రిజైన్ మోడీ! నెటిజన్ల డిమాండ్.. కమలనాధుల పరేషాన్
posted on Apr 28, 2021 @ 9:48AM
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. ఇదే ఎప్పటినుంచో ఉన్న సామెత. చాలాసార్లు ఇది నిజమవుతుంది కూడా. కాలం కలిసిరాకపోతే ఏదైనా జరుగుతుందని చెప్పడానికి ఈ సామెతను వాడుతుంటారు. రాజకీయ. వ్యాపార రంగాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇండియాలోనూ అదే జరుగుతోంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో వెలుగు వెలిగిన నేత.. ఇప్పుడు ట్రోలింగ్ కు గురవుతున్నారు. నెటిజన్ల నుంచి దారుణమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఒక సామాన్యుడు చాయ్ వాలా దేశానికి ప్రధాని కాకూడదా? అని 2014 ఎన్నికల్లో దీనంగా అడిగిన మోడీకి రెండు సార్లు ఆ పదవిని ఇచ్చారు దేశ ప్రజలు. సోషల్ మీడియానే ఆయుధంగా వాడి గద్దెనెక్కిన మోడీకి ఇప్పుడు అదే సోషల్ మీడియా పక్కలో బల్లెంలా తయారైంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి సోషల్ మీడియాలో ఏ చిన్న కామెంట్ చేయడానికి కూడా భయపడేవారు. కొందరు కమెడీయన్లు, కార్టూనిస్టులు ఇలాంటి ప్రయత్నం చేయడంతో వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. కాని ఇప్పుడు మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది.
దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రమాదకరంగా ఉంటున్నాయి. దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీరుపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీకి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీపై నెటిజన్లు మండిపడుతున్నారు. కరోనాను అదుపు చేయడంలో దారుణంగా విఫలమయ్యారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #ResignModi హాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
కేంద్ర సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను ట్విట్టర్ ద్వారా తీర్చుకుంటున్నారు నెటిజన్లు.కరోనాను అదుపు చేయడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని.. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి పదవి నుంచి మోడీ తప్పుకోవాలని ట్విట్టర్ మారుమోగుతోంది. ‘రిజైన్ మోడీ’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. ఇప్పటికే దీనిపై దేశ ప్రజలంతా 230000కు పైగా మంది ట్వీట్స్ చేసి మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా కల్లోలంలో ఏం చేయలేని మోడీ దిగిపోవాలంటున్నారు.
సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ కలిగిన మోడీకి ట్విట్టర్‌లో ఈ స్థాయిలో నిరసన సెగ తగలడం ఇదే తొలిసారి. గత ఏడాది ఆగస్టులో సోషల్ మీడియాలో మొదటి సారి మోడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన నిర్వహించిన మన్ కీ బాత్ పై నెటిజన్లు డిస్ లైక్ ల మోత మోగించారు. జేఈఈ నీట్ పరీక్షలపై మాట్లాడని మోడీ వీడియోను 18 లక్షల మంది చూస్తే 74 మంది లైక్ చేస్తే.. 5 లక్షల మంది డిస్ లైక్ చేశారు. Where is Modi అంటూ ట్విటర్‌లో భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడిన మాటలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని మోడీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని నెటిజన్లు ఆరోపించారు. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్నా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంపై మండిపడుతున్నారు. ఉద్యోగాలు కావాలంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. ‘మోడీ రోజ్‌గార్ దో’, ‘మోడీ ఉద్యోగమివ్వు’ వంటి ట్వీట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఒక్క రోజులోనే ఇలాంటి ట్వీట్లు ఏకంగా 50 లక్షలు రావడం గమనార్హం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఇచ్చిన హామీ ఏమైందని గొంతెత్తుతున్నారు.