నందిగ్రామ్ లో మమత ఓటమి... కోర్టుకు వెళతామన్న టీఎంసీ
posted on May 2, 2021 @ 8:17PM
టీట్వంటి మ్యాచ్ ను తలపించేలా సాగిన నందిగ్రామ్ అసెంబ్లీ ఫలితాన్ని ఎట్టకేలకు అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించినట్లు ఈసీ ప్రకటించింది. సమీప ప్రత్యర్థి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 1,736 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు తెలిపింది. నందిగ్రామ్ లో తొలి రౌండ్ నుంచి హోరాహోరీగా ఫలితం వచ్చింది. రౌండ్ రౌండ్ కు లీడ్స్ మారాయి. కొన్ని రౌండ్లలో సువేందకు ఆధిక్యంలో ఉంటే.. మరికొన్ని రౌండ్లలో మమత ముందున్నారు.
అయితే సాయంత్రానికల్లా మమతా బెనర్జీ 12 వందల ఓట్లతో గెలిచినట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే మమత ఓడిపోయారని, సువేందు 16 వందలకు పైగా ఓట్లతో గెలిచారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై గందరగోళం కొనసాగుతుండగానే... నందిగ్రామ్ లో ఇంకా లెక్కింపు కొనసాగుతుందని, గెలుపును ప్రకటించలేదని ఈసీ ప్రకటించింది. దీంతో అసలు నందిగ్రామ్ లెక్కింపులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. టీఎంసీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్ర దగ్గర ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది.
అయితే రీ వెరిఫికేష్ తర్వాత సువేందు అధికారి గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. బిజెపి అభ్యర్థి సువెందు అధికారి విజయం.టీఎంసీ అభ్యర్థి సీఎం మమతా బెనర్జీ పై 1,736 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఆర్వో ప్రకటన చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామన్న తృప్తి టీఎంసీ శ్రేణులకు దక్కలేదు.ఈ ఫలితంపై పెద్దగా బాధపడాల్సిన పనిలేదని మమతా పార్టీ నేతలను ఊరడించారు. అయితే, ఓట్ల లెక్కింపులో తేడా జరిగిందని, తాము దీనిపై కోర్టుకు వెళతామని ఆమె వెల్లడించారు.