అవినీతి నేతల భరతం పట్టండి! సీజేఐకి కాపు సంఘం నేత లేఖ
posted on Apr 28, 2021 @ 12:21PM
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఏపి రాష్ట్ర అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాసరావు లేఖ రాశారు. దేశంలో ఉన్న అవినీతి ప్రజాప్రతినిధుల భరతం పట్టాలని కోరారు. అనేక మంది అత్యంత అవినీతిపరులైన నేతలు ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నారన్నారు. అవినీతికి సంబంధించి సిబిఐ, ఈడి కేసులలో ముద్దాయిలుగా ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు బెయిల్ పై సంవత్సరాల తరబడి ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు శ్రీనివాసరావు. అవినీతి కేసుల్లో చిక్కుకున్న బడా వ్యాపారులు, కొందరు అధికారులు, ఆర్థిక ఉగ్రవాదులు కూడా బయటే ఉన్నారని చెప్పారు.
సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్నవారి బెయిల్ వెంటనే రద్దు చేసి, 100 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 6 నెలలులోనే విచారణ పూర్తి చేసి కఠిన శిక్షలు వేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ ముద్దాయిలు రాజకీయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని చేసిన లక్షల కోట్ల దోపిడి కారణంగా భారత ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినదని తెలిపారు. ప్రజాప్రతినిధులు అక్రమంగా దోచుకున్న సొమ్మంతా ప్రజల ఆస్తి అయినందున తక్షణం జప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సామాన్య రైతుబిడ్డ స్థాయి నుండి సుప్రీంకోర్ట్ ప్రధానన్యాయమూర్తిగా ఎదిగిన మీరు భారతదేశ యువతకు మార్గదర్శకులన్నారు శ్రీనివాసరావు సీజేఐకి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. తమరి సారధ్యంలో భారతదేశం న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. గతంలో కేంద్ర న్యాయశాఖా మంత్రిగా పని చేసిన పి.శివశంకర్.. న్యాయ వ్యవస్థలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారని వేల్పూరి శ్రీనివాసరావు తన లేఖలో గుర్తు చేశారు. తమరు కూడా రాజ్యాంగ రక్షణకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంకోసం న్యాయ వ్యవస్థలో వున్న లోపాలు సరిచేసి అనేక కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి న్యాయ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు.