వదలని వాన.. తప్పని తిప్పలు!
posted on Jul 23, 2022 @ 10:44AM
విశ్వనగరం మీద వరుణులు పగబట్టాడా అన్న అనుమానం కలుగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే మరో సారి హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలపై వరుణుడు తన ప్రతాపం చూపాడు. శుక్రవారం ఉదయం ముసురు పట్టి చిరుజల్లులతో మొదలైన వాన అంతకంతకూ పెరిగి కుండపోతగా మారింది. వర్షం నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. లోతట్టు ప్రాంతాలలో ఇళ్లళ్లోకి నీరు ప్రవేశించింది. రహదారులు గోదారులయ్యాయి.
ట్రాఫిక్ లో జనం నానా ఇబ్బందులూ పడ్డారు. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరి వాహనాలకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ముసురు ఇప్పట్లో వదలదనీ మరో రెండు రోజులు ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు వర్షాలు వదలకుండా కురిశాయి. జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేశాయి. నాలుగు రోజులు వర్షాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న నగరం శుక్రవారం నాటి జోరు వానకు ఉక్కిరి బిక్కిరైంది. ఒక్క జంట నగరాలనేమిటి? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కనీసం 15 ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి క్రమేపీ పెరిగిన వర్షం సాయంత్రానికి తీవ్రరూపం దాల్చింది. భారీ వర్షానికి హైదరాబాద్ బేగంపేటలోని బ్రాహ్మణవాడి, వడ్డెరబస్తీలో మోకాలిలోతు వరకు నీరు నిలిచింది. లింగంపల్లి అండర్‌బ్రిడ్జి, బొల్లారం రోడ్డులో వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజాంపేట మెయిన్‌రోడ్డులో, ఉప్పరపల్లిలో టోలీచౌకీ వద్ద ప్రవాహం ఉండటంతో వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు.
మక్కా మజీద్ అవరణలో వజుఖానా వెనక ఉన్న పురాతన భవనం గోడ కుప్ప కూలింది. కుత్బుల్లాపూర్‌లోని ఇంద్రసింగ్‌నగర్, నిజాంపేటలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, టోలీచౌకీ, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఆబిడ్స్, కోఠి, మోజాంజాహి మార్కెట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. శేరిలింగంపల్లి మండలంలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.