మితిమీరిన ఆనందమూ ప్రమాదమే!
posted on Jul 22, 2022 @ 5:25PM
అనారోగ్యంతో మరణించేవారి సంగతి తెలుసు. ఏదో చెప్పలేని బాధతో క్షీణించి మరణంచేవారుంటారు. ఒంటరితనం మానసిక ప్రశాంతతలేకపోవడం.. ఇవన్నీ మనిషి మరణానికి దారితీస్తుంటాయి. చిత్రమే మంటే అమితానందం కూడా ప్రమాదమే అంటున్నారు శాస్త్రవేత్తలు. అదేమిటి.. జీవితంలో సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ ఆనందంగా జీవించాలని అంటూంటారు కదా అంటే కరెక్టే. కానీ హఠాత్పరిణామాలతో వచ్చే ఆనందం గుండె పోటుకి దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆమధ్య ఒక సినిమాలో ఓ పెద్దామె నవ్వుతూ నవ్వుతూ గుండె ఆగి మరణించడం చూపించారు. నవ్వు ముఖంతోనే పార్ధివ దేహం కనపడుతుంది! అది సినిమా సీన్‌లే అని అనుకోవచ్చు. కానీ అందుకు చాలా ఆస్కారం ఉందిట. అదేదో గొప్ప మరణంగానూ భావించనక్కర్లేదు.
ఈ ఆధునిక కాలంలో అన్నీ చాలా ఆశ్చర్యకర సంఘటనలే ఎక్కువ వింటున్నాం, చూస్తున్నాం. అబ్బాయి కి ఎన్నడూ లేనిది జీతం రెండింతలు పెరగడం, విదేశీ చదువు ఫ్రీగా లభించడం, ఎవ్వరూ ఊహించని విధంగా విదేశాల్లో పెద్ద ఉద్యోగం రావడం, లాటరీలో కోట్లు రావడం వంటివి ఎంత ఆనందా న్నిచ్చే సమాచారాలో అంత ప్రమాదకరం కూడా! ఇలాంటి మరణాల్ని తకోత్సుబో సిండ్రోమ్ అంటారని జ్యూరిచ్ ఆస్పత్రికి చెందిన స్విస్ శాస్త్రవేత్తలు తేల్చారు. దీన్నే ఇంకా తేలికగా చెప్పాలంటే హార్ట్ బ్రోకెన్ సిండ్రోమ్ అంటారు.
అత్యంత ఆనందకర సందర్భాలు, సంఘటనలు ఒక్కోసారి మనిషిని తెలీకుండా విపరీతమైన బలహీన తకు దారితీస్తాయి. ఇలాంటివి మనమూ అపుడపుడూ గమనిస్తుంటాం. ఇంట్లో ఏదయినా అత్యంత ఆనం దకర సంఘటన జరిగితే అందరూ గట్టిగా నవ్వేసుకుంటూంటారు. అందులో ఒక్కరిద్దరికి ఆ ఆనందపు నవ్వు చాలా సేపు ఉంటుంది. అలసట వచ్చేస్తుంది. కుర్చీలో కూర్చుండిపోతారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వావురా.. అంటారు హాస్యంగా అందరూ.. కానీ అదే గుండె ఆగేందుకు దారి తీస్తుందిట. అంటే ఆ సమ యంలో గుండె ఎడమ కవాటం ఉండాల్సిన స్థితి మారుతుంది. దానితో గుండెపోటు వస్తుంది. అయితే ఇలాంటి కేసులు చాలా అరుదు. అంటే గుండె కండరాలు మెల్లగా శక్తి కోల్పోతాయి.
గుండె జబ్బులు వచ్చే కేసుల్లో ఇలాంటిది ఏ ఒక్కటో రెండో ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు, డాక్టర్లు. అందు కనే ఎక్కువగా ఆవేశపడవద్దని, ఆగ్రహానికి , అతి భయానికి గురికావద్దని, అతిగా స్పందించడం, లేని దాన్ని ఉందని ఊహించుకుని ఆందోళనచెందడం వంటివాటికి దూరంగా ఉండాలని.. మామూలుగా డాక్ట ర్లు సూచిస్తుంటారు. అంటే మనిషి మధ్యవయసు దాటిన తర్వాత కొంత ఉద్రేక పరిస్థితులకు దూరం గా ఉండాలి. సహజంగా మధ్యతరగతి కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు దాదాపు తరచూ వస్తుంటాయి గనుక కడు జాగ్రత్తగానే ఉండాలంటున్నారు గుండె నిపుణులు. జ్యూరిచ్ శాస్త్రవేత్తలు సుమారు 500 మంది రోగుల ఆరోగ్యపరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ హాపీ సిండ్రోమ్‌ను కనుగొన్నారు. దీనికి సం బంధించిన విశ్లేషణతో కూడిన వ్యాసాన్ని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించారు.
తకోత్సుబో సిండ్రోమ్ అధికశాతం మహిళల్లోనే కనపడుతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శ్వాస తీసు కోవడం తగ్గడం, ఛాతీ నొప్పి వంటివి అతి సాధారణ లక్షణాలుగా పేర్కొన్నారు.