, అభిమానులు తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు చేశారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందకు వచ్చి ప్రజల కోసం నిలబడతానని తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితిపై ప్రభుత్వ తీరును తప్పు పట్టారు వకీల్ సాబ్. ఏపీలో కరోనా బారిన పడినవారికి ఆసుపత్రుల్లో పడకలు, ఔషధాలు, ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడం దురదృష్టకమని విమర్శించారు. బెడ్స్ కొరతతో కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంలేదని, చికిత్సలో ఉపయోగించే మందుల కొరత ఏర్పడిందని వివరించారు. పరిస్ధితిని అంచనా వేయకపోవటం వలనే ఇటువంటి ఆందోళనకర పరిస్ధితి వచ్చిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.  కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఏపీలో 7 వేలు, తెలంగాణలో 4 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయని, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. కరోనా సోకడంతో పవన్ కల్యాణ్ కు ఉపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ ఫెక్షన్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఫాంహౌజ్ లోనే ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది.   

మావల్ల కావడం లేదు.. ఏదైనా చేయండి! కరోనాపై ప్రధానికి సీఎం లేఖ 

దేశంలో కరోనా విలయతాండవంతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పూర్తిగా అదుపు తప్పింది. రోజూ వేలాది కొత్త కేసులు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేక చేతులెత్తేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఢిల్లీలో పరిస్థితి పూర్తిగా విషమించింది. రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. డాక్టర్లు ఏమి చేయలేకపోతున్నారు. దీంతో ఢిల్లీలో కరోనా పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆక్సిజన్ కొరత వేధిస్తోందని అందులో ప్రస్తావించారు. దాదాపు ఐసీయూ బెడ్స్ అన్నీ నిండిపోయాయని చెప్పారు. అయినా సరే, తమ ప్రయత్నంలో తాము ఉన్నామని, కేంద్రం మద్దతు కూడా కావాలాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఆస్పత్రుల్లో 10,000 పడకలున్నాయి. అయితే 1800 పడకలను కోవిడ్ కోసమే రిజర్వ్ చేసి ఉంచాం. ఢిల్లీలో కరోనా ఘోరంగా ఉంది. అందుకే కరోనా కోసం 7000 పడకలను రిజర్వ్ చేయాలి. ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగానే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఢిల్లీలోని డీఆర్డీవోలో ఐసీయూకు సంబంధించి 500 బెడ్లను తయారు చేస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. అయితే మరో 500 పడకలను కూడా తయారు చేయిస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకూ మాకు కేంద్ర సహకారం పూర్తిగా అందుతోంది. మరిన్ని విషయాలపై కూడా మీరు మాకు సహాయం చేయాలని ఆశిస్తున్నాం’’ అంటూ ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. మరోవైపు కరోనాతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండటంపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కొన్ని సలహాలు ఇచ్చారు మన్మోహన్ సింగ్. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. రాబోయే ఆరు నెలల్లో టీకాలు ఎందరికి ఇవ్వాలో నిర్దేశించుకుని, అందుకు తగినట్లుగా టీకా తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. వివిధ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్లకు ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్డర్ల వివరాలను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.  రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ను ఏ పద్ధతిలో పంపిణీ చేస్తారో పారదర్శకంగా ప్రకటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం కేంద్ర ప్రభుత్వం  10 శాతం వ్యాక్సిన్లను ఉంచుకోవచ్చునని, మిగిలిన టీకాలను రాష్ట్రాలు తమకు తగిన ప్రణాళిక ప్రకారం వాడుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. కోవిడ్-19పై ముందు వరుసలో ఉండి పోరాడుతున్నవారిని వర్గీకరించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని తెలిపారు. 45 ఏళ్ళ వయసు లోపువారికి కూడా అవసరమైతే వ్యాక్సినేషన్ చేయడానికి రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలన్నారు. దీనికి ఉదాహరణను కూడా మన్మోహన్ సింగ్ వివరించారు. అదేమిటంటే, పాఠశాల ఉపాధ్యాయులు, బస్సులు, త్రిచక్ర వాహనాలు, ట్యాక్సీల డ్రైవర్లు, పంచాయతీ సిబ్బంది, కోర్టులకు వెళ్ళే న్యాయవాదులను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించవచ్చునని, వారి వయసు 45 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, వారికి టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చునని తెలిపారు. 

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శనివారం ఏడు వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ఏపీలో పాజిటివ్ రేటు 20 శాతంగా ఉండటం ఆందోళన కల్గిస్తోంది. 36 వేల టెస్టులు చేయగా ఏడు వేల పాజిటివ్ లు వస్తున్నాయి. అంటే టెస్టులు చేస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తుందంటే కరోనా ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు. టెస్టుల సంఖ్య పెంచితే కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.  కరోనా సెకండ్ వేవ్ తో తెలంగాణలో విద్యాసంస్థలను మూసివేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొనసాగిస్తున్నారు. దీంతో స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్ కరోనా హాట్ స్పాట్లుగా మారిపోతున్నాయి. కర్నూల్ జిల్లా ఆదోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌లో కరోనా కలకలం చెలరేగింది. 52 మంది విద్యార్థినీలకు కరోనా పాజిటివ్ వచ్చింది.  ప్రిన్సిపాల్ శాంతి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను వైద్య అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. పాఠశాల సముదాయంలోనే ఓ గదిలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  కరోనా సెకండ్ విజృంభిస్తున్నా స్కూళ్లు, కాలేజీలు కొనసాగిస్తుండటంపై  విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని కోరారు. వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమమన్నారు. టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయంలో.. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడిని నివారించడానికి పరీక్షలు రద్దు చేయటమే ఉత్తమమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకూ ఎక్కువవుతుడటంతో పాటు మరణాల రేటు కూడా పెరుగుతోందన్నారు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, వెంటిలేటర్ల కొరత అధికంగా ఉందని సీఎం జగన్ కు రాసిన లేఖలో లోకేష్ తెలిపారు. కరోనా తీవ్రతతో అద్యాపకులు వణికిపోతున్నారు. స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఉపాద్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ విద్యాశాఖ అధికారులు కూడా విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వానికి సూచించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తరహాలోనే పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉందని తెలుస్తోంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రం వాయిదా వేయాలని నిర్ణయించారట.దీనిపై ఏక్షణమైనా ప్రభుత్వం నుంచి ప్రకటన రావచ్చుంటున్నారు. 

భయంకరంగా సెకండ్ వేవ్! జనాలకు ఈటల వార్నింగ్ 

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. శనివారం 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో 15 మంది చనిపోయారని వైద్యశాఖ ప్రకటించింది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం కేసులు, మరణాలు భారీగా ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ విజృంభణలో వైద్య శాఖను అప్రమత్తం చేశారు మంత్రి ఈటల రాజేందర్. బెడ్లు, వ్యాక్సిన్, ఆక్సిజన్ వంటి సదుపాయాలపై ఆయన అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జనాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఈటల రాజేందర్.  రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందన్నారు ఈటల. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నందున ఆక్సిజన్‌ సరఫరా విషయంపైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో నిత్యం 200 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుందన్నారు. కేసులు పెరిగితే 350 టన్నుల వరకు అవసరం ఉండొచ్చని తెలిపారు .ఆక్సిజన్‌ సరఫరా విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్నారు ఈటల. ప్రైవేట్‌, ప్రభుత్వ దవాఖానల వైద్యులు కరోనా రోగులకు ఐసీఎంఆర్‌ విధి విధానాలకు అనుగుణంగా వైద్యం అందించాలని సూచించారు. రోగి పరిస్థితి, అవసరాన్ని బట్టి ఆక్సీజన్‌ అందించాలన్నారు మంత్రి. ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత సైతం వైద్యులపై ఉందన్నారు. ఆక్సిజన్‌ అవసరం మేరకు వాడుకోవాలన్నారు.  కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్‌ మొదలైందని అన్నారు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు 100 శాతం టీకాలు పంపిణీ చేస్తాం. ప్రతి పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు ఈటల రాజేందర్. ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉందని చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత సమస్యను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు ఈటల. వ్యాక్సిన్‌ కొరత కారణంగానే పంపిణీ నిలిచిపోయిందన్నారు. టీకా నిల్వలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఈటల చెప్పారు. 

సిగ్గులేని పాలన! కేసీఆర్ పై షర్మిల నిప్పులు

ఉద్యోగ నియామకాల కోసం చేపట్టిన దీక్షను వైఎస్ షర్మిల విరమించారు.  72 గంట‌ల పాటు నిరాహార దీక్ష‌లో కూర్చున్న షర్మిలకు నిరుద్యోగుల కుటుంబస‌భ్యులు నిమ్మ రసం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌జేశారు. ఈ సంద‌ర్భంగా  సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ పాలకులు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. పాల‌కుల్లో ఒక్క‌రికైనా గుండె ఉందా? ఆ ఛాతీలో ఉన్న‌ది గుండెనా? బ‌ండ రాయా? అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. తెలంగాణ‌లో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ఎప్పుడు వ‌స్తాయ‌ని ఎదురు చూస్తున్నారని అన్నారు షర్మిల. పెళ్లి కూడా చేసుకోకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వారికి వ‌య‌సు కూడా పెరిగిపోవడంతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారన్నారు. ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం సీఎం కేసీఆర్ కాదా? ఇవి హ‌త్యలా? ఆత్మ‌హ‌త్య‌లా?' ని ష‌ర్మిల నిలదీశారు. కేసీఆర్ చిటికేస్తే నోటిఫికేష‌న్లు వ‌స్తాయన్నారు షర్మిల. గతంలో వైఎస్సార్ మూడు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చారన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారనిప్రశ్నించారు. అప్ప‌ట్లో వైఎస్సార్ ప్రైవేటు రంగంలోనూ ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టించారని తెలిపారు.  కేసీఆర్ మాత్రం అసమ‌ర్థుడు.. ఆయ‌న ఛాతీలో ఉన్నది గుండెనా? బ‌ండా?  దొర‌ల గ‌డీ నుంచి నియంత పాల‌న కొన‌సాగిస్తున్నారు అంటూ  ష‌ర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు.  ప్ర‌శ్నించాల్సిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు చేతుల‌కు గాజులు వేసుకుని కేసీఆర్ ఇచ్చిన డ‌బ్బును తీసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారని షర్మిల విమర్శించారు. అందుకే తాను పోరాటం చేస్తాన‌ని వ‌చ్చానన్నారు. తన పోరాటంతో పాల‌కుల‌కు భ‌యం వేస్తోందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మ‌మ్మ‌ల్ని టార్గెట్ చేశారని షర్మిల ఆరోపించారు. పోలీసులు లా అండ్ ఆర్డ‌ర్ కోసం ప‌నిచేస్తున్నారా? కేసీఆర్ కోసం ప‌నిచేస్తున్నారా?  తెలియడం లేదన్నారు. తెలంగాణ త‌ల్లి సాక్షిగా తన బ‌ట్ట‌లు చింపి, నా చేతిని విర‌గొట్టి, ఇంకొక త‌మ్ముడి కాళ్లు విర‌గ్గొట్టి తీసుకెళ్లారని చెప్పారు. సిగ్గుండాలి పాల‌కుల‌కు. ఆడ‌వాళ్ల మీదనా మీ ప్ర‌తాపం. యావ‌త్ మ‌హిళా లోకం ఈ పాల‌కుల మీద ఉమ్మి వేస్తోంది అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.  త‌న పోరాటం ఆగ‌బోద‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. ల‌క్షా 91 వేల ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్లు జారీ చేయాల్సిందేనన్నారు. దున్నపోతు మీద వాన ప‌డిన‌ట్లు కేసీఆర్ గారు స్పందించ‌కుండా ఇలాగే కాల‌యాప‌న చేస్తే తాముచేయ‌బోయే ప్ర‌తి కార్య‌క్ర‌మంలో నిరుద్యోగుల అంశాన్ని లేవ‌నెత్తుతానని ష‌ర్మిల హెచ్చరించారు.

తిరుప‌తి ల‌బ్‌డ‌బ్‌.. వైసీపీలో డ‌గ్‌డ‌గ్‌..

అంత‌న్నారు. ఇంత‌న్నారు. తిరుప‌తి మాదేన‌న్నారు. 6 ల‌క్ష‌ల‌కు పైగా మెజార్టీ ఖాయ‌మ‌న్నారు. అరెవో సాంబా.. రాస్కో.. అన్నంత బిల్డ‌ప్ ఇచ్చారు. తీరా పోలింగ్ రోజు వ‌చ్చేస‌రికి. చేతులెత్తేశారు. అధికార వైసీపీలో గెలుపు భ‌యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఓడిపోతామ‌నే టెన్ష‌న్‌లో దొంగ ఓట్ల‌తో దిగ‌జారిపోయారు. తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశారు. మునుపెన్న‌డూ లేనంత‌గా తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక ర‌చ్చ రచ్చగా మారింది. ఏకంగా తిరుప‌తి ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌నేంత వ‌ర‌కూ విష‌యం వివాదాస్ప‌ద‌మవ‌డం మామూలు మేట‌ర్‌ కానేకాదు. ఓట‌మి భ‌యం, గెల‌వాల‌నే కుట్ర‌తోనే వైసీపీ ఈ స్థాయిలో దొంగ ఓట్ల దందాకు తెగ‌బ‌డింద‌ని చెబుతున్నారు. 6 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుందంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన వైసీపీ నేత‌లు.. అంత ఆధిక్యం వ‌స్తే మ‌రెందుకు ఇంతగా దొంగ ఓట్ల దారుణం? అని ప్ర‌శ్నిస్తున్నారు. అంటే, తాము ఎలానూ గెల‌వమ‌ని వారు అనుకున్నారా?  గెలుపుపై ధీమా స‌డ‌లిందా?  లేక‌, త‌మ అధినేత జ‌గ‌న్ రెడ్డి 6 ల‌క్ష‌లు టార్గెట్ పెట్టారు కాబ‌ట్టి ఇలా బ‌రి తెగించారా? అని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి.  ఎంత దారుణం? ఎంత అప్ర‌జాస్వామికం? ఒక‌టా, రెండా.. వంద‌లాది బ‌స్సులు.. వేలాది మంది దొంగ ఓట‌ర్లును.. తిరుప‌తి మొత్తం దించేశారు. విచ్చ‌ల‌విడిగా దొంగ ఓట్లు వేసేందుకు లైసెన్సులు ఇచ్చేశారు. పాలించే వాడు వాళ్ల‌ వాడే.. అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి ఎస్కార్టులు.. పాల‌కులే దగ్గ‌రుండి మ‌రీ దొంగ ఓట్లు వేయించారు. మీడియా సాక్షిగా తిరుప‌తి ఎన్నిక‌లో దొంగ ఓట్ల ప్ర‌హ‌స‌నం కొన‌సాగింది. ఇంతా చేస్తే.. పోలింగ్ శాతం ఏమైనా పెరిగిందా? అంటే అదీ లేదు. చాలా త‌క్కువ‌గా.. 65 శాతం ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఇంత త‌క్కువ శాతం పోలింగ్ ఎవ‌రికి లాభం? మ‌రెవ‌రికి న‌ష్టం? అనే విశ్లేష‌ణ‌లు జోరుగా సాగుతున్నాయి.  ఓటింగ్ శాతం త‌గ్గ‌డం అధికార పార్టీని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ఓట‌ర్ల తీర్పు ఎలా ఉండ‌బోతుందోన‌నే టెన్ష‌న్ మొద‌లైంది. ఇలాగైతే 6 ల‌క్ష‌ల మెజార్టీ మాటేమో గానీ.. గెలిస్తే  అదే చాల‌న్న భ‌యం వారిని వెంటాడుతోంది.  ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్‌, పంచాయ‌తీ, ప‌‌రిష‌త్ ఎన్నికల‌న్నీ వైసీపీ గంప గుత్త‌గా కొల్ల‌గొట్టేసింది. ఏక‌గ్రీవాల మాటున అధికార పార్టీ ఆగ‌డాలకు అడ్డే లేకుండా పోయింది. న‌యానో, భ‌యానో దాదాపు అన్ని ఎన్నికల్లోనై వైసీపీదే హ‌వా. కానీ, తిరుప‌తికి వ‌చ్చే స‌రికి సీన్ రివ‌ర్స్. తిరుప‌తి ఎంపీ బై పోల్‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. చంద్ర‌బాబు, లోకేశ్‌లు కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని తిరిగారు. ఊరూరా తెలుగుదేశానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు స్థానికులు. టీడీపీ జోష్ చూసి వైసీపీలో క‌ల‌వ‌ర‌పాటు మొద‌లైంది. అందుకే, ఓ ద‌శ‌లో జ‌గ‌న్ సైతం ప్ర‌చారానికి వ‌స్తాన‌న్నారు. తాను ప్ర‌చారం చేసినా ఓడిపోతే ప‌రువు పోతుంద‌నుకున్నారో ఏమో.. క‌రోనా సాకుతో క్యాంపెయిన్‌కు డుమ్మా కొట్టారు. గెలుపుపై కాన్ఫిడెన్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే జ‌గ‌న్ ప్ర‌చారానికి రాలేద‌నేది విప‌క్షాల విమ‌ర్శ‌. ప్ర‌చార స‌మ‌యంలోనే ఇక‌ వైసీపీ ప‌ని అయిపోయింద‌ని అన్నారంతా. శ‌నివారం నాటి పోలింగ్‌తో మ‌రింత క్లారిటీ వ‌చ్చేసింది. పోలింగ్ జ‌రిగిన తీరు.. వైసీపీ దొంగ‌నోట్ల దిగ‌జారుడు.. ఇవ‌న్నీ వైసీపీ ఓట‌మికి సిగ్న‌ల్స్ అంటున్నారు. అందుకే, తిరుప‌తి ఫ‌లితాల‌పై అధికార పార్టీలో ఎన‌లేని ఉత్కంఠ‌. 

ఏపీలో దొంగల రాజ్యం!

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బయటపడిన దొంగ ఓట్లు బాగోతం ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. దొంగ ఓటర్లను తరలిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో అధికార వైసీపీ తీరుపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో దొంగల రాజ్యం నడుస్తుందంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక రోజున వెన‌క్కి పంపామ‌ని డీజీపీ చెప్పిన ఆ 250 బ‌స్సులు ఎవ‌రివ‌ని టీడీపీ నేత‌ య‌న‌మల రామ‌కృష్ణుడు ప్ర‌శ్నించారు. ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్ల క‌ల‌క‌లంతో  ఏపీ పరువు పోయిందన్నారు.  ఏపీని దొంగ ఓట్లు- దొంగ నోట్ల‌ రాజ్యంగా మార్చారని యనుమల మండిప‌డ్డారు. రాష్ట్రం మొత్తం దొంగ‌లమ‌య‌ం అయిందన్నారు. ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్ల కల‌క‌లంపై సీఎం జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. మంత్రుల ప్రమేయంతోనే దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చారని ఆయన ఆరోపించారు.  దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చిన వారంతా మంత్రులు పంపిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు కాదా? అని యనుమల  నిల‌దీశారు. దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చిన వారంద‌రిపై ఎందుకు కేసులు న‌మోదు చేయ‌ట్లేదు? అని య‌న‌మ‌ల ప్ర‌శ్నించారు. పోలింగ్ రోజు దొంగ ఓటర్ల‌తో బ‌స్సులు తిరుప‌తికి ఎలా వ‌చ్చాయని ఆయ‌న నిల‌దీశారు. కేసులు న‌మోదైన 12 మంది అధికార వైసీపీకి చెందిన వారు కాదా? అని చెప్పారు.ఉప ఎన్నిక‌ జ‌రిగిన ప్రాంతంలో 144 సెక్ష‌న్ విధిస్తే పంక్ష‌న్ హాళ్ల‌లో, రోడ్ల‌పైకి వేల మంది ఎలా వ‌చ్చారని ప్రశ్నించారు. ఓట‌మి భ‌యంతోనే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారని ఆయ‌న చెప్పారు. తాము చేసిన ఫిర్యాదుల‌పై ఎన్నిక‌ల సంఘం స్పందించాలని యనుమల కోరారు.

ఐసీయూలో మోత్కుపల్లి! 

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మృత్యువుతో పోరాడుతున్నారు. కరోనాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య  పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.  మోత్కుపల్లి నరసింహులుకు  క‌రోనా సోక‌డంతో మూడు రోజుల క్రితం ఆయ‌న‌ను హైద‌రాబాద్‌ సోమాజిగూడ‌లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అయితే శనివారం రాత్రి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింది. దీంతో ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.  దివంగత ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన మోత్కుపల్లి.. టీడీపీలో కీలక పదవులు నిర్వహించారు. మంత్రిగా కూడా పని చేశారు. ఎన్టీఆర్ , చంద్రబాబు వివాదంలో ఎన్టీఆర్ సైడ్ ఉన్నారు మోత్కుపల్లి. ఎన్టీఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి టీడీపీకి వచ్చారు నర్సింహులు. అయితే చంద్రబాబుతో విభేదాలు రావడంతో మళ్లీ బయటికి వచ్చారు. ఆలేరు నుంచి ఐదు సార్లు, తుంగతుర్తి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి.. గత ఏడాది బీజేపీలో చేరారు.  మోత్కుపల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.   

కరోనా విజృంభణకు కారణాలివే! 

దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి. కరోనా రోగులకు బెడ్లు లేకపోవడంతో హాస్పిటల్స్ లో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరో ఆరు వారాల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసుల ఉద్ధృతిపై  ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు. కేంద్రం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు పాటించకపోవడం, రూపు మార్చుకున్న వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం దేశంలో కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలని  తెలిపారు.  వ్యాక్సినేషన్ జరుగుతోందన్న ధీమాతో ప్రజలు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారని డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనా విస్తరిస్తుంటే దేశంలో మత సంబంధ కార్యక్రమాలు, ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎన్నికలు, మత కార్యక్రమాలను ఆంక్షలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ వయోపరిమితిని సడలిస్తూ వెళ్లాలని, తద్వారా అత్యధికులకు వ్యాక్సిన్ అందించేందుకు వీలవుతుందని తెలిపారు.  దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్ ఔషధానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ధరలు మరీ అధికం కాకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. రెమ్ డెసివిర్ అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించాలని ఫార్మా సంస్థలను కోరింది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి ఫార్మా సంస్థలు రెమ్ డెసివిర్ ధరలను తగ్గించాయి.రెమ్ డాక్ బ్రాండ్ ధర రూ.2,800 నుంచి రూ.899కి తగ్గించగా, రెమ్ విన్ బ్రాండ్ రూ.3,950 నుంచి రూ.2,450కి తగ్గించారు. రెడిక్స్ బ్రాండ్ ధర రూ.5,400 నుంచి రూ.2,700కి తగ్గింది. సిప్ రెమీ బ్రాండ్ ధర రూ.4 వేల నుంచి రూ.3 వేలకు... డెస్ రెమ్ బ్రాండ్ ధర రూ.4,800 నుంచి రూ.3,400కి తగ్గింది. ఇక జుబీ-ఆర్ బ్రాండ్ ధర రూ.4,700 నుంచి రూ.3,400కి... కోవిఫర్ బ్రాండ్ ధర రూ.5,400 నుంచి రూ.3,490కి తగ్గించారు.