ఆపన్నులను ఆదుకోవడంలో బాబు తగ్గేదేలే!
posted on Jul 22, 2022 @ 3:19PM
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లానే వేశారు. జగన్ రెడ్డి సర్కార్, వైసీపీ నేతలు చేస్తున్న పనికిమాలిన పనులన్నింటినీ వరుసపెట్టి ఏకేస్తున్న చంద్రబాబు ప్రతి సందర్భాన్నీ టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా సరే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి విజయం సాధించిపెట్టడం ద్వారా అసెంబ్లీలో తాను చేసిన శపథాన్ని నెరవేర్చుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. తన సతీమణిని వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా విమర్శించినప్పుడు ఆవేదనతో మళ్లీ సీఎంగానే ఈ సభలో అడుగుపెడతా అంటూ బయటికి వచ్చేశారు.
భారీ వర్షాలు, వరదలతో భారీగా నష్టపోయిన కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించి, బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి పరామర్శించి, టీడీపీ తరఫున భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితులకు తక్షణమే సాయం చేసి, అండగా ఉండాల్సిన సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లోనే వెళ్లిపోయారని విమర్శించారు. అలా గాల్లో వస్తే.. బాధితుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు స్వయంగా వరదనీటిలో పడవలపైన, బురద నిండిన గ్రామాల్లో కూడా పర్యటించారు. కష్టాల్లో ఉన్న తమను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబును చూసి గోదావరి జిల్లాల ప్రజల్లో చెప్పలేనంత సంతోషం వ్యక్తం అయింది. ఆయనకు నీరాజనాలు పట్టి మరీ స్వాగతం పలికారు.
వరద బాధితులకు పక్కరాష్ట్రం తెలంగాణలో పది వేలు పరిహారం ఇస్తే.. ఏపీలో కేవలం రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ ఇస్తున్న రెండు వేల రూపాయలు వరదలో మునిగిపోయిన ఇళ్లలోని బురద తొలగించుకోడానికి కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టడం తథ్యం అని, బాధితులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ రెడ్డి పాలన సరిగా లేదు కాబట్టే పోలవరం ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలిసిపోతామంటూ తీర్మానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
వరదనీరు నిండి ఉన్న లంక గ్రామాల్లో చంద్రబాబు నాయుడు సాహసం చేసి మరీ బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురై, పలువురు నేతలు వరదనీటిలో పడిపోయారు. ఇలాంటి ప్రమాదాలకు కూడా ఏమాత్రం వెనుదిరగకుండా చంద్రబాబు తన పరామర్శ యాత్రను కొనసాగించారు. బాధితుల పక్షాన నిలిచారు.
వైసీపీ ప్రభుత్వం పెంచేసిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, పన్నులపై ‘బాదుడే.. బాదుడు’ పేరిట ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఏడు పదులు దాటిన వయస్సులో కూడా చంద్రబాబు విసుగు, విరామం, అలసట లేకుండా జిల్లాల యాత్రలు చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి దాష్టీకాలు, వైసీపీ నేతల దుర్మార్గాలపై ఎప్పకటికప్పుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన గోదావరి జిల్లాల పర్యటనకు సంబంధించి రెండు విషయాలు చెప్పాల్సి ఉంది. సాధారణంగా వరదలు, భారీ వర్షాలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రాజకీయ నేతలు బాధితులను ఒక చోట చేర్చి పరామర్శించడం, తోచినంత సాయం చేస్తుంటారు. కానీ చంద్రబాబు మాత్రం వరదలో చిక్కుకున్న మారుమూల గ్రామాలకు కూడా స్వయంగా వెళ్లడం, రోజంతా బాధితుల సమస్యలు వింటూ.. వారితో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో ఎంతో ఓపికతో వ్యవహరించారు. రోజంతా విరామం లేకుండా బాధితుల పక్షాన నిలిచేందుకు చంద్రబాబు ఎంతో చొరవ చూపించారు. ఆయన ఓపిక, స్టామినాను చూసిన వరద బాధితులు కూడా అవాక్కయ్యారు.
వరద బాధితులను గాలికి వదిలేసి, గాల్లో వచ్చిన జగన్ గాల్లోనే చూసి వెళ్లిపోతే.. చంద్రబాబు మాత్రం సమస్య మూలాల్లోకి వెళ్లి, బాధిత జనం కోసం జనం మధ్యకే వెళ్లి, వారికి అండగా నిలబడతామని భరోసా ఇవ్వడం విశేషం. ఏదేమైనా తాను చేసిన శపథం ప్రకారం చంద్రబాబు నాయుడు సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టే సూచనలో ఏపీలో సర్వత్రా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.