అంబులెన్సులు లేకుంటే గుర్రాలను వాడండి!
posted on Apr 27, 2021 @ 8:49PM
కరోనా కట్టడి చర్యలపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి విరుచుకుపడింది. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వేగంగా విస్తరిస్తున్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. నైట్ కర్ఫ్వూతో పాటు సమావేశాలను, ఫంక్షన్లను 50శాతానికి కుదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ కంట్రోల్ రూమ్ కోసం మరిన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. అంబులెన్స్‌లు అందుబాటులో లేని సమయంలో మృతదేహాలను తరలించడానికి గుర్రాలను వాడాలని న్యాయస్థానం సలహా ఇచ్చింది. అంబులెన్స్ డ్రైవర్లు, హాస్పిటల్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అన్నీ ఆర్టీపీసీఆర్ టెస్టులకోసం వేచి చూడకుండా వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం సరైన అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని హితవు పలికింది. వాయు మార్గాలను ఆక్సిజన్ రవాణాకు సిద్ధంగా ఉంచాలని భారత వాయిసేనను హైకోర్టు కోరింది. కేంద్రం కూడా రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ సరఫరా చేసేలా చూడాలని సలహా ఇచ్చింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కూడా డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులకు, వికలాంగులకు వైద్య సదుపాయం సరైన విధంగా చూడాలని సూచించింది. నైట్ షెల్టర్లను, సరైన సౌకర్యాలను కల్పించాలని, ప్రైవేట్ హాస్పిటల్స్‌ను కూడా కోవిడ్ సేవలు అందించే విధంగా ఉత్తర్వులు ఇచ్చి ప్రస్తుత కోవిడ్ హాస్పిటల్స్‌పై ఒత్తిడి తగ్గించాలన్ని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
రాష్ట్రంలో కేవలం నాలుగే సోషియల్ డిస్టెన్స్ కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందని హైకోర్టు మండిపడింది. పోలీస్ శాఖ సమర్పించిన నివేదికపై అసహనం వ్యక్తం చేసింది. పోలీసులకు మాస్క్ కంపల్సరీ చేయమన్న హైకోర్టు.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నామని హైకోర్టు పేర్కొంది. పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణ మే 5కి వాయిదా వేసింది.