పీకే సంచలనం.. రెస్ట్ తీసుకుంటానని ట్వీట్
posted on May 2, 2021 @ 4:46PM
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సహా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఫలితాలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకే అధికారం కైవసం చేసుకోగా.. కేరళలో గత సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండోసారి లెఫ్ట్ కూటమి విజయం సాధించింది. అసోంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా.. పుదిచ్చేరిలో ఎన్డీఏ కూటమి గెలిచింది. పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఊహించని విక్టరీ కొట్టింది మమతా బెనర్జీ. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ రెండు వందలకు పైగా సీట్లు గెలుచుకుంది టీఎంసీ.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల్లో ఎలా గెలవాలో పార్టీలకు సలహాలు, సూచనలు ఇస్తూ దేశంలో సరికొత్త ట్రెండ్ కు ఆద్యుడైన ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం చేశారు. జీవితంలో మరేదైనా చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.ప్రస్తుతం చేస్తున్న పనిని ఇకపై కొనసాగించలేనని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బెంగాల్ గెలిచిందని, అందుకు తాను ఎంత చేయాలో అంతా చేశానని వివరించారు. కొంతకాలం విరామం తీసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకేల కోసం పీకే పనిచేశారు. ఈ రెండు పార్టీలు తాజా ఎన్నికల్లో విజయం సాధించాయి. బెంగాల్ లో 8 విడతల్లో ఎన్నికలు జరగ్గా.... బీజేపీకి రెండంకెల సీట్లు దాటితే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిశోర్ పదేపదే సవాల్ చేశారు. ఆయన సవాల్ కు తగ్గట్టుగానే బెంగాల్ లో బీజేపీ వంద సీట్లు సాధించలేకపోయింది.ప్రశాంత్ కిశోర్ గతంలో జేడీయూ పార్టీలో చేరినా, ఎన్ పీఏ, ఎన్నార్సీ అంశాల్లో పార్టీ వ్యతిరేక వైఖరి అవలంబించారంటూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.