ఈడీ దూకుడు ప్రతిపక్షాలే టార్గెట్

ప్రతిపక్ష పార్టీల  భయాలు నిజం అవుతున్నాయి. సీబీఐ,ఈడీ,ఎన్ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీల నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవంక నేషనల్  హెరాల్డ్ కేసులో  కాంగ్రెస్  అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా  ఆందోళనలు నిర్వహిస్తోంది. మరో వంక కేంద్ర దర్యాప్తు సంస్థలను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పభుత్వం దుర్వినియోగ పరుస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం విపక్షాల ఆందోళన, అభ్యంతరాలను అంతగా పట్టించుకున్నట్లు లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది., ప్రభుత్వ పాత్ర. ప్రమేయం లేదని,కోర్టుల ఆదేశాల మేరకే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని  కేంద్ర మంత్రులు, అధికార బీజేపీ నాయకులు విపక్షాల విమర్శలను కొట్టి వేస్తున్నారు.  అదలా ఉంటే, అదే సమయంలో ఈడీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ బిగ్ షాకిచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ నేత, మమతా దీదీ మంత్రివర్గంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పార్థా చటర్జీని అరెస్ట్ చేసింది. వివరాలలోకి వెళితే, 2018 లోపార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో, రాష్ట్రంలో  ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు పార్థా ఛటర్జీ అనుచరుడు అర్పితా ముఖర్జీ నివాసంలో స్వాదీనం చేసుకున్నారు.  ఈడీ అధికారులు  శుక్రవారం మంత్రి పార్థా ఛటర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్‌ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యా మండలి మాజీ అధ్యక్షుడు మాణిక్‌ భట్టాచార్య, మరికొందరి నివాసాలపై  ఏక కాలంలో దాడులు నిర్వహించారు. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్‌, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అనుచరుడు అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఏకంగా రూ.20 కోట్ల నోట్ల కట్టలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ), ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో అవకతవకలకు సంబంధించిన కేసులో సోదాలకు వెళ్లిన అధికారులకు ఈ డబ్బు దొరికింది. దర్యాప్తులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అనంతరం.. మంత్రి పార్థా చటర్జీని ఈడీ అరెస్టు చేసింది. అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన రూ.20 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవేనని భావిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. నగదుతో పాటు 20కి పైగా సెల్‌ఫోన్లను అర్పితా ముఖర్జీ నివాసం నుంచి జప్తు చేసినట్లు తెలిపింది. నేరాన్ని నిరూపించడంలో ఉపయోగపడే పత్రాలతో పాటు డొల్ల కంపెనీల వివరాలు, విదేశీ కరెన్సీ, బంగారం, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తుల వద్ద లభించాయని వెల్లడించింది. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.  నిజమే, చట్టం ముందు అందరూ సమానమే, అవినీతికి పాల్పడిన వారిని రక్షించాలని ఎవరూ .. కోరుకోరు. కానీ,..ప్రతిపక్ష పార్టీల నాయకులను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే దాడులు, సోదాలు, అరెస్టులు జరగడమే అనుమానాలకు తావిస్తోంది.  

అంత‌గా ల‌భించ‌ని కొత్త బ్ల‌డ్ గ్రూప్‌.. ఇఇఎం నెగెటివ్‌!

ఎవ‌రికైనా ర‌క్తం కావాల్సివ‌చ్చిన‌పుడు పేషెంటు ర‌క్తం ఏ గ్రూప్‌కి చెందిందో అదే గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారి నుంచి ర‌క్తాన్ని కోర‌తారు. అలాగాకుండా కొంద‌రికి మామూలుగా దొరికేది కాకుండా వేరే గ్రూప్ ర‌క్తం కావాల్సి వ‌స్తుంటుంది. అప్పుడు స‌ద‌రు ఆస్ప‌త్రి, డాక్ట‌ర్లు తెగ కంగారు ప‌డుతూంటారు. ఎలాగో ఒక డోన‌ర్‌ని ప‌ట్టుకోగ‌ల్లుతారు. అయితే అంత‌కు మించిన ఆశ్చ‌ర్య‌క‌ర‌మేమంటే, గుజ‌రాత్‌లో ఒక మ‌నిషి ర‌క్తం స‌హ‌జంగా ఉండే ఏ, బి, ఓ లేదా ఏబి గ్రూప్ ర‌క్త‌మే ల‌భిస్తుంది. కానీ గుజ‌రాత్ లో ఒక పెద్దా య‌నకు గుండెజ‌బ్బు. ఆయ‌న్ను ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చి ఆప‌రేష‌న్‌కి సిద్ద‌ప‌డ్డారు. అందుకు ర‌క్తం కావాల్సి వ‌చ్చింది. ఆయ‌న ర‌క్తం ఏ గ్రూప్‌కి చెందింద‌నేది డాక్ట‌ర్లు తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయారు.  అది  ఇఎంఎం నెగెటివ్ గ్రూప్‌.  ఇది అస‌లు దొర‌క‌డ‌మే దుర్ల‌భం అని తేల్చారు. ఆ 65 ఏళ్ల పెద్దాయ‌న ర‌క్తం గ్రూప్ భార‌త‌దేశంలో లభిస్తుంది. ఇత‌ర దేశాల్లో అంత‌గా ల‌భించ‌ద‌ని తెలుసుకున్నారు. మామూలుగా మ‌నిషి శ‌రీరంలో నాలుగు ర‌కాల ర‌క్తం గ్రూప్‌లు ఉంటాయి, వాటికి 42 ర‌కాల అద‌న‌పు ర‌క్తం ర‌కాలు ఏ, బి, ఓ, ఆర్ హెచ్ అనేవి ఉంటాయిట‌. అలాగే ఇఎంఎం ఎక్కువగా ఉండే 375 రకాల యాంటిజెన్‌లు అంటే శరీరంలో రోగనిరోధక  ప్రతి స్పందనను ప్రేరేపించే టాక్సిన్ లేదా ఇతర విదేశీ పదార్ధం, ముఖ్యం గా నెగెటివ్ ల ఉత్పత్తి చేసేవి కూడా ఉంటాయి. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అలాంటి పది మంది మాత్రమే వారి రక్తంలో ఇఎంఎం  హై-ఫ్రీక్వెన్సీ యాంటిజెన్‌ను కలిగి లేరు, ఇది వారిని సాధారణ మానవులకు భిన్నంగా చేస్తుంది. అటువంటి అరుదైన బ్లడ్ గ్రూపులు ఉన్నవారు తమ రక్తాన్ని ఎవరికీ దానం చేయలేరు లేదా ఎవరి నుండి పొందలేరు. ప్రపంచంలో ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారని, అయితే ఇప్పుడు గుజరాత్ లోని రాజ్‌కోట్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ఈ బ్లడ్ గ్రూప్‌తో గుర్తించ బడ్డారని నివేదికలు చెబుతున్నాయి.  గుండెపోటుతో అహ్మదాబాద్‌లో చికిత్స పొందుతున్న 65 ఏళ్ల రోగికి గుండె శస్త్రచికిత్సకు రక్తం అవసరమని సూరత్‌లోని సమ ర్పన్ బ్లడ్ డొనేషన్ సెంటర్  వైద్యుడు సన్ముఖ్ జోషి  తెలిపారు. అయితే అహ్మదాబాద్  ల్యాబొరేటరీలో అతని బ్లడ్ గ్రూప్ కనిపించకపోవడంతో ఆ నమూనాలను సూరత్‌లోని రక్తదాన కేంద్రానికి పంపారు. పరీక్ష తర్వాత, నమూనా ఏ గ్రూపుతో సరిపోలడం లేదు, దీంతో వృద్ధుడితోపాటు అతని బంధువుల రక్త నమూనాలను దర్యాప్తు కోసం అమెరికాకు పంపినట్లు ఆయన తెలిపారు.  ఆ త‌ర్వాత , వృద్ధుని రక్త వర్గం భారతదేశంలో మొట్టమొదటిది  అలాగే ప్రపంచంలోని పదవ అరుదైన రక్త సమూహంగా గుర్తిం చిన‌ట్టు  డాక్టర్ జోడించారు. రక్తంలో ఇఎంఎం లేకపోవడంవల్ల, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (ఐఎస్ బిటి) దీనికి ఇఎంఎం నెగెటివ్ అని  పేరు పెట్టింది.

ఉలిపి క‌ట్టె బీజేపీ!

దేశంలో బీజేపీ వారు బొత్తిగా భ‌రించ‌లేని వారి  పెద్ద‌ జాబితాలో ఇక మిగిలింది క‌మేడియ‌న్స్‌! యువ హాస్యనటుడు మునావర్ ఫరూఖీ ఎక్కడికి వెళ్లినా షోలు రద్దవుతుండ‌టమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. ఈమ‌ధ్య‌నే బంగ‌ళూరులో ఆయ‌న ప్ర‌ద‌ర్శ‌న ర‌ద్దు చేయాల‌ని పోలీసుల‌ నుంచి తాఖీదు అందుకున్నారు నిర్వాహ‌కులు. హిందూ జాగ‌ర‌ణ్ స‌మితి,  జై శ్రీ‌రామ్ సేనా అనే రెండు హిందూత్వ సంస్థ‌ల సూచ‌న‌ల మేర‌కే పోలీసులు తాఖీదును పంపార‌న్న‌ది నిర్వాహ‌కుల‌కూ అర్ధ‌మ‌యింది. ఫారూకీ షో ఇలా ఆగిపోవ‌డం ఇది మొద‌టిసారి కాదు, ఇంతకు ముందు ఓ డజను సార్లు ఇలా జరిగింది. మామూలుగా చ‌ట్ట  ప్ర‌కారం చూస్తే పోలీసుల‌కు ఈ షో ఆపాల్సిన అవ‌స‌రం ఎంత మాత్ర మూ లేదు. అంతే కాదు భారీ బందోబ‌స్తు పెట్టా ల్సిన గ‌త్యంత‌ర‌మూ ఉండేది కాదు. కానీ పోలీసులు హిందూ జాగ‌ర‌ణ్ వారి హెచ్చ‌రిక‌ల‌ను అమ‌లు చేయాల్సి వ‌చ్చింది. చిత్ర‌మేమంటే ఇదే బంగ‌ళూరు వేదిక మీద గ‌తంలో మూడు ప‌ర్యాయాలు ఆయ‌న షోలు జ‌రిగేయి. ఈ పోలీసులే పొట్ట‌చెక్క‌ల య్యేలా న‌వ్వారుట‌! మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వ‌లె క‌ర్ణాట‌కా కూడా బీజేపీ పాల‌న‌లోనే ఉంది. అక్క‌డ‌యితే ఫ‌రూకీ రాజ‌కీయ జోక్ పేల్చి ఏకంగా జైలు పాల‌య్యాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లోనూ వారంట్లు జారీ అయ్యాయి.   అస‌లు క‌మెడియ‌న్స్‌తో మ‌రీ ముఖ్యంగా ఫ‌రూకీతో బీజేపీ వారికి వ‌చ్చిన ఇబ్బందేమిటి?   హిందూత్వ వీరుల‌కు ఈయ‌న ఎందు కు న‌చ్చ‌లేదు?   విదూష‌కుని పాత్ర గురించి అంద‌రికీ తెలిసిన‌దే. అలాగంటే, మ‌హారాష్ట్ర‌లో ప్ర‌ద‌ర్శించే త‌మాసా వంటి జానప‌ద ప్ర‌దర్శ‌న‌ల్లో హాస్య‌గాడు ఉంటాడు క‌దా? అలాగే రామ్‌లీలా నాట‌కాల్లో మ‌రి అంతా  హాస్య‌గాళ్ల హాస్య‌ ధోర‌ణితోనే  గ్రామాల్లో  రాత్రిళ్లు తెల్లారుతుంటాయి. మ‌రి మ‌డిసి అన్నాక కూసంత ఆస్యం ఉండాలంటారు గ‌దా! అస‌లే కార్మికులు, క‌ర్ష‌కుల‌తో నిండి, రోజూవారి క‌ష్టాల‌తో బ‌తుకులు ఈడుస్తున్న ప్ర‌జలూ, ఈమాత్రం హాస్యానికీ నోచుకోకూడ‌ద‌ని ప్ర‌భుత్వాలే నిర్ణ‌యించేస్తే ఎలా? అలాంట‌పుడు  సంఘ్ వ్యవస్థ సమర్థించే స్వయం ప్రకటిత హిందూ నాగరికతని తామే కాపాడుతున్నామ‌న్న అతి భావ‌న‌లో ఉన్న‌వారు జోకుల‌ను ఎందుకు భ‌రించ‌లేక‌పోతున్నారు?  ఫరూఖీపై దాడి చేయడం దేనికి అంటే , ఫరూఖీ ఒక ముస్లిం, హిందూత్వ మితవాదం ముస్లింలను జాతీయ స్రవంతి నుండి పక్కకు నెట్టాలని నిశ్చయించుకుంది. ఈ ఏడేళ్లలో మతోన్మాదం పెరగడం విస్త‌రించ‌డం చూసిన ఎవరికైనా దాన్ని బహిరంగంగా చెప్పనవసరం లేదు. వివిధ రాష్ట్రాల్లోని బిజెపి పరిపాలనలు ఉన్మాద సంస్థలు,  ఫ్రీలా న్సర్‌ల ప్రయత్నాలను దయతో చూశాయి, మద్దతు కూడా ఇచ్చాయి. పోలీసులూ సంతోషంగా సహకరిస్తున్నారు. కానీ క‌మెడియ‌న్లు ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ మీద కాస్తంత వెట‌కారంతో విసిరే మాట‌లు, జోక్స్‌ను హిందూత్వ కార్య‌క‌ర్త‌లకు బొత్తిగా మింగుడు ప‌డ‌కుండా ఉంది. జీవితాన్ని, విమ‌ర్శ‌ల్ని స‌ర‌దాగా తీసుకోవ‌డం కూడా చేత‌కాని వారు అధికారంలో ఉండ‌ట‌మే దుర దృష్టం. 2002 గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌య‌లో ఫ‌రూక్ కామెడీ షో ఒక చిత్ర‌మైన అంశాన్ని లేవ‌నెత్తింది.. అస‌లా గొడ‌వ‌ల్లో జునాగ‌ఢ్ కుర్రాళ్లెవ‌రూ పాల్గొన‌లేద‌ని, కార‌ణం వాళ్లంత  బ‌ద్ధ‌కిస్టులు మ‌రొక‌రు లేక‌పోవ‌డ‌మేననీ. ఇలాంటి  జోకులు మతతత్వ అంశాలకు మతోన్మాద దర్పణం చూపకుండా ఉండ‌వు క‌నుక వీటిని ఆ మ‌హానుభావులెవ‌రూ స‌ర‌దాగా తీసుకోలేరు.  ఏడేళ్లలో ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించని ప్రధాని గుజరాత్‌లోని జర్నలిస్టుల పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉన్నారు.  టెలివిజన్ ఛానెల్స్‌, అనేక ప్రింట్ పబ్లికేషన్‌లు వంటి బిజెపి అనుకూల మీడియా ప్రోత్సాహం పొందుతుంటే, మిగిలినవి దూష‌ణ‌కు గుర‌వుతున్నాయి. కీలకమైన వ్యవసాయ చట్టాలు రద్దయిన  సెషన్‌తో సహా ఐదు సెషన్‌ల కోసం పార్లమెంటు సెషన్ కవర్ చేయడానికి ప్రెస్‌లకు అను మతి లేదు. మన ప్రభుత్వాలనిర్వాకం ఇలా ఉంది మరి.

హేతుబ‌ద్దీక‌ర‌ణ‌పేర ఖాళీల భర్తీకి ఏపీ స‌ర్కార్ గండి

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి గండి కొట్టేందుకు ఏపీ సర్కార్ హేతుబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా యూనిట్‌గా తీసుకుని ఉపాధ్యాయులను ఉన్న‌చోట‌నే స‌ర్దుబాటు చేసే అవకాశం ఉంది.  అస‌లు మొత్తం ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి అనేక సాంకేతిక ఇబ్బందులున్నాయని చెబుతోంది.   కొన్నిచోట్ల ఎక్కువ‌మంది విద్యార్ధులు, మ‌రికొన్ని చోట్ల ఎక్కువ‌మంది ఉపాధ్యాయులు ఉండ‌డం వంటి కారణాల వల్ల బోధన   అన్ని ప్రాంతాల్లోనూ   స‌మానంగా జ‌ర‌గ‌డం లేదని చెబుతోంది. ఈ కారణం చెబుతూ ఖాళీల భర్తీ జోలికి వెళ్లకుండా  ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ  నిర్వహించాలని ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది.   కరోనా వ‌ల్ల‌ గత రెండేళ్లుగా పాఠశాలలు సరిగ్గా నడవకపోవడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు.  అయితే హేతుబద్ధీకరణ కు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి సిద్ధంగా ఉంచారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏయే పాఠ శాలల్లో ఎంత మంది విద్యార్థులున్నారు? విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంత మంది ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాల్సి ఉం టుంది?  అన్న విషయంపై  నివేదికను సిద్ధం చేశారు. ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రకారం రేషనలైజేషన్‌లో స్థాన చలనం ఉంటుంది.  ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు   రెగ్యులర్‌గా నడుస్తుండడంతోపాటు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే   ఖాళీలు భర్తీ చేయాలంటే ముందుగా హేతుబద్ధీకరణ జరగాలని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసి నట్టు తెలిసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే రేషనలైజేషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల పరిధిలోనే ఈ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.  అయితే రేషనలైజేషన్‌లో భాగంగా ఎక్కువ మంది టీచర్లకు స్థాన చలనం అనివార్యమౌతుందని చెబుతున్నారు.  మరోవైపు పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన ప్రగతిని నెల వారీగా నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీఈవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రగతి నివేదికలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నివే దికల్లో ఒకవేళ విద్యార్థుల ప్రగతి తగ్గినట్టుగా స్పష్టమైతే.. సంబంధిత పాఠశాల టీచర్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

టీఆర్ఎస్ కు రామచంద్రు తేజావత్ గుడ్ బై

తెరాస నుంచి వలసలు పెరుగుతున్నాయి. పార్టీకి గుడ్ బై చెప్పేవారి సంఖ్యా క్రమంగా పెరుగుతోంది. ఆ క్రమంలో తాజాగా మాజీ ఐఏఎస్ రామచంద్రు తెజావత్ టీఆర్ఎస్ కుగుడ్ బై చెప్పారు. ఇప్పటి వరకూ రామచంద్రు తేజావత్ టీఆర్ఎస్ కు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిథిగా పని చేస్తున్నారు. తన రాజీనామాకు ఆయన చెప్పిన కారణం ఇటీవల  పార్టీ తీసుకున్న నిర్ణయాలు తనకు నచ్చడం లేదన్నది. రామంచంద్రు తెజావత్ మాజీ ఐఏఎస్ అధికారి. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు తెరాస మద్దతు ఇవ్వకపోవడం తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ పదవికీ కూడా రాజీనామే చేసినట్లు వెల్లడించిన రామచంద్రు తేజావత్..టీఆర్ఎస్ పార్టీకీ, ప్రభుత్వానికి సేవ చేద్దామని తాను భావించినా, పార్టీ కానీ, ప్రభుత్వం కానీ తన సేవలను ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు.   ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిథిగా తన విధులను వంద శాతం చిత్తశుద్ధితో నిర్వర్తించినట్లు చెప్పిన ఆయన కాళేశ్వరం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులకు క్లియరెన్స్ వచ్చే విషయంలో విశేష కృషి చేశానన్నారు. అలాగే   సికింద్రాబాద్ కరీంనగర్ రైల్వే లైన్,  నేషనల్ హైవే ప్రాజెక్టులు, ఎయిమ్స్, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల సాధనలో కూడా తన పాత్ర ఉందని పేర్కొన్నారు.

నీళ్ల ట్యాంకుల బారాత్..!

పెళ్లి అన‌గానే అంద‌రికీ ఇష్ట‌మైన‌ది బారాత్‌లో స‌ర‌దాలు, డాన్స్‌లు, గోల‌. రెండు కుటుంబాలు ఇష్ట‌ప‌డే ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో వారి మ‌న‌సులు క‌లుస్తాయి, వారి త‌త్వం తెలుస్తుంది. అదో అందం, ఆనందం. కానీ ఆ మ‌ధ్య కొల్హాపూర్‌లో విశాల్ కోలేక‌ర్‌ జంట పెళ్లి బారాత్ మ‌రో విధంగా జ‌రిగింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా నీళ్ల ట్యాంకుల బారాత్..! మంగ‌ళ‌వారిపేట ప్రాంత‌మంతా అస‌లు నీళ్ల స‌మ‌స్య‌తో నానా ఇబ్బం దులు ప‌డుతూంటే సంబంధిత అధికారులు నిమ్మ‌కునీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌!  పెళ్లి పేరంటాలు స‌రే స‌మాజంలో స‌మ‌స్య‌ల మీద కాస్తంత దృష్టి ఉండాలి. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను అధికారులు అంత‌గా ప‌ట్టించుకోన‌ప్పుడు ఏదో ఒక సంద‌ర్భంలో వారికి తెలిసేలా చేయ‌డం ఎంతైనా అవ‌స‌రం. కానీ అలా ఎవ‌రూ ఊహించ‌రు. ఎంత‌సేప‌టికి ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ చ‌క్క‌ర్లు కొట్ట‌డంతోనే స‌మ‌యం వృధా చేసుకుంటూంటారు. ముఖ్యంగా నీళ్ల అవ‌స్థ‌లు ఎదుర్కొనేవారు గ‌ట్టిగా ఎదురుతిర‌గాల్సిందే. అందులోనూ ఈ రోజుల్లో. కానీ వారి కార్యాల‌యాల‌కు వెళ్లి గొడ‌వ‌లు చేయ‌డంవ‌ల్ల ఏమీ జ‌ర‌గ‌దు. పైగా మ‌న కొంప‌కే ఎస‌రు పెడ‌గ‌ల‌రు స‌ద‌రు ప‌నివారు.  ఇవ‌న్నీ బాగా ఆలోచించే మ‌హారాష్ట్ర కొల్హాపూర్ కుర్రవాడు త‌న పెళ్లి బారాత్‌ను త‌న బంధువుల‌తో కాకుండా కేవ‌లం వాట‌ర్ ట్యాంకుల‌తోనే జ‌రిగేట్టు ప్లాన్ చేశాడు. కార‌ణం పెళ్లి ఆనందాన్ని అందరూ పంచుకుంటున‌పుడు అంద‌రి స‌మ‌స్య‌ను అధికారుల‌కు తెలిసేలా చేయాల‌ని కొత్త ఆలోచ‌న చేశాడు. అంతే పెళ్లి కూతురు, ఆ అమ్మాయి త‌ర‌ఫువారూ అంగీక‌రించేరు. ఎందుకంటే ఇది ఆ వూరి స‌మ‌స్య‌. అధికారుల నిర్ల‌క్ష్యాన్ని తెలియ‌జేయాల‌న్న ఉద్దేశంతో ఈ స‌రికొత్త బారాత్ చేప‌ట్టాడు.  అన్న‌ట్టు ఈ కుర్రాడి ఆలోచ‌న బాగుంది. ఆమ‌ధ్య నీటి స‌మ‌స్య ప‌రిష్కార క‌ధాంశంతో వ‌చ్చిన సినిమాలో చిరు, హీరో, స్నేహితులు, అనుచ‌రుల‌తో ఏకంగా వాట‌ర్ పైప్స్‌లో రాత్రంతా ఉండి నిర‌స‌న తెలియ‌జేయ‌డం గుర్తుందిగా! అలాంటిదే కాస్తంత వెరైటీ అన్న‌మాట‌.  ఎనీవే చిరు, కొల్హాపూర్ కుర్రాడు ఇచ్చిన స్పూర్తితో ఇలాంటి వినూత్న నిర‌స‌న‌లు తెలియ‌జేయ‌డం పెద్ద ట్రెండ్‌గామారినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డ‌క్క‌ర్లేదేమో!

మోదీ, షా చ‌ద‌రంగ ప్రావీణ్యం

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులూ ఉండ‌రు. అలాగ‌ని ఒక‌రికొక‌రు ఒకే ప‌న్నాముక్క‌లానూ కలిసి ఉండ‌రు. తెర‌ మీద కావ‌లించుకున్న ఇద్ద‌రూ తెర‌ వెనుక ఆవ‌ల కొట్టుకు ఛ‌స్తారన్నారు పూర్వం ఓ క‌వి. ఎవ్వ‌ర‌యినా, ఎవ‌రితోనైనా సఖ్య‌త న‌టించ డ‌మే.. ప్ర‌యాణ ల‌క్ష్యం వేరే ఉంటుంది. ఇపుడు మోదీ, మ‌మ‌తా దీ స్నేహం భావం అదే. ఇద్ద‌రూ నిజానికి ఎడ‌ మొగం  పెడ‌మొగం. కానీ శ‌తృవును ఎంచుకున్నాక చూసుకోవ‌డాలు, న‌వ్వుకోవ‌డాలు, ఆన‌క పెర‌ట్లో పావులు కదపప‌డాలు మామూలే.   మోదీ ప్ర‌భుత్వానికి విప‌క్షంలోనూ తామే ఉండాల‌న్న చిత్ర‌మైన కోరిక‌  మ‌మ‌తా దీది. ఒక్క‌సారైనా ప్ర‌ధాని కావాల‌న్న త‌లంపు ఆమెది. దేశంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని మోదీగారు అనుకోగానే తొక్కేయ‌డం చాలా క‌ష్టం. అందుకు త‌గిన ప‌దునైన తిక్క అస్త్రం ఒక‌టి కావాలి క‌నుక  బెంగాలీ చెల్లి మ‌మ‌తాదీని ఎగ‌దోయ‌డంమే మార్గం అనుకున్నారాయన. ఆమె కూడా త‌న అవ‌స‌రం కోసం మోదీ ముక్త భార‌త్ కీ జై అనే అనాలి. క‌నుక  వైరుధ్యాలు తెర‌మీద చూపుతూ  తెర‌ వెనుక ఊహించ‌ని మ‌లుపుల‌తో చిర్న‌వ్వులు చిందిస్తూ మ‌నం ఒక‌టే క‌లిసి పోరాడ‌దాం అని అంద‌రికీ టోపీ పెట్టే వ్యూహాల‌తో ఉన్నారు.  బీజేపీతో క‌ర్రా విర‌క్కుండా పాము చావాకూడ‌ద‌న్న తీరులో మ‌మ‌తా బెన‌ర్జీ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆమెను భ్ర‌మ‌లోనే ఉంచామ‌ని బేజీపీ అనుకుంటోంది, తాను ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి విష‌యంలో త‌నను విశ్వాసంలోకి తీసుకోలేద‌న్న ఉక్రోషంతో  ఆమె దూరంగా ఉంటున్నారు. అందువ‌ల్ల వీరి ఐక్య‌త గాలివాటుకు ప‌డే క‌ర్ర‌లాంటిది. పైగా మార్గ‌రెట్ అల్వా అభ్య‌ర్ధిత్వాన్ని కాంగ్రెస్ ప్ర‌క‌టిం చింది కానీ అదేమంత విజ‌యాన్ని ఇవ్వ‌క‌పోవ‌చ్చు. వాస్త‌వానికి మార్గ‌రెట్ మీద సోనియాకు ప్ర‌త్యేకించి ప్రేమ లేదు. ఎవ‌రూ లేక పేరు ప్ర‌క‌టించిన‌ట్లే అయింది, క‌నుక న‌వీన్ ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు మ‌ళ్లీ బీజేపీ అభ్య‌ర్ధికే మ‌ద్దునిస్తారు. అంటే  రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్దులను గెలిపించుకోవ‌డంలో, తమ‌కు భ‌విష్య‌త్‌లో అనుకూలించేవారినే పీఠం ఎక్కించ‌డంలో క‌మ‌ల‌నాథుల వ్యూహం ఫ‌లించిన‌ట్టే.  ఆప్ పార్టీ  ఎంపిక భేటీకి డుమ్మా కొట్టేసింది.  వెరసి యశ్వంత్ సిన్హాలాగే మార్గరెట్‌ను కూడా ఘోరంగా ఓడిపోయే ప్రణాళికను బీజేపీ అమలు పరుస్తోంది. అందులో మొదటి సూచిక మమత వోటింగుకు దూరంగా ఉంటామనే ప్రకటన! ఢిల్లీ సర్కిళ్ల ప్రచారం మేరకు మొన్న మంత్రి పదవికి రాజీనామా చేసిన ముక్తార్ నక్వీని బెంగాల్ గవర్నర్‌గా చేస్తే మ‌మ‌త‌ను శాంత ప‌రిచిన‌ట్టే అవు తుంది. నక్వీ  హుందాగా ఉంటారు. తన వ్యవహారశైలి, రాబోయే సాధారణ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల ఎంపిక చాలా ప్రణాళికబద్ధంగా జరగబోతోంది. క‌నుక బెంగాల్ టైగ‌ర్‌ను ఆట్టే గోల‌చేయ‌కుండా దువ్వ‌డంలో మోదీ, షా చ‌ద‌రంగ ప్రావీణ్యం  గొప్ప‌దే!

ఒక వైపు వరద ముంపు.. మరో వైపు మొసళ్ల భయం!

కష్టాలు వస్తే ఒకే సారి కట్టగట్టుకుని వస్తాయంటారు పెద్దలు. ఇప్పుడు గుజరాత్ వడోదర వాసుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఒక వైపు వరదలు ముంచెత్తి ఇళ్లు నీటమునిగి సతమౌతున్న వడోదర వాసులకు మొసళ్ల భయం పట్టుకుంది.   వడోదర విశ్వామిత్ర నది ఒడ్డున ఉంటుంది. విశ్వామిత్ర నది మొసళ్ల ఆవాసం కూడా. ఈ నది దాదాపు 300కు పైగా మొసళ్లకు ఆశ్రయం ఇస్తోంది. అటువంటి విశ్వామిత్ర నది ఇటీవలి వర్షాలకు పొంగి ప్రవహించింది. భారీగా వరద నీరు పోటెత్తడంతో నది గట్లు తెంచుకుని ప్రవహించింది. వరద నీరు వడోదరను ముంచెత్తింది. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. ఆ వరద నీటితో పాటు నదిలో ఆవాసం పొందుతున్న మొసళ్లు కూడా వడోదరలోకి వచ్చేశాయి. కాలనీలకు కాలనీలను ముంచెత్తిన వరద నీటితో పాటు మొసళ్లు కూడా కాలనీల్లోకి వచ్చేశాయి. పలు అపార్ట్ మెంట్ ఆవరణల్లో మొసళ్లు కనిపించడంతో జనం భయంతో బెంబేలెత్తిపోయారు. అసలే వరదలతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న వారికి మొసళ్లు ప్రాణాంతకంగా పరిణమించాయి. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వరద నీటితో పాటు కొట్టుకు వచ్చిన మొసళ్లు డ్రైనేజీల ద్వారా ఎక్కడికెక్కడకు కొట్టుకుపోయాయో అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మొత్తం మీద అటవీ అధికారులు శ్రమించి పెద్ద సంఖ్యలో మొసళ్లను పట్టుకుని తీసుకెళ్లినప్పటికీ.. ఇంకా ఎన్ని మొసళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయా అన్న భయం మాత్రం వడోదర వాసులను వెంటాడుతూనే ఉంది. 

తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఎక్కడంటే? ఎందుకంటే??

తెలంగాణలో త్వరలో  మరో  అసెంబ్లీ స్థానం ఖాళీ కానుందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందే మరో ఉప ఎన్నిక అనివార్యం కానుందా ? మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారెందుకు సిద్ధమయ్యారా ? అంటే, రాజకీయ వర్గాల నుంచి, అవుననే సమాధానమే వస్తోంది. అవును, గత కొద్ది రోజులుగా నల్గొండ  జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారనే వార్త మీడియా, సోషల్ మీడియాలలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చాలా జోరుగా షికార్లు చేస్తోంది.   అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో తమ కంటూ ఒక స్థానం సంపాదించుకున్న కోమటి రెడ్డి సోదరుల రాజకీయం  ఎప్పుడు మలుపు తిరుగుతుందో, వారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టం.  అంతే కాదు , కోమటి రెడ్డి సోదరుల మాటల్లో వినిపించే జోరు, చేతల్లో కనిపించదని  అంటారు. నిజానికి, ఒక దశలో సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ కు గుడ్ బై చెపుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అలాగే పీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగ పడిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇక జీవితంలో గాంధీ భవన్ గడప తొక్కేది లేదని శపథం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని పరోక్షంగానే అయినా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా ఆ తర్వాత గాంధీ భవన్ మెట్లు ఎక్కడమే కాదు, సోనియా, రాహుల్ గాంధీ కంటి తుడుపు కానుకగా ఇచ్చిన స్టార్ క్యాంపైనర్ పదవిని కళ్ళ కద్దుకుని మరీ తీసుకున్నారు. ఆరో వెలితో సమానమైన అ పదవితోనే సంతృప్తి చెందారు, సర్దుకు పోయారు.   ఇక రాజగోపాల రెడ్డి, విషయం అయితే చెప్పనే అక్కర లేదు. 2018 ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి, గడచిన మూడు సంవత్సరాలుగా రాజగోపాల రెడ్డి  పార్టీ మారతారనే వార్త  పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూనే వుంది. బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాలలో ఆయనే స్వయంగా ప్రకటించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని వార్త లొచ్చాయి. అయితే. ఇంతరవరకు ఆ దిశగా  ముందడుగు పడలేదు. ఆ ముహూర్తమూ రాలేదు. అయితే, ఈసారి అలా కాదని, నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారని అంటున్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిన బీజేపీ, 2023లో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో  భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత షా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక గెలుపుతో, పార్టీకి మంరింత ఉపు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వచ్చిన ఉపును, మరో ఉప ఎన్నిక గెలుపుతో మరింత ముందుకు తీసుకు పోయే వ్యూహంలో భాగంగానే, మునుగోడును ఎంచుకున్నారని అంటున్నారు. అందుకే అమిత్ షా ఎప్పటి నుంచో బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డితో రాష్ట్ర నాయకుల ప్రమేయం  లేకుండా నేరుగా మంతనాలు జరిపారని తెలుస్తోంది. ఈ భేటీలో అమిత్ షా చాలా స్పష్టంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్దం అయితేనే బీజేపీలోకి తీసుకుంటామని రాజ గోపాల రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు అంగీకరిస్తే  ఉప ఎన్నికల భారం మొత్తం పార్టీ భరిస్తుందని చెప్పడంతో పాటుగా అమిత్ షా ఉప ఎన్నికల్లో గెలుపునకు భరోసా కూడా ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ  మునుగోడుతో పాటుగా  మరో మూడు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి, చివరకు మునుగోడు పై నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  సో .. అదే నిజం అయితే బంతి ఇప్పుడు రాజగోపాల రెడ్డి కోర్టులో ఉందని, ఆయన ఊ .. అంటే  కర్ణాటక (ముదస్తు) అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా డిసెంబర్’లో మునుగోడు ఉపేఎన్నిక ముహూర్తం ఫిక్స్ అయిపోయినట్లే అంటున్నారు.

బ్ర‌ద‌ర్స్‌..ఇదే స‌మ‌యం...ఉద్య‌మించండి!

రాజ్యానికి దూర‌మైన రాకుమారుడు ప‌ది మందిని పోగేసి యుద్ధానికి స‌న్న‌ద్ధం కావ‌డానికి అంద‌రినీ ఉత్సాహ‌ప‌రిచాడు. ఆ ప‌దిమంది త‌మ బంధువ‌ర్గాన్నీ, స్నేహితుల‌నీ పోగేసి పెద్ద సైన్య‌మే సిద్ధం చేశారు. ఇదంతా రాజ్యాన్ని తిరిగి సాధించాల‌న్న ప‌ట్టు ద‌ల‌, రాజ్యంలో త‌లెత్తిన దారుణ ప‌రిస్థితులే కార‌ణం. అందుకే అవ‌కాశాన్ని చేజిక్కించుకోవ‌డానికి మ‌న‌లోని పొర‌పాట్ల‌ను, నిరాశ‌ను వ‌దిలేసుకుని రెండింత‌ల ఉత్సాహాంతో ఉర‌కండి అంటూ ఆ రాకుమారుడు సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చి మ‌రీ ర‌ణ‌రంగానికి స‌న్న‌ద్ధుల‌ను చేశాడు...ఇది అనేక త‌రాల క్రితం జ‌రిగిన క‌థ‌. ఇపుడు ఇందుకు దాదాపు ద‌గ్గ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవ‌డానికి తెలుగుదేశం అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టి రాష్ట్ర రాజ‌కీయ‌, సామాజిక ప‌రిస్థితుల‌న్నీ ఆయ‌న శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను ద్విగుణీకృతం చేశాయి. కొత్త శ‌క్తితో ఆయ‌న కుర్రాడిలా ఉర‌క‌లు వేస్తున్నారు. అలాంట‌పుడు పార్టీ నాయ‌కులు, హితులు, కార్య‌క‌ర్త‌లు నీరుగారిన‌ట్టు ఉండ‌డం, నిరుత్సాహంగా ఉండ‌డం ఆయ‌న‌కు స‌సేమీరా ఇష్టం లేదు. అందుకే అంద‌రినీ పిల‌చి క్లాసు పీకుతున్నారు. ఇది సామాన్య‌మైన‌ది కాదు యుద్ధోన్ముఖుల‌ను చేసే స్పెష‌ల్ క్లాసు. దీనికి అంద‌రూ అటెండ్ కావాలి. అధికారంలోకి వ‌చ్చి మ‌ళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలోకి తీసికెళ్లాలంటే ఇదే మంచి త‌రుణం. అధికారంలో ఉన్న జ‌గ‌న్‌, వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పూర్తిగా కోల్పోయారు. అందువ‌ల్ల విప‌క్షంగా బ‌ల‌వంతుల‌మై వారిని పీఠం నుంచి దించాల‌న్న ఏకైక ల‌క్ష్యంతోనే బ‌త‌కాలి, ఉర‌కాలి, మాట్లాడాలి, ఎదిరిం చాలి.. అన్న నినాదాల‌ను బాబు ఇప్పుడు త‌మ ఎమ్మెల్యేల‌కు నూరి పోయ‌డంలో త‌ల‌మున‌క‌ల‌య్యారు.  చంద్ర‌బాబులో గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని కొత్త కోణం ఇపుడు బ‌య‌ట‌ప‌డింది. ఆయ‌న‌లో ఒక గొప్ప నూత‌నోత్సాహంతో కూడు కున్న మార్పు క‌న‌ప‌డుతోంది. కానీ కొన్ని జిల్లాల్లో పార్టీ నేత‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొన‌డం ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొన డ‌మే ఆయ‌న్ను ఇబ్బందిపెడుతోంది. వారినీ అధికారం వేపు క‌ద‌ల‌మ‌ని, అందుకు త‌గ్గ‌ట్టు మారాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. మాట‌లో, ఆరోప‌ణ‌ల్లో వేగం పెంచారు. అంద‌రినీ అలానే దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌చారంలో, రోడ్డు షోల‌లో ఆయ‌న సాధార‌ణంగా మాట్లాడే తీరులో ఎంతో మార్పు వ‌చ్చింది. మాట‌ల తూటాలు వ‌దులుతున్నారు. ప్ర‌త్య‌ర్ధుల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఈసారి న‌ల‌భ‌యి శాతం యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా పార్టీలో కొత్త శ‌క్తికి అవ‌కాశం క‌ల్పించి పార్టీప‌రంగా త‌మ శక్తి సామ‌ర్ధ్యాల్ని మ‌రింత ప్ర‌ద‌ర్శించి ప్ర‌తిప‌క్షాల‌కు నిద్ర‌లేకుండా చేయాల‌న్న‌దే ఆయ‌న ల‌క్ష్యంగా ఉంది.  అందుకే కష్టపడిన వాళ్ళని పార్టీ గుర్తిస్తుందని, ఈసారి ఎన్నికలలో ఎలాంటి లాబీయింగ్ లు పని చేయవని స్పష్టం చేసిన నేపద్యం లో కార్యకర్తలలో కొత్త  ఉత్సాహం నింపారు.ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారం చేజిక్కుంచుకోవడమే టార్గెట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రమిస్తు న్నారు. వయసు మీద పడుతున్నా. యువతకు పోటీగా విరామం లేకుండా జిల్లాల బాట పడుతున్నారు. ఇబు  బాదుడే బాదుడు అంటూ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన వరద ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా భేటీ నిర్వహిస్తున్నారు. నిత్యం కార్యకర్తలకు టచ్ లో ఉంటున్నారు. వారి నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. మరోవైపు టికెట్ల కేటాయింపు విషయంలోనూ  కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అధికారులు, వ్య‌హ‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన‌ట్టు కాకుండా యువ‌త మ‌న‌సును తాకేట్టు క్లుప్తంగా, సూటిగా మాట్లాడుతూ పార్టీవ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది.. ఏ నేత ఏం చేస్తున్నారో.. ఏనేత పై ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం ఏంటన్నది ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసు కుంటున్నారు. చాలా మంది నేతలు మొదట రెండు మూడు రోజులు చేయడం, ఆ తరువాత ఎప్పుడో తమకు కుదిరినప్పుడు జనంలోకి వెళ్లడం లేదా.. పార్టీ పిలుపునిచ్చినప్పుడు కనిపించడం ఆ తరువాత ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా పోతున్నారని క్లాస్ పీకారు. ఇది కేవలం ఒకరిద్దరు కాదు జిల్లా నేతలం దరి పరిస్థితి ఇలానే ఉంది. మీరు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎప్పుడు జనంలోకి వెళ్లారు.. ఎంత సేపు అక్కడుంటున్నారు.. అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారనే విషయాలు త‌న‌కు స్ప‌ష్టంగా తెలుస్తున్నాయ‌న్నారు. పార్టీ అధినేత ఇంత స్ప‌ష్టంగా, సూటిగా ఉండ‌డంతో నాయ‌కులు కాస్తంత ఖంగుతున్నారు. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం కాస్తంత విజ‌య‌వంతం కావ‌డంతో బ‌ద్ద‌కంగా మార‌డం త‌గ‌ద‌ని హెచ్చ‌రిస్తూ ఈ దూకుడును ప‌నిలోనూ చూపించ‌గ‌లిగితేనే ల‌క్ష్యం సాధించ‌గ‌ల్గుతామ‌ని హెచ్చ‌రించారని తెలుస్తోంది.  అయితే, పార్టీ సభ్యత్వ నమోదు గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో ఉండాలని చెబితే.. ఒక నియోజకవర్గంలో కూడా మెరుగ్గా ప్రోగ్రెస్ లేదని ఫైర్ అయ్యారు. వ్యవసాయానికి మీ ప్రాంతంలో విద్యుత్ మీటర్లు అమర్చుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకల్ గా ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అక్రమాలపై రెగ్యూలర్ గా కార్యక్రమం చేయడంపై ఏ ఒక్కరికీ శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేతలు మానిటర్ చేయాల్సిన ఐదు జిల్లాల కో-ఆర్డీనేటర్ అమర్నాథ్ రెడ్డిని ప్ర‌శ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో చంద్రబాబు జూమ్ మీటింగ్ ను  నాయ‌కులు పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు. తీరా  స‌మావేశంలో ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది చంద్రబాబు తెలుసుకునే య‌త్నం చేయ‌గానే అంతా విస్తుపోయారు.  మొత్తానికి చంద్ర‌బాబు నూత‌నో త్సాహం తో ఉర‌క‌లు వేస్తుండ‌డంతో పాటు నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌నూ మ‌రింత ఉత్సాహంగా, దూకుడుగా ముంద‌డుగు వేయాల‌ని చిన్న హెచ్చ‌రిక ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. పత్తా లేని మంత్రులు

గోదావరి వరద చరిత్రను తిరగ రాసింది. 36 ఏళ్ల తర్వాత గోదారమ్మ మరోసారి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వచ్చిపడుతున్న వరదనీటి ప్రవాహానికి నదీ పరీవాహక ప్రాంతాలు తల్లడిల్లిపోయాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వందలాది లంక గ్రామాల ప్రజలు వరదనీటి మునకలో నరకయాతనలు పడుతున్నారు. అనేక లంక గ్రామాల్లో వరదనీరు 18 నుంచి 25 అడుగుల ఎత్తులో ప్రవహించింది. కొన్ని మండలాల్లో ఏ లంక గ్రామం ఎక్కడ ఉందో తెలియనంతగా వరదనీరు వెల్లువెత్తింది. గోదావరినదీ పాయలు వశిష్ట, వైనతేయి, గౌతమి భీకరరూపం దాల్చి ప్రవహించాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లోని పలు గ్రామాలు కూడా వరద ఉధృతితో అల్లాడిపోయాయి. ప్రకృతి విపత్తు ఊళ్లకు ఊళ్లపైన ఇంతలా విరుచుకుపడినా ఏపీలోని ఏ మంత్రి కూడా వరద బాధిత ప్రాంతాలను కన్నెత్తి చూడడం లేదని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసి అధికారం కట్టబెట్టిన తాము అసలు బతికి ఉన్నామో చచ్చామో కూడా చూసేందుకు కూడా ఒక్క మంత్రి కూడా రాలేదని దుయ్యబడుతున్నారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక, పిల్లలకు పాలు లేక, కొంపా గోడు కూలిపోయి, ఇంట్లోని సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయి, పాడైపోయినా తమను ఏ ఒక్క మంత్రీ కనీసం పలకరించకపోవడం, పరామర్శించకపోవడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏలూరు జిల్లాలో ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద బీభత్సంతో 50 వేల మందికి పైగా ప్రజలు అల్లాడిపోయారు. అయినప్పటికీ వారిని పరామర్శించేందుకు కనీసం ఒక్క వైసీపీ నేత గాని, ఒక్క మంత్రి గానీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఒక పక్కన ఎక్కడికక్కడ టీడీపీ స్థానిక నేతలు తమకు తోచిన మేరకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఆహారం, తాగునీరు లాంటివి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గుండెలోతు వరదనీటిలో కూడా స్వయంగా తమ వద్దకే వచ్చి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సహాయ సహకారాలు అందించారు. అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రుల కానీ ఒక్కరు కూడా తమను పట్టించుకున్న పాపాన పోలేదని శాపనార్థాలు పెడుతున్నారు. సీఎం జగన్ రెడ్డి కూడా ఏదో గాల్లో వచ్చి గాల్లోనే తిరిగి.. తమను గాలికి వదిలేసి తుర్రుమన్నారే తప్ప నేరుగా తమ ఇబ్బందుల గురించి ఒక్క మాట అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరద బీభత్సంలో కూడా మరో పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి తమను పరామర్శించి, కష్టసుఖాలు తెలుసుకోవడం పట్ల వరద పీడిత ప్రాతాల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతిలో పడవ ప్రమాదం జరిగి, టీడీపీ సీనియర్ నేతలు నదిలో పడిపోయారు. అయితే.. అప్పటికే చంద్రబాబు మరో బోటులోకి వెళ్లడంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇలా ప్రాణాలకు తెగించి కూడా టీడీపీ అధినేత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు తమకు అండగా నిలబడితే.. వైసీపీ నేతలకు ఏ మాయ ముంచుకొచ్చిందని దుయ్యబడుతున్నారు. అయితే.. తూర్పు గోదావరి జిల్లాలో కొందరు మంత్రులు వరద ప్రాంతాలకు వచ్చి, చూసి వెళ్లారంటే.. కనీస సాయం అందించలేదని, మాట వరసకు కూడా ఒక్క హామీ ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన చంద్రబాబు సహా టీడీపీ నేతలు వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి, భరోసాగా నిలిస్తే.. ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందం’గా సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకోవడాన్ని జనం తప్పుపడుతున్నారు. జగన్ ఎంతసేపూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అడ్డదారుల్లో అయినా మళ్లీ ఎలా అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయమే తప్ప తమను పట్టించుకోవడంలేదని ఫైరవుతున్నారు. ఒక పక్కన లక్షలాది మంది జనం వరద ముంపులో నానా అగచాట్లు పడుతుంటే.. జగన్ మాత్రం జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాలు, నియోజకవర్గం, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీల గురించి చర్చలతో కాలక్షేపం చేయడమేంటని నిలదీస్తున్నారు.

లాలీ  వీర‌మ‌ర‌ణం!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఫ‌తాన్‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని బ‌హ‌దూల్ గ్రామంలో ఇటీవ‌ల చాలామంది  ఒక పెద్దాయ‌న ఇంటి వ‌ద్ద ఆమ‌ధ్య గుమిగూడి సంతాపం ప్ర‌క‌టించి ద‌హ‌న‌సంస్కారాలు చేసేరు. ఎంత‌యినా లాలీ.. లాలీయే..నాలుగు రోజులుముందు పుట్టిన లేగ దూడ‌ను కాపాడి త‌న ప్రాణాలు కోల్పోయింది.. అది స్వామిభ‌క్తంటే.. అనుకున్నారంతా!  లాలీ వీర‌మ‌ర‌ణం పొందింది. ఇంత‌కీ ఈ లాలీ ఎవ‌రంటే ఓ కోడి. తినడానికి ఎన్నిఉన్నా, ప్ర‌తీ ఒక్క‌రికీ ఏదో ఒక‌టి స్పెష‌ల్ ఉంటుంది. కానీ తొంభైశాతం మంది భోజ‌న‌ప్రియుల‌కు చికెన్ అంటేనే ప్రాణం. కోడియ‌న్న‌ది తినుట‌కేగ‌దా మాన‌వా! అనే డైలాగులు నిత్యం హోట‌ళ్ల‌లో వింటూండ‌వ‌చ్చు. కానీ బ‌హ‌దూల్ వాసులు మాత్రం లాలీని బ్ర‌హ్మాండంగా పెంచేరు, త‌మ ఇంట్లో ఆవులు, గేదెల్లాగా ఎంతో ప్రేమ‌తో. అందుకే వారికోసం ప్రాణ త్యాగం చేసింది. డాక్ట‌ర్ సక్రామ్ స‌రోజ్ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఆ మ‌ధ్య లేగ పుట్టింది. దానికి ర‌క్ష‌గా ఇంటిల్లాపాదీ జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డానికి ప‌గ‌లూ రాత్రి కాప‌లా కాస్తుండేవారు.  ఒక రోజు ఎవ్వ‌రూ లేని మ‌ధ్యాన్నం స‌మ‌యంలో  ఒక కుక్క ఆ ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చి ఆ లేగ మీద దాడి చేసింది. అక్క‌డికి కొద్ది దూరంలో లాలీ అనే వారి కోడి అలా తిరుగుతూ కుక్కని చూసి ప‌రుగున వ‌చ్చి కుక్క‌ను ఎదిరిం చింది. కుక్క ఓ క్ష‌ణం ఆశ్చ‌ర్య పోయింది.. నువ్వెంత‌.. నేనెంత అన్న‌ట్టు చూసింది. కోడి ఎగిరి దాని మొహాన్ని పొడిచింది. కుక్క కాలితో ఒక్క త‌న్ను త‌న్న‌ది అది అవ‌త‌ల‌ప‌డింది. ఇక లేవ‌ద‌ని మ‌ళ్లీ లేగ ద‌గ్గ‌రికి వెళ్లింది. లాలీ శ‌క్తినంతా కూడ‌గ‌ట్టుకుని వ‌చ్చి మ‌ళ్లీ కుక్క కంటి మీదా, మొహం మీద దాడి చేసింది. ఎంత‌యినా కుక్క బ‌లం ముందు కోడి ఆగ‌గ‌ల‌దా? గ‌ట్టిగా ఒక్క త‌న్ను త‌న్నింది. లాలీ ఎగిరి చాలాదూరం ప‌డి ర‌క్తం ఓడి ప్రాణం విడిచింది. కానీ దాని దాడికి కాస్తంత దెబ్బ‌లు తిన్న కుక్క మ‌ళ్లీ వ‌స్తుందేమోన‌ని య‌జ‌మాని చూసి చంపుతాడ‌న్న భ‌యంతో పారిపోయింది.  కొంత‌సేప‌టికి ఆ ఇంటివారు లాలీ దూరంగా ర‌క్తం మ‌డుగులో ప‌డి ఉండ‌డం చూసి ఎంతో బాధ‌ప‌డ్డారు. స‌రోజ్ కుమారుడు అభి షేక్ ఆ కుక్క కోసం వీధంతా వెతికాడు. అది ఎటో పారిపోయింది. అత‌గాడు ఏడుస్తూ ఇల్లు చేరాడు. కానీ అప్ప‌టికి జ‌ర‌గాల్సింది జరిగిపోయింది. ఇంటిల్ల‌పాదీ, ప‌క్క‌నున్న వాళ్లూ అంతా లాలీ సాహ‌సానికి ఎంతో మెచ్చుకున్నారు, చ‌నిపోయింద‌ని  చాలా బాధ ప‌డ్డారు. దాన్ని అక్క‌డే స‌రోజ ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే ఖ‌న‌నం చేశారు. చాలా కాలం క్రితం లాలీని ఆశా దేవీ అనే కూర‌లు అమ్ముకునే మ‌హిళ ద‌గ్గ‌ర నుంచి డాక్ట‌ర్ స‌రోజ తెచ్చుకున్నారు. 

రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు విందు.. కేసీఆర్, మమతలకు అందని ఆహ్వానం

రాజకీయ ప్రత్యర్థులను కేంద్రం, ప్రధాని శత్రువులుగా పరిగణిస్తున్నారన్న విమర్శలకు ఊతం కలిగేలా మరో ఉదంతమిది.రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం (జులై24)న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్ధం ప్రధాని మోడీ విందు ఏర్పాటు చేశారు. ఆయన పదవీ విరమణ విందు కార్యక్రమానికి రామ్ నాథ్ కోవింద్ దంపతులు,  కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. వారితోపాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పద్మ అవార్డుల గ్రహీతలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్ష  కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ చౌదరి హాజరయ్యారు. కాగా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేరుగా ఆహ్వాన కార్డులు పంపడానికి సమయం లేకపోవడంతో.. ఢిల్లీలోని ఆ రాష్ట్ర భవన్‌ల రెసిడెంట్‌ కమిషనర్లకు వాటిని అందజేశారు. ఈ విషయాన్ని  ప్రధాని కార్యాలయం  వెల్లడించింది. వారు హోంశాఖ కార్యాలయం నుంచి నేరుగా కార్డులను తీసుకొని తమ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు పంపించాలని సూచించింది. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపే విషయంలోనే మోడీ సర్కార్ (కేంద్ర ప్రభుత్వం) తన వైఖరిని బయటపెట్టుకుంది. కనీస మర్యాదను మంటగలిపింది. తమ విధానాలను వ్యతిరేకించే ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపలేదు.   బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సీఎంలనూ మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. తెలంగాణ సీఎంకు ఆహ్వానం అందలేదు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ ఆహ్వానం లేదు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన రాష్ట్రపతి వీడ్కోలు విందులో కూడా కేంద్రం వివక్ష చూపడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాయి.

కాటి కెళ్లాలన్నా.. కట్టె కాలాలన్నా బాదుడే బాదుడు!

అనాదిగా రాజుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, ధ‌నిక‌వ‌ర్గానికి, వ్యాపారుల‌కు సులువుగా చిక్కేది సామాన్య‌ప్ర‌జ‌లే. ప‌చ్చిమిర‌ప‌కాయ నుంచి ప‌చారీ సామాన్ల వ‌ర‌కూ దేని జోలికి స్వేచ్ఛ‌గా వెళ్ల‌నీయ‌రు. ఏదో ర‌కంగా క‌నీసం రెండు రూపాయ‌లు అద‌నంగా కొట్టేద్దామ‌నే అనుకుంటారు. కాలం మారినా, ఆ  దాడి ఆలోచ‌న‌లో మాత్రం పెద్ద‌గా మార్పు రావ‌డం లేదు, పేరు మార్చారంతే. ఇంకా చెప్పా లంటే ఆ చట్టబద్ధమైన దోపిడీకి హద్దూ..పొద్దూ లేకుండా పోతోంది. ప్రజలు ఉన్నది పన్నులు కట్టడానికే.. తాము కట్టించు కోవడా నికే అన్నట్లుగా ప్రభుత్వాలు చెలరేగిపోతున్నాయి.  ఏదో ఒక సాకుతో అధిక ప‌న్నులు వ‌సూలు చేయ‌డం దేశంలో ఇప్పుడు నిత్య‌కృత్య‌మైంది. మ‌రీ ముఖ్యంగా జీఎస్టీతో ఉద్యోగుల జీవితాల‌ను మ‌రింత సంక్లిష్టం చేశారు. సంపాద‌న‌లో స‌గం ఏదో ఒకర‌కం ప‌న్నుల‌కే పోతోంది. ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌లు విసిగెత్తు తున్నారు. ఏది కొనాల‌న్నా, తినాల‌న్నా ప్ర‌భుత్వం దాన్నిగురించి ఏమ‌న్నా అన్న‌దా అని ఆలోచించాల్సిన ప‌రిస్థితి క‌ల్పించారు. కేంద్రం కేవ‌లం వ్యాపార‌సంస్థ‌లు, ఆయా కుటుంబాల‌కు మాత్ర‌మే కొమ్ము కాస్తోంద‌న్న‌ది ప్ర‌తీ విష‌యంలోనూ తెలిసిపోతోంది. ఈ ర‌క‌మైన దోపిడీని దేశంలో సామాన్యులు ఊహించ‌లేదు. చిత్ర‌మేమంటే పెరుగు మీద‌కూడా ఐదు శాతం ప‌న్ను విధించ‌డం. ఇంత‌కంటే దారుణాన్ని ఊహించ‌లేం.  ప్ర‌జ‌లంతా ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవ‌డానికి అస‌లా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇక అనారోగ్యం పాలై ఆస్ప‌త్రికి వెళితే పెద్ద చికిత్స‌, ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మైతే వాటిని అడ్డుపెట్టుకుని ఆస్ప త్రులు ముందే వాటి ఖ‌ర్చు చెప్పి ప్రాణం లాగేస్తున్నారు. ఓట్లు వేయించు కుని గ‌ద్దె ఎక్కుతున్నామ‌న్న ఇంగితం కూడా లేకుండా పోతోంది. ఓట్ల స‌మ‌యంలో అనేక ప్ర‌మాణాలు, హామీల వ‌ర్షంలో ముంచెత్తి ఓట‌రు న‌వ్వుమొహం చెరిగే లోగా విజేత‌లై దూర‌మ వుతున్నారు.  అస‌లు ప‌న్నులు అతిగా ఎందుకు విధిస్తున్నాము, ప్ర‌స్థ‌త‌స్థితిలో క‌ట్టేట్టున్నారా లేదా అన్న‌ది ప్ర‌భువుల వారికి బొత్తిగా గిట్ట‌ని అంశం. దాన్ని గురించి ఆలోచించ‌మ‌నే అధికారులు, మిత్రులు చెబుతూంటారేమో..కానీ అధికార పార్టీవారికి, ప్ర‌ధాని, ముఖ్య మంత్రుల‌కు, ఆర్ధిక మంత్రుల‌కు అవేవీ చెవికి ఎక్క‌డం లేదు. ఇలాంటివారిని చూసి  ప్రజలు ఏడ్వలేక నవ్వుతూ సెటైర్లు వేస్తు న్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రజలను ఎందుకు పిండుకోవాలనుకుంటుందనేది ఎక్కువ మంది ఆవేదన చెందుతున్న మాట. నిజానికి  ఇది మొదటిది కాదు.. అలాగని చిట్టచివరిదీ కాదు. ఇంకా ఎన్ని వాతలుంటాయో.. ఎలాంటి వాటి మీద ఉంటా యో చెప్పడం కష్టం. కానీ మధ్య తరగతి జీవి మాత్రం ఈ పన్నుల చక్రబంధంలో ఇరుక్కుని నలిగిపోతున్నాడు. సంపాదిస్తే ఆదాయపు పన్ను.. ఖర్చు పెడితే జీఎస్టీ… పెట్రోల్, డిజిల్ టాక్సులు ఎక్స్ ట్రా ! బ‌త‌క‌డానికి ఊపిరి మీద కూడా రేపో మాపో ప‌న్ను విధిస్తే.. సారీ.. ఈ ఆలోచ‌న వారికెందుకు ఇవ్వ‌డం.. చ‌చ్చేదీ సామాన్య‌లం మ‌న‌మే!  ఎక్క‌డ ఎక్కువ వ‌స్తువులు కొని ఆనందిస్తారేమోన‌ని ప్ర‌భుత్వానికి ఈర్ష్య. అవును అందుకే   జీఎస్టీ లేని వస్తువంటూ లేదు.  బిల్లు వేయని దగ్గర కొన్నా, ఆ వస్తువులో జీఎస్టీ పన్ను కూడా కలిపేసి ఉంటుంది. అంటే, సంపాదించుకున్నదానికి పన్ను కట్టడమే కాకుండా, ఖర్చు పెడుతున్న ప్రతీ దానికి పన్నులు కట్టాలన్నమాట. తినే తిండి దగ్గర్నుంచి ప్రతీ దానికి పన్ను కట్టాలి. ఇవిగాక పెద్ద‌మొత్తంలో  ప్రజల్ని దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పన్నులు ఉండనే ఉన్నాయి. దీనికి జీఎస్టీలో చోటు లేదు. అంటే విడిగా పన్నులు బాదేస్తారన్నమాట. దీని ద్వారా కేంద్రానికి ఏటా మూడు, నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే ప్రజల సంపద ఎంతగా పీల్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్ర‌మేమంటే బ‌త‌క‌డానికి ఉద్యోగం, ప‌న్నులు క‌ట్ట‌డానికి జీతం అన్న‌ట్టుగా బ‌డుగు జీవుల బ‌తుకులు మార్చేశారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌వారికోస‌మే ప్ర‌జ‌లు బ‌త‌కాల‌న్న‌మాట‌!  ఆలోచించే తీరిక లేకుండా కష్టపడి మధ్యతరగతి ప్రజలు పన్నులు కడుతున్నారు. పాలకవర్గాలతో సన్నిహితంగా ఉన్న వారు మరింత ధనవంతులైపోతున్నారు. ఈ అంతరాలు ఇలా పెరిగిపోతే జరిగేది దేశాభివృద్ధి కాదు.. వినాశనం. ఆ విషయాన్ని సంకుచిత మనస్థత్వం కలిగిన పాలకులు అర్థం చేసుకోడం కష్టం. ప్రజలు అలాంటి వారిని ఆదరించినంత కాలం ఈ పన్నుపోట్లు తప్పవు. ప్రజలు కట్టే పన్నులతో రాజకీయ ఖర్చులు చేసుకోవడం ఆగదు. మనమింతే.. మన పాలకులూ ఇంతే !

త‌ల్లికో జుట్టు పోగు..!

న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడే జుత్తు అంటే మ‌హిళ‌ల‌కు ప్రాణం. అది అందంలో భాగంగా భావిస్తారు గ‌నుక‌. ఆమ‌ధ్య‌కాలం వ‌ర‌కూ పొడ‌వాటి జ‌డ‌లు చూస్తుండేవారం. ఇపుడు ఎంత చ‌క్క‌గా స్ట‌యిల్‌గా ఉండాలో అమ్మాయిల‌తోపాటు అమ్మ‌లూ చూసుకుం టున్నారు. అంచేత పొడుగు జ‌డ‌ల‌కు మంగ‌ళం పాడేసేరు. ఇంగ్లీషువారి బాప్డ్‌హెయిర్ స్ట‌యిల్ అంద‌రికీ స్ట‌యిల్‌గా ఆక‌ట్టు కుంది. స‌రే ఎవ‌రి ఇష్టం వారిది. అయితే ఆరిజోనా కుర్రాడు త‌న తల్లికోసం మాత్రం చ‌క్క‌టి జుత్తు పెంచుకుంటున్నాడు. కార‌ణం ఆమెకి బ్రెయిన్ ట్యూమ‌ర్ తో ఉన్న జుత్తంతా పోయింది. ఆమెకు మ‌ళ్లీ ఒక‌నాటి రూపు ఇవ్వాల‌ని అత‌ని కోరిక‌. అందుకే జుత్తు క‌ష్ట‌ప‌డి పెంచు కుంటున్నాడు.  మూడేళ్లక్రితం మెలేన్ సాహాకి ట్యూమ‌ర్ సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. ఆమె రేడియేష‌న్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ కార‌ణంగా ఆమె జుత్తంతా కోల్పోయింది. ఆమెకు అప్ప‌టివ‌ర‌కూ మంచి చ‌క్క‌టి జుత్తు ఉండేది. ఆమెకు తిరిగి ఆ జుత్తు ఉన్న సంతోషాన్ని ఇవ్వాల నుకున్నాడు ఆమె కుమారుడు 27 ఏళ్ల మాట్‌. ఒక‌రోజు వారిద్ద‌రూ భోజ‌నం చేస్తుండ‌గా, నీ కోసం నేను జుత్తు పెంచుకుంటాను. మంచి విగ్ త‌యారు చేయిస్తాన‌న్నాడు. ఆమె ఆనందంతో క‌డుపుబ్బ న‌వ్వింది.  త‌ల్లి అలా న‌వ్వుకుని ఎన్నాళ్ల‌యిందో అనుకున్నాడు మాట్‌. ఆ న‌వ్వుల్ని అలానే చూడాల‌నుకున్నాడు. త‌ల్లి జుత్తులాంటిదే త‌న జుత్తు అని గ్ర‌హించే తాను ఆ నిర్ణ‌యానికి వ‌చ్చేడు. స్నేహితుల‌తో మాట్లాడి విగ్ గురించి తెలుసుకున్నాడు. మొన్న మార్చి నాటికి మాట్ జుత్తు 12 అంగుళాలు పెరిగింది. విగ్ త‌యారుచేసే వ్య‌క్తి ఈ జుత్తు చాలా బావుంది, ఆమెకు న‌ప్పుతుంద‌న్నాడు. పైగా ఈ మాత్రం చాలుతుంద‌న్నాడు. కుర్రాడి ఆనందానికి హ‌ద్దే లేదు. ఆమెను ఆనంద‌ప‌ర‌చ‌డానికి ఈ మాత్రం చేయ‌లేనా అనుకున్నాడు. త‌ల్లికో జుత్తు పోగు! మాట్ కాలిఫోర్నియా విగ్ త‌యారీ కంపెనీ వారిని క‌లిసి రెండువేల డాల‌ర్లు చెల్లించాడు. వాళ్లు బ్ర‌హ్మాండంగా విగ్ త‌యారు చేసి ఇచ్చారు. అది పెట్టుకున్న మెలాన్ అద్దంలో చూసుకుంది.. అస‌లు అది విగ్‌లా అనిపించ‌డం లేద‌న్న‌ది. మాట్ త‌ల్లిని కావ‌లించు కున్నాడు ఆనందంతో! ఆమె అనారోగ్య బాధ నుంచి కాస్తంత ఉప‌శ‌మ‌నం క‌లిగించినందుకు త‌న‌ను తాను శ‌భాష్ అనుకునే ఉంటాడు. వాళ్ల బంధువులు, ఆమె స్నేహితులు కూడా కుర్రాడి ప‌నిని ఎంతో మెచ్చ‌కున్నారు. వియ్ ఆల్ ల‌వ్ యూ! అన్నారు. అది స‌రిపోయింది.. త‌ల్లి అనారోగ్యంతో కుమిలిపోతున్న అత‌ని మ‌న‌సుకి.

న్యాయశాఖ పరిశీలనలో జమిలి ప్రతిపాదన

జమిలి ఎన్నికల విషయాన్ని కేంద్రం ఇంకా వదల లేదు. లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం కలిసి వస్తుందని కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం లాకమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది. లోక్ సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలపై  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు చెప్పారు. కాగా  స్టాండింగ్ కమిటీ   కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని, ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోందని ఆయన తెలిపారు. తరచుగా వచ్చే ఎన్నికల వల్ల నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం వ్యయం అవుతుందనీ, దేశంలో 2014-22 మధ్యకాలంలో 50  ఎన్నికలు జరిగాయని స్టాండింగ్ కమిటీ  వివరించింది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నికల నిర్వహణ కోసం రూ. 7వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయ్యిందని కిరణ్ రిజుజు తెలిపారు. కిరణ్ రిజుజు సమాధానంతో కేంద్రం మదిలో   జమిలి   ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉందని,   లోక్​సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఉందని అవగతమౌతుంది.   మోడీ అధికారంలోకి రాగానే ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఎన్నికల విధానంలో మార్పుల వల్ల అభివృద్ధి వేగవంతమౌతుందని ఆయన చెబుతున్నారు. లోక్ సభ నుంచి స్థానిక ఎన్నికల వరకూ ఒకే సారి నిర్వహించడం వల్ల ప్రజా ధనం ఆదా కావడమే కాకుండా అభివృద్ధికి అవరోధాలు ఉండవని అన్నారు. అయితే విపక్షాలు నిర్ద్వంద్వంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చెబుతున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని అంటున్నారు. జమిలి పేర కేంద్రంతో పాటు రాష్ట్రాలలో కూడా అధికారం  గంపగుత్తగా చేజిక్కించుకోవాలన్న  దురాలోచనలో ప్రభుత్వం ఉందని అభ్యంతరం చెబుతున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్‌ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్నది మోడీ వాదన.  పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయన్నది ఆయన అభిప్రాయం.  2019 బీజేపీ మానిఫెస్టోలో జమిలి అంశాన్ని చేర్చింది.  నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.   అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇందుకు దేశంలో సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసర అవుతుంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాల సంఖ్యే అధికం. లోక్ సభలో మోడీ సర్కార్ కు పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో సభ్యుల బలం ఒకింత తక్కువైనా కేంద్రం నిర్ణయాలకు వత్తాసు పలికే పార్టీలు ఉండటంతో అక్కడా ఆమోదం పొందడం పెద్ద కష్టం కాదు. దీంతో జమిలి ప్రతిపాదన అమలుకు ఇదే మంచి తరుణం అని మోడీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుంటే మోడీ సర్కార్ జమిలి విషయంలో అడుగు ముందుకు వేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు సైతం జమిలికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతులు ఇస్తున్నాయి. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో జమిలికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చిన సంగతి విదితమే.  

గడప గడపకూ బాధ్యతలు మాజీ మంత్రులకు

జగనాగ్రహానికి పార్టీలో ప్రముఖుల ప్లేస్ లు మారిపోతున్నాయి. పనికి రారన్నట్లుగా కేబినెట్ నుంచి ఉద్వాసన గురైన వారికే ఇప్పుడు వైసీపీ అధినేత గడపగడపకూ మన ప్రభుత్వం బాధ్యతలను అప్పగించారు. ఈ అప్పగింతకు ముందు ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి క్లాసే పీకారు. అయినా వారిలో స్పందన లేదన్న నిర్ణయానికి వచ్చేసి ఈ సారి ఆ బాధ్యతలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, రిజనల్ కో అర్డినేటర్లకు అప్పగించేశారు. విచిత్రమేమిటంటే వీరిలో అత్యధికులు ఇటీవలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమాత్య పదవులను పోగొట్టుకున్న వారే. ఇలా బాధ్యతలు బదలాయించడానికి జగన్ పెప్పిన కారణమేమిటంటే..గడప గడపకూ వోళ్లని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నా  ఓ పది.. పదిహేను మంది తప్ప ఎవరూ సీరియస్ గా తీసుకోలేదని.  దీంతో ఆయన ఎలాగైనా ఎమ్మెల్యేల్ని గడప గడపకూ తరలించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సారి జిల్లాల అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టారు. వీరిలో ఎక్కువ మంది ఇటీవల పదవులు పోగొట్టుకున్న మాజీ మంత్రులే. వారికే ఇప్పుడు ఎమ్మెల్యేలతో ప్రోగాంను సక్సెస్ చేయించాల్సిన బాధ్యత ఇచ్చారు. వాళ్లకి ఐప్యాక్ టీం సహకరించేలా ఏర్పాటు చేశారు.  ఐ ప్యాక్ టీంలు జిల్లాల వారీగా పని చేస్తాయని వారితో సమన్వయం చేసుకోవాలని జగన్ ఆదేశించారు. మొత్తానికి గడపగడపకూ మన ప్రభుత్వాన్ని విజయవంతం చేసే బాధ్యత అంతా పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లదేనని జగన్ విస్పష్టంగా చెప్పేశారు. మాజీలకు ఈ బాధ్యతలు అప్పగించడంతో మళ్లీ  మంత్రులు డమ్మీలేనని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఈ మాత్రం దానికి తమకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి మాజీలను చేయడమెందుకని తాజా మాజీలు ఒకింత నిరసన వ్యక్తం చేస్తున్నారు.   మంత్రలు అధికారం అనుభవిస్తుంటే.. మాజీలమైన తాము పార్టీకి ఊడిగం చేయాలా అన్న సణుగుడు మాజీలలో మొదలైందని పార్టీ శ్రేణులే అంటున్నారు. మంత్రులను కాదని తమ మాట క్యాడర్ ఎందుకు వింటుందన్న సందేహమూ వారిలో వ్యక్తం అవుతోంది.   అంతే కాకుండా తమ తమ నియోజకవర్గాలలో తామూ గడపగడపకూ వెళ్లాలి కదా అని గుర్తు చేస్తున్నారు.  ప్రభుత్వంపై ఆగ్రహాన్ని జనం ఎమ్మెల్యేలపై వెళ్లగక్కితే వారి ఆగ్రహం ఏదో మేరకు చల్లారుతుందన్న జగన్ భావిస్తున్నట్లుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఏది ఏమైనా జగన్ ఎంత మొత్తుకున్నా, తాపత్రేయపడినా, హెచ్చరికలు చేసినా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల పార్టీలో ఎవరూ సీరియస్ గా లేదని పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.

తెలంగాణపై వరుణుడి కరుణ వరద

ఊహించ‌నివిధంగా వాతావ‌ర‌ణం మారిపోయింది. భారీ వ‌ర్షాల‌తో తెలంగాణాపై వరుణుడి కరుణ వరద కొనసాగుతోంది. దీంతో వ‌రుణుడి వ‌ల‌లో రాష్ట్రం చిక్కుకున్న‌ట్టుగా ఉన్న‌ది. ఈ వ‌ర్షాల కార‌ణంగా ఉద్యోగులు, ప‌నుల‌కు వెళ్లేవారు మ‌రింత ఇబ్బందులు ప‌డుతున్నారు. చిరు వ్యాపారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ఒక వంక జ‌లాశ‌యాలు నిండుతున్నాయ‌న్న ఆనందంగా ఉన్న‌ప్ప‌టికీ మ‌రీ క‌ద‌ల‌నీయ‌ని స్థితిలో వ‌ర్షాలు ముంచెత్త‌డం భ‌యాందోళ‌న‌కూ గురిచేస్తోంది.  వర్షాల కారణంగా భాగ్యనగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ ఫ్లో 2000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్‌సాగర్ నాలుగు గేట్లను ఎత్తి 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా...  ప్రస్తుత నీటి మట్టం 1786.65 అడుగులకు చేరింది. అటు హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి  నీటి  మట్టం  1763.50 అడుగులకు గాను, ప్రస్తుత నీటి మట్టం 1760.50 అడుగులకు చేరింది.  మెదక్, సంగారెడ్డి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మెదక్ మండలంలో 26.8 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. శివ్వంపేట మండలంలో 21.4 సెంటిమీటర్లు, తుప్రాన్ మండలంలో 19.6 సెంటీమీటర్లు, చిన్న శంక రం పేటలో 19.4 సెంటీమీటర్లు, వెల్దుర్తి లో 17.3 సెంటీ మీటర్లు, నర్సాపూర్‌లో 17.2 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అటు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 21.4 సెంటీమీటర్లు, ఆందోల్‌లో 15.4 సెంటీమీటర్లు మేర వర్షపాతం నమోదు అయ్యింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారనంగా మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 7,612.52 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 3,600 .18 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా... ప్రస్తుత సామర్థ్యం 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.33 టీఎంసీలకు చేరింది.

అక్కడ సంజయ్ రౌత్.. ఇక్కడ కేటీఆర్ ?

ప్రపంచం మొత్తం మీద మనిషిని  పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అదేమో, కానీ, ఈ మధ్య కాలంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, తెలంగాణ మంత్రి కేటీఅర్ మధ్య చాలా దగ్గరి పోలికలున్నాయనే మాట అక్కడక్కడ వినిపిస్తోంది. అయితే ఆ ఇద్దరి మధ్య ఉన్నది భౌతిక పోలికలు కాదు. వ్యక్తిత్వ సారుప్యతని  అంటున్నారు. నడక,  నడత,  మాట తీరు, ఈ అన్నిటినీ మించి  కూర్చున్న కొమ్మను నరుక్కునే విపరీత దురహంకార ధోరణి విషయంలో ఇద్దరి మధ్య స్పష్టమైన సారుప్యత కనిపిస్తోందనే మాట ఎప్పటి నుంచో అక్కడక్కడా వినిపిస్తున్నా ఈ మధ్య కాలంలో మరింత గట్టిగా వినిపిస్తోందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. నిజానికి, కేటీఆర్  తీరు పట్ల పార్టీలో ఒక విధమైన ఆందోళన వ్యక్తంవుతోందని అంటున్నారు.  అయితే, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కీలక నేతగా చెలామణి అవుతున్నారు.అందులో మరో అభిప్రాయం లేదు. నిజానికి, కేటీఆర్ తెరాస రాజకీయాల్లో కీలక నేతగా చెలామణి అవడమే కాదు, కాబోయే ముఖ్యమంత్రిగానూ ప్రచారం  జరుగుతోంది. అందుకే కావచ్చును, కొంతమంది ఆయనంటే గిట్టని వాళ్ళు కేటీఆర్’ను మహా రాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్’తో పోలుస్తున్నారు, సంజయ్ రౌత్ కూడా సామ్నా పత్రికలో ఉద్యోగిగాచేరి అలా అలా ఎదిగి ఇలా ఏకుమేకై కూర్చున్నారని, కేటీఆర్’ కూడా సన్ అఫ్ కేసీఆర్’ గా  ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇలా తయారయ్యారని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, శివసేన పతనంలో రౌతు పోషించి పాత్రను, తెరాస పతనంలో కేటీఆర్ పోషితున్నారనే మాట కూడా అక్కడక్కడ వినిపిస్తోంది.మితి మీరిన అహంకారం, అతి తెలివి చూపడం ఈరెండు అంతిమంగా  పతననానికి దారి తీస్తాయి, సంజయ రౌత్’లో పుష్కలంగా పేరుకు పోయిన ఈ అవలక్షణాల కారణంగానే, శివసేనలో చిచ్చు రాజుకుంది. శివసేనలో చీలిక తెచ్చాయి. కేటీఆర్’లోనూ అవే లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మహారాష్ట్రలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడుకునేటప్పుడు,, షిండే పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ, శివసేన రెండు ముక్కలుగా చీలిపోవడానికి మూల కారణం సంజయ్ రౌత్, ఆయన కారణంగానే,శివసేనలో అశాంతి రాజుకుందని విశ్లేషకులు పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.  మహారాష్ట్రలో శివసేన అధినేత్ మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై సైలెంట్’గా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఎవరిని అడిగినా, తిరుగుబాటుకు, ఇంకా  ఇతర కారణాలు అనేకం ఉన్నా, సంజయ్ రౌత్. దురుసు ప్రవర్తన, దురంకార  ధోరణి ఒక  ప్రధాన కారణంగా పేర్కొంటారు. ఇక్కడ తెలంగాణలో, మంత్రి కేటీఆర్ ధోరణిలోనూ అలాంటి పోకడలు కనిపిస్తున్నాయని అంటున్నారు.  కేటీఆర్ తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే, ఎరికి వారు సహించి ఉరుకుంటున్నా, ఎక్కడో అక్కడ అగ్గిరాజుకుంటే, ఇప్పుడ కాకపోయినా, ఎప్పడు అప్పడు మహారాష్ట్ర  పరిణామాలు తెలంగాణ ల్ల్నూ పునరావృతం అయ్యే ప్రమాదం లేక పోలేదని అంటున్నారు.   ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల దురహంకారం గురించి మాట్లాడుతున్నారే, కానీ, సొంత పార్టీలో పెరుగతున్న దురహంకార ధోరణినీ, సొంత పార్టీలో రగులుతున్న అసమ్మతినీ గుర్తించడం లేదని తెరాస నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, పదిమంది పొతే పోతారని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను చులక చేయడం సరి కాదని అంటున్నారు. మహారాష్ట్రలోనూ తిరుగుబాటు, ముగ్గురితో మొదలై 11 కు చేరి అక్కడి నుంచి 40 ప్లస్ ‘ కు చేరిందని గుర్తు చేస్తున్నారు. అదెలా ఉన్నా, అన్నిటికంటే ముఖ్యంగా తెరాసలో అంతా బాగుంది అనేందుకు లేదు. నివురు గప్పిన నిప్పుల ఉందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.