బెంగాల్ దీదీదే.. బీజేపీకి దబిడి దిబిడే..
posted on May 2, 2021 @ 2:09PM
నరేంద్ర మోదీ వర్సెస్ దీదీ. అమిత్‌షా వర్సెస్ మమత. జేపీ నడ్డా వర్సెస్ బెనర్జీ. బీజేపీ వర్సెస్ తృణమూల్. మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ. బెంగాల్ దీదీ మమతా బెనర్జీపై కమలనాథుల మూకుమ్మడి దాడి. 8 దశల పోలింగ్‌తో కుతంత్రం.. కొవిడ్ సమయంలోనూ ప్రధాని మోదీ 20 వరకూ సభలు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 30 ర్యాలీలు.. ప్రచారానికి 22 మంది కేంద్ర మంత్రులు, ఆరుగురు ముఖ్యమంత్రులు.. భారీగా భద్రతా బలగాల మోహరింపు.. పోలింగ్ వేళ నలుగురి కాల్చివేత.. ఇలా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను రణరంగంగా మార్చి.. గడ్డిపూల తోటలో కమలాన్ని వికసింపజేయాలనే బీజేపీ ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయింది. కమలాన్ని కాలితో తొక్కి.. నలిపేసింది మమతా బెనర్జీ. బడాబడా బీజేపీ నాయకులకు.. బెంగాల్‌లో ముచ్చెమటలు పట్టించి.. పరిగెత్తించి.. పొలిమేరలు దాటే వరకూ తరిమేసింది బెంగాల్ టైగర్. బెంగాల్ మళ్లీ బెంగాలీ బిడ్డకే దక్కింది. "బంగ్లా నిజెర్ మెయెకీ చాయె".. "బెంగాల్ తన సొంత కూతురినే కోరుకుంటోంది" అంటూ ఎన్నికల బరిలో దిగిన దీదీ.. అనూహ్య మెజార్టీతో మళ్లీ విజయం చేజిక్కించుకున్నారు. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
బెంగాల్‌ను కొల్లగొట్టేందుకు కమలనాథులు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే ప్రయత్నం చేశారు. ఏళ్లుగా మమతను టార్గెట్ చేస్తూ వచ్చారు. శారదా కుంభకోణం, ఈడీ, సీబీఐ కేసులతో తృణమూల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఎన్నికల షెడ్యూల్ విషయంలోనూ మమతను బాగా ఇబ్బంది పెట్టారు. కేవలం 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏకంగా 8 దశల్లో పోలింగ్ నిర్వహించడం వెనుక కేంద్రం ఒత్తిడే కారణం. ఇంత చేసినా.. బీజేపీ ఏం సాధించింది? బెంగాల్ టైగర్ పంజా దెబ్బకు ఇప్పుడు గిలిగిలా కొట్టుకుంటోంది. 200కు పైగా స్థానాల్లో గెలిచి.. బెంగాల్ పీఠాన్ని మళ్లీ మమతనే దక్కించుకుంది. ఆ ఆడ సివంగి ఘాండ్రింపు ముందు.. కమలనాథులు పిల్లిలా పారిపోయారు. వంద లోపు స్థానాలతో కాసింతైనా పరువు నిలుపుకున్నారు. నిన్నటి వరకూ బెంగాల్ మాదే.. ముఖ్యమంత్రి పీఠమూ మాదేనంటూ బీరాలు పలికిన.. మోదీ, అమిత్‌షాలు.. వీల్ ఛైర్‌లో ఉండి చక్రం తిప్పిన దీదీ ముందు బేజారయ్యారు. బెంగాలీలు బీజేపీని బండకేసి కొట్టి ఓడించారు. దీదీకే మరోసారి పట్టం కట్టి.. స్వాభిమానం, ఆత్మాభిమానం చాటుకున్నారు.
ఒకరు నాకు ఎదురొచ్చినా వారికే డేంజర్.. నేను ఒకరికి ఎదురెళ్లినా వారికే డేంజర్.. ఇదీ మమతా స్టైల్. కాటన్ చీర, హవాయి చెప్పులు, చేనేత సంచి.. అంతే. మమత అంటే ఇంతే. ఇంత సింపుల్‌గా ఉంది కదాని లైట్ తీసుకుంటే ఇక అంతే. అపర కాళిలా విరుచుకుపడుతుంది. కమలనాథులు ఆమెను తక్కువగా అంచనా వేశారు. మా ముందు మమత ఎంత అన్నట్టు దూకుడు ప్రదర్శించారు. హిందుత్వ ఎజెండాని, అధికార బలాన్ని బెంగాల్‌పై ప్రయోగించారు. స్వతహాగా పోరాట స్పూర్తి కలిగిన బెంగాలీల ముందు బీజేపీ అస్త్రాలన్నీ తుస్సు మన్నాయి. 8 దశల్లో నిర్వహించిన పోలింగ్ మమతను నిలువరించలేకపోయాయి. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి.. మోదీ, అమిత్‌షాలు చేసిన ర్యాలీలు, పొలిటికల్ వేషాలు.. దీదీ ముందు పారలేదు. బెంగాల్‌లో బీజేపీ పప్పులు ఉడకలేదు.
మమతా బెనర్జీ. ఆమె మామూలు మహిళ కాదు. రాజకీయ బెబ్బులి. గతంలో దశాబ్దాల పాటు బెంగాల్‌ను పాలించిన కామ్రేడ్లను కూకటివేళ్లతో పెకిలించినా.. ఇప్పుడు బెంగాల్‌ను ఆక్రమించుకోవడానికి రథయాత్ర చేసిన కమలనాథులను తరిమికొట్టినా.. అది దీదీకే సాధ్యమైంది. ఎన్నికల ప్రచారం సమయంలో కాలికి గాయమై.. వీల్ ఛైర్‌కే పరిమితమై.. ఆ కుర్చీలోంచే.. ఇప్పుడు సీఎం కుర్చీ వైపు అడుగులేసింది మమతా బెనర్జీ. కమలదండును అధికార పీఠం దరిదాపుల్లోకి కూడా రానీకుండా.. దూరం పెట్టగలిగిన సత్తా ఆ బెంగాలీ బిడ్డకే సొంతమైంది.
పొలిటికల్ మాస్టర్ మైండ్ ప్రశాంత్ కిశోర్ రచించిన వ్యూహాలు బాగా వర్కవుట్ అయ్యాయి. నందిగ్రామ్ నుంచి మమత బరిలో నిలవడం బెంగాల్ ఎలక్షన్స్‌కే హైలైట్. అది పీకే స్కెచ్ అని అంటారు. బెంగాలీ కూతురినంటూ.. ప్రజల్లోకి వెళ్లి.. వీల్ ఛైర్‌లో కలియ తిరిగి.. కమలం పువ్వులను ఎక్కడికక్కడ తొక్కిపడేసింది. బెంగాల్ అంతటా గడ్డి పూలను పూయించింది. స్పష్టమైన మెజార్టీతో మళ్లీ బెంగాల్‌ను సొంతం చేసుకుంది దీదీ.
బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని సర్వ శక్తులూ ఒడ్డిన కమలనాథులకు బెంగాలీలు షాక్ ఇచ్చారు. అధికారానికి ఆమడ దూరంలోనే ఉంచేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో.. 18 ఎంపీ సీట్లతో, 40శాతం ఓట్లతో ఊపు మీద ఉన్నట్టు కనిపించిన కమలదళం.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పడిపోయి.. పరాభవం పాలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లు.. బలుపు కాదు వాపు అని తేలిపోయింది. ఈసారి ఎలాగైనా బెంగాల్‌ను కైవసం చేసుకొని.. మమతకు షాక్ ఇవ్వాలని భావించిన బీజేపీకే ఇప్పుడు ఓటర్లు థౌజెండ్ వాట్స్ పవర్‌తో ఖతర్నాక్ షాక్ ఇచ్చారు.
మరోవైపు.. బెంగాల్ దంగల్ తృణమూల్ వర్సెస్ బీజేపీలానే సాగింది. కాంగ్రెస్‌కు ఖాతా తెరవడమే కష్టమైంది. ఒకప్పుడు బెంగాల్‌ను ఏళ్ల తరబడి ఏలిన కమ్యూనిస్టులు.. ఇప్పుడు బోణీ కొడితే చాలు అనుకునే స్థానానికి పడిపోయారు. బీజేపీని, కాంగ్రెస్‌ను, కామ్రేడ్లను అందరినీ గంప గుత్తగా ఓడించి.. బెంగాల్ నాదే.. సీఎం స్థానమూ నాదే.. నంటూ గర్జిస్తోంది బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ. ప్రచారంలో ఆమె అన్నట్టుగానే.. దీదీ నెక్ట్స్ టార్గెట్ ఢిల్లీనే.. ఇక బీజేపీకి దబిడి దిబిడే...