దొంగ ఓట్లే లీడ్! ఓడి గెలిచిన టీడీపీ
posted on May 2, 2021 @ 5:25PM
అంతన్నారు. ఇంతన్నారు. ఏకంగా 6 లక్షల మెజార్టీ వస్తుందన్నారు. మంత్రులంతా తిరుపతిని చుట్టుముట్టారు. వైసీపీకి ఓటేయకపోతే పథకాలు అందవంటూ బెదిరించారు. వాలంటీర్లనూ విచ్చలవిడిగా వాడేసుకున్నారు. ఇక పోలింగ్ నాడైతే దొంగనోట్ల దండయాత్రే. పొరుగు నియోజకవర్గాల నుంచి వందలాది బస్సులు, వాహనాల్లో దొంగ ఓటర్లు దిగిపోయారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తిరుపతిలో దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యం అబాసుపాలైంది. ఇంతా చేస్తే.. అంత గట్టిగా ప్రయత్నిస్తే.. వచ్చింది కేవలం రెండు లక్షల పైచిలుకు మెజార్టీ మాత్రమే.
ప్రచార సమయంలో జిల్లా మంత్రి తమకు 5 లక్షల ఆధిక్యం కాయమంటూ మీసం మెలేశాడు. మరో మంత్రి ఆరు లక్షల మెజార్టీ ఖాయమన్నాడు. జిల్లాకు వచ్చిన మంత్రులు సైతం 5 లక్షల మెజార్టీ ఖాయమన్నారు. గెలుపు తమదేనంటూ గొప్పలకు పోయారు. తీరా.. తిరుపతి ఫలితం వచ్చాక అంతా ఖంగు తిన్నారు. ఇదేంటి ఇంత తక్కువ మెజార్టీ ఏంటంటూ ఉలిక్కిపడుతున్నారు. 5 లక్షల ఎక్కడ? 2 లక్షలు ఎక్కడ? తిరుపతిలో వైసీపీ గెలిచినట్టా? ఓడినట్టా? మంత్రి చెప్పిన లెక్క ప్రకారం.. సుమారు 3 లక్షల ఓట్ల తేడాతో అధికార పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోయిందని అంటున్నారు. ఛీ.. ఇదీ ఓ గెలుపేనా అంటున్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటి వారు.దొంగ ఓట్లు వేయించకుంటే వైసీపీ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. తిరుపతి పోలింగ్ రోజున వేలాది మంది బయటి వ్యక్తులు ఓటేయడానికి రావడం మీడియా సాక్షిగా బహిర్గతమైంది. వందలాది మందిని టీడీపీ, బీజేపీ నేతలు పట్టుకున్నారు. తిరుపతిలో అయితే ఎక్కడ చూసినా ఫేక్ ఓటర్లే కనిపించారు. దొంగ ఓటర్ల దండుతో నిజమైన స్థానిక ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. తిరుపతిలో పోలింగ్ తగ్గటానికి ఇదే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు సీఈసీకి లేఖ కూడా రాశారు. ఇంత చేసినా వైసీపీ మెజార్టీ రెండు లక్షల్లోనే ఉండటం.. అధికార పార్టీ నేతలను షాకింగ్ కు గురి చేస్తుందంటున్నారు.
నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనే మూడున్నర లక్షల మెజార్టీ సాధించాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. కౌంటింగ్ లో మాత్రం అతి కష్టం మీద లక్ష దాటిందని అంటున్నారు. గూడురు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ సాగింది. జగన్‌రెడ్డి సర్కారు అవలంభిస్తున్న అడ్డగోలు విధానాలపై ఓటర్లు విసుగు చెందారని చెప్పడానికి తిరుపతి ఎన్నికలే ఓ ఉదాహరణ. అధికార పార్టీ చెబుతున్నట్టు జగన్‌రెడ్డి పాలనపై అంత ప్రేమే ఉంటే.. వాళ్లు చెప్పినట్టుగా.. 5లక్షలకు పైగా మెజార్టీ వచ్చుండేది. అంత ఆధిక్యం రాలేదంటే.. జగన్‌పై వ్యతిరేకత పెరుగుతున్నట్టేగా? ప్రభుత్వ పాలనపై మెజార్టీ ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టేగా? అంటున్నారు.
ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఆ ఎన్నికల్లో ఎలా గెలిచిందీ అందరికీ తెలిసిందే. బలం, బలగం, బల ప్రయోగంతో ప్రతిపక్షాలను, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసి.. ఏకగ్రీవాలపై ఒత్తిడి చేసి.. నయానో భయానో.. స్థానిక సంస్థలను తమ ఖాతాలో వేసుకుంది వైసీపీ. అలానే, తిరుపతిలోనూ వార్ వన్ సైడ్ అవుతుందని ఊహించింది. కానీ, ప్రచార సమయంలో టీడీపీ నుంచి వచ్చిన అనూహ్య పోటీతో ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయింది అధికార పార్టీ. టీడీపీ దూకుడు చూసి.. చంద్రబాబు, లోకేశ్ ప్రచార ర్యాలీలు చూసి.. అసలు గెలుస్తామనే నమ్మకం కూడా వదిలేసింది. అందుకే, 5 లక్షల మేర అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తామంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు వైసీపీ నాయకులు. గెలుపు మూడ్ టీడీపీ నుంచి వైసీపీకి మళ్లేలా.. అధికార పార్టీ మెజార్టీపై ప్రచారం, బెట్టింగ్‌లు పెంచేశారు. ఓటర్ల దృష్టిని వైసీపీ ఓటమి నుంచి మెజార్టీపైకి మళ్లించారు. అవసరం ఉన్నా లేకున్నా.. 5 లక్షల మెజార్టీ వస్తుందంటూ తిరుపతి వ్యాప్తంగా ఊదరగొట్టారు. తీరా.. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక.. మెజార్టీ 2 లక్షలకే పరిమితం కావడంతో.. అధికార పార్టీ పరువు పోయినంత పనైంది. గెలిచినా.. ఆ గెలుపును ఆస్వాదించలేని దుస్థితి వైసీపీది.
వైసీపీపై ఎంత మేర వ్యతిరేకత వ్యక్తమవుతోందో.. అదే స్థాయిలో టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నికే ఇందుకు సాక్షం. తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు ప్రచార సభలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఇసుకేస్తే రాలనంత జనం చంద్రబాబు ర్యాలీల్లో కనిపించింది. నారా లోకేశ్ షోలు సైతం అంతే గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఎక్కడికెళ్లినా.. టీడీపీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును, నారా లోకేశ్‌కు జేజేలు పలికారు. ప్రజా తీర్పు.. ప్రచార సమయంలోనే వచ్చేసింది. ఆ ర్యాలీలు, ఆ సభలే.. టీడీపీని నైతికంగా గెలిపించేశాయి. ప్రస్తుతం.. దొంగ ఓట్లతోనో, అధికార బలంతోనో, బెదిరింపులతోనో.. టెక్నికల్‌గా వైసీపీ గెలిచినా.. ప్రజలు మాత్రం టీడీపీ పక్షానే ఉన్నారని స్పష్టం అవుతోంది. వైసీపీకి 5 లక్షల మెజార్టీ రాకపోవడమే అందుకు నిదర్శనం. అందుకే, తిరుపతిలో వైసీపీ గెలిచి ఓడింది.. టీడీపీ ఓడి గెలిచింది... అంటున్నారు జనం. ఆ విషయం జగన్ మనస్సాక్షికి కూడా తెలుసు.