దేశంలో కఠిన లాక్ డౌన్! కేంద్రానికి ఎయిమ్స్ రిపోర్ట్
posted on May 2, 2021 @ 8:17PM
దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించబోతున్నారా? లాక్ డౌన్ పై కేంద్రం నుంచి ఏ క్షణమైనా ప్రకటన రానుందా? అంటే కేంద్ర సర్కార్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. దేశంలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్నందున.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తర్వాత లాక్ డౌన్ పెడతారని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రావడం.. అంతలోనే ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలతో దేశంలో లాక్ డౌన్ విధించడం ఖాయమని తెలుస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండవరోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా రోజురోజుకు ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. మే రెండో వారానికి దేశంలో కరోనా విజృంభణ పీక్ స్టేజీకి చేరుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత ఉన్న కొన్న రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. అయినా కరోనా కట్టడి కావడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో గతేడాది మాదిరిగానే పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. కొవిడ్-19 సంక్షోభంతో దేశం కొట్టిమిట్టాడుతున్న వేళ ఈ తరహా ఆంక్షలు తప్పదని ఆయన స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు 10 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ విధించాలని ఎయిమ్స్ డైరెక్టర్ తేల్చి చెప్పారు.
ప్రస్తుతం భారతదేశం కొవిడ్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోందనీ.. ఈ మమ్మారిని నిలువరించేందుకు నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు విధించి ప్రయోజనం లేదని డాక్టర్ గులేరియా అన్నారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా సహా ఇతర రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు విధించడం వల్ల పెద్దగా ఏమీ ప్రయోజనం కనిపించలేదని ఆయన వివరించారు. ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో ఓ వైద్యుడు ఆక్సిజన్ అందక మరణించడం పైనా డాక్టర్ గులేరియా స్పందించారు. ఆ వైద్యుడు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసుననీ.. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు కూడా తీవ్ర నష్టమని అన్నారు. ఈ వైరస్ తీవ్రతను ప్రపంచంలోని ఏ ఆరోగ్య వ్యవస్థ ఇంతవరకు నిలువరించ లేకపోయిందనీ.. వైరస్ నియంత్రణకు చెక్ పెట్టాలంటే పూర్తిస్థాయి లాక్‌డౌన్ లేదా కఠిన ఆంక్షలే కీలకమని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు.
మరోవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతోపాటు ఆక్సిజన్ కొరత వేధిస్తుండటంతో నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లుగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. నైట్రోజన్ ఉత్పత్తి చేసే 14 పరిశ్రమలను ఆక్సిజన్ ఉత్పత్తికి మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే విధంగా మరొక 37 పరిశ్రమలను మార్చబోతున్నారు. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను సమీపంలోని ఆసుపత్రుల వద్దకు చేర్చాలని నిర్ణయించారు. ఆ విధంగా ఆసుపత్రుల వద్దకు ఈ ప్లాంట్లను చేర్చడం సాధ్యం కాకపోతే, తయారు చేసిన ఆక్సిజన్‌ను ప్రత్యేక సిలిండర్లతో ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయించారు.