కరోనా కల్లోలంలో పరీక్షలా? జగన్ మూర్ఖత్వంపై చంద్రబాబు ఫైర్
posted on Apr 28, 2021 @ 1:29PM
జగన్‌ది వితండ వాదం. మూర్ఖత్వం. లాక్‌డౌన్ పెట్టాలనే ఆలోచనలో సర్వత్రా ఉంటే పరీక్షలు పెట్టాలని చూడటం తగదు. పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదని.. విద్యార్థులకు రవాణా, ఇతర విధాలుగా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా వేస్తే, జగన్ వారికంటే మేధావా అని నిలదీశారు. వితండ వాదం, మూర్ఖత్వంతోనే రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న చోట లాక్‌డౌన్ పెట్టుకుని వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టుపెట్టొద్దన్నారు. 18ఏళ్ల పైబడిన వారికి టీకా ఇచ్చే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 25.8 శాతానికి పెరిగింది. కోర్టులకు కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చెప్పడం అబద్ధం.. అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు చంద్రబాబు.
వివిధ దేశాల వైద్య నిపుణుల సహకారంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తమ వంతు సహకరిస్తామని తెలిపారు. పార్టీ పరంగా ఎంతవరకు సాయమందించగలమో అంత వరకూ చేస్తామన్నారు టీడీపీ అధినేత. అందరినీ కలుపుకుపోయి ప్రజల ప్రాణాలు కాపాడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.