కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు ముందడుగే!?
posted on Jul 23, 2022 7:43AM
తెలంగాణ సీఎం.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఇటీవలి కాలంలో ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై ముఖం మొత్తినట్లు కనిపిస్తోంది. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఆయన దృష్టి అంతా జాతీయ రాజకీయాలపైనే ఉందని తెరాస శ్రేణులు కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎనిమిదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వంపై ఇప్పుడు ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందనీ, ఈ సమయంలో రాష్ట్రంపై సీరియస్ గా దృష్టి సారించకుండా జాతీయ రాజకీయాలంటూ చేస్తున్న హడావుడి వల్ల రాష్ట్రంలో మరో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యానికి తూట్లు పడే అవకాశాలున్నాయనీ తెరాస శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లుతుండటం. అధినేత వాటిని పట్టించుకోకుండా సందర్భం ఏదైనా మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యం అన్నట్లుగా ప్రసంగాలు చేయడం, రాష్ట్ర సమస్యలన ప్రస్తావించకపోవడం మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి నుంచి జాతీయ అజెండా వరకూ ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వ్యూహాలు పన్నినా అనుకున్నంత స్పందన రాకపోవడంతో కేసీఆర్ కూడా ఒక అడుగు వెనుకకు వేశారని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులు కూడా భావించాయి.
కానీ తాజాగా కేసీఆర్ తన జాతీయ రాజకీయ పర్యటనల కోసం ప్రత్యేకంగా కాన్వాయ్ కోసం కార్లు సమకూర్చుకున్నట్లు బయట పడింది. అందుకు సంబంధించి కొన్ని కార్లు మొన్న (గురువారం) బెజవాడ మల్లపల్లి పారిశ్రామిక వాడలోని గ్యారేజీకి చేరుకున్నాయి. ఆ తరువాత కార్గో విమానంలో వాటిని తరలించారు. ఆ కార్లను వాటి తయారీ సంస్థ కార్గొ విమానాశ్రయంలో గన్నవరం ఏయిర్ పోర్టుకు అక్కడ నుంచి గ్యారేజీకి తీసుకువచ్చి అవసరమైన ఫిట్టింగ్ లు చేయించారు. ఆ వెంటనే మళ్లీ అదే కార్గొ విమానంలో హస్తినకు తరలించారు. వీటిని ఢిల్లీలోని టీఆర్ఎస్ భవన్ కు తరలించారని చెబుతున్నారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటనల్లో ఈ ఈ కాన్వాయ్ నే ఉపయోగిస్తారని అంటున్నారు. అంతు కాదు తన జాతీయ రాజకీయ పర్యటనలలో భాగంగా వీటినే వివిధ రాష్ట్రాలకు తిరగడానికి వినియోగిస్తారని చెబుతున్నారు. అత్యంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా తన జాతీయ పర్యటనల కోసం కేసీఆర్ కాన్వాయ్ కార్లను రెడీ చేయించుకున్న సంగతి బయటకు పొక్కడం సంచలనం కలిగించింది. అధికారికంగా టీఆర్ఎస్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ కేసీఆర్ కొత్త కాన్వాయ్ కార్ల గురించి ఎటువంటి ప్రకటనా వెలువడకపోయినా.. కేసీఆర్ కోసం కొత్త కాన్వాయ్ రెడీ అవుతోందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
ఎందుకంటే ఎన్డీయేను ఢీకొట్టడానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ముందుకు వచ్చే సూచలను కనిపించడం లేదు. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఇంట్రెస్టు చూపుతున్నా టీఆర్ఎస్ చెప్పిన మాట వినే పొజిషన్లో లేదు. దీంతో టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా సక్సెస్ అవుతారోనని తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.