గెలుపు ముర్ముదే.. ఓడింది సిన్హా కాదు!
అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించినట్లుగానే రాష్ట్రపతి ఎనికల్లో, అధికార బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము ఘన విజయం సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ముర్ముకు 6,76,803 ఓట్లు పోలయితే, ఆమె ప్రత్యర్ధి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 3,80,177 ఓట్లు లభించాయి. మొత్తం పోలైన ఓట్లలో ముర్ము 64 శాతం ఓట్లు సాధించారు. యశ్వంత్ సిన్హాకే 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
మరో మూడు రోజుల్లో, జులై 25న ద్రౌపతి ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నిజమే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్ధి విజయం సాధించడం విశేషమేమీ కాదు. ఇంతవరకు ఒకే ఒక్క సందర్భంలో మినహా, మిగిలిన అన్ని సందర్భాలలో అధికార పార్టీ/ కూటమి అభ్యర్ధులే రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ ఒక్క సందర్భం (1969) లో కూడా. అధికార కాంగ్రెస్ పార్టీలో చీలిక నేపధ్యంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీనే, కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్ధి నీలం సంజీవ రెడ్డికి వ్యతిరేకంగా వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దించారు. ఆత్మ ప్రభోదం నినాదంతో ఆమె వీవీ గిరిని గెలిపించారు. అదొక ప్రత్యేక పరిస్థతి. ప్రత్యేక సందర్భం.
అయితే ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము గెలుపు కోణం కాకుండా ప్రతిపక్ష పార్టీల ‘ఉమ్మడి’ అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఓటమి కోణం నుంచి చూడవలసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి,రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ తొలి గంట కొట్టక ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికపై దృష్టిని కేంద్రీకరించాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశ భవిష్యత్ రాజకీయలకు, రాష్ట్రపతి ఎన్నికలు,టర్నింగ్ పాయింట్ , మేలి మలుపు అవుతుందని, మోడీ, షా జోడీ దూకుడుకు రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలతో బ్రేక్ పడుతుందని ఆశించారు. అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దించితే, అధికార ఎన్డీఎ కూటమికి గట్టి పోటీ ఇవ్వగలమని, తద్వారా, 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి పోరాటాన్నిముందుకు తీసుకు పోగలమనే ఆలోచన వెంబడి అడుగులు వేశారు.
అందు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో శరద్ పవార్ మొదలు కేసీఆర్ వరకు ప్రతిపక్ష పార్టీల పెద్దలంతా, పేరంటాలు చేశారు. పావులు కదిపారు. చర్చలు జరిపారు. అయితే, ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక దగ్గరే తడబడి తప్పటడుగులు వేశారు అనుకోండి అది వేరే విషయం. చివరకు ఏమి జరిగింది అనేది ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. యశ్వంత్ సిన్హాను బరిలో దించారు. అయిన ఫస్ట్ సీన్ లోనే సినిమా అర్థమై పోయింది. ప్రతిపక్షాల ఐక్యత ఎండమావని మరో మారు తెలిపోయింది. ప్రతిపక్షాల పక్కా ఓట్లనుకున్న ఓట్లలో పది శాతం కంటే ఎక్కువ ఓట్లే అధికార కూటమి అభ్యర్ధికి పోలయ్యాయి.మొతం మీద ఓ 17 మంది ఎంపీలు ఓ వంద మందికి పైగా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు చెబుతున్నారు. ముర్ముకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన జేఎంఎం, వైసీపీ, శివసేన ఇతర ఎన్డీయేతర పార్టీల ఓట్లు వీటికి అదనం.
సో.. ముర్ము గెలుపు యశ్వంత్ ఓటమి కాదు, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి పరాజయం. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలు దేశ రాజకీయాలలో టర్నింగ్ పాయింట్ అవుతాయని పెట్టుకున్న ఆశలు నెరవేర లేదు, సరికదా ఓటి కుండ బొక్కలు బయట పడ్డాయి. అంతే కాదు ముర్ము తిరుగులేని విజయంతో కంగుతిన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక ముందు ముందు ప్రతిపక్ష పార్టీల ఐక్యత ఇంకెన్ని వంపులు, వంకర్లు పోతుందో చూడవలసిందేనని పరిశీలకులు అంటున్నారు. మరో వంక, వచ్చే రెండేళ్ల వ్యవధిలో జరిగే గుజరాత్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో, అదే విధంగా 2024 ఎన్నికల పైనా గిరిజన రాష్ట్రపతి ప్రభావం తప్పక ఉంటుందని అంటున్నారు.
అలాగే రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలను కొట్టి వేయలేమని అంటున్నారు. అందుకే రాజకీయ విశ్లేషకులు రాష్టపతి ఎన్నికల్లో ముర్ము గెలుపు, బీజేపీ దీర్ఘకాల వ్యూహంలో మరో గెలుపు, మరో మలుపు అంటున్నారు. బీజేపీకి బ్రాహ్మణ, బనియా పార్టీ అనే ముద్ర ఉన్నా, ఉత్తారాది పార్టీ అనే ముద్ర ఉన్నా, ఇంకా చాలా చాలా గీతలు, గళ్ళు ఉన్న బీజేపీ, ఒక్కొక గీతను దాటుకుంటూ వస్తోంది. చివరకు ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని వర్గాలను కలుపుకు పోతోందని పరిశీలకులు అంటున్నారు.
ప్రస్తుత పార్లమెంట్ లో ఎస్సీ,ఎస్టీ ఎంపీలు 131 ఉంటే అందులో బీజేపీ ఎంపీలు 77 మంది ఉన్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమంటే, 2014లో కంటే 2019 బీజేపీకి 21 ఎంపీ సీట్లు ఎక్కువచ్చాయి ( 282 నుంచి 303) ..ఈ 21 మంది ఎంపీలలో 10 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలున్నారు. ఇప్పడు ముర్ము ఎన్నిక తర్వాత ఎస్సీ, ఎస్టీలలో బీజేపీ ఇంకా విస్తరించే అవకాశం ఉంటుందని, ఆ ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి ఎన్నికల వ్యూహం బెడిసి కొట్టిందని, భవిష్యత్;లోనూ ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా బీజేపీని ఎదుర్కోవడం అయ్యే పని కాదని అంటున్నారు.