ఈయన మామూలోడు కాదు
posted on Jul 22, 2022 @ 3:02PM
మామూలు వాటికి విరుద్దం ఏదయినా వింతే. ఎడంచేత్తో రాస్తూంటే వింతగా చూస్తారు. అదెలా వచ్చిందా అని. వెనక్కి నడుస్తుంటే, కాస్తంత పిచ్చనే అనుకుంటారు. రెండుచేతులతో రాస్తుంటే కన్నార్పకుండా చూస్తారు. ఇది వింతల్లో వింత అని.
ఇక్కడో పెద్ద మనిషి రెండు చేతులతోనూ ఒకేవిధంగా అద్భుతంగా బొమ్మలు వేస్తున్నాడు. ఇదో ఊహించ లేని నైపుణ్యం. పూర్వం ఒక ప్రపంచ ప్రముఖ ఆర్టిస్టు ఒక చర్చి లోపలి భాగంలో చాలా పెద్ద పెయింటింగ్ వేశాడట. దానికి ఆయనకు సంవత్సర కాలం పట్టిందని చరిత్ర. తిండి, నిద్రాహారాలు మానేసి వేసిన ఆ పెయింటింగ్ ప్రపంచ చిత్రకళా చరిత్రలో అత్యుత్తమమైనదిగా నిలిచిపోయింది.
ఈ విచిత్ర చిత్రకారుడు ఎవరన్నది సమాచారం లేదు. కానీ ఆయన క్లాస్ బ్లాక్ బోర్డు మీద వేస్తున్నాడు గనుక స్కూలు టీచర్ అయి ఉండవచ్చు. కానీ రెండు చేతులతో ఒకే విధంగా శివాజీ బొమ్మని గీయడం, అసలే బొమ్మనైనా అంత బాగా గీయడం అనేది చిన్నవిషయం మాత్రం కాదు. అది స్వతహాగా ఉండే కళా నైపుణ్యం తాలూకు చిన్న ప్రదర్శన. కానీ ఆయన్ను ఆ స్కూలు వారు సత్కరించాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను గొప్పకళాకారునిగా గుర్తించాలి. ఇలాంటివారే ఆయా ప్రాంతాల్లో మంచి ఆర్టిస్టులను తయారు చేయగలరు.
ఆయన బొమ్మ వేయడం చూసిన ఒక అభిమాని వీడియో తీసి అందరూ ఆయన గురించి తెలుసుకునేట్టు చేశారు. ఈ ఆర్టిస్ట్ ఎవరో గాని, వెనక్కి తిరగకుండానే అంత మంచి బొమ్మవేశారు. నిజంగా సూపర్ అని వీడియో ప్రేక్షకులంగా మనస్పూర్తిగా మెచ్చుకుంటున్నారు.