వెంకటేశా.. నీ కొండమీదా హత్యాకాండ!
posted on Jul 22, 2022 @ 2:30PM
తిరుమల తిరుపతి అనగానే భక్తి పారవశ్యంలో మునుగుతారు జనం. ప్రతీ ఏడూ వెంకన్నను దర్శనా నికి వెళ్లకుంటే తోచని జనాలున్నారు. అక్కడంతా భక్తి, సామరస్య భావన తప్ప మరోటి ఎన్నడూలేదు. తిరు మల అంటేనే సామాజిక సామరస్యానికి, ప్రశాంతతకి ప్రతీక. ఎంతో కట్టుదిట్టమైన రక్షణవ్యవస్థనే గమని స్తుంటాం. పిల్లలు తప్పిపోయినా తమవద్దకు చేర్చగల పోలీసు వ్యవస్థ ఉంది. అలాంటి వెంకన్న సన్నిధిలో ఏకంగా హత్య జరగడం యావత్ తెలుగు లోకాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తిరుమ కొండపై హత్య జరగడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమల కొండపై ఓ భక్తుడి హత్య కలకలం రేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం దగ్గర వ్యక్తి మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు.
తిరుమలలో హత్య తో ఒక్కసారిగా కలకలంరేగింది. ఆలయానికి సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా బండ రాయితో మోది హత్య చేశారు. అయితే ఈ దారుణానికి చిన్నపాటి గొడవ కారణమని తిరుమల వన్ టౌన్ పోలీసులు తెలిపారు. తమిళనాడులోని ఆరణి జిల్లాకు చెందిన కె.శరవణన్, వేలూరుకు చెందిన భాస్కర్ ఇద్దరూ తిరుమలలో చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. అయితే రాత్రిళ్లు అక్కడే పడుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి స్థానిక మ్యూజియానికి ఎదురుగా వయోవృద్ధుల టిక్కెట్ల పంపిణీ కేంద్రం దగ్గర భాస్కర్ వచ్చి పడుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత శరవణన్ అక్కడికి వచ్చి తన చోటులో ఎందుకు పడుకున్నావంటూ గొడవపడ్డాడు. బలవంతంగా భాస్కర్‌ను అక్కడి నుంచి పంపించాడు. దీంతో కోపం పెంచుకున్న భాస్కర్ శరవణన్‌పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సిమెంట్ రాయిని తీసుకొచ్చి నిద్రపోతున్న శరవణన్ తలపై మోదాడు. తీవ్ర గాయాలైన అతడు చనిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది.. తర్వాత హత్య ఉదంతం బయటపడింది.. మృతదేహం కనిపించింది. అనంతరం సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అర్థ రాత్రి ఘటన జరిగినట్లు గుర్తించారు.
పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా భాస్కర్‌ను అరెస్ట్ చేశారు. అయితే తిరుమలలో హత్య జరగడం హాట్ టాపిక్ అయ్యింది. తిరుమలలో ఎవరైనా నివాసం ఉండాలంటే స్థానికులకైతే ఆధార్‌కార్డు, పని చేసేందుకు వచ్చేవారికైతే గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. కానీ కరోనా ఆంక్షలు తొలగించడంతో.. భక్తులను టీటీడీ అనుమతిస్తుండటంతో పనిచేసేందుకు వస్తున్న వారు కొందరు గుర్తింపు కార్డులు లేకుండా తిరుమల వస్తున్నారు. ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి, హత్యకు పాల్పడిన వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేటు హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.