తగ్గేదే లే.. ప్రాణాలకంటే పరీక్షలే ముఖ్యమా?
posted on Apr 28, 2021 @ 1:16PM
తగ్గేదే లే. విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నా వెనక్కి తగ్గేదే లే. కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహిస్తాం. ఇదీ సీఎం జగన్ తాజా ప్రకటన.
పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని.. విపత్కర సమయంలోనూ అగ్గి పెట్టాలని చూస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని.. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని జగన్ అన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని వివరించారు.
‘పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్ అనే ఉంటుంది. పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ ఉండాలనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమైన పనే. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నా. జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన పని. కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటున్నామని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నా’ అని జగన్ అన్నారు.
పది, ఇంటర్ పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో సీఎం జగన్ ఈ ప్రకటన చేశారు. జగన్ చెప్పిందే నిజమైతే.. ఇంత చిన్న విషయం కేంద్రానికి తెలీదా? దేశంలోకే అత్యున్నత విద్యా బోర్డులైన సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలు ఎందుకని పది పరీక్షలు రద్దు చేశాయి? ఆ జాతీయ సంస్థలకు తెలీదా.. సర్టిఫికెట్లలో పాస్ అనే ఉంటుందని? వారికి తెలీదా.. పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థలో సీట్లు వస్తాయో, రావో? ఇప్పటికే అనేక రాష్ట్రాలు సైతం పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి. మరి, ఆ రాష్ట్రాలు.. పని లేక పరీక్షలు రద్దు చేశాయా? ఎగ్జామ్స్ పెట్టడం చేతగాక పరీక్షలు వద్దనుకున్నాయా? ఒక్క జగన్‌కు మాత్రమే విద్యార్థుల భవిష్యత్ పట్టిందా? మిగతా.. కేంద్ర, రాష్ట్రాలు తమ పిల్లల భవిష్యత్తును కాలరాస్తున్నాయా? అని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. పరీక్షలకంటే ప్రాణాలు ముఖ్యమనే చిన్న లాజిక్ జగన్ మరిస్తే ఎలా అని నిలదీస్తున్నారు. కరోనా కాటేస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలకంటే పరీక్షలే ముఖ్యమన్నట్టు సీఎం జగన్ మాట్లాడిన తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. మరి, జగమొండి జగన్ వారి ఆవేదనను వింటారా? పట్టించుకుంటారా? పరీక్షలపై ఇలానే పంతానికి పోతారా?