టీకా కోసం భారీగా క్యూలు.. చేతులెత్తేస్తున్న రాష్ట్రాలు
posted on Apr 28, 2021 @ 10:54AM
దేశంలో కరోనా కల్లోలం స్పష్టిస్తోంది. మంగళవారం దేశంలో 3 వేల 2 వందల మందికి పైగా చనిపోవడం కలకలం రేపుతోంది. రోజూ ముడున్నర లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మేలో మరింత ముప్పు ఉంటుందని, రోజుకు 10 లక్షల కేసులు కూడా రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే అందరికి వ్యాక్సిన్ ఇవ్వడమే పరిష్కారమని సూచిస్తున్నారు. కేంద్ర సర్కార్ కూడా వ్యాక్సినేషన్ పై ఫోకస్ చేసింది. ప్రస్తుతం 45 ఏండ్ల పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తుండగా.. మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించింది. రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి టీకాలు వేసే అవకాశం కల్పించింది కేంద్రం.
ఇంతవరకు బాగానే ఉన్నా మే 1నుంచి టీకాలు వేయడానికి సరిపడా వ్యాక్సిన్లు ఉన్నాయా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. రెండు రోజుల్లో మూడవ దశ వ్యాక్సినేషన్ మొదలు కావాల్సి వున్నా... రాష్ట్రాలకు మాత్రం టీకాలు వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం సాఫీగా మొదలయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తుంటే చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కు తీవ్ర అవాంతరాలు ఏర్పడేలా ఉన్నాయి. అందుకు కారణం డిమాండ్ కు తగినంతగా టీకాల సరఫరా లేకపోవడమే. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే టీకాలు నిండుకున్నాయి. కొత్తగా చాలినన్ని టీకా వయల్స్ ఏ రాష్ట్రానికీ సరఫరా కావడం లేదు.
దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే దాదాపు 90 నుంచి 100 కోట్ల డోస్ లు కావాలి. ఈ ఏజ్ గ్రూప్ లో సుమారు 45 కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. 60 ఏళ్లు దాటిన వారందరికీ, ఆపై 45 ఏళ్లు దాటి వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికీ టీకాలు ఇస్తున్నా, అదింకా లక్ష్యాన్ని తాకలేదు. ఇప్పటివరకూ సుమారు 15 కోట్ల డోస్ లను మాత్రమే పంచారు. అందులో రెండు డోస్ లు తీసుకున్న వారి సంఖ్య 2 కోట్లను కూడా దాటలేదు. చాలా రాష్ట్రాలు 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వాలంటే, తమకు వెంటనే వయల్స్ పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు కావాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లను కోరింది. వచ్చే ఆరు నెలల కాలంలో ఇవి పంపాలని కోరింది. ఇదే తరహా విజ్ఞప్తులు పలు రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్ కంపెనీలకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, యూపీ, రాజస్థాన్, కేరళ, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ తదితర అన్ని ప్రాంతాల నుంచి వ్యాక్సిన్ కంపెనీలకు లేఖలు అందుతున్నాయి.
టీకాలకు ధర నిర్ణయం విషయంలో సందిగ్ధతలు నెలకొని వున్నాయి. తాము కొనుగోలు చేసే టీకాలను ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కంపెనీలు కేంద్రానికి ఇచ్చే టీకాలకే తగ్గింపు ధరలను అమలు చేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమ ప్రజలకు ఉచితంగా టీకాలు ఇస్తామని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. అందుకయ్యే ఖర్చును తామే భరిస్తామని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే మూడు నెలల కాలంలో ఎన్ని టీకాలు అందుబాటులో ఉంటాయి? ఎంత మందికి వాటిని ఇవ్వవచ్చు? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు.
మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించలేమని ఆంధ్రప్రదేశ్, గోవా ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కేంద్రం కోరిన డోస్ లను సరఫరా చేయడానికే మరింత సమయం పట్టేలా ఉంది. దీంతో రాష్ట్రాలకు టీకాలను పంపించేందుకు ఇంకెంత సమయం పడుతుందోనన్న ఆందోళన కూడా ఉంది. కొవిన్ వెబ్ సైట్ లో, ఆరోగ్య సేతు యాప్ లో 18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. కానీ రిజిస్టర్ చేసుకున్న వారికి ఎప్పుడు వ్యాక్సిన్ ఇస్తారన్న స్పష్టత మాత్రం లేదు.