అవును ..అ ఇద్దరూ దగ్గరయ్యారు !
కాంగ్రెస్, తెరాస పార్టీలు దగ్గరవుతున్నాయా? అ రెండు పార్టీల మధ్య దూరం తరుగుతోందా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవసరం అయితే, చేతులు కలిపేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? అంటే, రెండు వైపుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఇంటి పార్టీగానే భావిస్తూ వచ్చారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కించడం పెద్ద కష్టం కాదనే సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు.
2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రస్ ఎమ్మెల్యేలులో మూడొంతులకు పైగా సంవత్సరం తిరగకుండానే తెరాస గూటికి చేరిపోయారు గులాబీ కడువా కప్పుకున్నారు. సో.. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తెరాసకు ప్రత్యర్ధి పార్టీగా గతంలో భావించలేదు ఇప్పుడూ భావించడం లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీగా కంటే ఫ్రెండ్లీ పార్టీగానే ట్రీట్ చేస్తూ వచ్చారు. ఇది అందిరకీ తెలిసిన నిజం. జగమెరిగిన సత్యం. అయితే, రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడు అయిన తర్వాత రెండు పార్టీల మధ్య దూరం కొంత పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ టార్గెట్’గా రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వం పై దాడి చేస్తున్నారు. అటు నుంచి కేసీఆర్, కేటీఆర్ కు అదే స్థాయిలో దాడి కొనసాగించారు.అయితే ఇప్పుడు, కేసీఆర్ కాంగెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలెట్టారని ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించిన నేపధ్యంలో కీడెంచి మేలెంచడం మంచిదనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు, సోనియా, కేసీఆర్ మధ్య స్నేహ బంధాన్ని పెంచేందుకు కాంగ్రెస్, తెరాస పార్టీలలలో ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షులు ఇద్దరు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కీలక బాధ్యతలను నిర్వహించిన ప్రస్తుత తెరాస రాజ్యసభ సభ్యుడు, ఆంధ్ర్ ప్రదేశ్’కు చెందిన ఇంద్దరు మాజీ ఎంపీలతో కూడిన ఒక బృందం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, అసెంబ్లీ ఎన్నికల వరకు ఉభయ పార్టీల మధ్య ప్రత్యక్ష పొత్తు ఉండదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమని అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటేనే, తెరాస గెలుపు సులువు అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీల బలాబలాలను బేరీజు వేసుకుంటూ, బ్యాలెన్సు చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో రెండు జాతీయ పార్టీలను ఒకే గాటన కట్టేసి విమర్శిస్తూ వచ్చారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి / పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు ప్రాంభించారు, అయితే, ప్రయత్నాలు ఫలించక పోగా, రాష్ట్రంలోనూ పరిస్థితులు తల్లకిందులు అయ్యే సంకేతాలు స్పష్టం కావడంతో, కేసీఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి విషయంలో, కాంగ్రెస్ ఉన్న కూటమిలో తెరాస ఉండదని ఖరాఖండిగా చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలో 18 జాతీయ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాను సమర్ధించడమే కాకుండా, ఆయనకు ఏ రాష్ట్రంలో, ఏ పార్టీ ఇవ్వని స్థాయిలో హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. కటవుట్లు పెట్టి, బ్యానర్లు కట్టి, బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అఫ్కోర్స్ అందుకు, మోడీని అవమానించడం అనే వేరే కారణం ఉన్నా, ఉభయతారకంగా కాంగ్రెస్ కు దగ్గరయ్యే దూరాలోచన కూడా లేకపోలేదని, తెరాస వ్యూహ బృందం సమాచారం. అలాగే, యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ స్వయంగా హాజరయ్యారు.
రాహుల్ గాంధీ పక్కన చేరి ముచ్చట్లాడారు. ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో కానీ, ఆ తర్వాత నుంచి కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ జోలికి వెళ్ళడం లేదు. రెండున్నర గంటల ప్రెస్ మీట్ పెట్టిన రండు నిముషాలు అయినా కాంగ్రెస్ పార్టీకి కేటాయించలేదు. ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేరుగా, కాంగ్రెస్ పార్టీ అడగక ముందే, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వాకు తెరాస మద్దతు ప్రకటించింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్, తెరాస దగ్గరవుతున్నాయి అనేందుకు సంకేతాలని పరిశీలకులు భావిస్తున్నారు.
అదలా ఉంటే కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్, అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, తెరాస, ఎంఐఎం పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మీడియా సాక్షిగా కుండ బద్దలు కొట్టారు. అంతే కాదు, రెండున్నర సంవత్సరాలు తెరాస (కేసీఆర్/కేటీఆర్), రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ (రేవంత్ రెడ్డి) ముఖ్యమంత్రిగా ఉంటారని చెపుతున్నారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఢిల్లీ వేదికగా కదులుతున్న రాజకీయ ఎత్తుగడలు, అనివార్యతల దృష్ట్యా కాంగ్రెస్ అవసరం తెరాసకుంది, తెరాస అవసరం కాంగ్రెస్ పార్టీకి వుంది. సో .. రేవంత్ రెడ్డి ఎంతగా కాదన్నా, ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలేందుకు వీలు లేదన్నా చివరకు కాంగ్రెస్, తెరాస కల్సి కాపురం చేయక తప్పదని పరిశీలకులు అంటున్నారు.