ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ! జగన్‌కు మూడేళ్లు కష్టమే?
posted on Apr 27, 2021 @ 5:28PM
ఏపీలో రాత్రి కర్ఫ్యూ పెట్టడం తుగ్లక్ చర్యగా అభివర్ణించింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కల్లోలం కట్టడికి హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఔషధాలపై 3 నెలలు జీఎస్టీ లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్షుకుమార్‌రాజు.
ఏపీలో భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపుపై అధికార యంత్రాంగానికి ఉన్న శ్రద్ధ.. కరోనా వ్యాప్తి నియంత్రణపై లేదని విమర్శించారు. కొవిడ్ సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఇంకా మూడేళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారని తాను అనుకోవడం లేదని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు.
విష్ణుకుమార్‌రాజు అనే కాదు.. ఏపీలో ఎవరిని అడిగినా ఇదే మాట అంటున్నారు. కరోనా కుమ్మేస్తుంటే.. ఏపీలో భవనాల కూల్చివేతలు ఏంటని అంతా నిలదీస్తున్నారు. టీడీపీ నేతలే టార్గెట్‌గా విశాఖలో విధ్వంస రచన కొనసాగుతోంది. పల్లా శ్రీనివాస్, సబ్బం హరి, గీతం వర్సిటీ.. ఇలా అక్రమ నిర్మాణాల పేరుతో టీడీపీ నేతల కట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. భీమిలీ రోడ్డులో చిన్న చిన్న షాపులను కూల్చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు, సంగం డెయిరీని ప్రభుత్వ పరం చేయడం.. దేవినేని ఉమాను నోటీసులతో బెదిరించడం.. ఇలా కరోనా కట్టడి కంటే కూడా టీడీపీ కట్టడి మీదే ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతోందంటూ ప్రజలు మండిపడుతున్నారు.
కొవిడ్ సమయంలో పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు పెట్టేందుకు సర్కారు షెడ్యూలు ప్రకటించడం మరింత దారుణం. ఇంత దారుణ పరిస్థితుల్లో పరీక్షల పేరుతో స్టూడెంట్స్ ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటని జనం నిలదీస్తున్నారు. అయినా.. జగన్ సర్కారుకు ఇవేమీ పట్టడం లేదు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను చూసే బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు లాంటి వాళ్లు జగన్ సీఎంగా మరో మూడేళ్ల పాటు ఉండటం కష్టమంటూ జోష్యం చెబుతున్నారు. నిజమే మరి... ముఖ్యమంత్రి తీరు అలా ఉంది మరి..