క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన కాళేశ్వరం పంప్ హౌస్ లూ చూడండి.. కేటీఆర్ కు షర్మిల సూచన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఉచిత సలహా ఇచ్చారు. ఆయన ప్రగతి భవన్ లో జారి పడి కాలి చీలమండ గాయంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాను గాయపడినట్లు ఆయన ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ లో ప్రగతి భవన్ లో జారిపడి చీలమండ వద్ద లిగమెంట్ దెబ్బతిందని పేర్కొన్న ఆయన వైద్యుల సలహా మేరకు మూడు వారాలు పూర్తి విశ్రాంతిలో ఉంటానని తెలిపారు. అక్కడితో ఆగకుండా విశ్రాంతి సమయంలో ఓటీటీలో వీక్షించడానికి మంచి షోలు ఏమైనా సూచించాల్సిందిగా ఆయన ఆ ట్వీట్ లో తన ఫాలోవర్స్ ను కోరారు. కేటీఆర్ ను ట్విట్టర్ లో ఫాలో అయ్యే వారు ఆయనకు ఏ షోలు సూచించారో తెలియదు కానీ.. వైఎస్సార్ టీవీ నాయకురాలు షర్మిల మాత్రం కేటీఆర్ ఏం చూస్తే బాగుంటుందో సూచించారు. ఈ మేరకు ఆ ట్వీట్ లో కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన షర్మిల కేటీఆర్ విశ్రాంతి సమయంలో చూసేందుకు చాలా ఉన్నాయనీ, వాటిలో కుట్ర సిద్ధాంతం గురించి తెలియజేసే కార్యక్రమాలు, నీట మునిగిన కాళేశ్వరం పంపు హౌజ్ లు, క్లౌడ్ బరస్ట్, అలాగే ముంపునకు గురైన గృహాలు, జనం కష్టాలు చూస్తే కాలక్షేపానికి కాలక్షేపం, ఆనందానికి ఆనందం దొరుకుతుందని సెటైర్ వేశారు. 

మునుగోడు ప్రేమలో బీజేపీ, టిఆర్ ఎస్‌

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం మీద‌  అంద‌రి దృష్టీ ప‌డింది. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తార‌న్న ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది. ఆయ‌న కూడా బిజెపీ హేమాహేమీల‌తో సంప్ర‌దించాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి అంగీక‌రించ‌డంతో ఆయ‌న అతి త్వ‌ర‌లో కాంగ్రెస్‌కు టాటా చెప్ప‌డం ఖాయ‌మ‌నే భావన అందిరిలో వ్యక్తమౌతోంది. ఈ కార‌ణంగా ఇక్క‌డ ఉప ఎన్నిక‌ అనివార్యమన్న భావనతో అందరి దృష్టీ ఇప్పుడు మునుగోడుపై పడింది కాంగ్రెస్ పార్టీని న‌మ్ముకుని చాలాకాలం నుంచీ ఆ పార్టీలోనే ఉన్న రాజ‌గోపాల్ రెడ్డి. తెలంగాణా ఏర్ప‌డిన‌పుడు  అందలం ఎక్కిస్తారని  ఆశించారు. కానీ అది జరగలేదు. పుండు మీద కారం జల్లినట్లుగా టీపీసీపీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో ఆ పదవి ఆశించి భంగపడ్డ తనసోదరుడు కోమటి రెడ్డి కంటే రాజగోపాలరెడ్డికే ఎక్కువ ఆగ్రహం వచ్చింది.  పదే పదే తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన రాజగోపాల రెడ్డి కారణాలేమైతేనేం కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇందు కోసం ఆయన బీజేపీ విధించిన షరతును అంగీకరించేందుకు కూడా సిద్ధపడ్డారని తెలుస్తోంది.  మునుగోడు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తే పార్టీ సభ్యత్వం ఇస్తామనీ, రాజీనామా వల్ల ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో ఆయనను బీజేపీ టికెట్ పై గెలిపించుకుంటామనీ బీజేపీ పెద్దలు ఆయనకు చెప్పినట్లు సమాచారం.  తెలంగాణాలో పాగావేయాలంటే ఇలాంటి సీనియ‌ర్ నాయ‌కులు త‌మ పార్టీలోకి రావ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని బీజేపీ భావించ‌డంతో రాజ‌గోపాల్ రెడ్డి రాక‌ను వారూ కోరుకుంటున్నారు.  తెలంగాణాలో కేసీ ఆర్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాలంటే టీఆర్ ఎస్ పార్టీ వారిని, కాంగ్రెస్ పార్టీ వారిని వీల‌యినంత మందిని ఆక‌ట్టుకోవ‌డం, వారిని కమలం గూటికి ఆహ్వానించడం బీజేపీకి అవ‌స‌రం.  ఇపుడు తాజాగా బీజేపీకి రాజగోపాల్ రెడ్డి ద‌గ్గ‌ర‌వ‌డం పార్టీ తెలంగాణాలో టిఆర్ ఎస్‌ను దించ‌గ‌లి గేందుకు స‌త్తాను పెంచుతుందని కమలం బావిస్తోంది.   ఇదిలా ఉండ‌గా, నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఖాయ మనీ, దీంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం తథ్యమని గులాబీ పార్టీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోం ది. ఈ మేరకు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టింది. గత మూడు రోజులుగా ప్రగతి భవన్‌ నుంచే ఇందుకు సంబంధించిన వ్యూహరచన కొనసాగుతోంది. ఆగస్టు నెలాఖరుకు రాజగోపాల్‌రెడ్డి  రాజీనామా చేసేలా బీజేపీ కీలక నేతలతో చర్చ జరిగిందని టీఆర్‌ఎస్‌ నేత లు భావిస్తున్నారు.  దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమైన మరుసటి రోజే సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య‌ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తు మొదలైంది. ఇం దులో భాగంగా  ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమికి కారణమైన గట్టుప్పల్‌ మండల ఏర్పాటును వెను వెంటనే ప్రకటించారు. ఆ తరువాత నియోజక వర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. ‘ఆపరేషన్‌ మునుగోడు’లో భాగంగా నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సర్పంచ్‌, ఎంపీటీసీలకు ఆదివారం హైదరాబాద్ లో మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత వేగవం తం చేయనున్నా రు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని బలంగా విశ్వసిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రధాని మోదీ, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కేంద్రంగా మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేల పరువు తీస్తున్న జగన్

ముఖ్యమంత్రి ఎవరైనా ఏం చేయాలి? తెలిసో తెలియకో పొరపాటు చేసిన తన పార్టీ ఎమ్మెల్యేలకు వారి పొరపాటు ఏమిటో తెలియజేయాలి. సరిచేసుకునే అవకాశం ఇవ్వాలి. మరో సారి ఇలా చేయవద్దని మందలించాలి.  మన్నించి వారి ఆబోరు కాపాడాలి. ఆ మాటకు వస్తే.. తన పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా విపక్ష ఎమ్మెల్యేల అభిమానం కూడా దెబ్బ తినకుండా చూసుకోవాలి. కానీ ఏపీ సీఎం జగన్ తీరు ఇందుకు పూర్తి  భిన్నంగా ఉంది.సొంత పార్టీ ఎమ్మెల్యేల పరువును ఆయనే తీసేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎంతసేపూ తన మాటే నెగ్గాలని, తానే అన్నింటికీ సుప్రీం అన్నట్లు జగన్ వ్యవహారం ఉందంటున్నారు. మూడేళ్లు సాధన చేసి మూలన ఉన్న ముసలిదాని నడ్డి విరగ్గొట్టాడన్న చందంగా ఉంది జగన్ ధోరణి అంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇజ్జత్ తీస్తే.. తన ఇజ్జత్ తీసుకున్నట్లేనని జగన్ గుర్తించలేకపోతున్నారని అంటున్నారు. మూడేళ్లుగా ప్రజల కష్టాలు, ఇబ్బందులు, కడగండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు తనకు జనం కావాలని, జనం ఓట్లు మళ్లీ తనకే కావాలంటూ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను గడప గడపకూ వెళ్లాలని తరుముతున్నారు. ఇక్కడ మళ్లీ జనం గోడు కాదు జగన్ కు కావాల్సింది. వాళ్ల ఓట్లు మాత్రమేనట. గడప గడపకూ వెళ్లి తన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో చేసేసిందంటూ ప్రచారం చేయాలని జగన్ తన ఎమ్మెల్యేలను పంపుతున్నారు. వైసీపీ సర్కార్ ఈ మూడేళ్లలో ఒరగబెట్టింది ఇదిగో.. అంటూ ఏదో ఒక పేపర్ ఎమ్మెల్యేల చేతిలో పెట్టి.. జనాన్ని చెవిలో జోరీగలాగా ఊదర గొట్టాలని చెబుతున్నారు. తద్వారా తన పార్టీ ఎమ్మెల్యేలను కొరియర్ బాయ్ లుగా మార్చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వస్తున్నాయి. అంతే కాదు తమ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు రోడ్లు లేవు, నీళ్లు రావు, విద్యుత్ సరఫరా ఇవ్వలేదు, టీడీపీ హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లను పంపిణీ చేయడంలేదేం.. ఇలా ఎన్నెన్నో స్థానిక సమస్యలతో   నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల అయితే.. జనం తాము ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తిట్లు, శాపనార్థాలు పెడుతూ.. తీవ్రంగా అవమానించి మరీ వెళ్లగొడుతున్న సంఘటనలు ఎదురవుతుండడం గమనార్హం. నిజానికి ఎవరైనా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కాగలిగారంటే.. జగన్ హవా కొంత తోడైనప్పటికీ.. ఆ ఎమ్మెల్యే విజయం వెనుక ఎంతో కొంత తన కృషి, సేవ, జనంలో పలుకుబడి తప్పకుండా ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ.. వైసీపీ ఎమ్మెల్యేల గెలుపు వెనుక కేవలం తన కష్టం, కృషే ఉందనే ధోరణి జగన్ లో బాగా వేళ్లూనుకుపోయి ఉందంటున్నారు. అందుకే వారిని తన పోస్టుమాన్ ల మాదిరి, కొరియర్ బోయ్ ల మాదిరిగా పరిగణిస్తున్నారంటున్నారు. తద్వారా ప్రజాస్వామ్యం అనే మాటకు విలువే లేకుండా తూట్లు పొడుస్తున్నారని సొంత పార్టీ వారే దుయ్యబడుతున్నారు. వాస్తవానికి స్థానిక సమస్యలపై ప్రజలు ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని నిలదీయాలి?  తమ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో, జెడ్పీ చైర్మన్ నో అడగాలి. కానీ, గడప గడపకూ అంటూ తమ ముందుకు వచ్చిన ఎమ్మెల్యే పట్ల కొన్ని చోట్ల కడుపు మండిన జనం నిలదీస్తున్నారు. దీంతో  గడప గడపకు మన ప్రభుత్వం దేవుడెరుగు   తమ గడపనే దాటలేని పరిస్థితి పలువురు ఎమ్మెల్యేలకు వచ్చింది. ఒక పక్కన జనం మధ్యకు వెళ్లాల్సిందే అని జగన్ హుంకరిస్తున్నా పబ్లిక్ లోకి వచ్చేందుకు పలువురు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారంటున్నారు. తన మాటే శాసనం అనే తీరులో జగన్ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా స్థానిక సమస్యలపైనా, అభివృద్ధి లేమి పైనా జనానికి జవాబు చెప్పేందుకు తమ వద్ద పాయింట్ లేకపోవడంతో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో గుర్తుకు రాని తాము ఎన్నికల తరుముకొస్తున్న వేళ మాత్రమే గుర్తొచ్చామా? అనే ప్రశ్న కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమ అనుచరులు, శ్రేయోభిలాషుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న దాఖలాలు ఉంటున్నాయి. అధినేత తమను గౌరవిస్తే.. జిల్లా స్థాయి నేతలు, అధికారులు గౌరవిస్తారని, సీఎం వద్దే తమకు విలువ లేనప్పుడు ఇంకెవరు తమను పట్టించుకుంటారని అంటున్నారు. మూడేళ్లుగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రంలో అభివృద్ధి పనులను గాలికి వదిలేసి, తమను ఇబ్బందుల పాలు చేయడంలో ప్రజల్లో వైసీపీ పట్ల, జగన్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో జనం మధ్యకు వెళ్లి, వారి మధ్యే తిరిగి, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి మనసులు గెలుచుకోవలసిన అవసరం ఉందని తెలిసి వచ్చినట్లుందని పలువురు అంటున్నారు. అందుకే  ఎమ్మెల్యేలను వారి వారి నియోజకవర్గాలకు బలవంతంగా తరుముతున్నారంటున్నారు. ఇంతవరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్ లు నొక్కి పాలన సాగించిన జగన్ కు చేతులు కాలినట్లున్నాయని, అందుకే జనం గుర్తుకు వచ్చారంటున్నారు. చివరిగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి.. ‘వైసీపీలో జగన్.. పార్టీ జెండా మోసిన వారు మాత్రమే ఉంటారు’ అన్న మాజీ మంత్రి పేర్ని నాని మాటలు అక్షర సత్యాలు కావచ్చంటున్నారు. ఎమ్మెల్యేలకు కనీసం ద్వార దర్శన భాగ్యం అయినా కల్పించాలని పేర్ని చేసిన ప్రతిపాదన త్వరలో నెరవేరే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.

నాడూ నేడూ ఐదూళ్లే సమస్య!

ఈ ఐదు అంకే చాలా చిత్రం. పూర్వం ఐదూళ్లివ్వండి మా బ‌తుకులు మేం బ‌తుకుతాం, ఈ భోగాలేమీ అక్కర్లేద‌న్నారు పాండ‌వులు. ఐదూ లేదు ఏమీ  లేదు పొండ్రాబ‌య్‌..అన్నాడు దుర్యోధ‌నుడు,  ఫ‌లితంగా కురుక్షేత యుద్ధం. ఆ త‌ర్వాత సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ అత్యాధునిక కాలంలో కూడా ఓ ఐదూళ్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలనొప్పి తెస్తున్నాయి. ఆ ఐదూళ్ల‌ నూ ప‌క్క‌నే ఉన్న తెలంగాణా రాష్ట్రంలో క‌ల‌పాల‌ని ఆ ఊళ్ల వారే డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్ర‌జాభీష్టం. దీనికి స‌ర్కారువారు అంగీక‌రించాలి గ‌దా.. అసలు ఆ ఊళ్ల వారు ఏపీ మాకొద్దు బాబోయ్ అంటూ తెలంగాణ వైపు చూడడానికి ఏపీ సీఎం జగన్ నిర్వాకమే కారణం అని విమర్శలకులు అంటున్నారు.  రెండుగా తెలుగు రాష్ట్రం విడిపోయిన మొదటి ఐదేళ్లు అభివృద్ధిలో, ఆదాయంలో, ర్యాంకింగ్ లలో తెలంగాణలో పోటీపడి దూసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఆ తరువాత ఈ మూడేళ్ల కాలంలో అన్ని రంగాలలో వెనుకబడిపోయింది.  జ‌గ‌న్ హయంలో ఆంధ్రప్రదేశ్ దుస్థితి గురించి ఎవ‌ర్నిడిగినా చెబుతారు. వ‌చ్చాడ‌య్యో సామీ అని పాడుకున్న‌వారంతా ఇప్పుడు నాలిక్క ర్చుకుంటున్నారు. పెద్దాయ‌న్ని (చంద్రబాబు) కాద‌ని పొర‌పాటే చేశామ‌ని తెగ బాధ‌ప‌డుతున్నారు.  అస‌లు ఏ మాత్రం ప్ర‌జ‌ల అభ్య‌ర్ధ‌న‌లు, స‌మ‌స్య‌లు ప‌ట్ట‌న‌ట్టే జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేవ‌లం ప్ర‌చార ప‌టాటోపంతో పాల‌న సాగిస్తున్నారంటున్నారంతా.  విలీన మండ‌లాల్లోని ఐదు గ్రామాల ప్ర‌జ‌లు త‌మ గ్రామాల్ని తెలంగాణాలో క‌ల‌పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. గ‌తంలో ఐదు పంచాయ‌తీలు తీర్మానాలు చేశాయి. అవన్నీ వైసీపీ మ‌ద్ద‌తుదార్ల  పంచాయతీలు కావడంతో తర్వాత రెండు , మూడు గ్రామాల కు చెందిన కొంతమంది ప్రతి నిధులతో అలాంటి తీర్మానాలు చేయలేదని చెప్పించారు. కానీ ఇప్పుడు ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆంధ్రా -తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో రాస్తారోకో చేశారు.  తమ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని నడిరోడ్డుపై బైటాయించి భారీ ఎత్తున ధర్నా చేశారు. ‘జై తెలంగాణ.. ఆంధ్రా వద్దు – తెలంగాణ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో పిచ్చుకలగూడెం, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాల ప్రజలు భారీగా పాల్గొ ని, తమను భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేశారు.  ఎవ‌ర‌న్నా స‌మ‌స్య వ‌స్తే గ్రామ‌పెద్ద ద‌గ్గ‌రికి వెళ్లేవారు, కాకుంటే క‌లెక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లేవారు. కానీ ఈ ఐదు గ్రామాలు ఆంధ్రా, తెలంగాణా మ‌ధ్య ఉండ‌డంతో ద‌గ్గ‌ర‌లోని ఆంధ్రా ప్రాంత కార్యాల‌యం కంటే 40 కిలీమీటర్ల దూరంలో  ఉన్న భ‌ద్రాచ‌లం వెళ్ల‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు.   గోదావ‌రి వ‌ర‌ద స‌మ‌యంలో కూడా ఈ ఐదు గ్రామాల వారిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన‌పోలేదు. అత్యంత అవ‌స‌ర స‌మ‌యంలో, ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం, అధికారుల‌కు ప‌ట్ట‌న‌పుడు ఈ గ్రామాల ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని ఎందుకు ప‌ట్టించుకుంటారు. మున్ముందు వీరితో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయోనన్న భ‌యంతోనే ఇపుడు తెలంగాణాయే ముద్దు అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతున్నారు. మ‌హాప్ర‌భో.. మీరు వ‌ద్దు, మీ పాల‌నా వ‌ద్ద‌ని త‌మ‌ను కేసీఆర్ నీడ‌లోకే పంపేయ‌మ‌ని ఏకంగా డిమాండ్ చేస్తున్నారు. త‌మ గ్రామాల‌ను భ‌ద్రాచ‌లం జిల్లాలో క‌లిపితేనే స‌మ‌స్య‌లు తీరుతాయ‌న్నది వారి న‌మ్మ‌కం.  ఒక పాల‌న‌ను ఈ విధంగా ప్ర‌జ‌లే ఘోరంగా తిర‌స్క‌రించ‌డం ద‌క్షిణాదిలో ఇదే తొలిసారి కావ‌చ్చు. రాజ‌కీ య స‌మ‌స్య‌ల కంటే సామాజిక స‌మ‌స్య‌లు ప్ర‌జ‌లే స్ప‌ష్టంగా ప్ర‌భుత్వానికి చెప్పుకోగ‌ల్గుతార‌న్న‌ది ఈ ఐదు గ్రామాల డిమాండ్ స్ప‌ష్టం చేస్తోంది.  ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కూడా గోదావరి కరకట్ట కట్టడానికి ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలన్నారు. సాంకేతికంగా సాధ్యం కాదని తెలిసినా ఈ అం శాన్ని రోజు రోజుకు హైలెట్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.  ఇక ఇప్పుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఆ ఐదు గ్రామాల‌వారినీ త‌మ ప్రాంతంలోకి తీసుకోవడం పై  చ‌ర్చిం చాలి. ఇదేమీ దుస్తులో, వ‌స్తువులో, పుస్త‌కాలో మార్చుకున్నంత సుల‌భ‌మేమీ కాదు. ఒక‌సారి విభ‌జ‌న జ‌రి గిన త‌ర్వాత ఇపుడు ఏకంగా గ్రామాల‌ను త‌మ రాష్ట్రంలోకి విలీనం చేయ‌డ‌మన్న‌ది కేంద్రం అంగీకరించా లి. కానీ ఇక్క‌డ తిర‌కాసేమంటే అస‌లు వారిని రెచ్చ‌గొడుతున్న‌దే తెలంగాణా ప్రభుత్వ‌మ‌న్న అభిప్రాయా లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అక్క‌డి ప్ర‌భ‌త్వం ఆ గ్రామాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని కేంద్రానికి తెలిసేలా నాట‌కాలు ఆడుతోంద‌నే అనుకోవాలి. ఇక అధికారం ఉన్న‌ది కొద్దికాల‌మే గ‌నుక  ఈ  కుంప‌టి ఇలా మండే లా కొన‌సాగించి అప్పుడ‌పుడు న‌వ్వుతూ కొన్ని బొగ్గులు వారిచేత వీరిచేత వేయిస్తుంటే ఆన‌క చ‌ట్ట స‌వ‌ర‌ణ గురించి ప్ర‌స్తావించ‌వ‌చ్చ‌న్న‌ది తెలంగాణా వ్యూహ‌మూ కావ‌చ్చునేమో!

రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ.. యూపీలో 8 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కనీసం 8 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ రెండు బస్సులూ కూడా బీహార్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న బస్సు దానిని ఢీ కొంది. సంఘటనా స్థలంలోనే ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం లక్నో ట్రూమాకేర్ సెంటర్ కు తరలించారు.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

జపాన్ లో బద్దలైన అగ్నిపర్వతం

జపాన్ లో  అగ్ని పర్వతం బద్దలైంది. పలు పట్టణాలలో లావా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్తగా పట్టణాలను ఖాళీ చేయించినా అపార నష్టం సంభవించింది. గత కొంత కాలంగా దక్షిణజపాన్ లోని సకురజీమా అగ్ని పర్వతం లావా వెదజల్లుతూ, యాక్టివ్ గా ఉంది. ఇది ఎప్పుడో అప్పుడు బద్దలౌతుందని భావిస్తూనే ఉన్నాయి. అయితే ఆదివారం రాత్రి హఠాత్తుగా ఒక్క సారిగా బద్దలైంది. దీంతో ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అగ్నిపర్వతానికి సమీపంలోని అరిమురా, పురుస తదితర పట్టణాలు, ప్రాంతాల ప్రజలను హుటాహుటిక ఖాళీ చేయించారు. అయితే అగ్నిపర్వతం బద్దలైన సమయం రాత్రి కావడంతో వెంటనే ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. సకురజిమా అగ్ని పర్వతం కొన్నేళ్లుగా యాక్టివ్ గా ఉంది. తరచూ బూడిద, పొగను వెదజల్లుతోందని అధికారులు తెలిపారు. గత కొంత కాలంగా ఆ పర్వతాన్ని సందర్శించేందుకు, దాని సమీపంలోనికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు చెప్పారు. తాజాగా   ఆదివారం రాత్రి ఒక్కసారిగా అగ్ని పర్వతం బద్దలైందనీ,   2.5 కిలోమీటర్ల ఎత్తున రాళ్లు, దుమ్ము ఎగజిమ్మిందని అధికారులు తెలిపారు. అగ్ని పర్వతం నుంచి వెలువడిన దుమ్ము, ధూళి మేఘాల్లో కలిసి.. ఆ ప్రాంతమంతా చిమ్మచీకటి అలుముకుందని వివరించారు. 

తెలంగాణను వదలని వానలు.. తొలగని వరద భయం

తెలంగాణను వర్షాలు వెంటాడి వేధిస్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలోనే వానలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలతో రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. జనం అష్టకష్టాలూ పడుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు పూర్తిగా నిండి పొంగి పొరలుతున్నాయి.  వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. జలాశయాలన్నీ జలకళతో కలకలలాడుతున్నాయి. పంటలు నీట మునిగాయి. పాత ఇళ్లు కుప్పకూలాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఇప్పటి వరకూ ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వానలు   ఇప్పుడు దక్షిణ తెలంగాణను వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్ల గోడలు కూలి నలుగురు మరణించారు. జాతీయ రహదారిపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు అవరోధం ఏర్పడింది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది.  పంట నష్టం తీవ్రంగా ఉంది. అయినా ఇప్పటి వరకూ అధికారులు  పంట నష్టంపై ఎలాంటి అంచనా వేయలేదు. ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించ లేదు. ప్రకృతి వైపరీత్యాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మెదక్ జిల్లా పాతూరులో అత్యధికంగా 26 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, జనగామలనూ వర్షాలు ముంచెత్తి పంటలు నీట మునిగాయి.   చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. రహదారులపై నీరు నిలుస్తోంది.   మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలోకి నీరు చేరింది. హల్దీ, కూడవెళ్లి, నల్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ర్సింహులపేట మండలం రాంపురం మధ్యలో బొత్తలపాలెం వద్ద పాలేరు వాగులో చిక్కుకున్న 22 మంది కూలీలను రెవెన్యూ, ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. దీంతో  ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ గిరిజన సంక్షేమ శాఖ మినీ గురుకులంలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేశంలోనూ విస్తరిస్తున్న మంకీపాక్స్.. నాలుగుకు పెరిగిన కేసుల సంఖ్య

ఒక వైపు కరోనా వ్యాప్తి నాలుగో వేవ్ దిశగా సాగుతోంది. మరో వైపు మరో కొత్త వైరస్ మంకీ పాక్స్ ఆందోళన కలిగిస్తోంది. రెండు  వైరస్ లకూ ఒకే ప్రొటో కాల్ పాటింకాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలనీ, తప్పని సరిగా మాస్క్ ధరించాలని చెబుతోంది. అయితే ఆ జాగ్రత్తలు పాటిస్తున్న దాఖలాలు దేశంలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో దేశంలో మంకీ పాక్స్ వ్యాప్తి కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. ఎటువంటి విదేశీయానం చేయని ఢిల్లీ వ్యక్తికి మంకీ పాక్స్ పాజిటివ్ రావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఢిల్లీలో ఇదే తొలి మంకీ పాక్స్ కేసు కావడం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఇటీవల ఒక పార్టీకి హాజరయిన 34 ఏళ్ల వ్యక్తి మూడు రోజుల క్రితం జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆస్పత్రిలో చేరారు. ఆ వ్యక్తి శాంపిల్‌ను డాక్టర్లు పుణఎలోని నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవి)కి పంపగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.   మంకీపాక్స్‌ వ్యాప్తి నియంత్రణకు కొవిడ్‌ కు పాటించే ప్రొటోకాల్‌నే పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుహెచ్‌ఓ) మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  భారత్ లో మంకీ పాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఆదివారం న్యూఢిల్లిలో మంకీపాక్స్‌ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ మరియు ఐసీఎంఆర్‌ ఉన్నతాధికారుల హాజరయ్యారు.   రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రొటోకాల్ పాటించాలని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ మంకీ పాక్స్ డేంజర్ బెల్స్ మోగాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలతో బాధపడతున్నాడు.   అతడికి హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామనీ, శాంపిల్స్ సేకరించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపామనీ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. అయితే మంకీపాక్స్ గురించి ఆందోళ‌న అవసరం లేదన్నారు.  కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయనీ, ఈ వ్యక్తి జులై 6న కువైట్ నుంచి వ‌చ్చాడ‌నీ, 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి రాషెస్‌ రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లిన‌ట్టు డీహెచ్ తెలిపారు. దీంతో అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు గుర్తించి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశార‌ని, అక్కడ్నుంచి 108లో అతన్ని ఫీవర్‌‌ హాస్పిటల్‌కు తరలించామన్నారు.  నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించామనీ, వారెవరికీ మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు లేవ‌నీ చెప్పారు.

కేంద్రం అంబుల పొదిలో ఆర్ధిక మండ‌లి అస్త్రం!

ఉద్యోగం స‌ద్యోగం లేని యువ‌కుడిని తండ్రి నిత్యం సంపాదన అవసరం గురించి చెబుతూ జ్ణాన బోధ చేస్తూనే ఉంటాడు. చీటికీ మాటికీ అక్క‌డా ఇక్క‌డా అప్పులు చేసి ఎక్కడ త‌ల‌ మీద‌కి తెస్తాడో అన్న  భ‌యమే తండ్రిని  కొడుకుకు బాధ్యత గుర్తు చేసే విధంగా పురిగొల్లుతుంది. అందువ‌ల్ల కొడుకు అల‌వాట్ల‌ు, ఖర్చులపై ఎప్పుడూ ఒక కన్నేసి వాటిని నియంత్రించడానికి,  క‌ట్టుదిట్టం చేయ‌డానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇందుకు బంధువు నుంచో, మిత్రుడి నుంచో స‌ల‌హా తీసుకుని మ‌రీ కార్యాచరణకు దిగుతాడు. కానీ దానివ‌ల్ల తండ్రీ కొడుకుల మధ్య సత్సంబంధాలు దెబ్బ‌తింటాయ‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌కు రాదు. ఇప్పుడు రాష్ట్రాల మీద ఆర్ధిక నియంత్ర‌ణ‌కు కేంద్రం దాదాపు ఇదే ఆలోచ‌న చేస్తోంది. తండ్రిగానో, పెద్ద‌న్న‌గానో ఓవ‌రాక్ష‌న్ చేస్తోంది. దీని వల్ల ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలుగుతోందని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. అలా కాకుండా కాస్తంత భ‌విష్య‌త్తు దృష్టి, దూర‌దృష్టితో ఆలోచించాల్సిన అవ‌స‌రం కేంద్రానికి ఉంది.  దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇష్టం వ‌చ్చిన‌ట్టు అప్పులు చేస్తున్నాయ‌న్న మాట విన‌ప‌డుతోంది. వాటిలో తెలుగు రాష్ట్రాలు ముందు పీటిన ఉన్నాయనుకోండి. అది వేరే సంగతి. వాటి వ్య‌వ‌హారం, తీరు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం వల్ల దేశ ఆర్ధిక వ్య‌వ స్థ‌కే న‌ష్టంవాటిల్లుతోందన్న భయాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో ఆర్దిక ఎమ‌ర్జెన్సీ విధించాల్సిన అవ‌స‌రం ఉందని భావిస్తోంది. అందుకు శ్రీలంక పరిస్థితుల్నీ, ఆర్ధిక‌వేత్త‌ల హెచ్చరికల్ని చూపుతోంది. దీన్ని అధిగమించేందుకు ఆర్ధిక మండ‌లి ఏర్పాటు అవ‌స‌రాన్ని  తెరమీదకు తీసుకువస్తోంది. ఆర్ధిక వ్య‌వ‌హారాల విష‌యాల్లో కేంద్రం,రాష్ట్రాల మ‌ధ్య విభేదాలు మ‌రింత పెరుగుతున్నం దు వ‌ల్ల నిపుణుల స‌ల‌హా మేరకు ఆర్థిక మండలి ఏర్పాటును కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది.  దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతకు అవసరమైన చర్యలను చేపట్టాల్సిందేనని 15వ ఆర్థిక సంఘం గతంలోనే ప్రభుత్వానికి సూచిం చిన విషయాన్ని కేంద్రం గుర్తు చేస్తోంది. ఆర్ధిక మండ‌లి ఏర్పాటు చేస్తే దాని  ద్వారా రాష్ట్రాల నుంచీ కేంద్రం నుంచీ కూడా ఆర్దిక లావాదేవీల రికార్డుల‌ను తెప్పించి ప‌రిశీలించే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణుల అభిప్రాయం.  పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, కేరళ, బీహార్‌, రాజస్థాన్‌లలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితులు సమీప కాలంలో రావచ్చునని ఇప్పటికే అనేకమంది ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ప్ర‌స్తుతం  అన్నిదేశాలూ శ్రీ‌లంక‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటూ  ఆ దుస్థితికి రాకుండా జాగ్ర‌త్త‌ ప‌డాల‌న్న‌యోచ‌న‌లో ఉన్నాయి. కానీ దేశంలో విప‌క్షా ల‌న్నీ కేంద్రాన్ని, బీజేపీ పాల‌న‌లోని ఇత‌ర రాష్ట్రాలలోని ప‌రిస్థితుల‌తో బేరీజు వేసుకుని కేంద్రం ప్ర‌ద‌ర్శించే వివక్ష పూరిత వ్య‌వ‌హారా ల‌తో విసిగెత్తి ఉన్నాయి. క‌నుక ఆర్ధిక నిపుణుల స‌ల‌హా మేర‌కు ఆర్ధిక మండ‌లి ఏర్పాటును బీజేపీయేతర రాష్ట్రాలు వ్య‌తిరేకించే అవ‌కాశాలే ఉన్నాయ‌న్నది విశ్లేష‌కుల మాట‌.  

పులివెందులలో ప్రజలకు కనిపించకుండా పరదాలు.. కోనసీమలో వరద కష్టాలను కప్పేయడానికి తెరలు!

ఏ నాయకుడైనా ప్రజలకు ఎప్పుడు ముఖం చాటేస్తాడు. ప్రజలలో తన పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలిసినప్పుడు. అని వార్యంగా ప్రజల ముందుకు రావలసినప్పుడు అధికారంలో ఉన్న నాయకుడైతే తనను వ్యతిరేకించే వర్గాన్ని నిర్బంధించి.. తన అనుకూల వర్గాలను చుట్టూ పెట్టుకుని జేజేలు కొట్టించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రెండు విధానాలనూ ఇప్పటికే ఉపయోగించేశారు. నెలల తరబడి ప్యాలెస్ దాటి జనంలోకి రాకుండా ఉండటమూ అయిపోయింది. పులివెందుల పర్యటనలో జనం ఆయనకు సమీపంలోకి రాకుండా బ్యారికేడ్లు పెట్టడమూ అయిపోయింది. ఇప్పుడాయన విపక్షాల విమర్శల కారణంగా అనివార్యంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వెళుతున్నారు. మంగళవారం (జులై 26)న ఆయన కోనసీమ జిల్లాలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ పక్కాగా ఖరారైపోయింది. ఆయన పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లూ చేసేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు ఏర్పాట్లేమిటంటారా? ఉంటాయి. రాజుగారు ప్రజల అవస్థలను చూడలేరు. అందుకు అవేమీ ఆయనకు కనిపించకుండా తెరలు కట్టేయడమే ఏర్పాట్లన్న మాట. తెరల మాటున వరద నష్టాన్ని, బాధితుల ఇబ్బందుల్నీ కప్పేసిన తరువాత తీరికగా జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారన్న మాట. అంతా బ్రహ్మాండంగా ఉంది. మా ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ప్రకటనో, ప్రసంగమో, లేదా మీడియా సమావేశంలోనో చెప్పేసి తన భుజాలను తానే చరిచేసుకుని పర్యటన ముగిస్తారన్న మాట. నాయకుడు బాధితులతో మమేకం అవ్వాలి. కష్టాల్లో ఆదుకుంటానన్న భరోసా ఇవ్వాలి. వరద ముంపులో ఉన్న సమయంలోనే వారి దగ్గరకు వెళ్లాలి. ముంపు బాధలను ప్రత్యక్షంగా చూడాలి. అందుకు భిన్నంగా వదర నీటిలో జనం నిండా మునిగి ఉన్న సమయంలో ఏరియల్ వ్యూ అంటూ గాలిలో తిరిగి వెళ్లిపోయిన జగన్.. అసందర్బంగా వివిధ శాఖల సమీక్షలు నిర్వహించారే తప్ప వరద బాధితుల కష్టాల గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు విపక్ష నేత వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి వరదలోనే ముంపు బాధితులకు కలిసి వారికి భరోసా ఇచ్చి వచ్చిన తరువాత అనివార్యంగా జగన్ పర్యటనకు బయలు దేరుతున్నారు.   అది కూడా వరద తీసేసిన తరువాత. అది కూడా వదర ఛాయలు కూడా జగన్ కు కనిపించకుండా అధికారలు తెరలతో కప్పేసిన తరువాత. భారీ నష్టం జరగలేదని చెప్పడానికి ఏం చేయాలో అన్నీ అధికారులు చేసేసిన తరువాత.   వరద బాధితులు తమను ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే..  వరద బాధితులను తాము బ్రహ్మాండంగా ఆదుకున్నాం.. వారికి కష్టమనేది తెలియకుండా అన్ని చర్యలూ తీసుకున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో విపక్ష నేత పర్యటనపై విమర్శలు గుప్పించింది. అసలాయన ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారంటూ నిలదీసింది. ఆయన పర్యటన వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందంటూ దుయ్యబట్టింది. వాస్తవంలో వరద బాధితులను గోదారికి వదిలేసిందన్న బాధితుల ఆగ్రహాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడేమో జగన్ కోనసీమలో పర్యటించి తెరల వెనుక ఉన్న కష్టాన్ని, నష్టాన్ని చూడకుండా తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేసిందనీ, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుందనీ చెప్పడానికి ఒక రోజు పర్యటనకు రాజు వెడలె రవితేజములలరగ అన్నట్లు పర్యటించేస్తారన్నమాట.

గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలకు బడ్జెట్ నిల్!

అరి చేతిలో వైకుంఠం చూపించేసి చివరకు అరిటాకులో చద్దన్నం పెట్టారన్నది ఓ నానుడు. జగన్ సర్కార్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేసి.. ఇప్పుడు వాటి అమలు  చేయలేక కోతలు, వడ్డింపులు, బాదుడు అంటూ జనం నెత్తిన బండ పడేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఒక త్రిశంకు స్వర్గం అని తేలిపోయింది. ఆయా సచివాలయాల ఉద్యోగులకు వేతనాలకు బడ్జెట్ లేదని స్వయంగా ప్రభుత్వమే చెప్పకుండానే చెప్పేసింది.  అంటే ఏన్నో వడపోతల తరువాత, ఆందోళనల తరువాత ప్రబేషన్ పొందినా వారికి పెరిగిన వేతనాలు వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. ప్రొబేషన్ కోసమే రోడ్డెక్కిన సచివాలయాల ఉద్యోగులు పూర్తిగా విజయం సాధించలేదు. దాదాపు 60 వేల మందికి ప్రభుత్వం ప్రొబేషన్ ఇవ్వలేదు. పోనీ ఇచ్చిన వారికైనా పెరిగిన వేతనాలు ఇస్తుందా అంటే అదీ లేదని ఇప్పుడు చెబుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునే జగన్.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యగోలు విషయంలో ప్రతి సారీ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కేవలం 15 వేల రూపాయల వేతనానికి ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రొబేషన్ విషయంలోనూ వారు నానా ఇబ్బందులూ పడ్డారు. పరీక్ష రాసి అందులో అర్హత సంపాదించి ఉద్యోగం సాధించుకున్న వారిని ప్రొబేషన్ కోసం మళ్లీ పరీక్ష అన్నారు.  తొలుత ఉద్యోగాలు ఇచ్చే సమయంలో మాత్రం ప్రొబేషన్ కు మళ్లీ ఎటువంటి పరీక్షలూ అవసరం లేదనీ, ఆటో మేటిగ్గా వచ్చేస్తుందని ప్రకటించిన జగన్.. రెండున్నరేళ్ల తరువాత పరీక్ష రాసి అర్హత సాధించుకోవాలన్నారు. అలా కొత్త నిబంధనతో దాదాపు 60 వేల మందిని ప్రొబేషన్ కు అనర్హులుగా ప్రకటించారు. పోనీ అర్హులంటూ ప్రొబేషన్ ఇచ్చిన వారికైనా ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెరిగిన వేతనాలు ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఎందుకంటే అందుకు బడ్జెట్ లేదట. ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించడానికి నిబంధనలు అంగీకరించవట. ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందుకుంటామని ఎదురు చూస్తున్న సచివాలయాల ఉద్యోగులకు ట్రెజరీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇది. ఆ కారణంగా ఈ నెల కూడా గతంలోలా 15 వేల రూపాయల వేతనం మాత్రమే వస్తుందని ట్రెజరీ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు సమాచారం అందించాయి.ముందు మందు నిబంధనలన్నీ పూర్తి చేసి అరియర్స్ తో సహా వేతనాలిస్తామని ప్రభుత్వ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు చెబుతున్నాయి. 

మువ్వన్నెల రాజకీయం ..! మోడీతో కేసీఆర్ ‘ఢీ’

అనుకుంటాం కానీ, అసలు అసలే. అరువు అరువే. కడుపులో లేంది కౌగిలించుకున్నా రాదు.  అది దేశ భక్తి అయినా, దైవ భక్తి అయినా, మరో భక్తి భావన ఏదైనా స్వతహాగా లోపలి నుంచి రావాలి, కానీ, పెదవుల పై పూసుకుని పలికే  లిప్ స్టిక్ పలుకులు  పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రభావం చూపావు. ఒరిజినల్, డూప్లికేట్ల  మధ్య  పొంతన పోలిక కుదరదు. అసలు అసలే,, నకిలీ నకిలీనే.. అసలు నకిలీ కాదు, నకిలీ అసలు కాలేదు.  అప్పుడెప్పుడో, కొంత కాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, మీరు ‘జై శ్రీరామ్’ అంటే  మేము ‘జై హనుమాన్’ అంటాం అంటూ బీజేపేతో భక్తి పోటీకి దిగారు. అన్నట్టుగానే కొంతా కాలం పాటు, అక్కడక్కడ హనుమాన చాలీసా పారాయణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫోటోలు, వీడియోలు పోస్టు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత, ఎందుకనో, ఆమె సైలెంటై పోయారు.  అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్  కూడా నాకంటే గొప్ప హిందువు ఎవరున్నారు, నేను చేసినన్ని పూజలు, యాగాలు ఎవరు చేశారు? అంటూ అప్పుడప్పుడు, ‘నేనూ హిందువునే ... అని గుర్తు చేస్తూ ఉంటారు. అయితే,,ఆయన కడుపులోంచి వచ్చిన  హిందుగాడు బొందు గాడు డైలాగు పాపులర్ అయినంతగా, ఆయన  చెప్పిన నేనూ హిందువునే ...డైలాగు పాపులర్ కాలేదు.  అదలా  ఉంటే, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీతో  దేశభక్తిలో పోటీకి దిగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్య సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సంవత్సర కాలంగా, అజాదీ కా అమృత్ మహోత్సవ్  పేరిట వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం పంద్రాగస్టు పండగకు రెండు రోజుల ముందు నుంచి ఆగష్టు 13 నుంచి 15 వరకు, ప్రతీ ఇంటి పైన మువ్వన్నెల జెండాను ఎగరేయాలని ప్రధాని నరేంద్ర  మోడీ పిలుపు నిచ్చారు. ప్రధాని పిలుపు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా  పేరిట  దేశ వ్యాప్తంగా జెండా పండగ  నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.  మామూలుగా అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన ఎనిమిదేళ్ళలో ఆయన ఏనాడు జాతిపిత మహత్మా గాంధీ జయంతి, వర్ధంతి వేడుకల్లో పాల్గొన లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకల్లోనూ పాల్గొన లేదు. ఈ సంవత్సరం రాజభవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లోను ముఖ్యమంత్రి  పాల్గొన లేదు, మీ జెండా మీది మా ‘అజెండా’ మాది అన్నట్లుగా సెపరేట్ గా జెండా ఎగరేశారు. ఇక సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. మిత్ర పక్షం ఎంఐఎంను, ముస్లిం మనోభావాలను దెబ్బతీయడం ఇష్టం లేకనో ఏమో  ముఖ్యమంత్రి కేసీఆర్, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ఎప్పుడో  మరిచి పోయారు.  అయితే, దేశభక్తి ఓటు మొత్తాన్ని మోడీ మూట కట్టుకుపోతారనే భయం వలన చేతనో ఏమో కానీ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హైజాక్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.  హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని, బీజేపీ సర్కార్ నిర్వహిస్తోందన్నట్లుగా కాకుండా.. రాష్ట్ర ప్రభుతమే నిర్వహిస్తున్నామన్నట్లుగా నిర్వహించాలని,  ప్రతి ఇంటిపైన ఎగరేసేందుకు జాతీయ జెండాలను రాష్ట ప్రభుత్వమే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే,   మేమూ హిందువులమే .. అన్నట్లుగా,  మాకూ దేశ భక్తి ఉందని నిరూపించుకునేందుకు స్వాతంత్ర్య దినోత్సవం అయ్యే వరకూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతృతవంలోనే ర్యాలీలు.. సభలు.. సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందరికీ జెండాలు పంచడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి  వ్యూహ రచన చేశారని అంటున్నారు.  అయితే, అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తున్న హ‌ర్‌ ఘ‌ర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా, జెండా కర్రతో సహ త్రివర్ణ పతాకాన్ని, ఇంటింటికి అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. అంటే, ఈ కార్యక్రమాల గురించి ప్రజలకు  అవగాహన కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పత్రికా ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్స్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. సినిమా థియేటర్లలో లఘు చిత్రాలు ప్రదర్శించేలా చర్యలు  తీసుకుంది. విద్యార్థిని విద్యార్థులు, యువతి యువకులు, క్రీడా కారులతో ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో  దేశ భక్తీ పోటీలో  తమదే పై చేయి అనిపించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. అయితే.... అధికారులు కొందరు ఇదంతా చూస్తుంటే  పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు .. అన్న సామెత గుర్తుకు వస్తోందని అంటున్నారు.

ఎన్నిక‌ల క‌మిష‌న్ ముందు తోడి కోడ‌ళ్ల పోరు!

పెర‌ట్లో చెవి క‌మ్మ దొరికితే నాదంటే నాద‌ని కోడ‌ళ్లు తిట్టుకున్నారు. అత్త‌గారు వెళ్లి ఇదెవ‌రిదో వాళ్లు ఇవాళ క‌మ్మ‌టి వంట చేస్తే నేనే తేలుస్తాన‌న్న‌ది. అంతే అత్త‌గారు ప‌క్కింటి క‌ల‌గూర‌గంప క‌బుర్ల‌కు వెళ్లింది, కోడ‌ళ్లు త‌మ బంగారాన్ని కాపాడుకోవ‌డానికి వ‌చ్చీ రాని వంట‌ చేయ‌డంలో త‌ల‌ మున‌క‌ల‌య్యారు. ఆన‌క తిండి ఎలా గున్నా అవ‌స్థ‌ మాత్రం పెద్ద కోడ‌లిదే. అదుగో అలా ఉంది ఉద్ధ‌వ్, షిండేల సంగ‌తి. అస‌లు శివ‌సేన అంటేనే మొన్న‌టి దాకా  ఉద్ద‌వ్ థాక్రే నాయ‌క‌త్వంలోనిదే. ఇపుడు షిండే  రాజ‌కీయ హ‌డావుడితో ఆయ‌న దుకాణం కూడా శివ‌సేన‌గా మారింది. దీంతో పార్టీ గుర్తు త‌మ‌కే ఉండాల‌న్న పోరు తోడికోడ‌ళ్ల ర‌గ‌డ‌లానే మారింది. మ‌హా రాష్ట్ర‌కే కాదు యావ‌త్ భార‌తా వ‌నికి వీరి గోడు మంచి కాల‌క్షేపంగా మారింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ముందు ఇరు వర్గాలూ పార్టీ, సింబ‌ల్ త‌మ‌కు ఎందుకు ఇవ్వాల‌న్న‌ది వివ‌రిస్తూ సంబంధిత ప‌త్రాలు అధికారుల ముందు పెట్టారు. ఇక వారే తేల్చ‌వ‌లె.  షిండే 40 మంది ఎమ్మెల్యేల‌తో ఉద్ధ‌వ్ థాక్రేను ఎదిరించి వేరు కుంప‌టి పెట్ట‌డం అధికారంలోకి వ‌చ్చేయ‌డం జ‌రిగి నెల రోజులు అయింది. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ఇంత‌టి సంక్షోభం శివ‌సేన ఎప్పుడూ ఎదుర్కొన‌లేదు. జూన్ 30న రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాట‌యింది. బిజెపి మ‌ద్దతుతో షిండే ముఖ్య‌మంత్రిగా , ఫ‌డ్న‌వీస్ ఉప ముఖ్య‌మంత్రిగా సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన సంగతి అంద‌రికీ తెలిసిందే. అధికారం చేజిక్కించుకోవ‌డం  అయిపోయింది. కానీ పార్టీ గుర్తు విష‌యంలో గోల ఆరంభ‌మయింది. అస‌లు శివ‌సేన పార్టీ అంటేనే థాక్రే వారిది క‌నుక పార్టీ,  సింబ‌ల్ రెండూ  మాకే చెందుతాయ‌ని ఉద్ధ‌వ్ థాక్రే గొంతు చించు కుంటున్నారు.  కానీ మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 44 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌స‌భ ఎంపీలు త‌న వేపు వ‌చ్చేరు గ‌నుక శివ‌సేన మాదే అవుతుంద‌ని షిండే గొడ‌వ పెట్టుకున్నారు. అధికారం పోయి, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, ఎమ్మెల్యేల‌ను కోల్పోయిన  థాక్రేకు శివ‌సేన అస‌లు పార్టీ సింబ‌ల్ ఇవ్వ‌డం న్యాయం కాద‌ని షిండే వాద‌న‌. అందు వ‌ల్ల ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై ఇద్ద‌రూ ఒత్తిడి తెస్తున్నారు. అయితే  ఇంత‌కు ముందు థాక్రే వ‌ర్గాన్ని ర‌ద్దు చేయాల‌ని, పార్టీ సింబ‌ల్‌ను త‌మ‌కు కేటాయించాల‌ని  మ‌హా అసెంబ్లీ స్పీక‌ర్ రాహుల్ న‌ర్వేక‌ర్‌ను షిండే కోరారు. కానీ ఆ విష‌యంలో నిర్ణ‌యం అప్పుడే తీసుకోవ‌ద్దంటూ ఇటీవ‌ల  స్పీక‌ర్‌కు  సుప్రీం కోర్టు చెప్పింది.  ఇదిలా ఉండ‌గా, ముంబై కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు అనేక ప్రాంతీయ సంస్థ‌ల ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ కార‌ణంగా పార్టీ సింబ‌ల్ విష‌యంలో ఇరు వ‌ర్గాలు త్వ‌ర‌ప‌డుతున్నాయి. ఇసి కి పార్టీ పేరు,  గుర్తు విష‌యంలో త‌మ వాద‌న‌లు వినాల‌ని కోరుతూ ఇరువ‌ర్గాలు ఇప్ప‌టికే అభ్య‌ర్ధ‌న‌లు అంద‌జేశారు.    

పుష్పా.. ఐ  హేట్ ట్రాఫిక్‌!

పుష్పా.. ఐ హేట్ టియ‌ర్స్‌.. అంటాడు బ‌చ్చ‌న్ ఓ సినిమాలో. ఈరోజుల్లో పెద్ద పెద్ద న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఈ డైలాగ్‌ని మార్చి టియ‌ర్స్ స్థానంలో ట్రాఫిక్ అని అనుకుంటున్నారు. నాలుగు ద‌శాబ్దాల క్రితం న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఉద్యోగానికి వ‌చ్చిన వారు టూవీల‌ర్ ఉంటే బాగుండు అనుకునేవారు. న‌గ‌రం వెలుప‌ల‌, ప‌ట్ట‌ణాల వెలుప‌ల పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వ‌స్తే బ‌స్స‌ల్లో ప‌డి పోలేక దాదాపు అంతా అనుకున్న‌ది అదే. ఎవ‌రు కార్లో వెళుతున్నా, వేగంగా టూ వీల‌ర్ మీద వెళుతున్నా అదే మాట అనుకుంటూ క‌నీసం సెకండ్ హ్యాండ్‌ది  తీసుకోవాల‌నుకునేవారు. అయినా ఆ రోజులు వేరు. పెద్ద‌గా ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఉండేవి కావు. ఇప్పుడు మ‌నుషుల కంటే వాహానాల జోరు, శ‌బ్దాల హోరు ఎక్కువ‌యిపోయింది. దీంతో రోడ్లు బాగున్నా, లేకు న్నా ట్రాఫిక్ జామ్స్ మాత్రం విసిగిస్తున్నాయి. ఇపుడు కూడా ఇంత వాహ‌న‌యోగం క‌లుగుతున్నా ఆఫీసుల‌కు, ప‌నుల‌కు వెళ్ల‌డం చాలా ఆల‌స్య‌మ‌వుతోంది. ఇది మ‌నం క‌ల్పించుకున్న ఇబ్బంది గ‌నుక  గ‌ట్టిగా కామెంట్ చేయ‌డానికీ క‌ష్ట‌మే.   మ‌రీ ముఖ్యంగా బంగ‌ళూరు, హైద‌రాబాద్‌, చెన్నై లాంటి న‌గ‌రాల్లో ట్రాఫిక్ జామ్స్ లేని స‌మ‌యం ఉండ‌దు. ప్ర‌తీవారికీ వాహ‌నాల మీద త్వ‌ర‌గా వీల‌యినంత వేగంగా వెళ్లాల‌న్న ఆతృత మ‌నిషిని ఏ ప‌నీ చేయ‌నీయ‌ని స్థితికి తెచ్చేసింది. వేగంతో పాటు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మీద అంత‌గా దృష్టి లేక‌పోవ‌డంతో ప్ర‌మాదాలు అంతే స్థాయిలో జ‌రుగుతున్నాయి. అస‌లు మాటి మాటికి బ్రేకులు వేసుకుంటూ కార్లు, హార‌న్లు కొడుతూ టూవీల‌ర్లు, ఆటోలూ నానా గంద‌ర‌గోళం సృష్టిస్తున్నాయి. చాలా మంది త‌మ వాహ‌నాల గేర్లు పాడ‌వుతున్నాయ‌నో, అస‌లు వాహ‌నాలే కొంత‌కాలం పూర్తిగా మార్చవ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌నో గోడు పెడుతున్నారు.  ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న ఒక బంగ‌ళూరు ఉద్యోగి త‌న కారు గేర్లు అమ్మ‌కానికి పెడుతున్నాన‌ని ప్ర‌క‌టించాడు... స‌ర‌దాగా! అప్పుడైనా గేర్ల గురించిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని. అత‌ను త‌న  కారు 3,4,5 అమ్మేస్తాన‌ని అవి షోరూమ్ కండిష‌న్స్‌లో నిరుప‌యోగంగా ఉన్నాయ‌న్నాడు! కానీ బంగ‌ళూరు, ముంబై, హైద‌రాబాద్‌నుంచీ అత‌నికి ట్విట‌ర్ స‌మాధానాలు వ‌చ్చాయి. బాబూ.. నీ కంటే మా ప‌రిస్థితే దారుణంగా ఉంది.. మేము ఏకంగా కారే అమ్మేద్దామ‌నుకుంటున్నామ‌ని! సో, కారులేద‌ని, టూవీల‌ర్ లేద‌ని బాధ‌ప‌డ‌వ‌ద్దు..  ఐ హేట్  నాట్ టియ‌ర్స్‌... ఓన్లీ ట్రాఫిక్  పుష్పా!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జీఎస్టీయార్పణమేనా?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. అయితే  ఆరంభమైన నాలుగు రోజులలో ఒక్కటంటే ఒక్క గంట సభ సజావుగా సాగిన దాఖలాలు లేవు. అధికార, విపక్షాల మధ్య వాగ్విదవాదాల కారణంగా సభ స్తంభించిపోయింది ఒక్క ముక్కలో తేల్చేయడం సరికాదు. సభ సజావుగా సాగకపోవడానికి కారణం జీఎస్టీ. అవును. జీఎస్టీ అంటూ చేస్తున్న వడ్డింపులకు నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ధరలూ పెంచేసినా, పెంచేస్తున్నా సహించి జనం సహనంగా ఉంటున్నారు. అయితే పసి వారికి ఆహారం అయిన పాలపై కూడా సేవా పన్ను విధించడంపై జనాగ్రహమే పార్లమెంటు సభ్యుల నిరసనల వెనుక ఉన్నదనడంలో సందేహం లేదు. పాలపై సేవా పన్ను వ్యతిరేకత కేవలం విపక్షాలకే పరిమితమైన అంశంగా పరిగణించడానికి ఇసుమంతైనా అవకాశం లేదు. ఎందుకంటే పాలపై సేవా పన్నును నిరసిస్తున్నది పార్టీలతో సంబంధం లేకుండా సామాన్య జనం. వడ్డింపులే పాలనా అన్నట్లుగా మోడీ2.0 హయాం సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీ మండలి సమావేశంలో పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించాలన్న నిర్ణయాన్ని యావద్దేశం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నది. పాలు, పెరుగుజ జున్ను వంటి వస్తువులపై పన్ను విధించడంలోని ఔచిత్యాన్ని అన్ని రంగాల వారూ ప్రశ్నిస్తున్నారు. పాల కొరత లేదు. దేశంలో శ్వేత విప్లవం విజయవంతం అయ్యింది. ఎంతటి కరవు పరిస్థితుల్లోనైనా కొరవ లేకుండా పాలు, మజ్జిగ వంటివి పుష్కలంగా లభించే పరిస్థితి ఉంది. పాల కల్తీపై దృష్టి పెట్టాల్సింది పోయి పాలపైనే జీఎస్టీ విధిస్తూ పేదలకు, పసి కందులకు వాటిని దూరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ఎలా చూసినా ప్రజా వ్యతిరేకత విధానమే. పాల వ్యాపారంలోని బడా బడా సంస్థలు వచ్చి చేరాయి కనుక పాలపై పన్ను విధించి ఆదాయం దండుకోవాలన్న దుష్ట చింతన వినా పాల ఉత్పత్తులపై సేవా పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో మరో ఉద్దేశం ఉన్నట్లు కనిపించదు. అసలు జీఎస్టీ విధానం మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంది. సామాన్యులు వినియోగించే వస్తువులపై జీఎస్టీ తక్కువ ఉండాలన్న జనం డిమాండ్ ను కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై జనాభిప్రాయాన్నే కాదు, విపక్షాల ఆందోళనలనూ కేంద్రం పట్టించుకోవడం లేదు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కోసమే జీఎస్టీ అంటూ చెబుతున్న కేంద్రం.. సంపన్నులు, పేదలను ఒకే గాటన కట్టి పన్నుల విధానాన్ని అవలంబిస్తున్నది. జీఎస్టీ వచ్చిన తరువాత ప్రతి నెలా జీఎస్టీ ఆదాయాన్ని వెల్లడిస్తున్న కేంద్రం.. పన్ను రాబడి పెరిగిందనీ, అదంతా తమ ఘనతేననీ భుజాలు చరిచేసుకుంటోంది. కానీ సామాన్యుల నడ్డి విరిగిన విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నది.   నెలకు లక్షా నలభైవేల కోట్ల రూపాయిలు పైనే వసూళ్ళు జరుగుతున్నాయని సంబరపడిపోతున్న సర్కార్ సంపన్నులు, ఉన్నత ఆదాయ వర్గాలపై పన్ను విధించాలని, సామాన్యులకు మినహాయింపు ఇవ్వాలన్న ప్రాథిమిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించేసింది. ఇప్పటికే వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను ఈ ఏడాదిలో పదిపదిహేను సార్లు పెంచింది. గతంలో పన్ను లేని ఎల్‌ఈడీ లైట్లపై   ఇప్పుడు 18 శాతం జీఎస్టీ విధించారు. మరో వైపు ఎల్‌ఈడీ లైట్లను వినియోగించా లని ఒక వంక ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.అంతెందుకు చదువునే పిల్లలు వాడుకునే పెన్సిల్, షార్పనర్, ఎరైజర్ వంటి వాటిపై కూడా 18 శాతం జీఎస్టీ విధించడమంటే.. జనం చావు జనం ఛస్తారు.. ప్రభుత్వం పని మాత్రం రాబడి పెంచుకోవడమే అన్నట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కాశ్మీరీల‌కు మిలిటెంట్ల‌తోపాటు పులుల క‌ష్టాలు

మీ పిల్లాడు మా వీధిలో ఆడుతూ కిటికీ ప‌గ‌ల‌గొట్టాడు..ఓ తండ్రి గోడు. ఏమ‌మ్మో.. మీ పిల్లాడు పాకుతూ వ‌చ్చి గుమ్మాన్ని త‌డిపాడు..చూస్తున్న‌వా.. ఓ త‌ల్లి గొడ‌వ‌.. మీ కుక్క‌పిల్ల మా చెట్ల కుండీ నెట్టేసింది.. ఓ అమ్మాయి ఫిర్యాదు.. ఇలాంటివి మ‌నం నిత్యం వింటూంటాం.. చూస్తుంటాం. ఇలాంటివి సిటీ వాతావ‌ర‌ణంలో, అందునా అపార్ట్‌మెంట్స్‌లో మామూలే. ఈజీగానే తీసుకోవా లని,  చిన్న‌వాట్ల‌కు ఆగ్ర‌హించ‌కూడ‌దంటారు పెద్ద‌వాళ్లు.  కానీ, కాశ్మీరులో జంతువుల‌కు ఎవ‌రు ఏం చెబుతారు?  కాశ్మీర్ అన‌గానే కాల్పులు, బాంబు దాడులు ఇవే మ‌న‌కు బాగా తెలిసిన‌వి. ఈమ‌ధ్య కాలంలో మ‌రో విప‌త్తు ఎదుర్కొంటున్నా రు కాశ్మీరు వాసులు. మిలిటెంట్ల‌తో కాదు ఇక వారు పులుల‌తోనూ యుద్ధం చేయాల్సి వ‌స్తోంది. నిత్యం భ‌యాందోళ‌న‌తో బికు బికు మంటూ బ‌త‌కాల్సి వ‌స్తోంది. బారాములా జిల్లా బాతంగి బోనియార్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల  రుత్బా ని  పులి చంపే సింది. ఆమె రోజూ వెళ్లిన‌ట్టే త‌న త‌ల్లితోపాటు ప‌శువుల‌ను కాయ‌డానికి వెళ్లింది.  ప‌శువుల‌ను తోలుతూ అటూ ఇటూ తిరుగుతూ కాస్తంత అట‌వీ ప్రాంతం లోప‌లికి వెళ్లింది రుత్బా అంతే అక్క‌డే పొంచి ఉన్న పులి అమాంతం ఆమె మీద‌కి దూకి చంపేసింది. ఈ వార్త ఆ జిల్లా ప్రాంమంతా విస్త‌రించి ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. ఇది నిజానికి మొద‌టి సంఘ‌ట‌న కాదు. చాలా రోజు లుగా ఇలాంటి పులి, న‌క్క దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. జ‌నం చాలా జాగ్ర‌త్త‌గానే మ‌సులుతున్నారు. అస‌లే మిలిటెంట్ల దాడుల‌తో భ‌యం నీడ‌లో ఉన్న ప్ర‌జ‌లంతా ఇపుడు ఈ జంతువుల దాడికి బ‌లి కావాల్సి వ‌స్తోంది.  ఉద‌యాన్నే చ‌క్క‌గా సిద్ధ‌మై త‌న‌తో పాటు వ‌చ్చిన పిల్ల అలా న‌వ్వుతూ తుళ్లూతోన్న పిల్ల అమాంతం దాడికి బ‌లై శ‌వంగా మారుతుంద‌ని ఏ త‌ల్ల‌యినా ఊహిస్తుందా? హ‌లీమా త‌న కూతురిని ఆ ప‌రిస్థితుల్లో చూసి దుఖంతో కుంగిపోయింది. నా బంగారు త‌ల్లిని మింగేసింది ముద‌న‌ష్ట‌పు పులి అంటూ శాప‌నార్ధాలు పెడుతోంది. వాస్త‌వానికి అస‌లా ప్రాంతంలో ఒంట‌రిగా ఎవ్వ‌రూ తిర‌గ‌వ‌ద్ద‌ని అధికారులు హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. కానీ మ‌రీ అంత భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌న్న చిన్న ధైర్యంతో ప‌శువుల కాస్తూ తిరుగుతూనే ఉన్నారు. చిన్న శ‌బ్ద‌మ‌యినా జాగ్ర‌త్త ప‌డుతూంటారు. అలాంటిది హ‌ఠాత్తుగా ఇలా దాడి జ‌రిగిపోయింది.  కాశ్మీరు లోయ‌ప్రాంతంలో ఇటీవ‌ల ఇలా పులులు దాడి జ‌రుగుతోంది. అనేక ప్రాంతాల్లో ఈ సంఘ‌ట‌న‌ల గురించి అట‌వీ అధికారు ల‌కు తెలిసి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఉన్నారు. అయితే మిలిటెంట్ల దాడితో స్వేచ్ఛ‌గా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోలేని ప‌రిస్థితులు వారిని ఇలాంటి ప్ర‌మాదాల నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడ‌లేక‌పోతున్నారు. రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ‌ని అస్ల‌మ్ షేక్ అనే సామాజిక కార్య‌క‌ర్త తెలిపారు. గ్రామాల్లోని పేద‌లు త‌మ‌కు తాము ర‌క్ష‌ణ క‌ల్పించుకునే స్థితి లేకపోవ‌డంతో రోజూ భ‌యంతోనే బ‌తుకుతున్నార‌న్నారు. రోజూ పనికి వెళ్ల‌కుంటే పూట గ‌డ‌వ‌దు, అలాగ‌ని ప‌నికి వెళితే ఇలాంటి దాడులు జ‌రుగుతు న్నాయ‌న్నారు. మ‌నిషి, జంతువుల మ‌ధ్య ఈ ఘ‌ర్ష‌ణ 2011 నుంచి క‌నీసం రెండువంద‌ల కుటుంబాలు దెబ్బ‌తిన్నాయి, రెండు వేల‌మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారని అట‌వీశాఖ అధికారుల లెక్క‌. గ‌త ఏడాది నుంచి 1,658 సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ ఏడాది ఇప్ప‌టికే  17 మంది చ‌నిపోగా 141 మంది గాయ‌ప‌డ్డారు. చాలా సంఘ‌ట‌న‌ల్లో ప్ర‌జ‌లు ఎదురుదాడి చేసి త‌ప్పించుకోగ‌లిగారు.  ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తున్న కాశ్మీరు లోయ‌ప్రాంత ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వాలు మ‌రింత ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సామాజిక కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. 

జోష్‌.. వాంతుల రోగి

పిల్లాడు వ‌రుస‌గా నాలుగు త‌మ్ములు తుమ్మితే.. అది కొంప‌దీసి వ‌ర్షాకాలం కాకుంటే, ఇంట్లో ఉన్న‌వాళ్లంతా తెగ  ఖంగారు ప‌డు తూంటారు. ఇంట్లో బామ్మ‌గారు ఏదో ఆకులు, అల్లం నూరి వాస‌న‌ప‌ట్టి రెస్ట్ తీసుకోమంటుంది. అంతే సాయంత్రానికి ఠ‌క్కున అన్నీ తుమ్ముల బెడ‌దా తీరి ఆడుకోడానికి వెళ‌తాడు.. బామ్మ‌గారు న‌వ్వుకుంటారు. కానీ జోష్ రైట్ అనే 13ఏళ్ల  పిల్ల‌వాడి సంగ‌తే వేరు. వాడికి ఇలాంటి చిట్కాలేమీ ప‌నిచేయ‌వు. అత‌ను చిత్ర‌మైన వాంతుల‌ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నాడు. ప్ర‌తీ ఐదు నిమిషాల‌కు పెద్ద వాంతిచేసుకుంటాడు! ఎడిన్‌బ‌ర్గ్‌కి చెందిన జూలీ పిల్లాడే ఈ జోష్ రైట్‌. చాలాకాలం నుంచి ఈ పిల్లాడికి గొంతు మండిన‌ట్ట‌యి వాంతులు అవు తుంటాయి. ఇదేదో మ‌హ‌మ్మారి మ‌న ఊళ్ల‌లో అనేక భూత పిశాచ వైద్యాలు చేయించేస్తారు. కానీ ఎడిన్‌బ‌ర్గ్‌లో అలాంటి అవ‌కాశం లేదు. పిల్లా డిని ప్ర‌తీ ఆరు వారాల‌కు ఒక‌సారి ఆస్ప‌త్రికి జూలీ తీసికెళుతుంటారు. చిత్ర‌మేమంటే  విచిత్ర వామిటింగ్ సిండ్రోమ్ (విఎస్‌) మూల కార‌ణ‌మేమిట‌న్న‌ది వాళ్ల‌కి అంతు చిక్క‌డం లేదు. ఎన్ని ప‌రీక్ష‌లు చేసినా వారికి అర్ధం కావ‌డంలేద‌ని డాక్ట‌ర్లే చెబుతున్నారు. లోకంలో ఇలాంటి జ‌బ్బూ ఉంటుందా అని చ‌ర్చిస్తున్నారు.  నోరంతా ఉమ్మి చేరుకుంటుంది వెంట‌నే వాంతి చేసుకుంటూంటాడు. దీనికి తోడు అప్పుడ‌ప్పుడూ ర‌క్తం కూడా ప‌డుతోందిట‌. ఇది మ‌రీ ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అంద‌రూ గ్ర‌హించారు. 13ఏళ్ల పిల్లాడు ఏమ‌యిపోతాడా అని ఆ త‌ల్లి భ‌య‌ప‌డుతోంది. మామూలు ద‌గ్గు, జ్వ‌ర‌మైతేనే  బ‌డికి రావ‌ద్ద‌ని అంటూంటారు. పాపం జోష్‌కి చదువుకోవాల‌ని, డాక్ట‌ర్ కావాల‌ని ఉంది. కానీ స్కూలు చ‌దువే అయ్యేట్టు లేదు. ఇంటిద‌గ్గ‌ర ట్యూష‌న్ చెప్ప‌డానికి కూడా టీచ‌ర్లు భ‌య‌ప‌డుతున్నార‌ట‌. వారికీ ఇది అంటుకుంటుంది. ఇది అంటువ్యాధి కాద‌ని మొత్తుకుంటున్నా వారి భ‌యం వారిది. అస‌లా వీధిలోకి వెళ్ల‌డానికి ఎవ‌రూ ధైర్యం చేయ‌డంలేదు.   ఇత‌ర పిల్ల‌లు, స్నేహితులు అంతా బాగానే చ‌దువుతున్నారు, ఆడుకుంటున్నారు.. త‌న‌కెందుకు ఇలా అయింద‌ని పిల్లాడు దిగులు ప‌డి మ‌రీ నీర‌సించాడు. స్కూలుకి స‌రిగా వెళ్ల‌లేక‌పోతున్నాడు. క్లాసులో ఇత‌రుల‌కు ఇబ్బందిగా ఉంద‌ని అత‌నే ఇంటి ద‌గ్గ‌ర చ‌దువుతానంటున్నాడు. జోష్‌కి ఒక‌డే కొడుకు. వీడిని బాగా చ‌దివించి మంచి ఉద్యోగిగా చూడాల‌ని ఎన్నో క‌ల‌లు కంటోం ది. కానీ జోష్ ఆరోగ్యం ఆమెను భ‌య‌పెడుతోంది. ఎవ‌రికీ చెప్పుకోలేదు, డాక్ట‌ర్లూ ధైర్యం చెప్ప‌లేక‌పోతున్నారు. అత‌నికి జీవితాంతం ఈ జ‌బ్బు ఉంటుంద‌నే అంటున్నారు. మ‌రి పూర్తిగా త‌గ్గేది ఎన్న‌డ‌న్న‌ది ప‌రిశోధ‌కులు తేల్చాల్సిందేన‌ట‌. ఇక ఆమెకు వాడి తోనే జీవితం, ప్ర‌తీ క్ష‌ణం. 

మెడీ బలం విపక్షాల అనైక్యతే!

 రాష్ట్రపతి ఎన్నిక అయిపోయింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక అయిపోతుంది. విపక్షాల ఐక్యత ఎండమావేనని మరోసారి తేలిపోయింది. మళ్లీ మళ్లీ అదే రుజువు అవుతుంది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుస విజయాలకు అసలైన కారణం సొంత ప్రతిభ కంటే.. సొంత బలం కంటే విపక్షాలలో ఉన్న అనైక్యతే కారణమని పదే పదే రుజువు అవుతోంది. అయినా విపక్షాలు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. సొంత బలం కంటే తమ అనైక్యతే మోడీ సర్కార్ బలోపేతం కావడానికి కారణమౌతోందని తెలిసినా, విభేదాలను పక్కన పెట్టి కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఏకాభిప్రాయానికి రావడంలో ఘోరంగా విఫలమౌతోంది.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను చూస్తున్న సామాన్య ప్రజలకు కూడా తెలుస్తున్న ఈ సంగతి విపక్షాలకు ఎందుకు తెలియడం లేదో అర్ధం కాదు. రాష్ట్రపతి ఎన్నికలలో ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల్లో   క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. ఇతక పార్టీల నుంచి ముర్ముకు మ‌ద్ద‌తుగా ఉన్న వారి కంటే అదనంగా 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఓటేశారు. అంటే విపక్ష పార్టీల ఐక్యత ఎంత బలంగా ఉందో తేటతెల్లమౌతుంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే  సరే సరి.  ఓటింగ్ కు దూరం అని మమతా బెనర్జీ ప్రకటించడంతోనే విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ఎందుకు నిలిపాయన్నది కూడా అర్ధం కాని పరిస్థితి.   తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీని ఎదుర్కోక తప్పని పరిస్థితి. అయితే ఆ రెండు పార్టీల కార్యక్షేత్రం వాటి వాటి రాష్ట్రాలే. ఎందుకంటే బీజేపీతో పోరు చేయకుంటే ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని కాపాడుకోవడం ఆ పార్టీలకు అసాధ్యమౌతుంది కనుక. ఈ రెండు పార్టీలూ మినహాయిస్తు మిగిలిన విపక్షాలు వేటికీ కేంద్ర ప్రభుత్వంతో అంటే బీజేపీతో జాతీయ స్థాయిలో పోరాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ అవసరం ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాజకీయాలలో అదీ జాతీయ స్థాయి రాజకీయాలలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీ పోటీ ఇచ్చే పార్టీ కానీ, కూటమి కానీ లేకుండా పోయింది.  కేంద్రంలో మోడీ సర్కార్ పై జాతీయ స్థాయిలో ఎంత వ్యతిరేకత ఉన్నా.. ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితుల్లో జనానికి కూడా బీజేపీ వినా మరో పార్టీ కనిపించని పరిస్థితి నెలకొంది.  ప్రజలు ప్రత్యామ్నాయం కనిపించినప్పుడే తమ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా చాటుతారు. అలా కనిపించనప్పుడు ఎవరైతేనేం అన్న నిర్లిప్తంతో ఉండిపోతారు. ఇప్పుడు దేశంలో ప్రజల   పరిస్థితి అదే.

విశాఖ వైసీపీ నేత‌ల ఘ‌ర్ష‌ణ‌

ప‌రిస్థితులు పార్టీకి అన‌నుకూల‌ మైన‌పుడు నాయ‌కునికి మ‌ద్ద‌తు నివ్వాలి. కానీ ప్రాంతీయ నాయ‌కుల మ‌ధ్య విభేదాలు మ‌రీ రోడ్డుకెక్కితే పోయేది పార్టీ ప‌రువే. ఇదే స్ప‌ష్టం చేసింది విశాఖ‌ప‌ట్నం వైసీపీ నాయ‌కుల  వైరి. ఇక్క‌డి హిందూస్థాన్ షిప్‌యార్డులో ప్ర‌మాద‌వ‌శాత్తూ మృతిచెందిన కార్మికుడి నివాసానికి  ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లి అక్క‌డ గొడ‌వ‌ప‌డ్డారు. అ\లాంటి చోట కూడా వారి మ‌ధ్య‌వైరాన్ని ప్ర‌ద‌ర్శించుకునే స్థాయిలో విభేదాలు త‌లెత్తాయ‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది.  అంతా బాగానే ఉంది అనుకున్న‌చోట కూడా వివాదాలు త‌లెత్తాయి. విశాఖ‌ ఎం.పీ  స‌త్య‌నారాయ‌ణ ద‌గ్గ‌రే వైసీపీ నేత‌లు దాడి చేసుకోవ‌డం విడ్డూరం. ఎం.పి తో పాటు స్థానిక కార్పొరేటర్ లావణ్య, 61 వ వార్డు కార్పొరేటర్ పీ.వీ.సురేష్ , వైసిపి నేతలు పొట్టి మూర్తి, మిగిలిన నాయకులు వెళ్లారు. ఎంపీ తో పాటు వెళ్తున్న క్రమంలోనే అక్క‌డ తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది.  స్థానిక కార్పొరేటర్ లావణ్య వర్గం ఆగ్ర‌హించి ఇక్క‌డ‌ మీ పెత్తనమేంట౦టూ కార్పొరేట్ పీవీ సురేష్, వైసిపి నేత పొట్టి మూర్తిలతో వాదనకు దిగారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కలుగజేసుకొని బాహాబాహీకి దిగిన ఇరువర్గాలను సముదాయించారు. అయితే ఈ వివాదంపై వైసిపి నేత పొట్టి మూర్తి కార్పొరేటర్ పి.వి. సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పి.వి.సురేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.